మిల్కీ బ్యూటీ క్రేజీ లైనప్
- Guest Writer
- Jun 26
- 1 min read

ఇండస్ట్రీలోకి వచ్చిన రెండు దశాబ్దాల తర్వాత కూడా తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ హంగామా చేస్తుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటికి కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్న తమన్నా మొన్నీమధ్య ఓదెల2 సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చింది. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల2 భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. ఓదెల`2 తర్వాత రైడ్`2 సినిమాలో తమన్నా స్పెషల్ సాంగ్ చేసి ఎంతో మంది మనసుల్ని గెలుచుకున్న తమన్నా చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులున్నాయి. ఓదెల2 తర్వాత తమన్నా తెలుగులో మరో సినిమాకు సైన్ చేయకపోయినా బాలీవుడ్ లో మాత్రం అమ్మడు పలు సినిమాలకు సైన్ చేసింది. తమన్నా లైనప్, ఆ సినిమాల డైరెక్టర్లు చూస్తుంటే తమన్నా అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఆసక్తి పెరుగుతుంది. బాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లతో తమన్నా సినిమాలు చేస్తోంది. అందులో భాగంగానే మిల్కీ బ్యూటీ రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ బయోపిక్ లో నటించనుంది. జాన్ అబ్రహం మరియు రోహిత్ శెట్టి కలయికలో వస్తోన్న ఓ బయోపిక్ లో తమన్నా ఫీమేల్ లీడ్ గా కనిపించనుంది.
దాంతో పాటూ బాలీవుడ్ హిట్ మూవీ నో ఎంట్రీకి సీక్వెల్ గా వస్తోన్న నో ఎంట్రీ2 లో తమన్నాకు అవకాశం లభించిందని సమాచారం. అనీస్ బాజ్మి దర్శకత్వంలో వరుణ్ ధావన్, అర్జున్ కపూర్, దిల్జీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఆల్రెడీ డైరెక్టర్ తమన్నాకు నెరేషన్ ఇవ్వగా కథ నచ్చి ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే షూటింగ్ ను మొదలుపెట్టి, కుదిరితే ఈ ఏడాదే సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇక అజయ్ దేవగణ్, డైరెక్టర్ జగన్ శక్తితో కలిసి చేస్తున్న రేంజర్ అనే ఫారెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రేంజర్ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. గతంలో అజయ్ దేవగణ్- తమన్నా కాంబినేషన్ లో హిమ్మత్ వాలా రాగా ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు వారిద్దరి కలయికలో సినిమా వస్తోంది. ఇవి కాకుండా అరుణబ్ కుమార్, దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో సిద్ధార్థ్ మల్హోత్రాకు జోడీగా వివాన్ అనే సినిమాలో కూడా తమన్నా నటిస్తోంది. ఇవి చేస్తూనే టాలీవుడ్, కోలీవుడ్ లో మరిన్ని సినిమాలను లైన్ లో పెట్టడానికి తమన్నా కథలు వింటూ చాలా బిజీగా ఉంటోంది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
Comments