top of page

మరో బాలు ఇక పుట్టడు..

  • Guest Writer
  • Sep 26, 2025
  • 7 min read

ఘనగాయకుడు బాలుకు ఇదే అతిగొప్ప నివాళి!!

(సెప్టెంబర్‌ 25 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా)

భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతమైన చలనచిత్ర నేపథ్య గాయకుడు ఎస్‌.పీ.బాలసుబ్రహ్మణ్యం. దేశ సినిమాలో బాలు స్థాయి ప్రతిభావంతమైన గాయకుడు ఇంత వరకూ రాలేదు! ఇకపై??

ఒక ప్రేయసికి ఒక ప్రియుడు ఏమౌతాడో, ఒక ప్రియుడికి ఒక ప్రేయసి ఏమౌతుందో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమాగానానికి అదవుతారు! సినిమా గానానికి యవ్వనం ఎస్‌.పీ. బాలసుబ్రహ్మణ్యం.

వివిధ భాషల్లో వేనవేల పాటలు పాడిన ఎస్పీబీ. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రంలో ‘‘ఏమి ఈ వింత మోహం..’’ పాటను తన తొలి పాటగా పాడారు. ఆ పాటలో సహగాయకులైన పీబీ శ్రీనివాస్‌ ‘‘అప్పుడే ఇతను గొప్ప గాయకుడు అవుతాడనుకున్నాను ఇప్పుడు ఇంకా ఎంతో గొప్పగాయకుడై పోయాడు’’ అని నాతో చాలాసార్లు అన్నారు.

దేశం ఆశ్చర్యపడినంత గొప్ప గాయకుడై రాణించారు ఎస్పీబీ. అవును, మన దేశంలో అందరికన్నా ప్రతిభావంతమైన సినిమా గాయకుడు ఎస్పీబీ. ఆయనకున్నంత గాన ప్రతిభ ఉన్న సినిమా గాయకుడు మనదేశంలో మఱొకరు లేరు. వోకల్‌ పవర్‌ అని గాయకుడు హరిహరన్‌ ఆయన్ను అన్నారు. ‘‘ప్రయత్నిస్తే నాలా బాలు పాడగలడు కానీ నేను బాలూలా పాడలేను’’ అని బాలమురళీకృష్ణ ఆన్నారు.

ఎస్పీబీకి తొలిదశ హిట్స్‌ తమిళ్‌లో వచ్చాయి. 1969లో వచ్చిన ‘‘ఇయర్కై ఎన్నుమ్‌ ఇళైయకన్ని..’’ (సినిమా శాంతినిలయం), ‘‘ఆయిరమ్‌ నిలవే వా..’’ (సినిమా అడిమైపెణ్‌) అన్న రెండు గొప్ప హిట్‌ పాటలతో మంచి గాయకుడని పేరు తెచ్చుకున్నారు ఆయన.

ఆ పాటల్లో ఆయన గానం చాల బావుంటుంది. ఒక పరిణతి ఉన్న గాయకుడి గానంలా ఉంటుంది. ఆయిరమ్‌ నిలవేవా పాట డబ్బింగ్‌ పాటగా తెలుగులో ఘంటసాల పాడారు. తమిళ్ష్‌లో బాలు పాడిరది విన్నాక తెలుగులో వింటే ఇబ్బందిగా ఉంటుంది. తెలుగు నటులకన్నా ఎంతో ముందే తమిళ్‌ ప్రముఖ నటులు ఎమ్‌.జి.రామచంద్రన్‌, శివాజీ గణేస(శ)న్‌ వంటివాళ్లు బాలు గొప్పతనాన్ని గుర్తించి కోరుకుని మరీ ఆయనతో తమకు పాటలు పాడిరచుకున్నారు.

ఘంటసాలను కాకుండా మొహమ్మద్‌ రఫీ, పీబీ శ్రీనివాస్‌ ఈ ఇద్దరినీ ఆదర్శంగా తీసుకున్నారు ఎస్పీబీ. ఇది సరైంది. ఇక్కడే ఎస్పీబీ. గొప్పతనం మనకు తెలియవస్తోంది. ఒక కళాకారుడికి ఉండాల్సిన సరైన పరిశీలనతో, అవగాహనతో ఘంటసాలను ఆయన ఆదర్శంగా తీసుకోకపోవడం వల్ల ఆయనకే కాదు సినిమా పాటకు కూడా ఒక ఔజ్జ్వల్యం వచ్చింది.

సుఖదుఃఖాలు సినిమాలో ‘‘మేడంటే మేడాకాదు..’’ పాట ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

ఘంటసాలను దాటి ఆలోచించగలగడం ఎస్పీబీ గొప్పతనాన్ని తెలియజేస్తున్నది. అదే ఆయన సాధించిన ఇంత పెద్ద గాన విజయానికి కారణం.

ఘంటసాలను ఆదర్శంగా తీసుకుని ఉంటే బాలు విఫలమై ఉండేవారు. (ఎమ్‌.ఎమ్‌.రాజా, పీ.బీ.శ్రీనివాస్‌ ఇలా ఎవరూ ఘంటసాలను ఆదర్శంగా తీసుకోలేదు! ఘంటసాలను ఆదర్శంగా తీసుకున్న రామకృష్ణ రాణించలేదు)

‘‘మేడంటే మేడా’’ కాదు పాటలో ఎస్పీబీ గానంలో ‘స్వర సమం’ అన్న అంశం కనిపిస్తుంది. బహుశా ఆ అంశం సహజంగా అమరి ఉంటుంది. గానంలో భావం మాత్రమే కాదు మనోధర్మం (మూడ్‌) కూడా ఉండాలి. ముఖ్యంగా సినిమాకు ఇది అవసరం. భావం, మనోధర్మం ఈ రెండిటితోనూ ఎస్పీబీ ఎన్నో గొప్ప పాటలు పాడారు.

పంతులమ్మ చిత్రంలో ఆయన పాడిన ‘‘మానసవీణ మధుగీతం..’’ , ‘‘ఎడారిలో కోయిల తెల్లారనీ రేయిలా..’’ పాటలను ఇందుకు ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ఏకవీర సినిమాలో ‘‘ప్రతి రాత్రి వసంత రాత్రి..’’, మంచి మిత్రులు సినిమాలో ‘‘ఎన్నాళ్లో వేచిన ఉదయం..’’ పాటల్లో ఘంటసాల కన్నా బాలు గానమే మేలైంది. ఘంటసాలలో లేని స్వర సమం, స్పిరిట్‌, వెర్వ్‌, వర్డ్‌త్రో ఈ అంశాలవల్ల ఆయన గానం ఆ పాటల్లో గొప్పగా అమరింది.

మొహమ్మద్‌ రఫీ తరువాత మన దేశంలో గాత్రంలో గొప్ప స్పిరిట్‌ ఉన్న గాయకుడు ఎస్పీబీ. యానిమేటెడ్‌ బాలుది. గాయకుడు మన్నాడే పాడడం అంటే గొప్పగా పాడడమే. మన్నాడే కన్నా గొప్పగా పాడడమంటే మాటలు కాదు. అలాంటిది ‘‘స్నేహమేరా జీవితం..’’ పాటను హిందీలో పాడిన మన్నాడే కన్నా ఎస్పీబీ గొప్పగా పాడారు.

బాలు గాత్రం, గానం చాలా ఎమోటివ్‌. సాహిత్యాన్ని భావయుక్తంగానూ, మనోధర్మంతోనూ పాడడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ‘‘నువ్వేనా సంపంగి పువ్వుల నువ్వేనా..’’, ‘‘కలువకు చంద్రుడు ఎంతో దూరం..’’ వంటి పాటల్లో మనకు ఈ విషయం తెలుస్తుంది.

ఎస్పీబీ ప్రతిభను దృష్టిలో పెట్టుకుని తమిళ్‌లో ఎమ్‌.ఎస్‌. విశ్వనాద(థ)న్‌ ఎన్నో గొప్ప పాటలను చేశారు. ముఖ్యంగా పట్టిన ప్రవేశం అన్న సినిమాలో ‘‘వాన్‌ నిలా నిలా అల్ల..’’ పాటను చెప్పుకోవచ్చు. దర్శకుడు కె.బాలచందర్‌, ఎమ్‌.ఎస్‌.విశ్వనాదన్‌ కలయికలో ఎస్పీబీ ఎన్నో గొప్ప పాటలు పాడారు.

కంబన్‌ ఏమాన్దాన్‌..’’, ‘‘ఇలక్కణమ్‌ మారుదో..’’ పాటలు మహోన్నతమైనవి. తెలుగుకూ తెలిసిన ఇది కథకాదు, అందమైన అనుభవం, 47 రోజులు సినిమాల్లోని పాటలు ఎస్పీబీ ఉన్నారన్న ధైర్యంతో చేసిన పాటలే.

సంగీత దర్శకులు సత్యం, చక్రవర్తి, రమేశ్‌నాయుడు వంటి సంగీత దర్శకుల పాటలకు ప్రాణం పోశారు ఎస్పీబీ పెద్దగా తెలియరాని చంద్రశేఖర్‌, శివాజీ రాజా వంటి సంగీత దర్శకులకూ ‘‘నా కొడకో బంగారు తండ్రీ..’’, ‘‘నీలి మేఘాలలోన నీతో నేనుండి పోనా..’’ వంటి పాటల్లో గొప్ప గానం చేశారు ఎస్పీబీ.

ప్రేమాభిషేకం సినిమా పాటలు ఆయన పాడకపోతే ఏమయ్యేవో? మల్లెపూవు సినిమాలో ఆయన చాల గొప్ప గానం చేశారు. ‘‘ఎవ్వరో ఎవ్వరో..’’ అన్న పాటను బాలు ఎంతో గొప్పగా పాడారు. కృష్ణ నటించిన దేవదాసు సినిమా పాటల్ని ఎస్పీబీ చాల గొప్పగా పాడారు. అందులో ‘‘కల చెదిరింది కథ మారింది..’’ చాల గొప్ప గానం.

ఇళైయరాజా వచ్చాక ఎస్పీబీ, ఇళైయరాజాల కలయికతో తమిళ్‌, తెలుగు, కన్నడ సినిమా పాటల్లో ఒక్కసారిగా కొత్త అందాలు, కొత్త ప్రమాణాలు, కొత్త పరిణామాలు విరిశాయి. ఈ ఇద్దరి వల్ల దక్షిణాది సినిమా పాటలకు యవ్వనం వచ్చింది.. వసంతం వచ్చింది. అభిలాష సినిమా పాటలలో ఈ యవ్వనాన్ని మనం చూడచ్చు. ‘‘నెలరాజా పరిగిడకు చెలి వేచే నా కొరకు..’’, ‘‘ఇలాగే ఇలాగే సరాగమాడితే..’’ వంటి మెలోడియస్‌ Ê మూడ్‌ ఓరియెంటెడ్‌ పాటల్ని ఎస్‌.పీ.బీ. ఉండబట్టే ఇళైయరాజా చెయ్యగలిగారు.

శంకరాభరణం సినిమాలోని ఎస్పీబీ గానం ప్రాంత, భాష, దేశ ఎల్లల్ని దాటి విశ్వ జనరంజకమైంది. ఆ గానం ఒక చరిత్ర అయింది. ఆ సినిమాలో ఎస్‌.పీ.బీ. పాడిన ‘‘శంకరా నాద శరీరా పరా..’’ ఒక ఎమోటివ్‌ వండర్‌.. ఆ సినిమాలో ఏ పాటకు ఆ పాటే సాటి. శంకరశాస్త్రి పాత్రకు పాడిన ఎస్పీబీ ‘‘ఆమని కోయిల ఇలా..’’ అంటూ ఒక యువ పాత్రకు పాడడం ఆయనేమిటో మనకు తెలియజేస్తుంది.

బాలు పాడిన హిందీ సినిమా ఏక్‌ దూజే కే లియే సినిమా పాటలు ఉత్తరాదిలో వాడవాడలా మార్మోగిపోయాయి. ఇంకా హిందీలో నొ(నౌ)షాద్‌, అర్‌.డీ.బర్మన్‌, బప్పీ లహరి, నదీమ్‌ శ్రవన్‌ లక్ష్మీకాంత్‌- ప్యారేలాల్‌ వంటి సంగీత దర్శకులకు ఎన్నో మంచి పాటలు పాడారు ఎస్‌.పీ.బీ.

ఒక పాట రికార్డింగ్‌ సందర్భంలో సంగీత దర్శకుడు నౌషాద్‌, బాలు ప్రతిభకు ఆశ్చర్యపోయారట. సంగీత దర్శకుడు ఒ.పీ. నయ్యర్‌ ‘‘రఫీ తరువాత దేశంలో ఎస్‌.పీ.బీ. మాత్రమే గొప్ప గాయకుడు’’ అన్నారు.

నటులకు తగ్గట్టుగా నటుల గొంతుల్ని అనుకరిస్తూ పాడడంలో ఎస్‌.పీ.బీ.కి సాటిరాగల వారు ఇంకోకరు లేరు.

తమిళ్ష్‌లో టీ.ఎమ్‌. సౌందరరాజన్‌ కొందరు నటుల్ని అనుకరిస్తూ పాడారు. కానీ ఎస్‌.పీ.బీ. ఈ పనిని తన ప్రతిభతో అనితరసాధ్యమైన స్థాయిలో చేశారు. ఆడ గొంతుతోనూ, పేడి గొంతుతోనూ కూడా కొన్ని పాటలు పాడారు.

మరే గాయకుడూ ఎస్‌.పీ.బీ. అనుకరించినన్ని గొంతుల్ని అనుకరించలేదు. ఒకే పాటలో రామారావు, నాగేశ్వరరావులను, కృష్ణ , శోభన్‌బాబులను అనుకరిస్తూ పాడిన పాటలున్నాయి. రాజాధిరాజు సినిమాలో విజయచందర్‌ను, నూతన్‌ప్రసాద్‌ను అనుకరిస్తూ బాలు పాడిన విధానం ఆశ్చర్యాన్నిస్తుంది.

రామారావు వంటి వారికి పురుష గాత్రంతో పాడిన బాలు మాడా, అల్లు రామలింగయ్య, సుత్తి వేలు వంటి వారికి కూడా పాడారు. సహజంగా టెనార్‌`టింబర్‌ ఎస్పీబీది. ‘‘సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ..’’ పాటలో ఆయన మంద్రస్థాయిలో మొదలు పెట్టి పాడడం గొప్పగా ఉంటుంది.

యుగళ గీతాలలో గాయనీమణులు ఆయనకన్నా బాగా పాడడం అన్నది ఎప్పుడూ జరగలేదేమో? ఇంత పెద్ద గాన జీవితం ఉన్న గాయకుడు ఇంకెవరూ లేరు మన దేశంలో. బాలు పాడినన్ని సినిమా పాటలు ప్రపంచంలో ఇంకెవరూ పాడలేదు.

శివస్తుతి బాలు భక్తిగానంలో ఓ కలికితురాయి. తమిళ్ష్‌లో కణ్ణదాసన్‌ రాసి, ఎమ్‌.ఎస్‌. విశ్వనాదన్‌ సంగీతం చేసిన కృష్ణుడి పాటలు కలకాలం నిలిచి ఉండే పాటలు.

కవి ఆత్రేయ ఒకసారి అన్నారు ’’ బాలు ఫీల్‌తో పాడతాడు ఇతరులు పాడడానికి ఫీల్‌ అవుతారు’’ అని. అవును ... ఎస్‌.పీ.బీ. ఒక ప్రతిభావంతమైన సంగీత దర్శకుడు కూడా. మయూరి చిత్రంలో గొప్ప పాటలు చేశారు.

తమిళ్‌లో సిగరం సినిమాలో గొప్ప పాటలు స్వరపఱిచారు. బాలు ఒక గొప్ప డబ్బింగ్‌ కళాకారుడు కూడా కదా! బాలు ఒక గొప్ప నటుడు. తమిళ్‌ సిగరం, తెలుగు పవిత్ర బంధం, మిథునం ఇలా కొన్ని సినిమాల్లో అత్యంత గొప్ప నటనను ప్రదర్శించారు. ఎస్పీబీ పాడి ఉండకపోతే సినిమా గానంలో ఎప్పటికీ ఒక లోటు ఉంటూనే ఉండేదేమో? ఎస్పీబీ పాడినందువల్లే సినిమా గానం పరిపుష్టమయిందేమో?

దేశ సినిమా గానానికి బాలు ఒక అనూహ్యమైన పరిణామం బాలు గానం ఒక చారిత్రిక సంఘటన.

ఎన్నని చెప్పుకోవాలి? ఎంతని చెప్పుకోవాలి ఎస్‌.పీ. బాలసుబ్రహ్మణ్యం గుఱించి? ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఎంతైనా చెప్పుకొవచ్చు.

ఎస్‌.పీ. బాలసుబ్రహ్మణ్యం సినిమా గానం పరంగా మన దేశానికి ఒక వరం.

మన దేశంలో ఎస్‌.పీ. బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రతిభ ఉండే గాయకుడు మరోసారి పుట్టరు. సినిమాలకు సంబంధించినంత వరకూ గానఅద్భుతం ఈ శ్రీపతి పండితారాధ్యూల బాలసుబ్రహ్మణ్యం!

ఎస్థెటిక్‌గా ఎస్పీబీ కన్నా మొహమ్మద్‌ రఫీ, పీబీ శ్రీనివాస్‌ వంటి వారు ఉన్నతంగా పాడారు. ఆయనకు ముందు ఘంటసాల, మన్నాడే వంటి గొప్పగాయకులు ఉన్నారు. ఎస్‌.పీ. బాలసుబ్రహ్మణ్యం ప్రతిభ పరంగా అందరి కన్నా మెరుగైన వారు.

రఫీలోని వెర్వ్‌, పీబీ శ్రీనివాస్‌లోని యాటిట్యూడ్‌ రెండిటి సమ్మిళితం ఎస్‌.పీ. బాలసుబ్రహ్మణ్యం గానం.

ఘంటసాల గొప్పగాయకుడుగా చలామణిలో ఉన్న సమయంలో వచ్చి ఘంటసాలను ఆదర్శంగా తీసుకోకుండా పీ.బీ. శ్రీనివాస్‌ను రఫీని పుణికిపుచ్చుకోవడం ఎస్‌.పీ.బీ. గొప్పతనం. అదే ఆయన్ను గొప్ప గాయకుణ్ణి చేసింది. తొలిదశలో ఆయన తమిళ్ష్‌లో పాడిన పాటలపై పీ.బీ. శ్రీనివాస్‌ ప్రభావం తెలుస్తూంటుంది. ముఖ్యంగా బాలు నాదం పట్టడం, నాద సహజత్వం పీ.బీ. శ్రీనివాస్‌ నుంచి గ్రహించినదే.

ఒ.పీ.నయ్యర్‌ రఫీ తరువాత మన దేశంలో బాలునే గొప్ప గాయకుడు అని ఆంతరంగీక సంభాషణల్లో తన మాటగా చెప్పారు.

బాలు లేకపోయి ఉంటే ముఖ్యంగా దక్షిణాది సినిమా పాటలో కొన్ని పరిణామాలు వచ్చేవి కావు. ఇళైయరాజా చూపిన కొత్త పరిణామాలకు బాలు ఊపిరి. బాలు ఉన్నారు కనుకనే ఇళైయరాజా, ఎమ్‌.ఎస్‌. విశ్వనాదన్‌ వంటి వారు కొన్ని అద్భుతాల్ని ఆలోచించి అమలు పరచగలిగారు.

గాయకుల్లో రఫీలోనూ, పీ.బీ.శ్రీనివాస్‌లోనూ ఉండే స్వర సమం బాలులో మాత్రమే మనకు తెలుస్తూంటుంది.

ఎస్‌.పీ. బాలసుబ్రహ్మణ్యం ప్రతిభపై పరిశోధన జరగాల్సి ఉంది. ఒక గొప్ప గాయకుడుగా ప్రశస్తి పొందినా ఆయన గొప్పతనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోబడలేదు.

ఎస్‌.పీ. బాలసుబ్రహ్మణ్యం పేరును ఆయన వసించిన వీధికి తమిళ్ష్‌ నాడు ప్రభుత్వం పెట్టింది.

కర్ణాటకలో ఎస్‌.పీ. బాలసుబ్రహ్మణ్యం పేరుతో రాస్తా ఉంది.

తెలుగువాళ్లం మనం సంతోషించాల్సిన విషయం ఇది.

మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌. పీ. బాలసుబ్రహ్మణ్యం పేరు ఏ ఊళ్లోనైనా ఏ వీధికైనా ఉందా? పోనీ భవిష్యత్తులోనైనా మన ప్రజలు, ప్రభుత్వాలు ఆ పని చేస్తాయా?

తెలుగు వాళ్లం మనం సిగ్గుపడాల్సిన విషయం కాదా?

2025లోనైనా ఘంటసాల కన్నా బాలు గొప్ప గాయకుడు అని గ్రహించడం

తెలివిడి. మధ్యతరగతి మాంద్యం, జాడ్యం వీటికి అతీతంగా ఆ తెలివిడి తెలుగుకు పూర్తిగా రావాలి. ఘంటసాల కన్నా బాలు గొప్ప గాయకుడు అవడంవల్ల ఘంటసాల గొప్ప వారు కాదు అని అర్థం కాదుబీ ఘంటసాల గొప్పతనానికి భంగం వాటిల్లదు.

సరైన అవగాహన, పరిశీలన ఉన్న ఎవరికైనా బాలు గొప్పతనం తెలుస్తుంది. పాత అభిరుచులు, పాత అభిప్రాయాలు విషయం వివేచన పరంగా పనికిరావు. తెలుగు మధ్యతరగతి అభిప్రాయాలకు అతీతమైన గాయకుడు బాలుబీ బహుముఖ ప్రజ్ఞాశాలి బాలు.

తమిళ్ష్‌లోనూ, కన్నడంలోనూ ఉన్న సాయిలో అభిమాన వర్గం, పరిగణన, ప్రాశస్త్యం బాలుకు తెలుగులో లేకపోవడానికి కారణం తెలుగు మధ్యతరగతి మాంద్యమే, జాడ్యమే. తెలుగు అభిజ్ఞ వర్గం ఘంటసాలలో కూరుకునిపోయి ఉండడంవల్లే ఎస్‌.పీ.బీ. గాన ప్రతిభకు ఇతర భాషల్లోనూ, దేశ వ్యాప్తంగానూ వచ్చిన గౌరవం, మన్నన తెలుగులో రాలేదు.

గజల్‌ గానంలో గులాం అలీ ఒక ప్రత్యేకమైన పరిణామం. అదే విధంగా భారతదేశ చలనచిత్ర నేపథ్య గానానికి ఎస్‌.పీ. బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రత్యేకమైన పార్శ్వంబీ ఒక పరిపుష్టమైన పరిణామం.

- రోచిష్మాన్‌, 9444012279

నివురైపోయినా.. మా జ్ఞాపకాల నీడలలో నువ్వెపుడూ ఉంటావు!!

నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావూ.., నను వలచావని తెలిసేలోగా నివురై పోతానూ!

ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నావు బాలూ? జ్ఞాపకాల నీడలేంటీ? దశదిశలా కమ్మేసిన మానసిక ఆక్సిజన్‌ నువ్వు! నిను వలచని మనిషెవ్వడు? నిన్నెవరు మరువగలరు..?

మగవాడి కోసం అసంఖ్యాక ప్రేమగీతాలు పాడావు, ఆడమనిషి కోసం ‘‘ఎటేపమ్మ ఒంటరి నడకంటూ’’ అన్నవై సుద్దులు చెప్పావు. తృతీయలింగపు ‘‘సూడు పిన్నమ్మా, పాడు పిల్లాడంటూ’’ పాటా పాడేశావు..!

హాస్యగాడి కోసం ‘‘ముత్యాలూ వస్తావా..!’’ అన్నావ్‌..! దేశభక్తిని ‘‘జననీ జన్మభూమిశ్చ’’ పాడి ఉద్దీపన చేశావ్‌..! గిరిజనుణ్ని ‘‘కృషి వుంటే మనుషులు ఋషులౌతారంటూ’’ మేల్కొలిపావు! శ్రామిక వనాల కోసం వసంతం తనంతట తానే తరలివస్తుందని భరోసానిచ్చావు..! క్షుద్రులెరుగని రుద్రవీణని సాక్షాత్తూ పరమశివుడికే అవధరించి విని తరించమంటూ తాంబూలాలిచ్చేశావ్‌..!

ఎన్ని గుండెలు జారుతున్నాయో ఊహించగలవా..? ఎన్ని కన్నీళ్ళు పారుతున్నాయో లెఖ్కెట్టగలవా..?

బాలూ..,

నీ ఒదిగిన మాట గురించీ, ఎదిగిన బాట గురించీ రంధ్రాన్వేషకులూ, నిత్యశంకితులూ నిరంతరం తీర్పులిస్తూనే ఉంటారు. రికార్డింగ్‌ రూముల్లో నాదస్వర విన్యాసాలు తప్ప, రోడ్డు మీది సత్రకాయగాళ్ల సన్నాయి నొక్కులు వినే తీరిక నీకెప్పుడుండిరదనీ?

నీ పాట గురించీ, గళవిన్యాసం గురించీ రెండో అభిప్రాయం లేదు బాలూ! అది సినిమాపాటకు తాతా, తండ్రీ, పెనిమిటీ, సోదరుడూ, కొడుకూ, మనవడూ! సంగీతమున్నంత కాలం, మానవజాతికి బధిరత్వం రానంతవరకూ నువ్వుంటావ్‌..! ఇప్పుడు కూడా ఎక్కడో భూతపు గొంతేసుకుని ‘‘ఓబాలా మసజసతతగా శార్దూలా..!’’ అంటూ ఫిల్‌ ఇన్‌ ద ట్యూన్‌ కూడా ఫీల్‌ తో పాడుతున్నావు..!

నీ ఇంటిపేరు శ్రీపతిపండితారాధ్యుల కావచ్చు కానీ, నిజానికి నువ్వు శ్రీపతిపామరారాధ్యుల వారివి. నాబోటి మాస్‌ గాడికి జతులూ, కృతులూ, శృతులూ,గతులూ ఏమర్ధమవుతాయి చెప్పూ..? నువ్వు ‘‘బంగారు కోడిపెట్టా వచ్చెనండీ’’ పాటలో ఓచోట ‘‘కుక్కుర్కూ..!’’ అంటావ్‌ చూడూ. అదీ నువ్వు! అందుకే నువ్వంటే మాకు లవ్వు!

బాలూ,

నీ పుణ్యాన ఎంత మంది పిల్లలు గాయకులయ్యారో తెలుసా..? ఎంత మంది నీ పేరు చెప్పుకుని కబళం తింటున్నారో ఊహించగలవా..?

నీ మూలాన గాయకులు కాలేదని చెప్పుకుంటున్న పెద్దవాళ్లకన్నా కొన్ని వేల రెట్లు..! వాళ్లలో చాలామంది తమను తాము స్వర్ణభాండాల్లాగా భావించుకునే సత్తుగిన్నెలు..!

నాకు సంతాపం చెప్పడం ఇష్టం లేదు బాలూ..! నీ కన్నా గొప్పగాయకులు పుంజీలుపుంజీలుగా ఉన్నారు. కానీ సినిమా పాట మాతృపెనిమిటి మాత్రం నువ్వే!

‘‘నాస్తితేషాం యశఃకాయే జరామరణ జంభయం’’ కదా..! నువ్వు అడ్డంగా నిలువెత్తు పాటవి..!

ఆ నారదుడికీ, తుంబురుడికీ, గంధర్వులకీ ప్రవేటు తీసుకో..! ఆ శివయ్య ముందు భక్తకన్నప్ప కిరాతార్జునీయం పాట పాడు గానీ, ఆయనతో డాన్సులూ గట్రా చెయ్యమాక..! అసలే పర్సనాలిటీలో ఆయన పెద్దకొడుకులాంటోడివి..!

మామనీ, ఎమ్మెస్వీనీ, ఘంటసాల మాస్టార్నీ, పంచమ్‌ దా నీ, వేటూరీ సినారే ఆత్రేయల్నీ అడిగినట్టు చెప్పు..! ఆ మహ్మద్‌ రఫీతో కావలసినన్ని పాటలు పాడిరచుకో..! సీతారావుడు సరిగ్గా కుదురుకున్నాడో లేదో కనుక్కో!

పిల్లాడు దారిన పడ్డాడ్లే.., వాడి దిగులేం పెట్టుకోకు.

పని రాక్షసుడిలా అక్కడా రోజూ మూడుషిఫ్టులూ పాడేయకు. సుఖంగా, సుబ్బరంగా విశ్రాంతి తీసుకో..!

సరస్వతీ దేవి తన ముద్దుల బిడ్డని చూసుకొని మురిసిపోతుంది. తన మావగారి పక్కనే ఓ రెండో శేషుడి పడకేయిస్తుంది. సుబ్బరంగా పడుకో..! ఆ గంధర్వుల సతీమణులు ఒక్కసారి నీ గొంతిన్నారంటే తినడం మానేసి పోటీపడి నీ కాళ్లొత్తుతూ సెటిలైపోతారు.

‘‘ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే..!’’ అంటూ పాడాల్సిన అవసరమే రాదు. పైగా ‘‘నడిరాతిరిలోనా నీ పిలుపూ!’’ అంటూ వాళ్లే ఎదురుపాడినా దిక్కులేదు.

ఇవాళేంటో మధ్యాహ్నం నుండి పూలు గుసగుసలాడటం లేదు., నవ్వులూ రువ్వడం లేదు. నువ్వు పాడని పుష్పవిలాపాన్ని పాడుతున్నాయి..!

ఇవాళేంటో గాలి సైగలు చేయడం లేదు. నువ్వు పాడని పడవప్రయాణపు పాట పాడుకుంటోంది..!

బాలూ..,

చాలాసార్లు చెప్పినట్టే ఇప్పుడూ చెబుతున్నా..!

ఐ లవ్యూ!

నువ్వు భౌతికంగా లేకపోవడం పట్ల నీగురించి నాకేం దిగుల్లేదు బాలూ..! నువ్వు పాడిన పాటల్ని ఇంకో రౌండ్‌ వింటే, తర్వాత నీ లైవ్‌ కాన్సర్టే వినొచ్చు!

కానీ వృద్ధులైన నా తల్లిదండ్రులు పాడుతా తీయగా, స్వరాభిషేకం వదలకుండా చూసేవాళ్ళు. వాళ్లను చూస్తే దిగులుగా ఉంటుంది.

నా కుటుంబంలో శాశ్వతసభ్యుడివి ఎందుకయ్యావు బాలూ...?

తేరే మేరే బీచ్‌ మే కైసాహై యే బంధన్‌ అంజానా..!

మైనే నహీ జానా తూనే నహీ జానా%ౌ!

ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుకా..?

ఏ దారెటు పోతుందో ఎవరినీ అడగకా%ౌ!

లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావూ..

మమ్ము తోలుబొమ్మలను చేసీ ఆడిస్తావూ..!

‘‘ఋణానుబంధేన రూపేణ

పశుపత్నిస్సుతాలయః

ఋణక్షయే క్షయంయాంతి

కాతత్రపరివేదనా?’’

అనేసి వదిలేద్దామంటే నువ్వా లిస్టులో లేవు. నీ ఋణం తీరదు..!

‘‘పెరుగుతుంది వయసనీ అనుకుంటారు,

కాని తరుగుతుంది ఆయువనీ తెలుసుకోరు..!’’

ఎంత సరిగ్గా అర్ధం చేసుకున్నావు బాలూ?

- గొట్టిముక్కల కమలాకర్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page