top of page

రుసరుసలు ఎందుకంటే..?

  • Guest Writer
  • Aug 5
  • 3 min read
ree

బాలీవుడ్‌ సీరియల్స్‌లో టాలెంట్‌ చూపించి అక్కడ నుంచి సిల్వర్‌ స్క్రీన్‌ ప్రమోట్‌ అయ్యింది మృణాల్‌ ఠాకూర్‌. హిందీలో సినిమాలు చేస్తూ ఒక మోస్తారు కెరీర్‌ కొనసాగిస్తున్న అమ్మడికి తెలుగు నుంచి సీతా రామం ఆఫర్‌ రావడం అది ఆమె చేయడం ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడం అంతా అలా జరిగింది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన సీతారామం సినిమాలో మృణాల్‌ ఠాకూర్‌ సీతామహాలక్ష్మి పాత్రలో అదరగొట్టేసింది. తెలుగులో ఎంట్రీ ఇవ్వడమే ఒక సూపర్‌ హిట్‌ పడటంతో అమ్మడు సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. ప్రెజెంట్‌ అడివి శేష్‌తో డెకాయిట్‌ మూవీ చేస్తుంది మృణాల్‌ ఠాకూర్‌. రీసెంట్‌గా అజయ్‌ దేవగన్‌తో మృణాల్‌ ఠాకూర్‌ నటించిన సినిమా సన్‌ ఆఫ్‌ సర్ధార్‌ 2. ఈ సినిమా లాస్ట్‌ వీక్‌ రిలీజైంది. సినిమాకు ఆశించిన రేంజ్‌లో పాజిటివ్‌ టాక్‌ రాలేదు. ఐతే సన్‌ ఆఫ్‌ సర్ధార్‌ 2 సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా ఆఫ్టర్‌ రిలీజ్‌ మృణాల్‌ సోషల్‌ మీడియా ఫాలోవర్స్‌తో చిట్‌ చాట్‌ చేసింది. ఈ చాట్‌లో భాగంగా మృణాల్‌ ఒక వ్యక్తి మీ సినిమాకు వచ్చిన రివ్యూస్‌ చూసి సినిమా వెళ్దామనుకున్న వాడినే ఆగిపోయా అన్న కామెంట్‌ కనబడిరది. సినిమా సూపర్‌ హిట్‌ అయితే రివ్యూస్‌ కూడా.. దానికి మృణాల్‌ ఆన్సర్‌ ఇస్తూ సినిమాను రివ్యూస్‌ మిస్‌ లీడ్‌ చేస్తాయని అన్నది. సినిమా ఎలా ఉంది అన్నది ఆడియన్స్‌ రివ్యూస్‌ చదివి కాదు చూసి డిసైడ్‌ చేయాలని అన్నది మృణాల్‌ ఠాకూర్‌. నెగి టివ్‌ రివ్యూస్‌ వల్లే సినిమాలు ఆడట్లేదని చెప్పడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు. మృణాల్‌ ఠాకూర్‌ సన్‌ ఆఫ్‌ సర్ధార్‌ 2 సినిమా చాలా పర్సనల్‌ గా తీసుకున్నట్టు ఉంది. అందుకే ఆ సినిమా నెగిటివ్‌ రివ్యూస్‌ పై ఆమె రుస రుసలాడుతున్నారు.

  • తుపాకి సౌజన్యంతో...


67 ఏళ్ల వయసు.. 37 ఏళ్ల కెరీర్‌.. ఓ జాతీయ పురస్కారం!


ree

తమిళ దర్శకుడు విసు తెలుగులో తీసిన మొదటి సినిమా ‘శ్రీమతి ఓ బహుమతి’ తెలిసే ఉంటుంది. దాని తమిళ వెర్షన్‌ ‘తిరుమతి ఒరు వెగుమతి’ సినిమాలో 30 ఏళ్ల యువకుడు నటించాడు. చాలా చిన్న పాత్ర. ఇప్పుడు సినిమా చూస్తే అందులో అతను ఉన్నాడని వెతికి గుర్తుపట్టాలి. కానీ అదే యువకుడు 38 ఏళ్ల తర్వాత తన 67వ ఏట జాతీయ పురస్కారం అందుకుంటాడని ఎవరూ అప్పుడు ఊహించి ఉండరు. అదే సినిమారంగం గొప్పతనం. నీలో ప్రతిభ ఉంటే నిన్ను తప్పకుండా ఉంచాల్సిన చోట ఉంచుతుంది. తథ్యం. ఇటీవల ప్రకటించిన జాతీయ సినీ పురస్కారాల్లో ఉత్తమ సహాయనటుడి పురస్కారం అందుకోనున్న నటుడు ఎం.ఎస్‌.భాస్కర్‌. మొత్తంగా చెప్పాలంటే, ముత్తుపేట్టై సోము భాస్కర్‌. సోము భాస్కర్‌ అనేది ఆయన పేరు కాగా, ముత్తుపేట్టై ఆయన పుట్టిన ఊరు.

ఇవాళ నటుడిగా అవకాశాలు పొందేందుకు చాలా మార్గాలున్నాయి. కానీ ముప్పై ఏళ్ల క్రితం సినిమాలు, నాటకాలు తప్ప మరో అవకాశం లేదు. సినిమాల్లో అవకాశం వచ్చినా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాలి. భాస్కర్‌ నాటకరంగ కళాకారుడు. ‘సొసైటీ ఫర్‌ న్యూ డ్రామా’ అనే నాటక ట్రూప్‌లో సభ్యుడు. అనేక నాటకాల్లో నటించారు. ఆ ట్రూప్‌తోపాటు అనేక ఇతర ట్రూప్‌లలోనూ సభ్యుడిగా మారి నాటకాలు వేశారు. ఆ సమయంలో దర్శకుడు, నాటక రచయిత విసు కళ్లలో పడి సినిమా అవకాశం అందుకున్నారు. అయితే ఆయన ప్రయాణం అంత సులువుగా సాగలేదు. 1987లో ఆయన సినిమా కెరీర్‌ మొదలుపెడితే, 2004 వరకు భాస్కర్‌కి బ్రేక్‌ రాలేదు. ‘ప్రధాన తారాగణం’ అనే చోట ఆయన పేరు రాయడానికి సుమారు 20 ఏళ్ల కాలం పట్టింది. ఆ మధ్యలో ఆయన ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేశారు. టూత్‌పేస్ట్‌ కంపెనీలో పనిచేశారు.

2004లో ‘ఎంగల్‌ అన్నా’ (తెలుగులో జగపతిబాబు నటించిన ‘ఖుషీఖుషీగా’) సినిమాతో భాస్కర్‌కు బ్రేక్‌ వచ్చింది. ఆ తర్వాత మెల్లగా ఆఫర్లు వరుస కట్టాయి. ప్రధానంగా కామెడీ వేషాలు ఆయన్ని నిలబెట్టాయి. తెలుగులో ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేసినటువంటి పాత్రలు తమిళంలో భాస్కర్‌ చేసేవారు. అవన్నీ ఆయనకు పేరుతెచ్చాయి. బ్రేక్‌ అయితే వచ్చింది. మరి గుర్తింపు? 2007లో ‘మొళి’ (తెలుగులో ‘మాటరాని మౌనమిది’) అనే సినిమాతో ఆ గుర్తింపు వచ్చింది. కొడుకును కోల్పోయి, ఆ నిజాన్ని నమ్మలేక, షాక్‌తో పిచ్చిగా ప్రవర్తించే ప్రొఫెసర్‌ జ్ఞానప్రకాశం అనే పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ క్యారెక్టర్‌ నటుడిగా అవార్డు అందించింది. అప్పటిదాకా కామెడీ వేషాలతో ఆకట్టుకున్న ఆయన సీరియస్‌ పాత్రలకూ సూట్‌ అవుతారని అందరికీ తెలిసింది. గట్టి పాత్రలు రావడం మొదలైంది.

కాలం గడుస్తూ ఉంది. 2017లో ‘8 బుల్లెట్స్‌’ అనే తమిళ సినిమా వచ్చింది. అందులో ఉద్యోగం పోగొట్టుకున్న కానిస్టేబుల్‌ కృష్ణమూర్తి పాత్ర చేశారు భాస్కర్‌. తెలుగులో అదే సినిమా ‘సేనాపతి’గా రీమేక్‌ చేసినప్పుడు ఆ పాత్రను రాజేంద్రప్రసాద్‌ చేశారు. అటు తమిళంలో, ఇటు తెలుగులో ఇద్దరూ తమ నటనతో అదరగొట్టారు. కొంత క్రౌర్యం, కొంత మంచితనం, మరికొంత గాంభీర్యం, ఇంకొంత నిస్సహాయత కలగలిసిన పాత్ర అది. భాస్కర్‌ ఇలాంటి పాత్ర కూడా చేయగలరా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యపోయిన వారిలో రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌ కూడా ఉన్నారు. తాను తీసే ‘పార్కింగ్‌’ అనే సినిమాలో ప్రధాన పాత్రకు ఈయనే కరెక్ట్‌ అని అనుకున్నారు.

అలా 2023లో ఆ సినిమాలో ఈవో ‘ఇళంపరుతి’ పాత్ర భాస్కర్‌కు దక్కింది. ఇంటి ముందు పార్కింగ్‌ విషయంలో గొడవపడి, పంతంతో కారు కొని, ఆ తర్వాత ఇబ్బందులు పడి, ఇంట్లోవారి చేత చెడ్డ అనిపించుకుంటున్నా తన పట్టువీడని ఇంటి పెద్ద పాత్రలో భాస్కర్‌ నటన అద్భుతం. ప్రేక్షకులు ఆ పాత్రకు చాలా కనెక్ట్‌ అయ్యారు. కొన్నిచోట్ల తిట్టుకున్నారు. మరికొన్నిచోట్ల అయ్యో అనుకున్నారు. ఆ పాత్ర మీద జాలినీ, కోపాన్నీ ఏకకాలంలో చూపించారు. జాతీయ అవార్డుల కమిటీకి ఆ నటన నచ్చింది. పురస్కారం ప్రకటించారు.

భాస్కర్‌ దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ‘గగనం’, ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే’ సినిమాల్లో నటించారు. అనేక తమిళ డబ్బింగ్‌ సినిమాల్లో ఆయన మనకు కనిపిస్తారు. వందల నాటకాల్లో నటించారు. రేడియో కార్యక్రమాలు చేశారు. టీవీ సీరియల్స్‌ చేశారు. వెబ్‌ సిరీస్‌లోనూ నటించారు. తమిళంలోకి డబ్బింగ్‌ అయిన తెలుగు సినిమాల్లో బ్రహ్మానందానికి శాశ్వత డబ్బింగ్‌ కళాకారుడు భాస్కరే. ‘బొబ్బిలిరాజా’ సినిమా నుంచి మొన్న మొన్న వచ్చిన ‘ఖుషీ’ దాకా అనేక తమిళ డబ్బింగ్‌ సినిమాల్లో బ్రహ్మానందం గొంతంటే ఎం.ఎస్‌.భాస్కర్‌దే. నటుడిగా చాలా బిజీగా ఉన్న సమయంలో కూడా బ్రహ్మానందం కోసం తమిళంలో తన గొంతు ఇచ్చి గౌరవించారు. భాస్కర్‌ కుమారుడు ఆదిత్య భాస్కర్‌ కూడా నటుడే. ‘96’ సినిమాలో విజయ్‌ సేతుపతి చిన్నప్పటి పాత్ర పోషించింది అతనే.

ఇప్పుడు భాస్కర్‌ వయసు 67 ఏళ్లు. ఆయన సినిమా కెరీర్‌ వయసు 37 ఏళ్లు. ఇన్నాళ్ల తర్వాత ఆయనకు జాతీయస్థాయి గౌరవం, గుర్తింపు దక్కింది. మంచి కళాకారులకు గుర్తింపు రావడం ఒక్కోసారి ఆలస్యం కావొచ్చు. కానీ తప్పకుండా దక్కుతుంది. అందుకు భాస్కర్‌ ఓ ఉదాహరణ.

- విశీ (వి.సాయివంశీ)

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page