రామోజీ-బాలు కలిసి జాతికందించిన అద్భుతమైన కానుక ‘పాడుతా తీయగా’
- Guest Writer
- Jun 19, 2025
- 3 min read
లెజెండరీ ప్రోగ్రామ్‌ను పాడు చేయవద్దు

తెలుగునాట కళలకూ, కళాకారులకూ లోటులేదు. పాడగలిగీ, పాటపై అమితమైన ప్రేమకలిగీ అవకాశాలు రాక మరుగునపడిపోయిన ఎందరో గాయనీగాయకులు ఈ వేదిక ద్వారా మనందరికీ కొన్ని దశాబ్దాలుగా వీనులవిందు చేస్తున్నారు. అదే అలవరసలమీద నిర్వహించే సరిగమప, సూపర్‌సింగర్ కార్యక్రమాలు సైతం చక్కని గాయనీగాయకుల్ని మనందరికీ అందించాయి. దాదాపుగా వీరందరూ ఏదో రూపాన వివిధ రంగాల్లో తమ పాటవాన్ని ప్రదర్శిస్తూ తమ గొంతు ఆగకుండా వినిపిస్తున్నారు.
కొందరు సినిమా పాటల్లో బిజీ అయిపోతే, మరికొందరు డబ్బింగ్ కళాకారులుగాను, ఇంకొందరు ప్రపంచవ్యాప్తంగా వివిధ షోల్లోను తమ గళాలను నిర్విరామంగా వినిపిస్తున్నారు. అయితే ఇందులో చాలామంది యుక్తవయస్కులు. సుమారుగా నలభైలోపువారే!
వీరందరూ పాడే పాటలు మనం తరచూ వింటూనే ఉన్నాం. ఏ ఒక్కరూ ఫలానా పాట సరిగా పాడలేదనే అపవాదును మూటగట్టుకోకుండా సాధ్యమైనంత అందంగా పాడుతున్నారు. కానీ సాహిత్యం మాటేమిటి?
గీతరచయిత ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపి, ఎంతో ఇష్టపడి కూర్చిన పాటలోని పదాలను బాధ్యతాయుతంగా పలకాల్సిన అవసరం ఉందాలేదా?
కీరవాణి.. చిలకలా కొలికిరో పాటనే చూడండి:
ఇటీవల చాలాసార్లు వినగా వినగా బయటపడిన విషయం ఏమిటంటే
‘పడుచుల మనసుల పంజర సుఖముల...’ అని పాడుతున్నారు. అది పంజర సుఖములు కాదండీ బాబూ, పంజర శుకములు. రమ్య బెహరా అలా పాడుతోంటే పక్కనే ఉన్న బాలుగారైనా సరిచెయ్యాలి కదా? విసిగిపోయారేమో మరి?
అలాగే ‘నెలరాజా ఇటుచూడరా...’ పాటలో కవిగారు ఒక గమ్మత్తైన ప్రయోగం చేశారు: ‘తగువేళరా... తగువేలరా’ అని. దాన్ని ఈ పిల్లకాయలు కొందరు ‘తగువేళరా తగువేళరా...’ అని పాడేస్తున్నారు. అది బాధాకరమైన విషయం. రచయిత కృషి బూడిదలో పోసిన పన్నీరైపోయింది.
అలాగే ఆమధ్య ఇళయరాజాకి సమర్పించిన ఒక అద్భుతమైన మెడ్లీలో అందరూ చాలా చక్కగా పాడారు. ఏ ఒక్కపాటనూ ఎంచడానికి లేదు. కానీ ఒకమ్మాయి ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ...’ పాటలో ‘పెదవి కొరికే.. పెదవి కొరికే..’ అని పాడేసింది. అది ‘పెదవి కొరికే... పెదవి కొరకే..’ వేటూరి, ఇళయరాజా కలిసి మనందరి మనసుల్నీ ఛిద్రం చెయ్యడానికి తయారుచేసిపడేసిన అంత రొమాంటిక్ పాటలో పదాల్ని అలా మార్చిపడేస్తే, మార్చిపాడేస్తే ఆయన ఆత్మ ఘోషిస్తుంది తల్లీ! తప్పు! సరిచేసుకో!
ఈమధ్య పాడుతా తీయగాలో ఒక కుర్రాడు ఒక పాత పాట సెలెక్ట్ చేసుకుని పాడాడు. అది నటశేఖర కృష్ణ నటించిన ‘గౌరి’ చిత్రంలోది.
‘గలగల పారుతున్న గోదారిలా...’ అనేపాట. ఆ మొదటి లైన్లనే పోకిరిలో మళ్ళీ వాడుకున్నార్లెండి. అదిక్కడ అప్రస్తుతం.
ఆ పాట చాలా బాగా పాడాడు ఆ కుర్రాడు. కానీ రెండో చరణంలో సత్యం ధర్మం నిలుపుటే... న్యాయంకోసం పోరుటే... పేదల సేవలు చేయుటే... ఇదీ సాహిత్యం. కానీ ఆ కుర్రాడు ‘పేదలు సేవలు చేయుటే..’ అని పాడాడు. పేదలకి సేవలు చెయ్యాలని కవిభావం. పేదలు మనకి సేవలు చెయ్యాలని అతగాడి పాటలో వినబడిన భావం.
ఎదురుగా చంద్రబోస్ ఉన్నారు. ఆయన తప్పనిసరిగా సరిచేయాలి. కానీ చెయ్యలేదు. అదిగో... సరిగ్గా ఇటువంటి సందర్భాల్లోనే బాలు గుర్తొస్తాడు. అటువంటివి అక్షరదోషాలు కావు. ళ, ణ, ష... అక్షరాలకు బదులు ల, న, స.. పాడితే అర్ధంచేసుకోవచ్చు. కానీ మొత్తం అర్ధమే మారిపోయేలాను, రచయిత రాసిన పాటలో అందమైన భావాలే కనుమరుగయేలాను పాడితే బాధనిపిస్తుంది. ఆయన అటువంటి పొరపాట్లను సరిచేసేవారు. ఒక్కోసారి ఆ పాట వెనుక ఉన్న కాస్త చరిత్రనో, ఆ రికార్డింగ్ సందర్భంలో జరిగిన విశేషాలనో నెమరువేసుకునేవారు. కేవలం ఏదో ఒకమూల ఒక చిన్న వాద్యపరికరం వాయించే కళాకారుణ్ణి సైతం గుర్తించి, అతగాణ్ణి నిలబెట్టి అందరి మన్ననలూ పొందేలా పరిచయవాక్యాలు పలికేవారు.
మౌనగీతం చిత్రం కోసం ‘పరువమా... చిలిపి పరుగు తీయకు..’ అనే జాగింగ్ పాట బాలు తమిళ్‌లో పాడుతున్నారు ఒక స్టేజ్‌మీద. సహగాయని జీన్స్ శ్రీనివాస్ కూతురు. అయితే ఆ పాటలో అడుగుల శబ్దం మొత్తం పాటంతా వినబడాలి. దాన్ని ఒక తబలా కళాకారుడు ఎలా వినిపించాడో తెలుసా? కింద కూర్చుని తన రెండు తొడలమీదా రెండు చేతులతోనూ టప్ టప్ టప్ అని కొట్టుకుంటూ పాటంతా నడిపాడు. చివరలో బాలు అతగాణ్ణి లేపి, ఆ పాటకు అంత అందాన్ని తీసుకొచ్చిన ఆ అడుగుల సవ్వడికి అతనే కారణమంటూ పరిచయం చేశారు. ఆ వేదికలో ఉన్నవారికే కాదు, చూస్తున్న మనకూ కృతజ్ఞతంటే ఏమిటో నిరూపితమైన క్షణాలవి.
ఇంతకీ నా సొదేవిఁటంటే.... సాహిత్యం జాగ్రత్తగా వినండి. ఒకవేళ తెలియకపోతే కాస్త తెలుగు బాగా తెలిసినవారిని అడిగి తెలుసుకుని సరిచేసుకోండి. మీ కాన్వెంట్ చదువుల పరిణామంలో అదేమంత నేరం కాదు. ‘అయ్యో, ఇదికూడా తెలీదా?’ అని ఎవరూ అనరు.
మీరు తెలుగుపాటను కలకాలం జవజీవాలతో నిలబెట్టాల్సిన బాధ్యతను భుజాలపై మోస్తున్నారు. ఘంటసాల, సుశీల, జానకి, పి.బి.శ్రీనివాస్, ఏ.ఎం.రాజా, బాలు, జిక్కీ, లీల ఇలా ఎందరో గాయనీగాయకులు మన తెలుగుపాటను స్వచ్ఛమైన భాషలో పలికించారు. ఇప్పుడు మీవంతు.
ఇక్కడ మరొక విషయం: నేను వెలిబుచ్చిన ఈ అభిప్రాయాలు కేవలం ప్రస్తుతం ఉన్న తెలుగు గాయకుల గురించి మాత్రమే! అనవసరంగా సిద్ శ్రీరామ్, హరిహరన్, అర్మాన్ మాలిక్, నకాష్ అజీజ్ అంటూ పరభాషా గాయకుల్ని ఇక్కడ నిందించకండి. వారి భాషలో వారంతా ఎలా పాడతారో మనకు తెలీదు. కానీ మన భాషలో కచ్చితంగా తప్పులు దొర్లుతాయి. వాటిని గురించి కాదు ఈ చర్చ. ఇక పాటల కార్యక్రమాలు నిర్వహించే సెలెబ్రిటీలు తప్పకుండా గౌరవించదగిన వ్యక్తులే! వారందరూ ఎంతో కృషిచేసి ఉన్నతస్థాయికి చేరుకున్నారనడంలో సందేహం లేదు. కానీ ఛానెల్ యాజమాన్యం చెప్పిందనో, చూసేవారు, పిల్లకాయల తల్లిదండ్రులు బాధపడతారనో మీమీ అభిప్రాయాలు చెప్పకుండా వదిలేయకండి. అనవసరమైన ఆర్భాటాలు, గాల్లో ముద్దులు, కౌగిలింతలతోనుబీ బాంబులు, చిచ్చుబుడ్లు స్టేజిమీద కాల్చడంతోను పాటలో సత్తాను పెంచే ప్రయత్నం చెయ్యకండి. అక్షరాన్ని, భావాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే! దశాబ్దాలుగా ఇక్కడే ఉంటూ ఇప్పటికీ తెలుగు చదవడం, మాట్లాడటం సరిగా రాదనే రాజకీయనాయకులు, నాయకురాళ్ల మధ్య జీవిస్తున్నాం. వారు కాదు మన భాషను సంగీతసాహిత్య సమలంకృతం చెయ్యాల్సింది.
మీరు. మీ అడుగుజాడల్లో నడిచే ఆ పిల్లలు. వారందరికీ దేవుడిచ్చిన గొప్ప వరం వారి గళం. దానికి సంగీతమనే తావి అబ్బింది. అది మా చెవులను తాకితే పులకింత కలగాలి. ‘ఆహా, ఎంత స్పష్టంగా పాటను అర్ధంచేసుకుని పాడుతున్నారు! ఇదికదా భాగ్యము!’ అనిపించాలి. ఇక యాసల సంగతి. ఇటీవలి కాలంలో మనందరికీ ఎక్కువగా వినిపిస్తున్న పాటల్లో తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ మాండలికాల యాస. అది హాయిగా ఆస్వాదిద్దాం. పాటను జనానికి చేరువయ్యేలా చేసే ప్రక్రియ అది. దానికీ ఈ రచనకూ ఎటువంటి సంబంధమూ లేదు. అంచేత... గీతరచయిత తపననూ, కృషినీ, భావాన్నీ వృధా పోనీయకండి. శుభాశీస్సులు!
కొచ్చెర్లకోట జగదీశ్










Comments