top of page

రిజిస్ట్రేషన్ల ప్రైవేటీకరణకు.. జీవో 396 తొలి అడుగు..!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 15 hours ago
  • 2 min read
  • పీపీపీ విధానంలో ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు’

  • మెరుగైన సేవలంటున్న ప్రభుత్వం

  • అదనపు భారం, ఉపాధి దెబ్బతింటుందంటున్న దస్తావేజు లేఖరులు

  • ప్రజల డేటా భద్రతపై నిపుణుల ఆందోళన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్ర రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సంస్కరణలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. జూలై 30న ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జీవోను ప్రభుత్వం ‘పౌర-కేంద్రీకృత సంస్కరణ’గా అభివర్ణిస్తుండగా, దస్తావేజు లేఖరుల (డాక్యుమెంట్ రైటర్స్) సంఘాలు మాత్రం ఇది రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేటీకరించేందుకు వేసిన తొలి అడుగని మండిపడుతున్నాయి.

సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులుగా ప్రైవేట్ కేంద్రాలు!

నూతన జీవో ప్రకారం.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంలో ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు’ ఏర్పాటు కానున్నాయి. ఇవి కేవలం సహాయక కేంద్రాలుగా మాత్రమే కాకుండా, వీటికి పూర్తిస్థాయి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల హోదాను ప్రభుత్వం కల్పించనుంది. ఈ కేంద్రాల్లో దస్తావేజుల తయారీ, డేటా ఎంట్రీ, ఫీజుల చెల్లింపులు, స్లాట్ బుకింగ్‌తో పాటు రిజిస్ట్రేషన్ సంబంధిత సేవలన్నీ ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో రద్దీ తగ్గుతుందని, మధ్యవర్తుల వ్యవస్థ అంతమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, రిజిస్ట్రేషన్లపై తుది చట్టపరమైన అధికారాలు మాత్రం ప్రభుత్వ అధికారుల వద్దే ఉంటాయని స్పష్టం చేసింది.

రూ. 2వేలు ఫెసిలిటేషన్ ఛార్జీ.. సామాన్యుడిపై భారమే ..

ఈ కొత్త విధానంలో ప్రతి డాక్యుమెంట్‌పై రూ. 2వేలు ‘ఫెసిలిటేషన్ ఛార్జీ’ (సేవా రుసుము) వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొనుగోలుదారులు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి భారీగా చెల్లిస్తుండగా, ఇప్పుడు అదనంగా ఈ సేవా రుసుము భారం కానుందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో ఈ ఫీజు రూ. 5వేలు ఉండగా, మన రాష్ట్రంలో కేవలం రూ.2వేలు మాత్రమే నిర్ణయించామని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అయితే మహారాష్ట్ర నమూనాను ఇక్కడ రుద్దడం ఎంతవరకు భావ్యం అని లేఖరుల సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

వేలాది కుటుంబాల ఉపాధిపై దెబ్బ

దశాబ్దాలుగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలనే నమ్ముకుని జీవిస్తున్న లైసెన్స్‌డ్ దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నూతన సేవా కేంద్రాల్లో తమకు ఎలాంటి అవకాశం ఉండదని, దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉపాధి కోల్పోతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 396లో తమ పునరావాసం లేదా ప్రత్యామ్నాయ ఉపాధిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడాన్ని వారు తప్పుబడుతున్నారు.

డేటా భద్రత ఎంతవరకు?

రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆస్తి విలువలు, కుటుంబ వివరాలు, ఆధార్ కార్డులు, ఆర్థిక లావాదేవీల వంటి అత్యంత సున్నితమైన సమాచారం ఉంటుంది. పీపీపీ విధానం ద్వారా ఈ డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత కరువవుతుందని క్షేత్రస్థాయి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు

ఈ జీవో అమలుకు ముందు ప్రభుత్వం పలు కీలక అంశాలపై స్పష్టత ఇవ్వాలని నిపుణులు మరియు లేఖరుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రూ. 2వేలు సేవా రుసుము అన్ని రకాల పత్రాలకూ వర్తిస్తుందా? ప్రస్తుతం స్వయం ఉపాధి పొందుతున్న దస్తావేజు లేఖరుల భవిష్యత్తు ఏమిటి? పీపీపీ కేంద్రాల ఎంపిక కోసం టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందా? డేటా భద్రతకు ప్రభుత్వం ఎలాంటి గ్యారెంటీ ఇస్తుంది? ఈ కేంద్రాల వల్ల తలెత్తే సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ఎలాంటి వ్యవస్థ ఉంటుంది?

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page