top of page

వింత జీవులున్నాయి.. తస్మాత్‌ జాగ్రత్త!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 29, 2025
  • 3 min read
  • అంతర్వేది తీరంలో పోలీసుల హెచ్చరిక బోర్డు

  • సముద్ర స్నానానికి దిగిన ఇద్దరిని కుట్టిన కీటకాలు

  • అస్వస్థతకు గురైన వారికి ఆస్పత్రిలో చికిత్స

  • అవి జెల్లీఫిష్‌లని.. ప్రాణాంతకం కావంటున్న నిపుణులు

  • బంగాళాఖాత తీర ప్రాంతాల్లో వీటి కదలికలు అధికం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

ఈ ప్రాంత జలాల్లో విషజీవులున్నాయి. అందువల్ల సముద్రంలో స్నానానికి దిగవద్దు.

..ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంతర్వేది సముద్ర తీరం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బోర్డుపై ఈ హెచ్చరిక కనిపిస్తుంది.

కొత్తగా ఈ హెచ్చరిక ఎందుకు? ఇక్కడ సముద్ర స్నానాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది కదా! ఇప్పుడు కొత్తగా విషజీవులున్నాయి.. ప్రమాదం.. అని హెచ్చరించడం ఏమిటన్న సందేహాలు, ప్రశ్నలు తలెత్తడం సహజం. దానికి కారణమేంటంటే జూన్‌ 30న ఇక్కడ స్నానానికి సముద్రంలోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులను ఒక వింత జీవి కుట్టింది. దాంతో శరీరమంతా దద్దుర్లు, దురదతో వారు అస్వస్థతకు గురయ్యారు.

ఇదే కాదు.. మూడేళ్ల క్రితం విశాఖ నగరంలోని రుషికొండ బీచ్‌లోనూ ఇటువంటి వింత జీవులు సముద్రజలాల్లో కనిపించి పర్యాటకులను భయాందోళనకు గురిచేశాయి.

వీటినే పరిశోధకులు, ఓషనోగ్రఫీ నిపుణులు జెల్‌ఫిష్‌లు అని చెబుతున్నారు. మిగతా చేపలకంటే ఇవి భిన్నమైనవని, ఇవి కుడితే అస్వస్థతకు గురవుతామని, చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇటీవల అంతర్వేది బీచ్‌కు వచ్చిన కొందరు పర్యటకులకు ఇదే చేదు అనుభవం ఎదురైంది. అంతర్వేదిలో కనిపించినవాటిని బ్లూ డ్రాగన్‌ జెల్లీ ఫిష్‌ అంటారని జువాలజీ అధ్యాపకులు చెబుతున్నారు. ఇవి విషపురుగులు కావని స్పష్టం చేస్తున్నారు.

దురద, దద్దుర్లు

అంతర్వేది వద్ద సముద్ర స్నానానికి దిగిన ఇద్దరు వ్యక్తులను ఊదా రంగులో జిగటగా, ముద్దలా ఉన్న జీవి కుట్టింది. దాంతో ఒళ్లంతా దద్దుర్లు, దురదలతో అస్వస్థతకు గురి కాగా స్థానికులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా ఇద్దరిని అస్వస్థతకు గురి చేసిన ఈ జీవులను అగ్గిబాట పురుగులు(ఒక రకమైన జెల్లీ ఫిష్‌లు)గా స్థానిక మత్స్యకారులు వ్యవహరిస్తుంటారు. ఇవి శరీరానికి తాకినా, కుట్టినా ఆ భాగంలో మంటలు, దురదలు వస్తాయని చెప్పారు. అటువంటప్పుడు బీచ్‌లో స్నానం చేస్తే తగ్గిపోతాయని వారు చెబుతుంటారు. దీనికి ముందురోజు కూడా అంతర్వేది తీరానికి వెళ్లిన కొందరు పర్యాటకులకు ఇదే అనుభవం ఎదురైందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటన వస్తృతంగా వైరల్‌ కావడంతో అంబేద్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా అంతర్వేది తీరంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

తూర్పు తీరంలో అధికం

జెల్లీఫిష్‌లకు దాడి చేసే స్వభావం ఉండదని, తమని తాము రక్షించుకోవడానికే కుడతాయని పరిశోధకులు చెబుతున్నారు. పేరులో ఫిష్‌.. అంటే చేప అని ఉన్నా ఇవి చేప జాతికి చెందినవి కావట. వీటి శరీరం వూదా రంగులో జిగటగా ముద్దలా ఉంటుంది. అవసరమైనప్పుడు ఇతర జీవులను కుట్టగలిగే సూదిలాంటి సెల్స్‌ కలిగి ఉంటాయి. కుట్టినప్పుడు వాటి నుంచి ఒక ద్రవం స్రవించి దద్దుర్లు, దురద పుట్టిస్తాయి. కొన్నిసార్లు తీవ్ర అస్వస్థతకు గురి చేయవచ్చు. కానీ ప్రాణాంతకం కావు. వీటికి ఈత కూడా రాదు. అందువల్ల నీటిపై తేలుతూ ప్రవాహం ఎటు వెళ్లే అటు పోతుంటాయి. ఆ క్రమంలో తీరానికి వస్తుంటాయని ఏయూ జువాలజీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. మనదేశ తూర్పుతీరంలో అంటే.. విశాఖ, చెన్నై, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల బంగాళాఖాత తీరాల్లో జెల్లీ ఫిష్‌లు అధికంగా కనిపిస్తాయి. ఆ క్రమంలో శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతాల్లోనూ ఆ జీవులు కనిపించే ఆస్కారం ఉంది. వీటిలో పోర్చుగీస్‌ మ్యాన్‌ ఓవార్‌, మూన్‌ జెల్లీ ఫిష్‌, బ్లూ డ్రాగన్‌ జెల్లీ ఫిష్‌లతో పాటు మరికొన్ని రకాలు ఉన్నాయి. కాగా అంతర్వేది బీచ్‌లో కనిపించింది బ్లూ డ్రాగన్‌ జెల్లీ ఫిష్‌. వీటి స్టింగ్‌(కొండి)లో మనిషిని అస్వస్థతకు గురిచేసే స్థాయిలోనే విషం ఉంటుంది. జెల్లీ ఫిష్‌లు సముద్రాల్లోనే కాదు.. చెరువులు, సరస్సులు అంటే మంచినీటి వనరుల్లోనూ ఉంటాయి. వేసవి చివరి రోజుల్లో, వర్షాలు ప్రారంభమయ్యే సమయాల్లో తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సమయంలో ఒడ్డుకు వచ్చి పిల్లలను వదులుతాయి. ఆహారం కోసం తీవ్రంగా వెతుకుతాయి. ఆ సమయంలో మనుషులు, ఇతర ప్రాణులు ఎదురైతే తమను తాము కాపాడుకునేందుకు కుడతాయి. జెల్లీఫిష్‌లు కనిపిస్తే అందంగా ఉన్నాయని కొందరు వాటిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడే అవి ఆందోళనకు గురై కుడతాయి.

రుషికొండ తీరంలోనూ

విశాఖ రుషికొండ బీచ్‌లో డైవింగ్‌కు వెళ్లిన వారికి పలు సందర్భాల్లో జెల్లీఫిష్‌లు కనిపించాయి. మూడేళ్ల కిందట రుషికొండ బీచ్‌కు ఐదారు కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కొందరు డైవింగ్‌ చేసినప్పుడు పసుపు రంగు జెల్లీ ఫిష్‌లు ఈదుతూ కనిపించాయి. వాటిని ఫోటోలు, వీడియోలు తీశారు. అలాగే ఏడేళ్ల కిందట ముంబైలో, ఐదేళ్ల కిందట గోవాలో జెల్లీ ఫిష్‌లు వందల సంఖ్యలో తీరానికి వచ్చి సందర్శకులు, లైఫ్‌ గార్డులపై దాడి చేసిన సంఘటనలు ఉన్నాయని నేవీ ఉద్యోగులు, స్కూబా డైవర్లు చెబుతున్నారు. సముద్రంలో జెల్లీఫిష్‌లు ఉండటం సహజమే కానీ తీరం సమీపంలోకి రావడం మాత్రం అరుదుగా జరుగుతుంటంది. రుషికొండ బీచ్‌లో కనిపించిన జెల్లీఫిష్‌లు నాలుగు నుంచి ఐదు మీటర్ల పొడవు ఉన్నాయి. ఈ జీవుల శరీరంలో 95 శాతం నీరే ఉంటుంది. ఇవి చిన్నవైతే గుంపులుగా, పెద్దవైతే ఒంటరిగా సంచరిస్తుంటాయి.

తీరానికి ఎందుకు వస్తాయి?

సాధారణంగా జెల్లీ ఫిష్‌లు సముద్రం మధ్య భాగాల్లో తేలియాడుతూ జీవిస్తాయి. కానీ సముద్రపు గాలుల దిశ మారడం, ప్రవాహాల ప్రభావం వల్ల ఒడ్డుకు కొట్టుకొస్తాయి. అలాగే సముద్రపు ఉష్ణోగ్రత పెరిగినపుడు, కొన్ని జెల్లీ ఫిష్‌లు చల్లటి నీటిని వెతుక్కుంటూ తీరం వైపు కదులుతుంటాయి. మరికొన్ని రకాల జెల్లీ ఫిష్‌లు చిన్న జీవులను ఆహారంగా తీసుకుంటూ, అవి ఎక్కువగా ఉండే తీర ప్రాంతాల దిశగా వస్తుంటాయి. ‘జెల్లీఫిష్‌ శరీరానికి తాకితే ఆ భాగాన్ని కొబ్బరినూనె, వెనిగర్‌, ఉప్పునీటితో శుభ్రపరచాలి. ఎందుకంటే విషపూరితమైన సూదుల్లాంటి నెమటోసిస్ట్‌లు చర్మంలో ఉండిపోతాయి. అవి మళ్లీ విషం విడుదల చేసే ప్రమాదం ఉంటుంది. శరీర భాగాన్ని శుభ్రపరిస్తే నెమటోసిస్టులు చనిపోతాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page