top of page

మద్యం మతలబులకు ఆయనే ‘గురువు’!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 3 days ago
  • 3 min read
  • టీచర్‌ ఉద్యోగం మానేసి వ్యాపారం పేరుతో లావాదేవీలు

  • రెండు రాజకీయ కుటుంబాల పేరు చెప్పి పెత్తనాలు

  • ఎమ్మెల్యే కుమారుడిని ముందుపెట్టి మద్యం బిజినెస్‌

  • అదే ముసుగులో కల్తీ, బెల్టు, తదితర అక్రమాలు

  • ప్రశ్నించేవారిపై అధికారుల ద్వారా దాడులు, కేసులు

  • అవలంగి కేసుతో బయటపడిన మాజీ గురువు అవలక్షణాలు

ree

ప్రతి అక్రమానికీ ఓ రేటుంటుంది.. ప్రతి దోపిడీ దొంగకూ ఓ డేటు ఉంటుంది.. ఓ కలుపు మొక్క హరితహారాల నడుమ కొన్నాళ్లు వెలిగిపోయి చెలరేగిపోవచ్చు.. కానీ ప్రతి దానికీ ఒక ఎక్స్‌పైరీ డేటు ఉంటుంది. అప్పుడు అది మలిగిపోక తప్పదు.

పవిత్ర గురుపూజోత్సవం రోజున మొన్నటి వరకు పాఠాలు చెప్పిన ఓ గురువుకు దీన్ని ఆపాదించాల్సి రావడం నిజంగా బాధాకరమే అయినా తప్పదు. చెడు చూడకు.. చెడు మాట్లాడకు.. చెడు వినకు.. అన్న గాంధీజీ సూక్తితోపాటు ‘చెడు చేయకు’ అని చెప్పాల్సిన గురుస్థానంలో ఉన్న వ్యక్తే సప్త వ్యసనాల్లో ఒకటైన మద్యం వ్యాపారాన్ని తన వ్యసనంగా మార్చుకున్నారు. ఇది తన వ్యాపారమని, మద్యం షాపులు టెండర్‌లో దక్కించుకోవడం తప్పు కాదని సమర్ధించుకుంటే ఫర్వాలేదు. కానీ మద్యం షాపులతో పాటు బెల్టు షాపులు విరివిగా ఏర్పాటు చేయడం, వారి నుంచి కూడా మామూళ్లు వసూలు చేయడం, అడిగితే రాజకీయ నాయకుల పేర్లు చెప్పడం ఈ గురువుగారికి కరతలామక విద్య. నిజాయితీగా ఉండాలంటూ నాన్‌డిటైల్‌ పుస్తకంలోని పాఠాలు చెప్పిన ఈ అయ్యవారిలో ఆ నిజాయితీయే కొరవడిరది.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
ree

ఉపాధ్యాయ ఉద్యోగం కంటే వ్యాపారిగానే ఎక్కువ సంపాదించవచ్చని భావించి స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన నరసన్నపేటకు చెందిన సదాశివుని రాంబాబు మాస్టారుకు జిల్లాలో రెండు ప్రధాన రాజకీయ కుటుంబాలతో సంబంధాలున్నాయి. స్వర్గీయ ఎర్రన్నాయుడు కేంద్రమంత్రి అయినప్పుడు మొదట్లో పీఏగా, ఆ తర్వాత అచ్చెన్నాయుడు దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించారు. ఇప్పుడు నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి అనధికారిక సహాయకుడిగా చక్రం తిప్పుతున్నారు. దీన్నే అవకాశంగా తీసుకుని ఇప్పటికీ పూర్వాశ్రయం కింజరాపు, ప్రస్తుత ఆశ్రయం బగ్గు కుటుంబాల పేర్లు చెప్పి మద్యం వ్యాపారంతో ఈయన గేమ్స్‌ ఆడుతున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు మద్యం షాపులకు టెండర్లు పిలిచారు. ఇందులో నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఉన్న వైన్‌షాపులను దక్కించుకోవడానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమారుడిని ముందు పెట్టి అన్ని షాపులకూ టెండర్లు వేశారు. వాటిలో కొన్నింటిని లాటరీలో దక్కించుకున్నారు. మిగిలినవాటిని బలవంతంగా చేజిక్కించుకున్నారు. ఇప్పటికీ ఆ నియోజకవర్గంలో రాంబాబు చేతికి షాపు అప్పగించకపోతే ఎక్సైజ్‌, పోలీస్‌ అధికారులను షాపు మీదకు పంపి కేసులు పెట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

వ్యాపారం పేరుతో వసూళ్లు

నియోజకవర్గంలో మద్యం షాపులకు టెండర్లు వేయడానికి అనేకమంది నుంచి సదాశివుని రాంబాబు సొమ్ము సేకరించారని చెబుతున్నారు. వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆశ చూపి నిధులు సమీకరించిన ఆయన ఇప్పటికీ సొమ్ములిచ్చినవారికి అసలెంతో, లాభమెంతో చెప్పడంలేదని బాధితులు లబోదిబోమంటున్నారు. ఉద్యోగ విరమణ చేశారు కదా.. మద్యం వ్యాపారం చేసుకుంటే తప్పంటన్న ప్రశ్న తలెత్తవచ్చు. కానీ మద్యం షాపుల వరకు అయితే కొంత ఓకే. కానీ పక్క ప్రాంతాల్లో బెల్టు షాపులకు కూడా తానే మందు సరఫరా చేయాలన్న నిబంధన ఒకటి విధించారట. సాధారణంగా ఒక వైన్‌షాపు పరిధిలో ఉన్న గ్రామాల్లోని బెల్టు షాపులకు అదే షాపు నుంచి లిక్కర్‌ సప్లై అవుతుంది. కానీ రాంబాబుకు షాపు లేనిచోట కూడా బెల్టు షాపులకు ఈయన్నుంచే లిక్కర్‌ వెళుతోందని.. కాదని ఎవరైనా ప్రశ్నిస్తే రైడ్‌లు చేయిస్తున్నారని తెలిసింది. టెండర్ల సమయంలో అందరూ కలిసి కోట్లాది రూపాయలు ఇచ్చామని దీనికి అసలో, వడ్డీయో ఇవ్వాలని అడిగితే తన బ్యాక్‌గ్రౌండ్‌ను బయటకు తీస్తున్నట్టు చెబుతున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి ఈయన అఫీషియల్‌ సహాయకుడో, అనఫీషియల్‌గా వ్యవహారాలు చక్కబెడతారో ఎవరికీ తెలియదు. కాకపోతే ఆయన ఇందిరానగర్‌ కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలోనే నిత్యం ఉంటారు. రాంబాబు తన ఇంటిలో దిగువ భాగాన్ని సిండికేట్‌ కార్యాలయానికి అద్దెకిచ్చేశారు. సాధారణంగా రూ.5వేలు అద్దె వచ్చే ఆ ఇంటిని సిండికేట్‌ ఆఫీసుగా మార్చి రూ.25వేలు వరకు అద్దె వసూలు చేస్తున్నట్టు భోగట్టా.

కోట్ల ఆస్తులు.. అయినా కక్కుర్తి

లిక్కర్‌ షాపు పక్కన, బెల్టు షాపు పక్కన చిప్స్‌, చేగొడియాలు, వాటర్‌ ప్యాకెట్లు, ప్లాస్టిక్‌ గ్లాసులు అమ్ముకునే చిరువ్యాపారులను సైతం వదలకుండా రాంబాబు వేధిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రతి బడ్డీ రోజుకు రూ.500 చెల్లించాలని, లేదంటే పోలీసులతో కేసులు పెట్టిస్తానని భయపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంత ఎత్తున దందా చేస్తున్న రాంబాబు పేదవాడా? అంటే.. కాదు. ఎప్పుడో కోట్ల ఆస్తులు కూడబెట్టారు. నరసన్నపేట ఇందిరానగర్‌లో భవనంతో పాటు అదే వీధిలో నాలుగు సెంట్ల స్థలం, తామరాపల్లిలో రెండెకరాల పొలం, శ్రీకాకుళం పీఎన్‌ కాలనీలో కోట్లు విలువ చేసే స్థలం ఉన్నట్లు ఆయన్ను ఎప్పట్నుంచో దగ్గరగా చూస్తున్నవారు చెబుతున్నారు. అయితే ఇవి ఎలా సంపాదించారనే విషయాల జోలికి ఇప్పుడు పోవడంలేదు. 2014 వరకు పని ఉన్నా, లేకపోయినా కింజరాపు అచ్చెన్నాయుడు పంచన ఉండేవారు. ఏం జరిగిందో గానీ వారు పక్కన పెట్టడంతో 2014 ఎన్నికల ముందు నరసన్నపేట బగ్గు రమణమూర్తి చెంతకు చేరారు. ఆ సమయంలో ఆర్థికంగా చితికిపోయిన రమణమూర్తికి ఆర్ధిక సహకారం అందించారు. దానికి సంబంధించిన వడ్డీని ఇప్పటికీ వసూలు చేస్తుంటారు. అందుకే రాంబాబు దందాలు తెలిసినా ఎమ్మెల్యే ఏమీ అనలేకపోతున్నారనే వాదన కూడా ఉంది. మరికొందరైతే ఈ విషయాన్ని స్వయంగా రాంబాబే చెబుతుంటారని కూడా అంటుంటారు. ఇందులో ఏది వాస్తవమో తెలియదు గానీ, తనకు రాజకీయం కంటే వ్యాపారవేత్తగానే సెటిలవ్వడం ఇష్టమని తీర్మానించుకున్న ఎమ్మెల్యే తనయుడిని ముందుపెట్టి సదాశివుని రాంబాబు సిండికేట్‌ను నడిపిస్తున్నారు. రెండు రోజుల క్రితం స్ఫూరియస్‌ లిక్కర్‌ తయారుచేస్తూ దొరికిన ముఠా రాంబాబు సిండికేట్‌లో ఉన్న బెల్టులకే లిక్కర్‌ సరఫరా చేస్తున్నట్టు భావిస్తున్నారు. కొత్త పాలసీ వచ్చినప్పటినుంచీ ఇదే పని చేస్తున్నా ఎక్కడా దొరక్కపోవడంతో కొన్నాళ్గుఆ షాపుల్లో కూడా పెట్టి అమ్మిస్తున్నారు. ఇదే విషయం అవలంగి షాపులో రుజువైంది. సిండికేట్‌కు తెలియకుండా నకిలీ లిక్కరు విక్రయించడం కుదరదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page