top of page

రాజాసాబ్‌.. డోస్‌ సరిపోలేదు సాబ్‌

  • Guest Writer
  • Jan 9
  • 4 min read

ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌.. మారుతి లాంటి మిడ్‌ రేంజ్‌ సినిమాలు చేసుకునే దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చినపుడు అంతా ఆశ్చర్యపోయారు. ప్రభాస్‌ అభిమానులైతే ఈ సినిమా వద్దే వద్దు అన్నారు. కానీ ప్రభాస్‌.. మారుతిని నమ్మి ముందుకు వెళ్లిపోయాడు. రాజాసాబ్‌ ప్రోమోలు చూస్తే.. మారుతి ఏదో అద్భుతం చేస్తాడని అనిపించింది. ప్రభాస్‌ అభిమానులు కూడా నెగెటివిటీనంగతా పక్కన పెట్టి తమ హీరో లాగే మారుతి మీద నమ్మకం పెట్టారు. మరి వీళ్లందరి నమ్మకాన్ని మారుతి నిలబెట్టాడా? తెలుసుకుందాం పదండి.

కథ:

రాజు (ప్రభాస్‌) తల్లిదండ్రులను కోల్పోయిన కుర్రాడు. అతడికి తన నానమ్మ గంగాదేవి (జరీనా వాహబ్‌) అంటే పంచ ప్రాణాలు. ఐతే అనారోగ్యం పాలై అల్జీమర్స్‌ తెచ్చుకున్న గంగాదేవి.. ఎన్నో ఏళ్ల ముందు తనను వదిలి వెళ్లిపోయిన భర్త కనకరాజు (సంజయ్‌ దత్‌) కోసం వేచి చూస్తుంటుంది. ఆమె కోసం ఎలాగైనా తన తాతను వెతికి తీసుకురావాలని తాను ఉన్న ఊరి నుంచి హైదరాబాద్‌ బయల్దేరతాడు రాజు. అక్కడ తాతను వెతికే క్రమంలో.. సిటీకి దూరంగా అడవిలో పాడుబడ్డ బంగ్లాలోకి రాజు అతడి మిత్ర బృందం వెళ్తుంది. అక్కడే తన తాత గురించి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి రాజుకు. ఆ విషయాలేంటి.. అతడి తాతకు ఏమైంది.. తన నానమ్మ కోరికను రాజు తీర్చగలిగాడా.. ఈ సంగతులన్నీ తెర మీదే తెలుసుకోవాలి.

కథనం- విశ్లేషణ:

హార్రర్‌ కామెడీ సినిమాలు తీయడంలో మారుతి నైపుణ్యం ఎలాంటిదో పుష్కరం కిందటే ‘ప్రేమకథ చిత్రంలో చూశాం. అప్పటికి అతనో చిన్న దర్శకుడు. తక్కువ వనరులతోనే ఒక ట్రెండు సృష్టించే సినిమా తీశాడతను. ఇప్పుడు మళ్లీ అతను హార్రర్‌ నేపథ్యంలో ఒక కథను ఎంచుకుంటే.. ప్రభాస్‌ లాంటి పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ దొరికాడు. వందల కోట్ల బడ్జెట్‌తో పాటు అడిగిందల్లా ఇచ్చే నిర్మాణ సంస్థ అండ లభించింది. టాప్‌ టెక్నీషియన్లు.. బోలెడంతమంది ఆర్టిస్టులు.. ఇలా ఏం కోరుకుంటే అవన్నీ సమకూరాయి. అన్నింటికీ మించి మూడేళ్లకు పైగా సమయమూ దొరికింది. వెండితెరపై అద్భుతాన్ని ఆవిష్కరించడానికి ఇంతకంటే ఏం కావాలి? కానీ మారుతి ఓ గొప్ప అవకాశాన్ని వృథ చేశాడు. ప్రేక్షకుల అంచనాలకు మించి ఏదో చేయాలని.. తనకు పట్టున్నఅంశాలను వదిలేసి.. హార్రర్‌ కథతో ఒక సైకలాజికల్‌ గేమ్‌ ఆడాలని చూశాడు. ఆ కాన్సెప్ట్‌ కొత్తగా అనిపించినా.. దాన్ని సరిగా డీల్‌ చేయలేక కంగాళీగా మార్చేయడంతో ‘రాజాసాబ్‌ ప్రేక్షకుల అంచనాలకు దూరంగా నిలిచిపోయింది. ప్రభాస్‌ చాన్నాళ్ల తర్వాత జోష్‌ ఉన్న.. ఎనర్జిటిగ్గా అనిపించే.. ఫుల్‌ లెంత్‌రోల్‌లో కనిపించడం అభిమానులను సంతోషపెట్టినా.. కొన్ని ఎపిసోడ్ల వరకు ఆకట్టుకున్నా.. సుదీర్ఘ నిడివితో సాగే రాజాసాబ్‌ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.

రాజాసాబ్‌ మూడు గంటలకు పైగా నిడివి ఉన్న సినిమా. ఇంత సుదీర్ఘ నిడివిలో కూడా కథేంటో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పకపోవడం.. ఏ పాత్రనూ కన్విన్సింగ్‌గా ప్రెజెంట్‌ చేయలేకపోవడం ఈ సినిమాకున్న అతి పెద్ద సమస్య. విలన్‌ చెడ్డవాడు అయినా సరే.. అతనో లక్ష్యంతో ఉన్నాడు అంటే దాని వెనుక బలమైన కారణం కనిపించాలి. అతను విపరీత మనస్తత్వంతో ప్రవర్తిస్తున్నాడు అంటే దానికీ సరైన రీజనింగ్‌ ఉండాలి. వీటితో ప్రేక్షకులు కన్విన్స్‌ కావాలి. కానీ రాజాసాబ్‌లో అసలు విలన్‌ లక్ష్యమేంటో.. అతనేం సాధించాలనుకుంటున్నాడో అర్థం కాదు. అతడికి సంపద మీద ఆశ అంటారు. పోనీ ఆ సంపదను సొంతం చేసుకుని దాన్ని అనుభవిస్తాడా అంటే అదేమీ చేయడు. ఊరికే సంపద పోగేసుకుని ఒకచోట కూర్చుంటాడు. తన భార్య మీదే అతను ఎందుకు పగ సాధిస్తుంటాడనడానికీ సరైన కారణం ఉండదు. అసలు విలన్‌ పాత్ర పర్పస్‌ ఏంటన్నదే కన్విన్సింగ్‌గా చెప్పలేకపోయాడు దర్శకుడు. విలన్‌ చేసిన దయ్యం పాత్రను చూస్తే ఎక్కడా రవ్వంత కూడా భయం కలగకపోవడం దానికున్న అతి పెద్ద బలహీనత. ఇక ఈ కథలో నానమ్మ-మనవడి మధ్య ఎమోషన్‌ ఎంతో కీలకం. తన నానమ్మ కోసమే హీరో ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ఎన్నో విన్యాసాలు చేస్తాడు. కానీ అతను అంత చేయాలి అంటే ముందు నానమ్మ-మనవడి మధ్య బంధాన్ని బలంగా చూపించడం.. ఆ ఎమోషన్‌ జనాలకు పట్టేలా చేయడం చాలా అవసరం. ఇక్కడ అదీ జరగలేదు. కథకు అత్యంత కీలకమైన మూడు పాత్రల్లో వేటితోనూ ఎమోషనల్‌ కనెక్ట్‌ ఏర్పడనపుడు ఇక ఈ కథతో ఎలా ట్రావెల్‌ చేయగలం?

మరి మూడు గంటల నిడివిలో మారుతి ఇంకేం చేశాడు అంటే.. ఒకరు ఇద్దరు సరిపోరని.. ఏకంగా ముగ్గురు హీరోయిన్లను పెట్టి రొమాంటిక్‌ ట్రాక్స్‌ నడిపించాడు. కమెడియన్లను పెట్టి నవ్వించడానికీ ప్రయత్నించాడు. కానీ ఇటు రొమాన్సూ పండలేదు. అటు కామెడీ పెద్దగా పేలలేదు. ఇంకోవైపు హార్రర్‌ ఫ్యాక్టర్‌ సైతం పెద్దగా పని చేయలేదు. హీరోయిన్లు ముగ్గురూ పోటీ పడి అందాల విందు చేశారు కానీ.. వాళ్ల పాత్రల్లో ఒక్కటీ క్లిక్‌ కాలేదు. ముగ్గురు హీరోయిన్లతో హీరో రొమాన్స్‌ పూర్తిగా తేలిపోయింది. తొలి గంటలో దర్శకుడు పెద్దగా కథలోకి వెళ్లకుండా హీరోయిన్లతో ఆట పాటలు.. కామెడీ ట్రాకులతోనే కాలక్షేపం చేయించడానికి చూడడంతో విసుగొచ్చేస్తుంది. విలన్‌ పాత్ర రంగప్రవేశంతో ఇంటర్వెల్‌ ముంగిట ప్రేక్షకులు తొలిసారిగా కొంచెం సినిమాలో ఇన్వాల్వ్‌ అవుతారు. విలన్‌ దగ్గర బందీలైపోయిన హీరో అండ్‌ గ్యాంగ్‌ అక్కడి నుంచి ఎలా బయటికి వస్తారన్న నేపథ్యంలో మిగతా కథ అంతా నడుస్తుంది. దెయ్యాన్ని చూసి అందరూ భయపడి అదిరిపోయే కామెడీకి కాలం చెల్లిపోవడంతో ద్వితీయార్ధంలో ఆ సన్నివేశాలేవీ ఫలితాన్నివ్వలేదు. ఐతే బొమన్‌ ఇరానీ పాత్ర రంగప్రవేశంతో ఇది సగటు హార్రర్‌ కథ కాదని అర్థమవుతుంది. మారుతి చెప్పాలనుకున్న యునీక్‌ పాయింట్లోకి సినిమా అడుగు పెట్టాక రాజాసాబ్‌ తొలిసారిగా క్యూరియాసిటీ పెంచుతుంది. సినిమా మొత్తంలో దర్శకుడి మార్కు బలంగా కనిపించే.. ఈ కథ స్థాయిని పెంచే ఎపిసోడ్‌ అది. విలన్‌ తంత్రమేంటో తెలిసినపుడు.. తర్వాత హీరో అతణ్ని కౌంటర్‌ చేసినపుడు భలేగా అనిపిస్తుంది కానీ.. ఈ ఎపిసోడ్‌ను నేర్పుగా షార్ప్‌ గా లాగించడంలో మారుతి కొంచెం తడబడ్డాడు. ప్రి క్లైమాక్స్‌ నుంచి భారీతనంతో కూడిన విజువల్‌ మాయాజాలంతో రాజాసాబ్‌ ఆకట్టుకుంటాడు కానీ.. ఎంతకీ తెగని విధంగా ఈ సన్నివేశాలు సా...గడం కొంత ప్రతికూలమైంది. విలన్‌ పాత్ర ఆడే ‘ఆట’ బాగున్నా.. తన పాత్ర చిత్రణే సరిగా లేకపోయింది. అలాగే హీరో-నానమ్మ ఎమోషన్‌ కూడా వర్కవుట్‌ కాలేదు. ఈ విషయాల్లో మారుతి జాగ్రత్త పడి ఉంటే.. అవసరం లేని ఫిల్లింగ్‌ ఎపిసోడ్లను పక్కన పెట్టి ఈ కథను ఇంకా షార్ప్‌గా చెప్పగలిగి ఉంటే రాజాసాబ్‌ ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలబడేది. కానీ ఇప్పుడు మాత్రం ఇది మిశ్రమానుభూతినే కలిగిస్తుంది.

నటీనటులు - పెర్ఫార్మెన్స్‌ :

ప్రభాస్‌ పెర్ఫామెన్స్‌ గురించి మారుతి చెప్పిన మాటలు అతిశయోక్తి కాదు. చివరి 40 నిమిషాల్లో ప్రభాస్‌ పెర్ఫామెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా హాస్పిటల్‌ ఎపిసోడ్లో బాగా చేశాడు. గత చిత్రాల్లో ముభావంగా.. అంతగా యాక్టివ్‌గా ఉండని పాత్రలు చేసిన ప్రభాస్‌.. ఇందులో మాత్రం ఫుల్‌ జోష్‌తో కనిపించాడు. తన స్టైలిష్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల ఏదో కృత్రిమత్వం ఇబ్బంది పెడుతుంది కానీ.. ఓవరాల్‌గా ప్రభాస్‌ అభిమానులను అలరిస్తాడు. సినిమా అంతా అతడి చుట్టూనే తిరుగుతుంది. హీరోయిన్లు ముగ్గురూ అందాల విందు చేశారు. ముఖ్యంగా నిధి అగర్వాల్‌.. మాళవిక మోహనన్‌ అందాల ప్రదర్శనలో పోటీ పడ్డారు. వాళ్లను అందుకోసమే పెట్టారనిపిస్తుంది. వాళ్లకు సరైన పాత్రలూ ఇవ్వలేదు. వాటిలో పెర్ఫామెన్స్‌కు స్కోపే లేదు. రిద్ధి కుమార్‌ క్యారెక్టర్‌ అయితే పూర్తిగా తేలిపోయింది. సంజయ్‌ దత్‌.. జరీనా వాహబ్‌ ఇద్దరికీ కీలక పాత్ర దక్కాయి. వాళ్లిద్దరి నటన ఆకట్టుకుంటుంది. కానీ వారి పాత్రల చిత్రణ సరిగా లేదు. బొమన్‌ ఇరానీ కనిపించిన కాసేపు తన ప్రాధాన్యాన్ని చాటుకున్నాడు. అమ్ము అభిరామి ఓకే. సత్య.. వీటీవీ గణేష్‌.. ప్రభాస్‌ శ్రీనుల కామెడీ పెద్దగా వర్కవుట్‌ కాలేదు.

సాంకేతిక వర్గం - పనితీరు :

సంగీత దర్శకుడు తమన్‌ పనితనం గొప్పగా లేదు. అలా అని తీసిపడేసేలానూ లేదు. తన పాటల్లో శరత్‌ చంద్రికా.. నాచే నాచే (రీమిక్స్‌) బాగున్నాయి. మిగతావి గుర్తుంచుకునేలా లేవు. చివరి 40 నిమిషాల్లో తమన్‌ ఆర్‌ఆర్‌ అత్యున్నత స్థాయిలో సాగింది. సన్నివేశాలను బీజీఎంతో బాగా ఎలివేట్‌ చేశాడు. కానీ అంతకుముందు వరకు ఆర్‌ఆర్‌ అంత ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. బీజీఎం ఎక్కడో విన్నట్లే అనిపిస్తుంది. కొన్ని సీన్లలో ‘రాక్షసుడు’ స్కోర్‌ గుర్తుకొస్తుంది. కార్తీక్‌ పళని ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్‌ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. వీఎఫెక్స్‌ టీం కష్టం తెరపై కనిపిస్తుంది. సంబంధిత సన్నివేశాలను భారీగా తీర్చిదిద్దారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. భారీగా సినిమాను తీర్చిదిద్దారు. రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ మారుతి సగటు హార్రర్‌ కథకే ఒక డిఫరెంట్‌ టచ్‌ ఇవ్వాలని చూశాడు. కథలోని ఆ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. దాని మీద అతను బాగానే కసరత్తు చేశాడు. కానీ ఈ కథకు స్క్రీన్‌ ప్లే మాత్రం సరిగా కుదరలేదు. అసలు కథలోకి వెళ్లడానికి ముందు పెట్టిన కాలక్షేపం ట్రాక్స్‌ సినిమాకు పెద్ద మైనస్‌ అయ్యాయి. సగటు కమర్షియల్‌ సినిమాలా అన్నీ మిక్స్‌ చేయాలని చూడడం ప్రతికూలంగా మారింది. రైటింగ్‌-మేకింగ్‌లో మారుతి కష్టాన్ని తక్కువ చేయలేం కానీ.. ఎగ్జిక్యూషన్‌ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది.

- తుపాకీ.కాం సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page