top of page

రాజేంద్రప్రసాద్‌ మానసిక పరిస్థితి బాలేదా ?

  • Guest Writer
  • 6 days ago
  • 2 min read

ree

సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . షుమారు నాలుగు దశాబ్దాలకు పైగా కామెడీ హీరోగా , క్యారక్టర్‌ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ హీరో తెలుగు ప్రజలకు సుపరిచితం. ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో వెండితెర మీద హాస్యాన్ని కూడా పండిరచి ఒకానొక టైములో హాస్యానికి బ్రాండ్‌ అంబాసడర్‌ గా మారి నట కిరీటి అని బిరుదుతో గౌరవం పొందారు. రాజేంద్రప్రసాద్‌ మంచి నటుడు , మంచి కమెడియన్‌ , మంచి క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌అందులో సందేహం లేదు. ఆయన అహ నా పెళ్ళంట సినిమాలో ఎంత బాగా నవ్వులు పండిరచాడో , ఆ నలుగురు మూవీలో అంత విషాదాన్ని పలికించాడు. నాలుగు దశాబ్దాల క్రితం కమెడియన్‌ హీరో పాత్రలకు రాజేంద్రప్రసాద్‌ మాత్రమే సరైన న్యాయం చేయగలడు అని నిర్మాతలు భావించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. తర్వాత్తర్వాత వీకే నరేష్‌ , అల్లరి నరేష్‌ లాంటి హీరోలు వచ్చారు రాజేంద్రప్రసాద్‌ సినిమాల్లో కమెడియన్లకు పెద్దగా పనుండేది కాదుఎందుకంటే ఆ బాధ్యతను కూడా తన భుజాన వేసుకుని అన్నీ తానే అయి నవ్వులు పూయించేవాడు.

దశాబ్దాలుగా హీరో పాత్రల్లో మెప్పించిన రాజేంద్ర ప్రసాద్‌ ఇటీవల సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో క్యారక్టర్‌ ఆర్టిస్టుగా కూడా రాణిస్తున్నాడు బేబీ , ఆ నలుగురు లాంటి సినిమాల్లో వయసుకు తగ్గ పాత్రల్లో నటించి ప్రేక్షకులచేత శభాష్‌ అనిపించుకున్నారు. ఇదంతా నాణేనికి ఒక వైపురెండోవైపు కూడా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అదే.

గత కొద్దికాలంగా సినిమా ఫంక్షనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజేంద్రప్రసాద్‌ నలుగురి దృష్టిలో పడుతున్నాడు. ఆఖరికి సినిమా ఫంక్షన్‌ లకు ఆయన్ని పిలవాలంటే నిర్వాహకులు భయపడే పరిస్థితులు వచ్చాయి. ఏ ఫంక్షన్‌ కి వచ్చినా ఏదో ఒక విపరీత వ్యాఖ్యలు చేసి ఆయన ట్రోలింగ్‌ కి గురవడమే కాదు నెటిజన్లు నిర్వాహకులను కూడా ట్రోల్‌ చేస్తున్నారు.

తాజాగా రాజేంద్రప్రసాద్‌ సకుటుంబాయణం అనే ఓ సినిమా ఫంక్షన్‌ లో మాట్లాడుతూ బ్రహ్మానందాన్ని ‘‘ముసలి %ౌ%.. ’’ అని రాయలేని భాషలో తిట్టాడు. అలా తిట్టడానికి కారణాలు కూడా ఏమీ లేవుజస్ట్‌ ఆయన తిట్టాలనుకున్నాడు .. తిట్టేసాడు. దీనితో మళ్ళీ నోరుజారిన ఆయన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఆ ఫంక్షన్‌ లో ముందుగా బ్రహ్మానందం ప్రసంగించి అనంతరం మైకు రాజేంద్రప్రసాద్‌ చేతికిచ్చి మాట్లాడవాల్సిందిగా కోరారు. మైకు అందుకున్న ఆయన మాట్లాడుతూ ’’ పద్మశ్రీ డాక్టర్‌ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడాలా ? ’’ అని వెటకారం చేసాడు. ఆ మాటల్లో నాలాంటి సీనియర్‌ నటుడికి ముందుగా మైక్‌ ఇవ్వకుండా నువ్వు మాట్లాడిన తర్వాత ఇవ్వడమేంటన్న అహంభావం కూడా ఉంది. అయినా బ్రహ్మానందం వినమ్రతగా ‘‘మీకంటే పెద్దవాడిని అయినా కూడా నేను మీ శిష్యుడనే కదా ? ’’ అని ఆయన సీనియారిటీని గౌరవిస్తూ అన్నారు.

దానికి రాజేంద్రప్రసాద్‌ ’’ కానీ నువ్వు ముసలి %ౌ%.. కొడుకువి కదా ?’’ అని వెటకారంగా అనడం తో వేదిక మీద ఉన్నవాళ్ళందరూ అవాక్కయ్యారు. ఆయనేమన్నాడో అర్ధం కాక బ్రహ్మానందం కూడా ‘‘ఎవరు ?’’ అని అడిగారు. టంగ్‌ స్లిప్‌ అయిన రాజేంద్రప్రసాద్‌ కవర్‌ చేసుకుంటూ ’’ నేనే ’’ అని అన్నప్పటికీ ఆయన మాట్లాడిన మాటలన్నీఅప్పటికే వీడియోలలో రికార్డ్‌ అయిపోయాయి. ఇటీవల హార్ట్‌ ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత సినిమాలు తగ్గించుకున్న సీనియర్‌ కమెడియన్‌ ఆర్టిస్టు ను పట్టుకుని ఆయన వయసుకు , హోదాకు గౌరవం ఇవ్వకుండా ‘‘ముసలి %ౌ%. ’’ అనటం బ్రహ్మానందం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి రాజేంద్ర ప్రసాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో రాబిన్‌ హుడ్‌ సినిమా ఫంక్షన్లో ఏకంగా ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ పై నోరు పారేసుకున్నాడు. తర్వాత ఇంకో ఈవెంట్‌ లో కమెడియన్‌ ఆలీని అనరాని మాటలు అన్నాడు. అంతేనా .. రాజేంద్రప్రసాద్‌ చేత మాటలు పడ్డవాళ్లలో అలనాటి హీరోయిన్లు కూడా ఉన్నారు.

ఒకనాటి హీరోయిన్‌ రవళిని గుండ్రాయి అంటూ బాడీ షేమింగ్‌ మాటలు మాట్లాడాడు. రోజాను హీరోయిన్ను చేసింది నేనే అంటూ ఎగతాళిగా మాట్లాడాడు.

ఇలా ఏ ఫంక్షన్‌ కి వచ్చినా వింత మనస్తత్వంతో విచిత్రంగా మాట్లాడుతుండటంతో ఆయన ప్రవర్తనతో విసిగి కొంతమంది సెలెబ్రిటీలు బాహాటంగానే విమర్శిస్తుండగా ఆలీ లాంటి వాళ్ళు కూతురు మరణంతో అలా మాట్లాడుతున్నాడని సరిపెట్టుకుంటున్నారు. దీనితో చిత్రపరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు ఈవెంట్లకు రాజేంద్రప్రసాద్‌ ను పిలవాలంటే భయపడే పరిస్థితులు వచ్చాయి. కోట శ్రీనివాసరావు , బాబూ మోహన్‌ లకు పుత్ర వియోగం ఏర్పడినప్పటికీ పబ్లిక్‌ వేదికల్లో ఎప్పుడూ నోరు జారి మాట్లాడలేదని వారు గుర్తు చేసుకుంటున్నారు. కానీ గత కొద్దికాలంగా రాజేంద్రప్రసాద్‌ హేళనలు చూస్తున్న పరిశ్రమకు చెందిన వర్గాలు మాత్రం ఆయనేదో మానసిక సమస్యతో బాధపడుతున్నాడని భావిస్తున్నాయి. వేదికల మీద విచిత్రంగా ప్రవర్తించడం , అకస్మాత్తుగా సంబంధం లేని మాటలు మాట్లాడటం ఆయన మానసిక పరిస్థితులను తెలియచేస్తున్నాయి అనుకుంటున్నారు. ఏమైనా నటకిరీటి బిరుదాంకితుడైన ఒక సీనియర్‌ కమెడియన్‌ కమ్‌ హీరో కమ్‌ క్యారక్టర్‌ ఆర్టిస్టు సినీ కెరీర్‌ ముగింపు దశలో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉన్న పేరును పోగొట్టుకునే బదులు రిటైర్‌ అయి విశ్రాంతి తీసుకోవడం మేలని ఆయన అభిమానులే అభిప్రాయపడుతున్నారు!

- పరేష్‌ తుర్లపాటి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page