top of page

లలిత సంగీతపు రారాజు

  • Guest Writer
  • Jul 15
  • 4 min read

చెకోవిస్కీ కన్సర్టోను అద్భుతంగా వాయించిన సంగీతజ్ఞుడిగా.. రష్యన్‌ ప్రజల మన్ననలందుకున్న ఆధునిక సంగీత గురు మనయంగత్‌ సుబ్రహ్మణ్యన్‌ విశ్వనాథ్‌. డాక్టర్‌ కావాలనుకుని యాక్టర్‌ అయ్యాననేవారిని తరచూ చూస్తుంటాం కదా.. అలాగే, ఎంఎస్వీ కూడా యాక్టర్‌ కమ్‌ సింగర్‌ కావాలని ఇండస్ట్రీకొచ్చాడు. జైలు డే రోజు ఖైదీలతో కలిసి సత్య హరిశ్చంద్ర నాటకంలో లోహితాస్యుడి వేషం వేసి అదరగొట్టాడు. అక్కడ ఖైదీలంతా సినిమాల్లో ప్రయత్నించు నీకు మంచి భవిష్యత్తుందని ప్రోత్సహించడంతో తన దృష్టి నటనపై పడిరది. కానీ, విధిరాత విశ్వనాథన్‌ను సంగీత దర్శకుడిగా మార్చేసింది. తరాలు మారినా మర్చిపోలేని పాటల పూదోటకు మారాజును చేసింది. జూలై 14 విశ్వనాథన్‌ లలిత సంగీతాన్ని వదిలి వెళ్లిన రోజు! ఒకసారి ఆ రూపానికి తగ్గ.. సంగీత దిగ్గజాన్ని సంస్మరించుకోవడం ఆయనకు మనమిచ్చే నివాళి!

ree

అసలు బాలీవుడ్‌ కంటే కూడా అద్భుతమైన సంగీతాన్నందించిన ఘనత దక్షిణ భారత సినిమా చరిత్రది. వందేళ్ల దక్షిణ భారత సినిమా చరిత్రనోసారి పరిశీలిస్తే ఇక్కడి సంగీతానికి మిగిలిన సమాజంతో పోలిస్తే మరింత భిన్నంగా, రాగయుక్తంగా మల్చిన ఎందరో సంగీత దర్శకులు మనకు కనిపిస్తారు. అందులో ముందువరుసలో కూర్చునే సంగీత దిగ్గజం ఎంఎస్వీ.

కడు పేదరికం నుంచి దక్షిణ భారత సినీ సంగీతంలో ఇవాళ్టికీ పేరు మోసిన ఇళయరాజా, రెహమాన్‌ వంటి ఎందరో మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ తల్చుకునే ఓ రోల్‌ మాడల్‌ స్థాయికెదిగిన సరిగమల సారం ఎంఎస్వీ.

ఎంఎస్వీ ప్రారంభ జీవితం!

కేరళలోని పాలక్కాడ్‌ సమీపంలోని ఎలప్పుల్లిలో 1928, జూన్‌ 24వ తేదీన జన్మించిన ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ బాల్యమేమంతా గొప్పగా సాగలేదు.

1932లో తన తండ్రి మరణించాడు. ఆ తర్వాత సోదరి మరణించింది. ఆ సమయంలో ఎంఎస్వీ తల్లి ఇక బతికి బట్ట కట్టే పరిస్థితి లేదనుకుని కొడుకుతో సహా బావిలో దూకి బలవన్మరణానికి సిద్ధపడిరది. కానీ, అప్పుడే ఆ విషయం తెలుసుకున్న ఎంఎస్వీ తాత వారిని కాపాడాడు. అలా చావునోట్లో తలబెట్టి వచ్చిన విశ్వనాథన్‌.. ఆ తర్వాత దక్షిణ భారత సినీ పరిశ్రమంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టే స్థాయికెదుగుతాడని ఎవరనకున్నారు? అదే మరి విధి అంటే!

ఆ తర్వాత స్థానిక థియేటర్‌లో బఠాణీలమ్ముకుని బతికేవాడు ఎంఎస్వీ. కానీ, సంగీతమంటే మాత్రం చెవి కోసుకునేవాడు. తరచూ సినిమా పాటలు వింటూ గడిపేవాడు. ఓ సందర్భంలో హార్మోనియం వాయిస్తూ.. ప్రముఖ సంగీత విద్వాంసుడు నీలకంఠ భాగవతార్‌ దృష్టిలో పడ్డాడు. ఆ మెరుపును గమనించిన భాగవతార్‌ ఎంఎస్వీని చేరదీశాడు. సంగీతం నేర్పించాడు. మూడేళ్లపాటు నేర్చుకున్న సంగీత ఓనమాలకు మరింత సాధన చేసి ఇంపు తెచ్చాడు. అలా 13 ఏళ్లకే మూడు గంటలపాటు కచేరీ చేసి అందరి ప్రశంసలందుకున్నాడు. ఇక అప్పట్నుంచి ఆ రాయి రత్నమైంది. దక్షిణ భారత సంగీత రంగం మొత్తం చూపు తనవైపు చూసేలా మెరిసింది.

విశ్వనాథన్‌ - రామ్మూర్తి జోడీగా మొదటి పరిచయం!

12 ఏళ్ల వయస్సులోనే విశ్వనాథన్‌ జూపిటర్‌ ఫిల్మ్స్‌ లో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించాడు. 1950 నుంచి 1860 మధ్య మనోహర, కర్పుక్కరసి, తంగపతుమై వంటి అతి పెద్ద తమిళ హిట్స్‌ ను అధించిన ఓ ప్రధాన చిత్ర నిర్మాణ సంస్థ ఇది.

జుపిటర్‌ ఫిల్మ్స్‌ లో జస్ట్‌ ఆఫీస్‌ బాయ్‌ ఎంఎస్వీ ఉద్యోగం. అక్కడే సీ.ఆర్‌.సుబ్బరామన్‌తో పరిచయమేర్పడి.. హర్మోనియం వాద్యకారుడిగా కుదిరాడు. అక్కడే వయోలిన్‌ విద్వాంసుడు టీ.కే. రామ్మూర్తితో స్నేహమేర్పడిరది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి తమిళ చిత్ర పరిశ్రమలో ఓ సంగీత జంటగా సినిమా సంగీతం చేయడం ప్రారంభించారు.

అయితే, సుబ్బరామన్‌ తర్వాతే ఎంఎస్వీ, రామ్మూర్తి జంట సినిమా సంగీతాన్ని ప్రారంభించింది. 1952లో సుబ్బరామన్‌ మరణించిన తర్వాత ఆయన అసంపూర్తిగా వదిలేసిన దేవదాస్‌, అలాగే చండీరాణి వంటి సినిమాలకు విశ్వనాథన్‌-రామ్మూర్తి కలిసి సంగీతమందించారు. ఇక ఆ తర్వాత వారు వెనక్కి చూసుకున్న దాఖలాలే లేవు.

అప్పటివరకూ దక్షిణ భారత సినీ సంగీతంలో జంట సంగీత దర్శకులెవ్వరూ లేరు. అలాంటి సమయంలో శంకర్‌ - జైకిషన్‌ తరహాలో తామెందుకు పనిచేయకూడదనే ప్రతిపాదనను రామ్మూర్తి ముందుంచింది ఎంఎస్వీనే. ముందు కొంత సంకోచించినా.. ఆ తర్వాత రామ్మూర్తి అంగీకరించడంతో ఇద్దరూ కలిసి అజేయంగా సినీ సంగీతాన్ని శాసించారు.

ఎంఎస్వీ బాణీలు కుదిరిస్తే.. వాటిని మరింత నైపణ్యంగా మల్చడం రామ్మూర్తి చేసేవారు. స్వతహాగా వయోలినిస్ట్‌ కావడం వల్ల రామ్మూర్తి ఒక చిన్న అపశృతిని కూడా క్షమించేవారు కాదు. ఎంఎస్వీ ట్యూన్స్‌ ను బీజిఎమ్స్‌ తో సహా.. కండక్టర్‌ గా ఒక సరైన పద్ధతిలోకి తీసుకువచ్చే క్రమంలో.. ఎక్కడైనా చిన్న తప్పు జరిగినా స్వరభేదం జరిగినా రామ్మూర్తి గుర్తించేవారు. అలా రామ్మూర్తి-ఎంఎస్వీ జంట 1952 నుంచి 65 వరకూ ఒక దశాబ్దకాలం దక్షిణాది సినీసంగీతంలో రారాజులుగా వెలుగు వెలిగారు. ఈ జంట తమిళంలో ఎంజీఆర్‌, శివాజీ గణేషన్‌, జయలలిత వంటి అగ్ర తమిళ నటులందరి సినిమాలకూ సంగీత దర్శకత్వం చేసింది.

దశాబ్దకాలం తర్వాత సోలోగానే సంగీతమందించాలనే పరస్పర నిర్ణయంతో ఎంఎస్వీ- రామ్మూర్తి జంట విడిపోయింది. అయితే, మళ్లీ యాదృచ్ఛికంగా ఈ ఇద్దరూ కలిసి 1995లో ఎంగిరుందో వంథన్‌ అనే సినిమా కోసం మళ్లీ కలిసి పనిచేశారు.

నేర్చుకుంది భారతీయ శాస్త్రీయ సంగీతమే అయినా ప్రాశ్చాత్య సంగీతంలోనూ పట్టు!

బేసికల్‌గా కర్నాటక సంగీతంలో మాత్రమే శిక్షణ పొందిన ఎంఎస్వీ సంగీతం సమకూర్చిన సినిమాలోసారి పరిశీలిస్తే ఆయన 50 ఏళ్ల కెరీర్‌లో వందల సంప్రదాయేతర, ప్రాశ్చాత్య బాణీలు కనిపిస్తాయి.

సామాన్యులు పాడుకునేదే పాట. జనరంజకమైందే పాట. ఈ సూత్రాన్నే నమ్మాడు ఎంఎస్వీ. అందుకే ఆయన పాటలన్నీ తేలికగా పాడుకునే ట్యూన్స్‌ ను మనమోసారి పరిశీలించొచ్చు. 1963లో రామ్మూర్తితో పాటు.. ఎంఎస్వీని మెల్లిసై మన్నార్‌ బిరుదుతోనూ.. అలాగే, ది కింగ్‌ ఆఫ్‌ లైట్‌ మ్యూజిక్‌ అనే సత్కారంతోనూ సన్మానించింది తమిళనాడు ప్రభుత్వం.

ప్రాజెక్ట్‌ ఒప్పుకుంటే నిర్మాత, దర్శకులను తిప్పడం.. ఆలస్యం చేయడం వంటివేవీ ఎంఎస్వీ వద్ద కనిపించకపోయేవట. నిమిషాల్లో పాటలు కంపోజ్‌ చేయడం.. ఒక డేట్‌ అనుకుంటే ఒకటీ.. లేదా, రెండు రోజుల్లోపే ఆ పాటలను రికార్డ్‌ చేసివ్వడం.. ఇదీ ఎంఎస్వీ కంపోజింగ్‌ శైలి. దక్షిణభారత సంగీత చక్రవర్తి ఇళయారాజాకు సినిమా సంగీతంలో ఓ రోల్‌ మాడల్‌ విశ్వనాథన్‌. విశ్వనాథన్‌ కారు వస్తుంటే చూడ్డానికి తపన పడ్డ ఏకలవ్య శిష్యుడు. అలాగే, ఆస్కార్‌ విన్నర్‌ ఏ.ఆర్‌.రెహమాన్‌కూ ఎంఎస్వీ అంటే గురువు. ఈ మధ్యే చనిపోయిన భారతీరాజా కుమారుడు మనోజ్‌తో ఆయన తండ్రి తీసిన సినిమా తాజ్‌మహల్‌కు ఏఆర్‌ఆర్‌ సంగీతమందిస్తే.. అందులోనూ, విశ్వనాథన్‌ ఓ ఊపైన పాట పాడి అలరించాడు.

ఎంఎస్వీ స్నేహితుడైన కన్నదాసన్‌ అనే ప్రముఖ గీత రచయిత కొంత విశ్వనాథన్‌ గురించి చెప్పుకొచ్చాడు.

ఓసారి మేము విమానమెక్కాం. విశ్వనాథన్‌ టాయిలెట్‌ అని రాసుంటే అది టూలెట్‌ అనుకుని రెంట్‌ ఎంత ఉంటుందనడిగాడు. మేం కాబూల్‌ లో దిగాం. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌ అంటే ఏంటి.. మహ్మద్‌ ఘోరీ ఎవరని అడిగాడు. అక్కడినుంచి తాష్కెంట్‌ కు వెళ్లాం. అలాగే సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ లోని లెనిన్‌ గ్రాడ్‌ కు వెళ్లాం. అతడికన్నీ మిస్‌ కమ్యూనికేట్‌ అవుతున్నాయనే విషయం మాకు అర్థమైంది. మమ్మల్ని ఆహ్వానించిన హోస్ట్‌ చెకోవిస్కీ కచేరీ హాల్‌ కు తీసుకెళ్లాడు. రష్యన్‌ సంప్రదాయ సంగీత విద్వాంసులు వాయించే పియానోను చూపించాడు. చెకోవిస్కీ అనేది ఉచ్ఛరించడం కష్టమైన విశ్వనాథన్‌.. ఆ పియానో దగ్గరకు వెళ్లి వాయిస్తుంటే.. ఏకంగా 30 నిమిషాలపాటు హాల్‌ అంతా పిన్‌ డ్రాప్‌ సైలెన్స్‌ నెలకొంది. విశ్వనాథన్‌ మేస్ట్రో కచేరీకి మంత్రముగ్ధులైన రష్యన్లు.. లేచి నిలబడి చప్పట్లు చరుస్తుంటే.. అతడికేం రాకుంటే ఏంటీ.. అన్నింటినీ మించినంత సంగీతం వచ్చుకదా అనిపించింది మాకు అంటాడు కన్నదాసన్‌.

దేవదాసులోని జగమే మాయ.. బతుకే మాయ వంటి బాణీతో ఓ తాగుబోతు విరహాన్ని సంగీతంలో వినిపించినా కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని ఒయలు పోతున్నావని ఓ ప్రియుడు ప్రేయసి గురించి ఆట పట్టించినా.. భలే భలే మగాడివోయ్‌ బంగారు మారాజువోయి అంటూ ఎల్లారి ఈశ్వరి గొంతుతో పురుషాధిక్య సమాజాన్ని గంతులేయించినా.. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్‌ అంటూ ఆకలిరాజ్యపు కేకలు వినిపించినా.. ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమవునో అంటూ మరో చరిత్ర సృష్టించిన సంగీత దర్శకుడు విశ్వనాథన్‌. అందుకే ఆ స్వరద్రష్ఠకు నివాళులతో..

- బాతాఖానీ.కామ్‌ సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page