రాజు వెడ్స్ రాంబాయి.. గుండెకు గుచ్చుకునే ప్రేమకథ
- Guest Writer
- 3 days ago
- 3 min read

‘లిటిల్ హార్ట్స్’తో ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న ఈటీవీ విన్ సంస్థ.. ఇప్పుడు ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని ట్రైలర్ చూస్తే పల్లెటూరి నేపథ్యంలో ఒక స్వచ్ఛమైన ప్రేమకథను అందించే ప్రయత్నం చేసినట్లు అనిపించింది. కొత్త దర్శకుడు సాయిలు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
రాజు (అఖిల్ ఉద్దేమరి) ఖమ్మం జిల్లాలోని ఇల్లందు అనే ఊరిలో బ్యాండ్ కొట్టుకుని బతికే కుర్రాడు. అతను యుక్త వయసులోకి వచ్చినప్పటి నుంచే తన ఊరికే చెందిన రాంబాయి (తేజస్వి రావు)ను ప్రేమిస్తుంటాడు. తర్వాత రాంబాయి కూడా అతణ్ని ప్రేమిస్తుంది. చాటుమాటుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరి గురించి ఊరంతా తెలిసిపోతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేసే రాంబాయి తండ్రి వెంకన్న (చైతు జొన్నలగడ్డ)కు తన కూతురిని ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాడికే ఇచ్చి పెళ్లి చేయాలని ఉంటుంది. తన అభీష్టానికి వ్యతిరేకంగా తన కూతురు.. వేరే కులానికి చెందిన బ్యాండ్ కొట్టుకునే కుర్రాడిని ప్రేమించడంతో వెంకన్న వీరి పెళ్లికి అంగీకరించడు. అదే సమయంలో రాజు.. రాంబాయిని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. ఇద్దరి మధ్యలో రాంబాయి నలిగిపోతుంది. మరి చివరికి తన జీవితం ఏమైంది.. రాజును పెళ్లాడిరదా లేదా.. వీరి కథకు ముగింపు ఏంటి.. అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
‘‘తెలుగు ప్రేక్షకులు విషాదాంతాలు చూడరు’’.. ‘‘మన వాళ్లు హార్డ్ హిట్టింగ్ కథలను ఒప్పుకోరు’’.. ‘‘మనసులను ఛిద్రం చేసే సన్నివేశాలను.. మలుపులను తట్టుకోలేరు’’.. ఇలాంటి అభిప్రాయాలు చాలా బలంగా నాటుకుపోయాయి చాలా ఏళ్ల పాటు. అందుకే గౌతమ్ మేనన్ తమిళంలో తెరకెక్కించిన ‘విన్నైతాండి వరువాయ’లో హీరో హీరోయిన్లను విడదీసి.. తెలుగులో అదే కథతో తెరకెక్కించిన ‘ఏం మాయ చేసావె’లో మాత్రం ప్రేమికుల జంటను కలిపేశాడు. కానీ ‘ఏమాయ చేసావె’ కంటే ముందే తమిళం నుంచి వచ్చిన ‘7/జి బృందావన కాలనీ’.. ‘ప్రేమిస్తే’ లాంటి హార్డ్ హిట్టింగ్ సినిమాలను ఆదరించిన ఘనత తెలుగు ప్రేక్షకుల సొంతం. ఇక గత దశాబ్ద కాలంలో అయితే కుమారి 21 ఎఫ్.. ఉప్పెన.. ఆర్‌ఎక్స్ 100.. బేబీ.. లాంటి షాకింగ్ ట్విస్టులున్న సినిమాలకు బ్రహ్మరథం పట్టారు మన ఆడియన్స్. అందుకే ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీం సైతం ధైర్యంగా అడుగు వేసింది. ఒక పల్లెటూరిలో సంచలనం రేపి.. అలాగే మరుగున పడిపోయిన ఒక కథను కొత్త దర్శకుడు సాయిలు తెరపైకి తీసుకొచ్చాడు. ఈ కథ విన్న ఎవ్వరికైనా మనసు ఛిద్రం అయిపోవడం ఖాయం. అదే సమయంలో ఇలాంటి కథను తెరపైకి తీసుకొస్తే ప్రేక్షకులు జీర్ణించుకోగలరా అనే సందేహం కలగడమూ సహజం. కానీ మారిన తెలుగు ప్రేక్షకుల అభిరుచి దృష్ట్యా దర్శకుడి ఆలోచనకు చాలామంది అండగా నిలిచారు. ఈ కథ తెరపైకి వచ్చింది. ఐతే ఇలాంటి మలుపులు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి కానీ.. వాటి మీదే మొత్తం భారం మోపితే మాత్రం కష్టమవుతుంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’లో అదే సమస్యగా మారింది. రెండుంబావు గంటల్లో అక్కడక్కడా కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ.. ప్రధానంగా క్లైమాక్సునే ఎక్కువ నమ్ముకోవడంతో కథనం పలుచబడిరది.
తనకు సినిమా లాంగ్వేజ్ ఏమీ తెలియదని.. తాను ఒక ఊరి వాడినని.. ఒక ఊరి కథను ఎలా చెప్పాలో మాత్రం తెలుసని అన్నాడు ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు సాయిలు. నిజంగానే ఊరి కథను.. పాత్రను సిన్సియర్ గా చూపించే ప్రయత్నం చేశాడు. 2010 కాలంలో నడిచే ఈ కథను అప్పటి పరిస్థితులకు తగ్గట్లు.. దర్శకుడు తాను ఏం చూశాడో అదే తీయడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో యువతగా ఉన్న వాళ్లు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. అప్పట్లో లవర్స్.. వాళ్ల ఫ్రెండ్స్ ఎలా ఉండేవాళ్లు అన్నది ఇందులో బాగా చూపించారు. హీరో హీరోయిన్ల మధ్య గిల్లి కజ్జాల నేపథ్యంలో సన్నివేశాలను బాగా తీశారు. హీరో ఫ్రెండు పాత్రతో వినోదాన్ని కూడా బాగానే పండిరచారు. ప్రథమార్ధం చాలా వరకు సరదాగా సాగిపోతూ టైంపాస్ చేయిస్తుంది. కానీ ఇంటర్వెల్ ముందు హీరో తండ్రి మరణంతో కథ మలుపు తిరిగాక సినిమా సీరియస్ టర్న్ తీసుకుంటుంది. చైతూ జొన్నలగడ్డ చేసిన వెంకన్న పాత్ర మీదే ద్వితీయార్ధమంతా నడుస్తుంది. ఆ క్యారెక్టర్ విపరీత ప్రవర్తన కొన్ని సీన్లలో అతిగా అనిపించినా.. అది బాగానే ప్రేక్షకుల అటెన్షన్ రాబడుతుంది.
ఐతే హీరోయిన్.. హీరోకి-తండ్రికి మధ్య నలిగిపోయే సన్నివేశాలు ఒకింత శ్రుతి మించినట్లు అనిపిస్తాయి. ఒక దశ దాటాక సన్నివేశాలు సాగతీతగా తోస్తాయి. కథ ఎంతకీ తెగనట్లు అనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో మనసులను ఛిద్రం చేసేలా ఏదో జరగబోతోందన్న అంచనా ప్రేక్షకుడికి ముందే వచ్చేస్తుంది. ఐతే హీరో హీరోయిన్లలో ఎవరో ఒకరిని చంపేయడం అన్నది ఎన్నో సినిమాల్లో చూసిందే. అదే చేసి ఉంటే ఈ సినిమా ప్రత్యేకత ఏమీ ఉండేది కాదు. ఇంతకుముందెన్నడూ చూడనిది ఏదో చూపించబోతున్నారనే అంచనాకు తగ్గట్లే జీర్ణించుకోలేని ట్విస్ట్ ఉంటుంది పతాక ఘట్టంలో. దాన్ని ఎవరెలా తీసుకుంటారన్నది అంచనా వేయడం కష్టమే. ‘ఉప్పెన’ లాగే ఇదొక అరుదైన క్లైమాక్స్ అని చెప్పొచ్చు. అది ప్రేక్షకులను కదిలిస్తుంది. బాగా డిస్టర్బ్ చేస్తుంది కూడా. ఐతే ఇక్కడ పోలికగా చెప్పుకొన్న ‘ఉప్పెన’లో క్లైమాక్స్ కంటే ముందు సినిమాలో ఎన్నో ఆకర్షణలుంటాయి. ఆ స్థాయి ఎట్రాక్షన్ ఇందులో లేదు. పల్లెటూరి నేపథ్యంలో కొన్ని చక్కటి సీన్లు.. అక్కడక్కడా కామెడీ.. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ.. చక్కటి సంగీతం.. క్లైమాక్స్ ట్విస్టుతో ‘రాజు వెడ్స్ రాంబాయి’కి పాస్ మార్కులైతే పడిపోతాయి. ఒకసారి చూడ్డానికి ఢోకా లేని సినిమానే ఇది. అంతకుమించి ఎక్కువ అంచనాలు పెట్టుకోకపోవడం మంచిది.
నటీనటులు -పెర్ఫార్మెన్స్ :
‘రాజు వెడ్స్ రాంబాయి’లో చాలా వరకు కొత్త నటీనటులే ముఖ్య పాత్రలను పోషించారు. లీడ్ రోల్స్ చేసిన అఖిల్-తేజస్వి పోటీ పడి నటించారు. రాజు సహజంగా తన పాత్రను చేసుకుపోయాడు. తనలో పల్లెటూరి కుర్రాళ్లను చూసుకుంటాం. కొన్ని చోట్ల మాత్రం తన నటన హద్దులు దాటినట్లు అనిపిస్తుంది. తేజస్వి రావు మాత్రం చిన్న వంక కూడా పెట్టడానికి వీల్లేనట్లుగా నటించింది. తన లుక్.. హావభావాలు.. నటన అన్నీ కూడా రాంబాయి పాత్రకు సరిగ్గా కుదిరాయి. తన ఎమోషన్లతో ప్రేక్షకుడు బాగా కనెక్ట్ అవుతాడు. వెంకన్న పాత్రలో అవిటివాడిగా చైతూ జొన్నలగడ్డ బలమైన ఇంపాక్ట్ వేశాడు. ఈ పాత్రకు ఇచ్చిన హైప్ ఎక్కువేమీ కాదు అనిపిస్తుంది. మంగపతి తర్వాత ఆ స్థాయిలో ఆ క్యారెక్టర్ గుర్తుంటుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. శివాజీ రాజా.. అనిత చౌదరి.. మిగిలిన నటీనటులు వారి వారి పాత్రల్లో బాగానే చేశారు. రాజు ఫ్రెండ్ డాంబర్ గా చేసిన కొత్త నటుడు బాగా నవ్వించాడు. అతడికి భవిష్యత్తుంది.
సాంకేతికవర్గం - పనితీరు :
చిన్న సినిమా అయినా ‘రాజు వెడ్స్ రాంబాయి’లో సాంకేతిక విభాగాలు మంచి పనితనమే చూపించాయి. వాజిద్ బేగ్ పల్లెటూరి వాతావరణాన్ని బాగా చూపించాడు. విజువల్స్ అందంగా సాగాయి. ప్రధాన పాత్రధారుల ఎమోషన్లను బాగా క్యాప్చర్ చేశాడు కెమెరామన్ వాజిద్ బేగ్. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సినిమాకు తెర వెనుక హీరో అని చెప్పొచ్చు. ‘రాంబాయి నీ మీద నాకు..’ పాట ఈ సినిమాలో అతి పెద్ద హైలైట్. సురేష్ నేపథ్య సంగీతం కూడా సినిమాకు పెద్ద బలంగా నిలిచింది. చాలా సన్నివేశాలను అతను బీజీఎంతో పైకి లేపాడు. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. దర్శకుడికి ఒక హార్డ్ హిట్టింగ్ రియల్ స్టోరీ దొరికింది. ఆ పాయింట్ వరకు అతను బలంగానే చెప్పాడు. పల్లెటూరి మనుషులను.. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఒక ప్రేమకథను సహజంగా చెప్పే ప్రయత్నం చేశాడు. కథనం ఎగుడుదిగుడుగా సాగినప్పటికీ.. కొన్ని మెరుపుల వల్ల ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఎంగేజింగ్ గానే అనిపిస్తుంది.
-తుపాకి.కామ్ సౌజన్యంతో...










Comments