top of page

వెండి తెరమీద ఓ పట్టుపురుగు విషాదం!

  • Guest Writer
  • Sep 24, 2025
  • 2 min read

ఆమెని మొదటిసారి ‘‘సీతాకోకచిలుక’’ సినిమాలో చూశాను. బహుశా తెలుగులో అదే ఆమె మొదటి సినిమా అయుంటుంది. ఎందుకంటే నా నుండి ఏ తెలుగు సినిమా కూడా తప్పించుకునేది కాదు ఆ రోజుల్లో. రిపీట్‌ రిలీజులు అధికంగా ఉండే ఆ రోజుల్లో ‘‘మంత్రశక్తి-దైవభక్తి’’, ‘‘అఖండ సౌభాగ్యవతి’’ వంటి డబ్బింగ్‌ సినిమాలతో సహా నాగయ్య నుండి నరేష్‌ వరకు, కాంచనమాల నుండి ముచ్చెర్ల అరుణ వరకు వేయగా తెలుగులో వచ్చిన ప్రతి సినిమాని ఎంతో బాధ్యతగా చూసినవాడిని. సీతాకోకచిలుకలో ఆమె కళ్లు నా గుండెని డిస్టర్బ్‌ చేశాయి. నెపాన్ని కాసేపు అప్పటి నా వయసు మీదకి తోసేస్తున్నాను మరి! శ్రీదేవి తరువాత నా గుండెలో కట్టుకున్న రెండో ఇల్లు ఆమెదే అప్పట్లో.

మళ్లీ సినిమా దగ్గరకు వస్తున్నా. అందులో ఆమెది వదిన పాత్ర. అంటే హీరోయిన్‌ అన్నయ్య ఐన శరత్‌ బాబుకి భార్య పాత్ర. మన సినిమాల్లో వదిన, అక్కాచెల్లెళ్ల పాత్రలకి ఇల్లాలి హుందాతనం తప్ప మరే ఇతర లక్షణాలూ ఉండకూడదు కాబట్టి ఆ సినిమా మొత్తం ఆ పాత్ర సమస్త కుటుంబ బాధ్యతల్ని మోసే ఇల్లాలి హుందాతనంతో వుంటుంది. ఆ సినిమా మొత్తానికి ప్రీ-క్లైమాక్స్‌ సన్నివేశం చాలా కీలకమైనది.

శరత్‌ బాబు తన దగ్గర పనిచేసే రాళ్లపల్లి భార్యపై లైంగిక అత్యాచారం చేస్తాడు. అతను గుడిసెలోకి వెళుతుండగా చూసిన స్మిత అలా నిస్సహాయంగా గుమ్మానికి జారగిలబడిపోతుంది. ఆ మొత్తం సన్నివేశం చాలా గొప్పగా ఉంటుంది. రాళ్లపల్లి వంటి ఆరితేరిన గొప్ప నటుడితో పోటీపడి మరీ ఆమె ఆ సన్నివేశంలో జీవించింది. ఆ సినిమాలోని ఆమె నటనలో ఎక్కడా నాటకీయత కనిపించదు. తెలుగు సినిమాకి ఓ గొప్ప నటి దొరికిందనుకున్నా. అద్భుతమైన హావభావ ప్రకటన చేసింది. భారతీరాజా చాలా మనసు పెట్టి తీసిన సన్నివేశమది. కేవలం ఈ సన్నివేశం కోసమే ఆ సినిమాని టీవీలు లేని ఆ రోజుల్లో గుంటూరు వెంకటకృష్ణా థియేటర్లో ఇంకో రెండు సార్లు అదనంగా చూశాను. కామెంట్స్‌ సెక్షన్లో ఇచ్చిన ఆ సినిమా లింకుని నొక్కి ఆ సన్నివేశం తప్పకుండా చూడండి. మీ గుండె కింద తడి మీకు ఖచ్చితంగా తగులుతుంది. నాదీ పూచీ.

సీతాకోకచిలుక తరువాత ఒక్క నెలకే రిలీజైన ఘరానా గంగులులో వాంప్‌ రోల్‌ వేసింది. అప్పటికే ఆమె తమిళ్‌, మలయాళం సినిమాల్లో అలాంటి రోల్స్‌ కి ఫేమస్‌ అని తెలుసుకున్నప్పుడు చాలా డిజపాయింట్‌ అయ్యాను. ఆమెని తెలుగు సినిమానే కాదు మొత్తం దక్షిణ భారత దేశ చిత్ర పరిశ్రమే ఓ వాంప్‌ స్టార్ని చేసింది. మన సినిమాల్లో మంచి శరీరాకృతి కలిగిన అందమైన నటీమణులెవరైనా సరే గ్లామర్కి, దేహ ప్రదర్శనకి వీలుగా వుండే గ్లామర్‌, వాంప్‌, క్లబ్‌ డాన్సర్‌ పాత్రలకే పరిమితం అవ్వాల్సిందే. అలాంటి పాత్రలే ధరించాల్సి రావడం వల్ల సిల్‌ స్మితకి వ్యక్తిగతంగా నష్టం ఏమీ కలిగి వుండకపోవచ్చు. ఆమె ఇష్టపూర్వకంగానే అలాంటి పాత్రల్నే వేసుండొచ్చు. అది వేరే విషయం. మళ్లీ దాసరి నారాయణ రావు తీసిన ‘‘అభిమన్యుడు’’ సినిమా వరకు ఆమెకి తనలోని ఆర్టిస్టుని ప్రూవ్‌ చేసుకునే అవకాశం రాలేదు. నాకైతే మొదటినుండీ సినిమాల్లో క్లబ్బు డాన్సులు, వాంప్‌ రోల్స్‌ నాకు బోర్‌. కాబట్టి ఆమెని మళ్లీ అభిమన్యుడు సినిమా వరకు పెద్దగా అభిమానించే అవకాశం రాలేదు.

సినిమాల్లో ఆమెకున్న డిమాండ్‌ ఎలాంటిదంటే ఒక్క 1984లోనే ఆమె 45 సినిమాల్లో నటించి ప్రపంచ రికార్డ్‌ సృష్తించింది. తన సినిమాల ద్వారా ఆమె జనాల్ని ఎంత ఎంటర్టెయిన్‌ చేసిందో కానీ ఆమె జీవితం మాత్రం దుఃఖదాయకమైంది. చివరిగా తను మరొకరి కోసం బతుకుతున్నానని, తనకెవరూ లేరని, అందరూ మోసం చేశారని బాధపడి, ఆ బాధలో నలిగిపోయి చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుంది.

స్మిత తను బతికుండగానే అనేకమందికి ఆదాయవనరుగా మారడం కాదు, మరణించిన అనంతరం కూడా ఆమె పేరున సినిమాలు తీసి కోట్లు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. అలా వచ్చిందే డర్టీ పిక్చర్‌. నిజానికి ఆమె బయో పిక్‌ గా చెప్పబడ్డ ఆ సినిమాకి అంత చెత్త పేరు ఎలా పెట్టగలిగారో! ఏది డర్టీ? ఈ సమాజమా? ఆమెనా? ఏది మురికి? ఎవరు మురికి? ఆమె మురికిలో వికసించిన కమలం.

డబ్బుని నమ్ముకున్నవారికీ, ప్రేమించే వారికి, వ్యామోహించే వారికీ, ఏదో పద్ధతిలో, ముసుగులో, అనుబంధాల్లో సాటి మనిషుల్ని వాడుకునే వారికీ అంతా బాగానే నడుస్తున్నది వడ్లపాటి విజయలక్ష్మీ! సీతాకోకచిలుక సినిమాలో భర్త ముఖాన ఉమ్మేసి నువ్వు చెప్పిన మాటలు గుర్తుకొస్తుంటాయి నిన్ను ఏ పాత సినిమాల్లో చూసినా! అన్నట్లు ఆ సినిమాలో ఏం చెప్పావు? అవి మొత్తం సమాజాన్ని ఉద్దేశించి అన్న మాటలు.

‘‘గొప్ప వ్యాపారివయ్యా నువ్వు! బతుకే ఓ వ్యాపారం నీకు. నా మీద పెళ్లి అనే వ్యాపారం చేసి నువ్వు లాభాలు గడిరచావు. నేను నష్టపోయాను!’’

- అరణ్యకృష్ణ

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page