top of page

వెండితెర వెనుక ‘వడ్డీల’ వలయం

  • Guest Writer
  • 5 days ago
  • 2 min read
ree

సినిమా ఇండస్ట్రీలో బయటకు కనిపించే రంగుల ప్రపంచం వేరు, లోపల జరిగే ఫైనాన్షియల్‌ యుద్ధం వేరు. ప్రేక్షకులు సినిమా రిలీజ్‌ అయ్యాక హిట్టా, ఫ్లాపా అని మాట్లాడుకుంటారు. కానీ అసలు సినిమా రిలీజ్‌ అవ్వడమే ఒక పెద్ద గెలుపుగా మారిన భయంకరమైన పరిస్థితులు ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొన్నాయి. ఇటీవల ఒక భారీ సినిమా పాత బాకీల గొడవ వల్ల వాయిదా పడటం అనేది ఇప్పుడు ట్రేడ్‌ వర్గాల్లో ఒక హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇది కేవలం ఆ ఒక్క సినిమా సమస్య కాదు, ఇది టాలీవుడ్‌ మొత్తాన్ని పట్టిపీడిస్తున్న ఒక క్యాన్సర్‌ లాంటిది. ఒకప్పుడు సినిమా బిజినెస్‌ చాలా పద్ధతిగా, నమ్మకం మీద సాగేది. సినిమా అనౌన్స్‌ చేయగానే ఎగ్జిబిటర్లు (థియేటర్‌ యజమానులు) డిస్ట్రిబ్యూటర్లకు అడ్వాన్సులు ఇచ్చేవారు, ఆ డబ్బు నిర్మాత చేతికి వచ్చేది. ఆ డబ్బుతో నిర్మాత సినిమా తీసేవాడు. కానీ ఇప్పుడు ఆ చైన్‌ పూర్తిగా తెగిపోయింది. థియేటర్ల నుంచి అడ్వాన్సులు రావడం దాదాపు తగ్గిపోయింది.

దీంతో నిర్మాతలు పూర్తిగా బయట ఫైనాన్షియర్లు, కార్పొరేట్‌ సంస్థల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. సినిమా బడ్జెట్‌ లో అధిక భాగం స్టార్‌ హీరోల రెమ్యునరేషన్లకే పోతోంది. హీరో పారితోషికం, మిగతా క్యాస్ట్‌ ఖర్చులు పోను.. మిగిలిన కొద్ది మొత్తంతో క్వాలిటీ సినిమా తీయలేక, ప్రమోషన్లు చేయలేక బయట నుంచి అధిక వడ్డీలకు డబ్బులు తెస్తున్నారు. ఒక నిర్మాత తీసిన మొదటి సినిమా నష్టపోతే, ఆ అప్పు తీర్చడానికి రెండో సినిమా మొదలుపెడతాడు. రెండో సినిమా మీద వచ్చిన అడ్వాన్సులతో మొదటి సినిమా అప్పులు కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఒక సినిమా బడ్జెట్‌ లో ఇంకో సినిమా వడ్డీలు కలుస్తున్నాయన్నమాట. ఈ చక్రం ఎక్కడో ఒకచోట ఆగిపోతే, మొత్తం సినిమాలు ఆగిపోతాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే. పాత కార్పొరేట్‌ సంస్థలు ఇచ్చిన ఫండిరగ్‌ రికవరీ కానప్పుడు, వారు ఏమాత్రం కనికరం లేకుండా లీగల్‌ గా కోర్టుకు వెళ్లి కొత్త సినిమాలను అడ్డుకుంటున్నారు.

వారికి కావాల్సింది ఎమోషన్స్‌ కాదు, రికవరీ. అది 20 కోట్లు కావచ్చు, 25 కోట్లు కావచ్చు. అది క్లియర్‌ అయ్యేదాకా సినిమా రీల్‌ కదలదు అని తేల్చి చెబుతున్నారు. దీనికి తోడు థియేటర్‌ వ్యవస్థలో వచ్చిన మార్పులు కూడా నిర్మాతకు మరింత కష్టంగా మారాయి. ఒకప్పుడు సింగిల్‌ స్క్రీన్స్‌ ఎక్కువగా ఉన్నప్పుడు, సినిమా రిలీజ్‌ అయిన వారం రోజుల్లోనే నిర్మాతకు డైరెక్ట్‌ గా క్యాష్‌ వచ్చేది. దాంతో తెచ్చిన వడ్డీలు వెంటనే కట్టేసేవాడు. కానీ ఇప్పుడు మల్టీప్లెక్స్‌ ల హవా నడుస్తోంది.

మల్టీప్లెక్స్‌ చైన్స్‌ నుంచి టికెట్‌ డబ్బులు నిర్మాత అకౌంట్‌ కు రావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ గ్యాప్‌ లో వడ్డీల మీటర్‌ ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. ఆ భారం మళ్లీ సినిమా బడ్జెట్‌ మీదే పడుతుంది. ఎగ్జిబిటర్ల నుంచి రావాల్సిన డబ్బులు టైమ్‌ కి రాక, ఫైనాన్షియర్ల ఒత్తిడి తట్టుకోలేక నిర్మాతలు సతమతమవుతున్నారు. అలాగే డిజిటల్‌ రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌ మార్కెట్‌ కూడా ఇప్పుడు స్థిరంగా లేదు. రెండేళ్ళ క్రితం ఓటీటీలు పోటీపడి సినిమాలు కొనేవి. కానీ ఇప్పుడు మార్కెట్‌ డౌన్‌ అయ్యింది.

ఓటీటీ సంస్థలు రేట్లు తగ్గించేశాయి. దీంతో నాన్‌ థియేట్రికల్‌ రెవెన్యూ మీద పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, మార్కెట్‌ లో క్రేజ్‌ కోసం సినిమాలు అనౌన్స్‌ చేయడం, ఆ తర్వాత ఫైనాన్స్‌ దొరక్క మధ్యలో ఆపేయడం లేదా వాయిదా వేయడం పరిపాటిగా మారింది. హీరోలు తమ పారితోషికం తగ్గించుకోరు, కార్పొరేట్‌ సంస్థలు తమ బాకీలు వదులుకోవు. మధ్యలో నలిగిపోయేది మాత్రం నిర్మాత మాత్రమే. ఈ వడ్డీల ఊబిలో నుంచి బయటపడాలంటే సినిమా బడ్జెట్‌ లెక్కలు పూర్తిగా మారాలి. కేవలం హీరో ఇమేజ్‌ మీద కాకుండా, మార్కెట్‌ వాస్తవాలకు తగ్గట్టుగా ఖర్చు ఉండాలి. లేకపోతే ఈ రోజు ఒక సినిమా ఆగిపోయింది, రేపు మరో పది సినిమాలు ఆగిపోతాయి.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో..


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page