top of page

రక్తనిధిలో ధనదాహం

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 16 hours ago
  • 4 min read
  • సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న న్యూ శ్రీకాకుళం u్లడ్‌బ్యాంక్

  • ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూళ్లు

  • కాగితాలకే పరిమితమైపోయిన సిబ్బంది

  • వైద్యులకు కమీషన్లు.. ప్లేట్‌లెట్లలో కల్తీలు

  • పర్యవేక్షించాల్సిన శాఖలకు నెలకు రూ.50వేలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మీ రక్తం మరొకరికి ప్రాణదానం.. ఇది రక్తదానం మీద అవగాహన కల్పించడానికి, ఆపదలో ఉన్నవారిని బతికించడానికి ఎవరో మహానుభావుడు రాసిన నినాదం. అయితే ఏ నినాదం వెనుక ఎవరి స్వప్రయోజనాలు దాగివున్నాయో తెలియవంటూ కమ్యూనిస్టు మిత్రులు నిరంతరం చెబుతుంటారు. సరిగ్గా ఈ నినాదాన్ని క్యాష్ చేసుకొని నగరంలో న్యూ శ్రీకాకుళం బ్లడ్‌బ్యాంక్ ఓ కొత్త మోడల్ బిజినెస్‌కు తెర లేపింది. బయట అంతా బ్లడ్‌బ్యాంక్ పేరుతో ఎంతోమంది ప్రాణాలు కాపాడేస్తున్నారని భావిస్తుంటారు. అయితే.. సేవ ముసుగులో ఇది కూడా ఓ ఫక్తు వ్యాపారమేనని నిరూపించాడు న్యూ శ్రీకాకుళం బ్లడ్‌బ్యాంక్ యజమాని టి.మణికంఠ. బ్లడ్‌బ్యాంక్‌కు ల్యాబ్ టెక్నికల్ సూపర్‌వైజర్‌గా వచ్చిన మణికంఠ తానే బ్లడ్‌బ్యాంకు మేనేజర్ అంటూ శ్రీకాకుళంలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. దాదాపు పదేళ్ల క్రితం స్థానిక వరం రెసిడెన్సీ ఎదురుగా న్యూ శ్రీకాకుళం బ్లడ్‌బ్యాంక్‌ను ప్రారంభించారు. ఇది గ్రామీణ విద్యాభివద్ధి సంఘం అనే సొసైటీ కింద పని చేస్తుంది. ఈ సొసైటీ ఎవరిది? వీరు విద్యాభివద్ధి అన్నారు కాబట్టి.. దీనికింద విద్యాసంస్థలు ఇంకా ఏమైనా ఉన్నాయా? లేదూ రాష్ట్రంలో మరిన్నిచోట్ల ఇటువంటి బ్లడ్‌బ్యాంకులే పెట్టారా? అనేది ప్రాథమికంగా తెలియదు. కానీ మార్కెట్‌లో జరుగుతున్న ప్రచారం మేరకు ఇది విజయనగరానికి చెందిన ఒక వ్యక్తిదని, వీరికి రాష్ట్రవ్యాప్తంగా 12 u్లడ్‌బ్యాంకులు ఉన్నాయని చెబుతున్నారు. కానీ శ్రీకాకుళంలో ఈ బ్లడ్‌బ్యాంకును అన్నీ తానై నడుపుతున్నది మాత్రం టి.మణికంఠే. రక్తదాన్ని వ్యాపారంగా మార్చారో, లేదో తెలుసుకునే ముందు బతుకుతెరువు కోసం వంశధార నిర్వాసితుడిగా శ్రీకాకుళం వచ్చిన మణికంఠ ప్రస్తుత ఆస్తులు ఒక్కసారి తెలుసుకుందాం. ఆయన భార్య ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో మెడికల్ అండ్ హెల్త్‌లో పని చేస్తున్నందుకు దాదాపు రూ.50వేల వరకు జీతం వస్తుండవచ్చు. అలాగే బ్యాంకు లోన్లు కూడా పెట్టివుండవచ్చు. అయితే వీటి వాయిదాలు చెల్లించడానికైనా ఆమె జీతం గాని, మణికంఠ గౌరవ వేతనం గాని సరిపోవని తెలుసుకోవాలి. ఎందుకంటే.. స్థానిక దత్తాత్రేయ కోవెల వద్ద దాదాపు రూ.2కోట్లు విలువ చేసే జి ప్లస్ వన్ భవనం ఉంది. ఇందులో ఒక ఏకంగా ఒక థియేటరే ఉందని చెప్ప్పుకుంటున్నారు. రూ.14 లక్షల వరకు విలువ చేసే బ్రెజ్జా కారు ఉంది. ఈమధ్యే దాదాపు లక్ష అటుఇటులో ఇదే ధర పలికే ఎర్తిగా కారు కూడా ఉంది. రెండు బుల్లెట్లు, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఈయన సొంతం. ఇది కాకుండా బ్యాంకు బ్యాలెన్స్‌లు, మిగతా ఆర్థిక లావాదేవీల సంగతి వేరే విషయం. ఒక బ్లడ్‌బ్యాంకులో ఇంత సంపాదించవచ్చని బహుశా ఎవరికీ తెలిసుండకపోవచ్చు. లేదు ఇదే మోడల్‌ను మిగిలినవారు కూడా అనుసరిస్తున్నారేమో తెలియదు గాని, మరొకరి ప్రాణాలు నిలుపుతున్నామన్న మానవత్వంతో ఇస్తున్న రక్తం ఇక్కడ సొమ్ములుగా మారిపోతుంది. బ్లడ్‌బ్యాంకుకు లైసెన్స్ ఇచ్చినప్ప్పుడే దేన్ని ఎంతకు అమ్మాలి? అని ప్రభుత్వం ఓ ధరల పట్టిక నిర్దేశించింది. ఇందులో హÃల్‌బ్లడ్ డోనార్ వస్తే రూ.1050కు అమ్మాలి. లేకపోతే రూ.1550కి అమ్మవచ్చని కేంద్రప్రభుత్వం గైడ్‌లైన్స్ ఇచ్చింది. ప్యాక్డ్ రెడ్‌సెల్స్‌కు కూడా ఇదే ధరలు వర్తిస్తాయి. కానీ ఎంతకు కొన్నారో బాధితులకు బాగా తెలుసు. బిల్లు మాత్రం నిబంధనలకు అనుగుణంగానే ఉంటుంది. ప్లేట్‌లెట్లు రూ.400కు అమ్మాలి. కానీ రూ.700కు అమ్ముతున్నారు. ప్లాస్మా కూడా రూ.400లే. అందుకే దీన్ని కూడా రూ.700కు అమ్మేస్తున్నారు. ఇక సొమ్ములు బాగా వచ్చేది సింగిల్ డోనార్ ప్లేట్‌లెట్లు డోనార్ ఉన్నా, లేకపోయినా రూ.10,500కు అమ్మవచ్చు. ఈ బ్లడ్‌బ్యాంకులో దీన్ని ఎక్కువకు అమ్ముతుండగా, ఒకే ఎస్‌డీపీని రెండు ప్యాకెట్లు చేసి అమ్మడం వల్ల అదనంగా సొమ్ములొస్తున్నాయి. అలాగే నెగెటివ్ బ్లడ్‌గ్రూప్ ఉన్నవారు ప్యాకెట్ పట్టుకెళ్తే.. ఇద్దరు లేదా ముగ్గురు డోనార్లను తీసుకువచ్చి బ్లడ్ ఇమ్మని చెబుతున్నారు. రక్తం ఉచితంగా ఇస్తున్నప్ప్పుడు మరి ప్రభుత్వమైనా ధరలు నిర్ణయించడమేమిటన్న ప్రశ్న తలెత్తక మానదు. కోల్డ్ స్టోరేజ్, స్క్రీనింగ్ టెస్ట్‌లు, వైద్యశిబిరాల నిర్వహణకు అయ్యే ఖర్చు వంటివి ఉంటాయి కాబట్టి ఈ ధర. దానికి అదనంగా వసూలు చేస్తున్నదంతా మణికంఠ జేబులోకేనన్న ఆరోపణలు లేకపోలేదు. జిల్లాలో ప్రధాన ఆసుపత్రులకు రోగులను తరలించే ఆరఎంపీలు, పీఎంపీలను పట్టుకొని, శ్రీకాకుళంలో పెద్ద డాక్టర్లను బుట్టలో వేసుకొని, వారి దగ్గరకు వచ్చే రోగులు న్యూ శ్రీకాకుళం బ్లడ్‌బ్యాంక్ నుంచి రక్తం తెచ్చుకోవాలని డైరెక్షన్ ఇచ్చే విధంగా చేసుకోవడం ద్వారా మణికంఠ గట్టిగానే సంపాదించేశాడు. ఇదే బ్లడ్‌బ్యాంకులో తన బావను ముందున పెట్టి, వెనుక కథంతా మణికంఠే నడుపుతాడు. ఈ తతంగమంతా బ్లడ్‌బ్యాంకును సూపర్‌వైజ్ చేయాల్సిన సంబంధిత అధికారులకు తెలుసు. అందులో డ్రగ్ ఆఫీస్‌కు నెలకు రూ.30వేలు, వైద్య ఆరోగ్యశాఖకు రూ.20వేలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలు ఇటువంటి బ్లడ్‌బ్యాంకులకు ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తాయంటే.. తలసేమియా వ్యాధితో బాధపడుతున్నవారికి నిత్యం రక్తం అవసరం పడుతుంది. ఈ వ్యాధికి మందు లేదు. రక్తమార్పిడి ఒక్కటే పరిష్కారం. ఇందుకోసం సొమ్ములు ఖర్చు చేయలేరని భావించిన ప్రభుత్వం తాము లైసెన్స్ ఇచ్చిన బ్లడ్‌బ్యాంకులు ఈ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తాన్ని అందించాలని నిర్దేశించాయి. అయితే మణికంఠ 25 నుంచి 30 మంది తలసేమియా పిల్లలకు రక్తం ఉచితంగా అందిస్తూనే, కొందరి నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తమ దగ్గర ఉన్న రక్తంలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉందని, దాన్ని తొలగించాలంటే అత్యాధునిక ఫిల్టర్లు వాడాలని చెప్పి ఒక్కో ప్యాకెట్‌కు రూ.1200 అదనంగా తీసుకుంటున్న సంఘటనలూ ఉన్నాయి. అసలు ఈ బ్లడ్‌బ్యాంకుకు మేనేజరెవరు? మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? అనేది పక్కన పెడితే, ఇక్కడ అన్నీ మణికంఠే చూస్తున్నారు. ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడానికి రూ.50వేలు ఖర్చవుతుందని లెక్కలు చూపుతున్నారు. అయితే ఒకసారి బ్లడ్‌క్యాంప్‌లో వచ్చిన ప్యాకెట్లను నాలుగైదు భాగాలుగా విభజించి నాలుగైదు క్యాంపులు నిర్వహించినట్లు ఈ సొసైటీకి చూపించి, ప్రతీ క్యాంపునకు రూ.50వేలు ఖర్చు చూపించి ఈయన కార్లు, బంగ్లాలు కొనుక్కుంటున్నారట. ఇక్కడ ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు ఉండాలి. ఒక్కరే ఉన్నారు. ఒక డాక్టర్ ఉండాలి. ఆమె రికార్డుల్లో మాత్రమే ఉన్నారు. ఒక కౌన్సిలర్ ఉండాలి. ఆ ఊసే ఇక్కడ లేదు. రక్తదాన శిబిరాలు జరిగినప్ప్పుడు ఎవరికో ఒకరికి తెల్లకోటు, మెడలో స్టెత్ వేసేసి పత్రికలకు ఫొటోలు పంపించేస్తున్నారు. అలాగే తాము సేకరించిన యూనిట్లలో 30 శాతం రిమ్స్ ఆసుపత్రికి ఇవ్వాలి. అసలు సేకరణలోనే తప్ప్పుడు లెక్కలు నమోదు చేస్తుంటే, రిమ్స్‌కు ఎన్ని వెళ్తాయో ఊహించుకోవచ్చు. డోనార్ కార్డు ఇవ్వడం ద్వారా రక్తదాత తనకు అవసరమైనప్ప్పుడు రక్తం ఈ u్లడ్‌బ్యాంకు నుంచి తీసుకోవడంలో వెసులుబాటు ఉంటుంది. అలా కాకుండా సర్టిఫికెట్లు ఇచ్చి పద్మశ్రీ ఇచ్చాం, తీసుకుపో అన్నట్టు పంపించేస్తున్నారు.

ఎమ్మెల్యే బ్యాంక్‌కే ఝలక్

పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తనయుడు ఒక డాక్టర్. ఈయన కూడా పాలకొండ రోడ్డులోనే ఒక బ్లడ్‌బ్యాంక్‌ను ఆమధ్య ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఎవరైనా రక్తం తీసుకుంటే.. రివర్స్ అయిపోతుందని స్వయంగా తన చెప్ప్పుచేతల్లో ఉండే డాక్టర్లచేతే మణికంఠ చెప్పిస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ఎవరైనా పేషెంట్‌కు రక్తం అవసరమైతే తెచ్చుకోండి అని మాత్రమే డాక్టర్లు చెబుతారు. కానీ ఎక్కడ తెచ్చుకోవాలో కూడా మన డాక్టర్లే చెబుతారు. ఇది మనోడికి కాసులు కురిపించే విధంగా మారిపోయింది. విజయశ్రీ బ్లడ్‌బ్యాంకులో రక్తం తీసుకుంటే అది ఒంటికెక్కదన్న ప్రచారం చేసే ఆసుపత్రులు కూడా ఇక్కడ ఉన్నాయి. దాని వెనుక న్యూ శ్రీకాకుళం బ్లడ్‌బ్యాంకును ప్రోత్సహించి తద్వారా లబ్ధి పొందాలన్నదే ఇక్కడ చాలా ఆసుపత్రుల లక్ష్యం.

ప్లేట్‌లెట్ల మాయాజాలం

సాధారణంగా రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య పడిపోయి సీరియస్‌గా ఉన్న పేషెంట్లకు రక్తం నుంచి ప్లేట్‌లెట్లు వేరుచేసి ఎక్కిస్తారు. అప్ప్పుడు మాత్రమే ఫలితం త్వరగా వస్తుంది. ఇందుకోసం ఎన్ని ప్లేట్‌లెట్ ప్యాకెట్లు అవసరమైతే అంతమంది డోనర్లు రక్తం ఇచ్చివుండాలి. ఒక ప్లేట్‌లెట్ ప్యాకెట్ మూడు రోజులు మాత్రమే ఫ్రిజ్‌లో నిల్వ ఉంటుంది. ఆ తర్వాత అందులో ప్లేట్‌లెట్‌లు చనిపోతాయి. కానీ న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంకుకు వెళితే.. ఒకేసారి 20 ప్యాకెట్లు కావాలన్నా ప్లేట్‌లెట్లు అందిస్తారు. అప్పటికప్ప్పుడు 20 మందిని తెచ్చి రక్తం తీశారనుకుంటే పొరపాటే. అలాగని వీరి ఫ్రిడ్జ్‌లో ప్లేట్‌లెట్ ప్యాకెట్ మూడు రోజుల కంటే ఎక్కువ ఉంటుందనుకోవడం తప్పే. మరి 20 ప్యాకెట్లు ఎలా ఇస్తున్నారంటే.. ఒకే ప్యాకెట్‌లో ఉన్న ప్లేట్‌లెట్లను 20 ప్యాకెట్లలో సర్ది, మిగతా ఖాళీకి సెలైన్ వాటర్ పోస్తారట. ఈ విషయం నగరంలో ఆసుపత్రులు నడుపుతున్న అనేకమంది వైద్యులకు తెలుసు. కానీ న్యూశ్రీకాకుళం బ్లడ్‌బ్యాంక్‌కే ఎందుకు సిఫార్స్ చేస్తారో వేరేగా చెప్పనక్కర్లేదు. ప్లేట్‌లెట్లు ఎక్కించుకున్నా కౌంట్ మాత్రం ఒకంతట పెరగడంలేదంటూ ఏదైనా కంప్లైంట్ వస్తే, ఆ ప్యాకెట్ ఎక్కడి నుంచి వచ్చిందో వేరేగా ఊహించనక్కర్లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page