top of page

యాసిడ్ దాడికి యత్నించినా నో కేస్

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 17 hours ago
  • 3 min read
  • ఇంటిని తగులబెట్టడానికి వచ్చినా స్పందించలేదు

  • తాళాలు బద్దలుగొట్టినా 112 దిక్కు

  • సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఎఫఐఆర్ పడలేదు

  • 2024 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

నక్కలు, తోడేళ్లకు అడవుల్లో జీవనం కష్టమై నగరానికి వలసలు వచ్చాయి. బాధితుడ్ని సొమ్ములు తెచ్చే వనరుగా చేసుకోవడం బాగా అర్థం చేసుకుంటున్నాయి. పసిరిక పాములు పచ్చని తీగలుగా కనిపించే కాలమిది. విషం ఇప్ప్పుడు కోరల్లో లేదు.. నిందితుడికి అమ్ముడుపోయే సమాచారంలో ఉంది. తనకు న్యాయం దక్కదని తెలిసినా పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కుతునే ఉంటారు బాధితులు. వీరిని చూస్తుంటే తమకు దక్కదని తెలిసినా తేనెటీగలు తేనె పెడుతునే ఉండటాన్ని ఉదాహరణగా తీసుకోవాలేమో?!

తన మీద యాసిడ్ దాడి జరిగిందని 2024 జూన్ చివరి వారం నుంచి నగరానికి చెందిన ఓ బాధితుడు పోలీసుల చుట్టూ తిరుగుతునే ఉన్నాడు. ఇందుకు ఆధారాలు కావాలంటే ఒకటికి పదిసార్లు తన ఇంటికి ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులకు ఇస్తునే ఉన్నాడు. దీని మీద చర్యలు తీసుకోండి మహాప్రభో అంటూ డీఎస్పీ స్థాయి నుంచి పోలీసు అధికారుల వరకు కాళ్లావేళ్లా పడి బతిమిలాడాడు. ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి ఎఫఐఆర్ నమోదు కాలేదు సరికదా.. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినందుకు 2025 అక్టోబర్ 20న దుండగులు ఆయన ఇంటికి నిప్ప్పు పెట్టడానికి ప్రయత్నించారు. ఈ సీసీ టీవీ ఫుటేజ్ కూడా పట్టుకొని బాధితుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. సమయానికి 112కు డయల్ చేయడంతో పోలీసులు రావడం వల్ల దుండగులు పారిపోయారు. దీని మీద కూడా ఎటువంటి కేసూ నమోదు కాలేదు. చివరకు అదే ఏడాది డిసెంబరు 26న ఆయన ఇంటికి ఉన్న తాళాలు బద్దలుగొట్టి లోపలికి చొరబడాలని ప్రయత్నించారు. అప్ప్పుడు కూడా 112 ఆదుకుంది తప్ప, టూటౌన్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేయలేదు. వీటన్నింటికీ సీసీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నాయి. పోనీ నిందితుడు ఏమైనా శుద్ధపూసా అంటే.. క్రిమినల్ చరిత్ర ఉందని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. బాధితుడేమైనా పిటిషన్‌మాంగరా అంటే.. ఆయన అసలు సిసలు బాధితుడని గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, కులపెద్దలు చేసిన పంచాయితీలు చెబుతున్నాయి. టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ప్రతీసారి నిమిషాల వ్యవధిలో నిందితులు వాలిపోవడం, స్టేషన్ బయటే లేపేస్తామంటూ వార్నింగ్‌లు ఇవ్వడం చూస్తే.. నిందితులకు అదే పోలీస్‌స్టేషన్‌లో ఎవరో సహకరిస్తున్నట్టు చిన్నపిల్లాడికైనా అర్థమైపోతుంది.

వివరాల్లోకి వెళితే.. నగరంలో బాకర్‌సాహెబ్‌పేటలో నివాసముంటున్న గుడ్ల శ్రీనివాసరావుకు, ఆయన తోడబుట్టిన అన్న వెంకటరమణమూర్తికి మధ్య వివాదాలు ఉన్నాయి. గతంలో గుడ్ల శ్రీనివాస్ మొత్తం కుటుంబాన్ని బియ్యం కొట్టులో పడేసి షట్టర్‌కు తాళాలు వేసి వెళ్లిపోయిన కేసులో గుడ్ల వెంకటరమణమూర్తి ప్రధాన నిందితుడని పోలీసులు తేల్చారు. అప్ప్పుడు కూడా రూరల్ ఎసఐ శ్రీనివాస్, మహిళా పోలీస్‌స్టేషన్ ఎసఐ నారీమణి, టూటౌన్ సీఐ వీరకుమార్‌లు సంఘటనా స్థలానికి వెళ్లి వెంకటరమణతో తాళాలు తీయించి కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2010 జులైలో జరిగితే, 2012 నవంబరులో జ్యుడీషియల్ మొబైల్ మెజిస్ట్రేట్ గుడ్ల వెంకటరమణకు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు అన్నదమ్ముల మధ్య గొడవలు, కేసులు నడుస్తునే ఉన్నాయి. వీటిని పక్కన పెడితే, తాజాగా 2024 జూన్ 23న తన మీద యాసిడ్ దాడి జరిగిందంటూ శ్రీనివాసరావు టూటౌన్‌లో ఫిర్యాదు చేసి, అందుకు సంబంధించిన ఆధారాలు (ఫొటోలు) ఇచ్చారు. దానిపై ఇప్పటి వరకు ఎఫఐఆర్ నమోదు కాలేదు. కుమారుడి ట్రీట్‌మెంట్‌తో పాటు శ్రీకాకుళంలో ఉంటే చంపేస్తారన్న భయంతో గుడ్ల శ్రీనివాసరావు కొన్నాళ్ల క్రితం ఇంటికి తాళం వేసి విశాఖపట్నం షిప్ట్ అయిపోయారు. అందులో భాగంగా ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. వైజాగ్‌లో అయితే ఉన్నారు కానీ.. తమ ఇంటిని, తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం నిరంతరం మొబైల్‌లో కెమెరాలను ట్రాక్ చేస్తునే ఉన్నారు. మొదటిదానిలో ఎఫఐఆర్ లేకపోవడంతో 2025 అక్టోబర్ 20న తన ఇంటికి నిప్ప్పు పెట్టడానికి ప్రయత్నించారంటూ 112కు విశాఖ నుంచి ఫోన్ చేశారు. 2004కు ముందు నుంచి ఎటువంటి రాకపోకలు లేని అన్న కుటుంబ సభ్యులు తాళం వేసి ఉన్న తన ఇంటి ముందు దీపాలు పెట్టడం, వాటిని గేటు లోపలికి చొప్పించాలని చూశారంటూ ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను ఇచ్చారు. అయినా పోలీస్ విచారణ జరగలేదు. అలాగే డిసెంబరు 26న ఇంటి తాళాలు బద్దలుగొట్టడానికి గుడ్ల వెంకటరమణ ప్రయత్నించడాన్ని కూడా సీసీ కెమెరాల్లో చూడటంతో మరోసారి 112కు ఫోన్ చేశారు. గుడ్ల వెంకటరమణమూర్తి కుమారుడు సాయి విజయకష్ణ ఈ నేరాల్లో ప్రధానంగా ఉన్నాడని తెలిసినా విచారణ జరగడంలేదు. టూటౌన్‌లో ఫిర్యాదు ఇచ్చిన ప్రతీసారి బయటకు లీక్ చేస్తున్నారని శ్రీనివాసరావు వాపోతున్నారు. ఈ ఏడాది జనవరి 2న టూటౌన్ సీఐని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి బయటకు వచ్చినప్ప్పుడే సాయి విజయకష్ణ నలుగురు మనుషులతో బయట ఉండి తనను బెదిరించారని శ్రీనివాసరావు తెలిపారు. 2024 నుంచి వరుస సంఘటనలు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు శ్రీనివాసరావు సోమవారం ఎస్పీ గ్రీవెన్స్‌లో ఆధారాలు సమర్పించారు. ఎస్పీ లేనందున అడిషనల్ ఎస్పీకి అందజేసి వచ్చారు. 2004 నుంచి జరుగుతున్న అన్నదమ్ముల యుద్ధంలో గుడ్ల వెంకటరమణమూర్తి, అతని కుటుంబం చేసిన అరాచకాలన్నీ ఆధారాలతో సహా శ్రీనివాస్ అడిషనల్ ఎస్పీకి ఇచ్చారు. కనీసం ఇప్ప్పుడైనా పోలీసులు స్పందిస్తారో లేదో చూడాలి. లేదూ యాసిడ్ దాడి అంటే మొహం కాలిపోవాలని, ఇంటికి నిప్ప్పు పెట్టడం అంటే ఫైరిం్పున్ రావాలని, తాళాలు బద్దలుగొట్టడమంటే ఇంటిలోని నగలు మాయమవ్వాలని, ఇవేవీ లేవు కాబట్టి కేసు నమోదు చేయలేమంటారేమో చూడాలి. నేరం జరిగిన తర్వాత నిందితులకు ముసుగేసి మీడియా ముందు నిలబెట్టేకంటే నేరం జరగకముందే చర్యలు తీసుకోవడం ఎప్పటికైనా మంచిది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page