యువతరం చూడాల్సిన సినిమా.
- Guest Writer
- Nov 12, 2025
- 2 min read

రష్మిక లీడ్‌రోల్‌లో నటించిన గర్ల్‌ఫ్రెండ్ ఒక డిఫరెంట్ సినిమా. ప్రస్తుతం యువతరం ఫేస్ చేస్తున్న బ్రేకప్ సమస్యని కొత్త కోణంలో చూపించారు. అమ్మాయిలు విపరీతంగా చూస్తున్నఈ సినిమాలో ఏముందో చూద్దాం. కథ గురించి మాట్లాడే ముందు స్త్రీ పాత్రల విషయంలో తెలుగు సినిమా పరిణామాన్ని పరిశీలిద్దాం. ఫెమినిజం గురించి ఎంత మాట్లాడుకున్నా, మనది మేల్ డామినేటెడ్ సమాజమే. సినిమా కూడా ముందు నుంచి హీరో ఓరియెంటెడే. పతిభక్తి నూరిపోసే సినిమాలు, భర్త ఎంత దుర్మార్గుడైనా కన్నీళ్లతో దారికి తెచ్చుకునే సతీమణులు, మొదటి రాత్రే భర్త కాళ్లకి దండం పెట్టి, తాళిని కళ్లకి అద్దుకునే సన్నివేశాలు, భర్తని ఏమండి, మీరు, అని పిలుస్తూ ఏమే, ఒసేయ్ అని పిలిపించుకునే భార్యలు ఉన్న కాలం ఒకటుండేది. ఒకవేళ ఆడవాళ్లు గట్టిగా మాట్లాడితే ఆడపెత్తనం అనేవారు, వాళ్లు సహజంగానే సూర్యకాంతం, ఛాయాదేవిలాగా కనిపించేవాళ్లు. చివర్లో భర్త చేతిలో దెబ్బలు తినడమో, పశ్చాత్తాపంతో కాళ్ల మీద పడడమో చేసేవాళ్లు.
కానీ కాలం మారింది. ఆడపిల్లలందరూ బాగా చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్థికంగా వేరొకరిపై ఆధారపడడం తగ్గింది. ఫెమినిస్ట్ భావాలు పెరిగాయి. పురుషాధిపత్యాన్ని ప్రశ్నించడం మొదలైంది. ఈ భావజాలం సాహిత్యంలో వచ్చినంత బలంగా సినిమాలో రాలేదు. కమర్షియల్ సినిమా ఇప్పటికీ ఏమీ మారలేదు. చాలా సినిమాల్లో హీరోయిన్ అంటే పాటలకే పరిమితం.
అయితే ప్యారలల్‌గా కొన్ని సినిమాలు వచ్చాయి. శారద, సుహాసిని, సౌందర్య, రాధిక చాలా సినిమాల్లో బలమైన పాత్రల్లో నటించారు. గట్టి వ్యక్తిత్వం ఉన్న, ప్రశ్నించే యువతులుగా నటించారు. ప్రశ్నించడం వేరు, ధిక్కరించడం వేరు. ప్రశ్నకు ఉన్నంత ఆమోదం, ధిక్కరణకి ఉండదు. అందుకే బాలచందర్‌లాంటి గొప్ప దర్శకులు అంతులేని కథలో సొంత వ్యక్తిత్వం, మానసిక ధైర్యం వున్న రెండు క్యారెక్టర్లు తీసుకున్నప్పటికీ సరైన ముగింపు ఇవ్వలేకపోయారు. పరిస్థితులకి, కుటుంబ బాధ్యతలకి తల ఒగ్గడం తప్ప జయప్రదకి వేరే దారిలేదు. తెగింపు ఉన్న ఫటాఫట్ జయలక్ష్మి కూడా సొసైటీని ఎదిరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో నుంచి పరిశీలిస్తే గర్ల్‌ఫ్రెండ్ బోల్డ్ సినిమా, ముగింపు కూడా బాగుంది.
కథ ఏంటి..
కథ చాలా సింఫుల్. విక్కీ (దీక్షిత్ శెట్టి), భూమా (రష్మిక) ఒకే కాలేజీలో చదువుతుంటారు. విక్కీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. సాహిత్యం మీద ఇష్టంతో ఎమ్‌ఏ ఇంగ్లిష్ లిటరేచర్‌లో భూమా చేరుతుంది. ఒక సందర్భంలో ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. కలిసి తిరుగుతారు. విక్కీ దుడుకు మనిషి, భూమా నెమ్మది. విక్కీకి తన తల్లి అంటే ఇష్టం. మా అమ్మలా ఉంటావు కాబట్టి నువ్వంటే ప్రేమ అని హీరోయిన్‌తో అంటూ ఉంటాడు. ఒకసారి బళ్లారికి తీసుకెళ్లి తల్లిని పరిచయం చేస్తాడు. తల్లి వంచిన తల ఎత్తదు. కొత్తవాళ్లతో మాట్లాడదు. భర్త చేతిలో దెబ్బలు తిని ఇంటి గోడల మధ్య జీవించిన ఇల్లాలు. ఆమెను చూసి భూమా షాక్ తింటుంది. విక్కీని చేసుకుంటే తన బతుకు కూడా అంతేనని అనుమానం వస్తుంది. సెకెండాఫ్‌లో హీరో పొసెసివ్‌నెస్‌ని భరించలేక బ్రేకప్ చెబుతుంది. దాంతో అతను దారుణంగా అవమానిస్తాడు. చివరికి హీరోయిన్ ఏం చేసిందనేది మిగతా కథ.
యువతరం చూడాల్సిన సినిమా
యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే కథ ఇది. ప్రేమ ఎంత సహజమో, బ్రేకప్ కూడా అంతే. కొంత పరిచయం తర్వాతే కదా ఒకరంటే ఒకరికి తెలిసేది. ప్రేమకి ముందు స్నేహితుడిగా ఉన్న లవర్, ఆ తర్వాత ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడినా ఆంక్షలు పెట్టే వ్యక్తిగా తయారైతే, బ్రేకప్ తప్ప ఇంకో దారి లేదు. ఆ తర్వాత తమని వాడుకుని వదిలేసిందని, బండారం బయట పెడతానని బెదిరించడం, దాడికి ప్రయత్నించడం, యాసిడ్ పోయడం ఇలాంటి సైకిక్ లక్షణాలతోనే అసలు ప్రమాదం. బాధితులంతా అమ్మాయిలే. ఇలాంటి సందర్భం వస్తే ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలి? అనే విషయం కొంచెం స్లో నెరేషన్ అయినా, బాగా చెప్పాడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్.
విక్కీ తల్లి రోహిణిగా హీరోయిన్ తనని ఊహించుకుంటున్నపుడు, బాత్రూం గోడలు కదులుతున్న సన్నివేశాల్లో చప్పట్లు వినిపిస్తున్నాయి. ప్రేమికులు అనేకసార్లు సెక్సువల్‌గా కలుసుకున్నారన్న విషయం ఆఖరులో డైలాగ్ ద్వారా చెబుతారు. కథ పరంగా ఈ సన్నివేశాలు చూపే అవకాశం ఉన్నా, ఆ పని దర్శకుడు చేయలేదు. చెప్పదలుచుకున్న విషయం పక్కదారి పట్టకుండా జాగ్రత్తపడ్డాడు.
రష్మిక నటన ఎలా ఉంది?
రష్మిక మంచి నటి. సినిమా ప్రారంభమైన కాసేపటికి భూమాదేవి తప్ప రష్మిక కనపడదు. కళ్లతోనే నటించింది. దుర్గగా అను ఇమాన్యుయేల్ పాత్ర బలంగా ఉన్న ఒక ఆర్క్ మిస్సయింది.
మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్ ఫర్‌ఫెక్ట్. ఫస్టాఫ్ స్లోగా ఉన్నా, సెకెండాఫ్ స్పీడ్‌గానే వుంది. యువతరం చూడాల్సిన సినిమా.
- బీబీసీ.కామ్ సౌజన్యంతో...










Comments