రానా నాయుడు-2.. ‘బోల్డ్’ తగ్గింది.. ‘బోర్’ పెరిగింది
- Guest Writer
- Jun 14
- 3 min read

టాలీవుడ్లో మిడ్ రేంజ్ హీరోలు సైతం ఇంకా ఓటీటీల వైపు చూడని సమయంలో విక్టరీ వెంకటేష్ లాంటి అగ్ర కథనాయకుడు.. తన అన్న కొడుకు రానా దగ్గుబాటితో కలిసి డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సిరీస్.. రానా నాయుడు. రెండేళ్ల కిందట వచ్చిన తొలి సీజన్..వెంకీ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. విషయం తక్కువ.. బూతులెక్కువ అంటూ తీవ్ర అసహనం చెందారు వెంకీ అభిమానులు. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసారైనా వెంకీ-రానా ఫ్యాన్స్ ఈ సిరీస్‌ను మెచ్చేలా ఉందా? చూద్దాం పదండి.
కథ:
ఎన్ని అడ్డదారులైనా తొక్కి సెలబ్రెటీలకు వచ్చే సమస్యలను పరిష్కరించే ఫిక్సర్‌గా పేరున్న రానా నాయుడు (రానా దగ్గుబాటి).. దీని ద్వారా ఎంత డబ్బు సంపాదించినా మనశ్శాంతి లేకుండా బతుకుతుంటాడు. దీంతో భార్య కోరిక మేరకు ఇకపై ఇవన్నీ వదిలేయాలని అనుకుంటాడు. తాను పని చేస్తున్న మంత్రి ఓబీ నుంచి విడిపోతాడు. కానీ అంతలో రానా కొడుకు అనీ కిడ్నాప్ అవుతాడు. దీంతో తిరిగి పాత శైలికి మారిపోతాడు రానా. ఈ క్రమంలో అతను ఒబెరాయ్ (రజత్ కపూర్) దగ్గర పనికి కుదురుతాడు. మరోవైపు రానాకు రవూఫ్ (అర్జున్ రాంపాల్)తో శత్రుత్వం పెరుగుతుంది. తన తండ్రి నాగనాయుడు (వెంకటేష్) నుంచి కూడా తలనొప్పులు తప్పవు. దీంతో రానా కుటుంబం మరింత ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. మరి ఈ సమస్యలన్నింటినీ రానా పరిష్కరించుకున్నాడా.. ఈ క్రమంలో ఏం కోల్పోయాడు.. రానా కుటుంబం ఒక్కటైందా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
రానా నాయుడు తొలి సీజన్ రిలీజైనపుడు అదెంత ఆసక్తికరంగా ఉందన్న దాని మీద కంటే.. అందులో హద్దులు దాటిన బూతులు.. భరించలేని వల్గర్ సీన్ల గురించే ఎక్కువ చర్చ జరిగింది. ముఖ్యంగా ఫ్యామిలీ హీరోగా ముద్ర పడ్డ వెంకీ నుంచి ఇలాంటి కంటెంట్ రావడాన్ని ఆయన అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు. రెండో సీజన్‌కు వచ్చేసరికి మేకర్స్ ఈ ఫీడ్ బ్యాక్ మీద గట్టిగానే పని చేసినట్లున్నారు. బూతుల డోస్ బాగా తగ్గిపోయింది. ఇక వల్గర్ సీన్లు కూడా అంతగా కనిపించవు. కొంచెం బోల్డ్ సీన్లయితే ఉన్నాయి కానీ.. తొలి సీజన్ తరహాలో వల్గారిటీ అయితే లేదు. ఐతే దీంతో పాటే కథాకథనాల మీద కూడా కొంచెం దృష్టిపెట్టి ఉంటే బాగుండేది. తొలి సీజన్లో అయినా కథలో కొన్ని ఆసక్తికర మలుపులు ఉన్నాయి.. అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్లు ఆసక్తి రేకెత్తిస్తాయి కానీ.. రెండో సీజన్ అయితే పూర్తి తేలిపోయింది. కొత్త పాత్రలు.. కొత్త విలన్లు వచ్చారు తప్ప.. కథలో ఏమంత కొత్తదనం కనిపించదు. అసలు హీరో లక్ష్యమేంటో అర్థం కాదు. ఏ పాత్ర పరమార్థమేంటో బోధపడదు. కొత్తగా మొదలైన పాత్రలతో రవ్వంత కూడా ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడదు. ఎనిమిది ఎపిసోడ్లతో దాదాపు ఆరు గంటల సుదీర్ఘ నిడివితో సాగే సిరీస్‌లో వారెవా అనిపించే ఒక్క ఎపిసోడ్ లేదంటే ఇది ఏమాత్రం ఎంగేజ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.
‘రానా నాయుడు’ తొలి సీజన్లో ఏ పాత్ర ఏంటో తెలుసుకోవడానికి.. కథేంటో అర్థం చేసుకోవడానికి.. కొంత సమయం పడుతుంది. అందుకోసమైనా ఆసక్తిగా సిరీస్ చూస్తాం. ఆ రకంగా అయినా ఆ సీజన్ ప్రేక్షకులను కొంత ఎంగేజ్ చేస్తుంది. కానీ కథేంటో తెలిసిపోయాక.. పాత్రలేంటో అర్థమైపోయాక.. రెండో సీజన్ ఆసక్తికరంగా సాగాలంటే కొత్తగా అనేక మలుపులు ఉండాలి. అవి తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించాలి. కానీ ‘రానా నాయుడు’ ఏ దశలోనూ ప్రేక్షకుల్లో ఉత్సాహం.. ఉత్కంఠ కలిగించదు. అర్జున్ రాంపాల్ పోషించిన కొత్త విలన్ పాత్ర అయితే పూర్తిగా వ్యర్థంగా అనిపిస్తుంది. ట్రైలర్లో ఆ పాత్రకు ఇచ్చిన బిల్డప్ కు.. సిరీస్ లో దాన్ని నడిపించిన తీరుకు పొంతన లేదు. అసలు రానా నాయుడికి.. అతడికి శత్రుత్వాన్ని సరిగానే ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆ క్యారెక్టర్ ఏంటన్నదే అసలు అంతుబట్టదు. దీంతో పోలిస్తే హీరోకు కొత్త యజమానిగా మారే విరాజ్ ఒబెరాయ్ పాత్ర.. దాని చుట్టూ నడిపిన స్టోరీ కొంచెం నయం. చివరి రెండు ఎపిసోడ్లలో ఈ పాత్రతో ముడిపడ్డ కథనం.. కొన్ని మలుపులు ఆసక్తి రేకెత్తిస్తాయి. కానీ మెయిన్ విలన్ ట్రాక్ మాత్రం పూర్తిగా తేలిపోయింది.
రానా నాయుడు కుటుంబం మీద చాలా సన్నివేశాలు నడిపించారు కానీ.. అందులో ఒక్కటీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయదు. ముఖ్యంగా వెంకటేష్ పాత్ర అసలీ సిరీస్‌లో ఎందుకు ఉందో అర్థం కాదు. తొలి సీజన్లో అయినా.. ఆ పాత్ర తాలూకు బ్యాక్‌స్టోరీ కొంత ఎంగేజ్ చేస్తుంది కానీ.. ఈసారి మాత్రం ఆ పాత్రను పూర్తిగా తేల్చి పడేశారు. తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని కానీ.. వారి మధ్య విభేదాలను కూడా సరిగా చూపించలేదు. వెంకీది జస్ట్ ఒక సహాయ పాత్రలా అనిపిస్తుంది తప్ప.. కథలో దానికి తగిన ప్రాధాన్యమే లేకపోయింది. అతను ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. ఇక ఆయన కొడుకుల పాత్రల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. బలమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడంతో ‘రానా నాయుడు-2’లో అతి పెద్ద బలహీనత. ఒకదాని వెంట ఒకటి పరిణామాలు జరిగిపోతుంటాయి కానీ.. ఏదీ ప్రేక్షకుల అటెన్షన్ రాబట్టదు. మొత్తం సిరీస్ అయ్యాక ఆరు గంటలు వృథా అయిన భావనే కలుగుతుంది తప్ప.. చెప్పుకోవడానికి ఇందులో ఒక్క స్టాండౌట్ ఎపిసోడ్ కూడా కనిపించదు.
నటీనటులు - పెర్‌ఫార్మెన్స్ :
: ‘రానా నాయుడు’కు చెప్పుకోదగ్గ ఆకర్షణ అంటే.. రానా నటనే. సిరీస్ మొత్తంలో పర్ఫెక్ట్ కాస్ట్ అనిపించేది అతనే. ఈ పాత్రను బాగా అవగాహన చేసుకుని అందులో ఒదిగిపోవడానికి రానా ప్రయత్నించాడు. తొలి సీజన్‌తో పోలిస్తే మరింత కాన్ఫిడెంట్ గా నటించాడు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. రానా కోసం యునీక్ క్యారెక్టర్లు రాయడానికి ఈ పాత్ర స్ఫూర్తిగా నిలుస్తుంది. వెంకటేష్ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. ఆయన చేయదగ్గ పాత్ర కాదిది. ఆయన క్యారెక్టర్ని వ్యర్థంగా మార్చేశారు రెండో సీజన్లో. సుర్వీన్ చావ్లా చూడ్డానికి బాగుంది. హాట్ హాట్ గా కనిపిస్తూ.. నటనలోనూ ఆకట్టుకుంది. బోల్డ్ సీన్లో ఆమె కుర్రాళ్లను బాగానే ఆకట్టుకుంటుంది. విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. రజత్ కపూర్.. కృతి కర్బందా కీలక పాత్రల్లో రాణించారు. సుశాంత్ సింగ్.. అభిషేక్ బెనర్జీ.. ఆదిత్య మేనన్.. వీళ్లంతా ఓకే.
సాంకేతిక వర్గం - పనితీరు :
టెక్నికల్ గా ‘రానా నాయుడు’ ఓకే అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ బాగున్నాయి. సిరీస్ లో మంచి క్వాలిటీ కనిపిస్తుంది. నిర్మాణ విలువల్లో ఏమీ రాజీ పడలేదు. కానీ అమెరికన్ టీవీ సిరీస్ ‘రే డొనోవన్’ను మనకు తగ్గట్లుగా అడాప్ట్ చేయడంలో దర్శకులు సుపర్ణ్ వర్మ-కరణ్ అన్షుమన్ నైపుణ్యం చూపించలేకపోయారు. సామాన్య జనానికి కనెక్ట్ అయ్యే కథాంశం.. పాత్రలు మిస్ కావడం ‘రానా నాయుడు’కు అతి పెద్ద మైనస్. ఈ కథంతా వేరే ప్రపంచంలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది. కథతో.. పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచడంలో దర్శక ద్వయం పూర్తిగా విఫలమైంది.
తుపాకి.కామ్ సౌజన్యంతో...
Comments