మోహన్ బాబు ఆ పాత్ర చేసి ఉంటే...!
- Guest Writer
- Nov 4, 2025
- 3 min read

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ చేసిన ‘శివ’ సినిమా అప్పట్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. మూస పద్దతిలో వెళ్తున్న సినిమా ఇండస్ట్రీకి సరికొత్త దారి చూపించిన సినిమాగా శివ నిలిచింది. రామ్ గోపాల్ వర్మకు మొదటి సినిమాతోనే దర్శకుడిగా స్టార్‌డం దక్కింది. సహాయ దర్శకుడిగా అనుభవం లేకుండానే శివ సినిమాను వర్మ రూపొందించాడు. మేకింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా, తాను అనుకున్నది అనుకున్నట్లుగా, ఎవరు ఏం చెప్పినా తాను చెప్పిందే జరగాలి అని శివ సినిమాను రూపొందించాడు. ఆయన మొండితనం చూసి చాలా మంది వీడెక్కడి మెంటలోడు బాబోయ్ అని చాలా మంది చిత్ర యూనిట్ సభ్యులు, టెక్నికల్ క్రూ అనుకున్నారట. నిర్మాతలను సైతం ఎదిరించి కొన్ని నిర్ణయాల్లో తనదే పై చేయి సాధించాడు. మొదటి సినిమాకే ఈ స్థాయి డామినేషన్ చేయగలిగాడు అంటే తన కథపై నమ్మకం అనడంలో సందేహం లేదు.
రామ్ గోపాల్ వర్మ శివ రీ రిలీజ్... శివకు సంబంధించిన స్క్రిప్ట్ చర్చల సమయంలో నాగార్జున సోదరుడు వెంకట్ అక్కినేని స్వయంగా పాల్గొన్నారట. ఆ సమయంలో ఆయన కొన్ని ఇన్‌పుట్స్ ఇస్తే నచ్చని వాటిని నిర్మొహమాటంగా తిరస్కరించాడట. అంతే కాకుండా ఒక పాత్ర కోసం మోహన్ బాబును నటింపజేయాలని అక్కినేని వెంకట్ బలంగా కోరుకున్నాడట. విలన్స్ లో ఒకడు అయిన గణేష్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. అలాంటి పాత్ర మోహన్ బాబు చేస్తే కచ్చితంగా సినిమా కాస్టింగ్ పరంగా పెరుగుతుందని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన భావించాడట. కానీ వర్మ మాత్రం ఆ పాత్రకు మోహన్ బాబు అస్సలు వద్దు అన్నాడట. ఆ పాత్రకు కొత్త వాడు అయితేనే బాగుంటుంది అని వర్మ భావించాడు. తాను అనుకున్నట్లుగానే ఆ పాత్రకు కొత్త నటుడిని తీసుకు వచ్చి, తాను చెప్పినట్లుగానే ఆ సీన్ అద్భుతంగా పండిరది.
నాగార్జున పాత్ర శివకి... రఘువరన్ వద్ద రౌడీగా ఉండే గణేష్ ఒక సీన్ లో శివ పాత్రకు వార్నింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సీన్ సినిమాకు అత్యంత కీలకంగా ఉంటుంది. అందుకే వర్మ ఆ సీన్ ను తాను కోరుకున్నట్లుగా కొత్త నటుడితో తీయడం వల్ల సినిమాలోని ఆ సీన్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సీన్ లో మోహన్ బాబు వంటి సీనియర్ నటుడు నటించి ఉంటే గణేష్ కాకుండా ప్రేక్షకులు అక్కడ మోహన్ బాబును చూసేవారు. దాంతో ఆ సీన్ అంత బాగా వచ్చేది కాదు అనేది వర్మ అభిప్రాయం. అందుకే తాను అనుకున్నది అనుకున్నట్లుగా వర్మ ఆ సీన్ ను చేశాడు. మొత్తానికి వర్మ మొదటి సినిమాకే ఒక మొండి వాడిగా తాను పట్టిన కుందేలుకు అన్నట్లుగా వ్యవహరించాడు అంటూ తాజా ఇంటర్వ్యూల్లో ఆ సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ చెబుతూ వచ్చారు.
శివ కోసం ప్రేక్షకుల ఎదురు చూపులు వర్మ సైతం ఇటీవల వరుస ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు. శివ సినిమాను ఇప్పటికే చాలా సార్లు రీ రిలీజ్ చేశారు. అయితే ఈసారి 4కే విజువల్స్‌తో పాటు, సరికొత్త సౌండ్ తో శివ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శివ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వర్మ దగ్గర ఉండి మరీ ఈ సినిమా కొత్త వర్షన్ ను రెడీ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా సంగీతం, మాటలు... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటీ అద్భుతంగా సెట్ అయ్యాయి. అందుకే శివ సినిమా వచ్చి మూడు దశాబ్దాలు దాటినా కూడా ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. శివ సినిమా రీ రిలీజ్ తోనూ మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంటుందని యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రిలీజ్ చేస్తున్నారు.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
వారణాసికి ఫిక్సయిపోవాల్సిందేనా?

ఎస్‌ఎస్‌ఎంబీ 29 అప్‌డేట్స్ అన్నీ నవంబరులోనే అని రాజమౌళి ఎప్పుడో హింట్ ఇచ్చేశాడు. అన్నట్టుగానే నవంబరు నెల మొదలైందో, లేదో.. మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాల పట్ల చర్చ మొదలైపోయింది. ఈనెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ గ్లింప్స్ విడుదల చేస్తున్నారు. ఈ ఈవెంట్ ని ప్రసార హక్కుల్ని హాట్ స్టార్ సంస్థకు అమ్మేశారు. ఇదే కాదు. ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఈవెంట్లూ హాట్‌స్టార్‌కే విక్రయించినట్టు టాక్. ఈ రూపంలో నిర్మాతకు భారీ మొత్తం అందబోతోంది.
మరింతకీ ఈ సినిమా టైటిల్ ఏమిటి? ఇప్పుడు అందర్నీ ఊరిస్తున్న ప్రశ్న ఇదే. ఈ చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ పెట్టినట్టు ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ ఈ టైటిల్ ఏమంత పవర్ ఫుల్ గా లేదని, పాన్ వరల్డ్ టైటిల్ కాదని ఫ్యాన్సు పెదవి విరిచారు. రాజమౌళి టైటిల్ మరీ ఇంత సింపుల్ గా ఎందుకు ఉంటుందిలే అని చాలామంది లైట్ తీసుకొన్నారు. దానికి తగ్గట్టే ఓ చిన్న సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ పెట్టి, పోస్టర్ కూడా వదిలారు. దాంతో మహేష్ సినిమా టైటిల్ ఇది కాదులే అని అంతా డిసైడ్ అయిపోయారు.
అయితే ఈ సినిమా టైటిల్ వారణాసినే అని.. దీన్ని 15న అధికారికంగా ప్రకటించబోతున్నారని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే ఛాంబర్‌లో మరో నిర్మాత ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకొన్నాడు కాబట్టి, వాళ్ల అనుమతి తీసుకోవాల్సివుంది. లేదంటే వారణాసికి ముందో వెనుకో ఓ పదాన్ని జోడిస్తారు. మరి ఇన్నాళ్లూ ఈ టైటిల్ వద్దనుకొన్న మహేష్ ఫ్యాన్స్ ఈసారి ఎలా స్పందిస్తారో చూడాలి.
టైటిల్ గ్లింప్స్ దాదాపు 3 నిమిషాల వరకూ ఉంటుందని టాక్. ఈ గ్లింప్స్‌ని ప్రదర్శించడానికి రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ భారీ తెర ఏర్పాటు చేస్తున్నార్ట. కనీసం లక్షమంది అభిమానులు ఈ ఈవెంట్ కు హాజరు అవుతారని టాక్. టాలీవుడ్ లోనే కాదు, దేశంలోనే ఇలాంటి ఈవెంట్ జరగలేదు అనుకొనేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నార్ట. రాజమౌళి ఏం చేసినా ఇంతేగా. కనీ వినీ ఎరుగని రీతిలో ప్లాన్ చేస్తారు. ఈసారీ అదే జరగబోతోంది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...










Comments