top of page

లగ్జరీపై నాకంత ఆసక్తిలేదు

  • Guest Writer
  • Aug 19, 2025
  • 2 min read

ఈ మధ్య ఓ వర్ధమాన నటుడు తాను తొందరపడి ఓ ఖరీదైన కారు కొని తర్వాత అవకాశాలు తగ్గటంతో ఆ భారీ ఈఎంఐలు కట్టలేక ఎలా ఇబ్బంది పడుతున్నాడో పక్కనున్న నటుడితో చెబుతున్నప్పుడు నాకో సంఘటన గుర్తొచ్చింది.

మా గురువుగారు (కోడిరామకృష్ణ గారు) దాదాపు 50 సినిమాలకు దర్శకత్వం వహించాక కూడా మారుతి ప్రీమియర్‌ కారులాంటివి తప్ప భారీగా ఖరీదైన కారు కొనలేదు. ప్రొడక్షన్‌వారి అంబాసిడర్‌ కారులోనే షూటింగ్‌కి వచ్చేవారు.

ఓ రోజు ఓ పెద్దాయన గురువుగారితో ‘సార్‌ నిన్నమొన్న ఒకటీ రెండు సినిమాలు హిట్లిచ్చిన డైరెక్టర్సే పెద్దపెద్ద కార్లు కొని ఎంజాయ్‌ చేస్తుంటే ఇన్ని సూపర్‌హిట్లిచ్చిన మీరేంటి సార్‌ ఇంకా లగ్జరీ కారు కొనకుండా’ అన్నారు.

దానికి గురువుగారు ‘లగ్జరీ కారుదేముంది సార్‌ ఒకటి కాకపోతే రెండు కొనగలం. కానీ మన జీవితానికి మనం అలవాటు చేసే ఏ లగ్జరీ అయినా సరే ఈ క్షణం నుండి మనకు ఒక్క రూపాయి కూడా రాకుండా సంపాదన ఆగిపోయినా జీవితాంతం దానిని సాఫీగా కొనసాగించగలగాలి. పైగా మన పిల్లలు కూడా ఆ లగ్జరీకి అలవాటుపడతారు. ఎప్పుడైనా ఆ స్థాయి కంటే కిందికి దిగాల్సిన పరిస్థితి వస్తే వాళ్లూ బాధపడాల్సిందే. నిజానికి అంతటి ఆర్ధిక స్ఠాయి ఉండి అనుభవించాలనే కోరికలున్నప్పుడు తప్పులేదు. కానీ వాటిపైన నాకంతటి ఆసక్తి కూడా లేదు. అయినా పైకెగిరేవాడు కిందపడతాడు గానీ, నేల మీద నడిచేవాడు పడడుకదండీ. నాకు నేలపైన నడవడమే ఇష్టం’ అన్నారు.

డబ్బు విషయంలో విజేతల పొదుపరితనాన్ని చూసి పిసినారితనం అనుకుంటారు సామాన్యులు. నిజంగా ఆర్ధికంగా బలపడేవాళ్లు తమ అవసరాల కోసం తప్ప జనం ముందు గొప్పను ప్రదర్శించటం కోసం డబ్బును ఖర్చు చేయరు.

‘నిజమైన ధనవంతుడు పేదవాడిలా కనిపించినా ఐశ్వర్యవంతుడవుతూనే వుంటాడు. ధనవంతుడిలా కనిపించాలనుకునే పేదవాడు మాత్రం మరింత పేదవాడు అవుతాడు’ అనే సూక్తి నిరూపితమైన నిజం. నిజమైన ప్రతిభకి మనుషులిచ్చే విలువకంటే ఆడంబరాన్ని చూసి ఇచ్చే విలువ ఎక్కువగా కనిపించినా దానికి ఆయుష్షు తక్కువే.

ఉన్నది ఒకటే జీవితం.. అనుభవించాలి గానీ పోయేటప్పుడు ఏమి తీసికెళ్తాం? అనేది ఒకరి ఫిలాసఫీ అయితే, వెళ్లేముందు ఉన్నవాళ్ళకి ఏమి వదిలి వెళ్లగలం? అనేది మరొకరి ఫిలాసఫీ. జిహ్వకో రుచి అన్నట్లు ఎవరి జీవితానుభవాలను బట్టి వారి వారి ప్రత్యేక ఫిలాసఫీ రూపొందుతుంది. ఎవరికి వారిది కరెక్టే.

- దేవీప్రసాద్‌


ఈ లేడీవిలన్‌.. అగ్రహీరోల పాత్రలను బీట్‌ చేసింది!

ఎనబై, తొంబైల్లో తెలుగు సినిమా విలన్ల పాత్ర చాలా కీలకంగా ఉండేది. ఎంతంటే. ఆ పాత్రలో జీవించిన నటులు బయట కనిపిస్తే.. యమ తిట్లు తిట్టేవారు అప్పటి జనం. ఎందుకంటే, ఆ పాత్రలో అలా జీవించేవారు మరి. అలాంటి నటులు కనుమరుగైపోతున్నారని అనుకుంటున్న వేళ.. కూలీ సినిమాలో ఓ లేడి క్యారెక్టర్‌ మొత్తం టాప్‌ హీరోలను కూడా డ్యామినేట్‌ చేసేసింది. సగటు ప్రేక్షకుడు ఆమెను చూస్తున్నంత సేపు.. నాయల్ది, కత్తందుకో జానకీ.. అన్నంత కోపంతో సినిమా చూస్తున్నాడు. ఆ క్యారెక్టర్‌లో అంతలా జీవించింది రచితా రామ్‌.

కూలీ సినిమాలో బాలీవుడ్‌ సహా కన్నడ, తెలుగు, తమిళ, మళయాళం ఇండస్ట్రీల నుండి పేరొందిన అగ్రహీరోలు నటించారు. కానీ అందులో విలన్‌ పాత్ర పోషించిన నాగార్జున, అమీర్‌ ఖాన్‌, షౌబిన్‌ కంటే కూడా.. రచితా రామ్‌ నటించిన కళ్యాణి క్యారెక్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుందనేది కొందరి నుంచి వినిపిస్తున్న బలమైన టాక్‌. అందుకే సినిమా రిలీజైన తర్వాత సోషల్‌ మీడియాలో ఆమె పాత్ర గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆమె పాత్ర చుట్టూ ఉన్న ట్విస్ట్‌.. ఆమె నటనా ప్రేక్షకులను కట్టేపడేసింది.

80, 90ల నాటి తెలుగు సినిమాల్లో విలన్లుగా నటించిన చలపతిరావు, కోట, ఆ తర్వాత తనికెళ్ల భరణి లాంటి వాళ్లను బయట చూసినప్పుడు జనం కోపంగా ఉద్రేకంగా చూసేవారట. ఆ సినిమాలో హీరోయిన్‌ను అంతలా ఏడిపించాలా.. హీరోనే చంపేంత ధైర్యామారా అంటూ ప్రశ్నలు ఎదుర్కొన్నామంటూ ఆ పాత విలన్లు ఎన్నోసార్లు చెప్పిన ఘటనలూ ఉన్నాయి. అదిగో అలాంటి సందర్భమే.. ఇప్పుడు ఈ కన్నడ భామ రచితా రామ్‌ ఎదుర్కొంటుందట.

సినిమా చూస్తున్నంత సేపు ఈ క్యారెక్టర్‌లో ఉండే వేరియేషన్స్‌కి ప్రేక్షకుల్లో ఆమె పట్ల చిర్రెత్తుకొచ్చి.. కనిపిస్తే కొట్టాలన్న కోపం తెప్పించేస్తుందంటున్నారు. అంతేనా, చివర్లో నాగార్జున ఆమెను చంపేస్తుంటే.. ఇంకా ఇంకా అన్నట్టుగా మనసులోని రాక్షసత్వాన్ని బయటకు ప్రదర్శిస్తున్నారు కొందరు ప్రేక్షకులు. అంతలా.. ఆ క్యారెక్టర్‌లో నటించింది రచితా రామ్‌.

అసలు ఈ సినిమాలో అమాయకత్వంతో సహా రూత్‌లెస్‌ విలనిజం చూపించిన క్యారెక్టర్‌ ఏదైనా ఉంది అంటే.. అది కేవలం రచితా రామ్‌ నటించిన కళ్యాణి పాత్ర మాత్రమే. అందుకే అగ్రహీరోలు విలన్లుగా నటించినా.. సగటు ప్రేక్షకుడి మదిలో మాత్రం ఈ కన్నడ భామ మాత్రమే గుర్తుండిపోయింది.. సోషల్‌ మీడియా అంతటా చర్చగా మారింది. అన్నట్టు.. ఈ లేడి విలన్‌ 2013లో తన కెరీర్‌ మొదలు పెట్టింది. ఇన్నేళ్లు కన్నడ నాట సినిమాలు చేసింది. ఇప్పుడు కూలీ సినిమాతో అన్ని ప్రాంతాల్లోనూ చర్చగా మారింది.

- బాతాఖానీ సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page