top of page

వ్యవస్థకే వైకల్యం..నకిలీలదే రాజ్యం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 14 hours ago
  • 3 min read
  • వికలాంగుల తయారీ కేంద్రంగా తోలాపి

  • గతంలోనే ‘సత్యం’లో సమగ్ర కథనాలు

  • దాంతో 23 మందిని గుర్తించి పింఛన్లు రద్దు

  • ఇంకా చాలామంది నకిలీ వికలాంగులు ఉన్నట్లు ఫిర్యాదు

  • అప్పనంగా విద్యా, ఉద్యోగ సౌకర్యాలతో వారి దర్జా

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

నకిలీ వికలాంగ ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందడంపై ‘సత్యం’ గతంలో ప్రత్యేక కథనాలను ప్రచురిస్తే.. విచారణ జరిపిన అధికారులు పొందూరు మండలం తోలాపి పరిధిలో 23 మంది ని అనర్హులుగా గుర్తించి పింఛన్లు తొలగించారు. కానీ ఇటువంటి నకిలీ పత్రాలతో ఇంకా చాలామంది వైట్‌కాలర్ ఉద్యోగాలు చేస్తున్నారంటూ కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు వచ్చినా ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇప్ప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై ఆ గ్రామానికే చెందిన దుంపల నూకరాజు అనే ఉపాధ్యాయుడు దాదాపు యుద్ధమే చేస్తున్నారు. నకిలీ వికలాంగ ధ్రువపత్రాలతో అటు చదువులోను, ఇటు ఉద్యోగాల్లోను, మరోవైపు పదోన్నతుల్లోను పీహెచ్ (ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్) కోటాను వాడుకొని ఎంజాయ్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఒకటికి పదిమార్లు అందరికీ ఫిర్యాదులు చేశారు. జిల్లా గ్రీవెన్స్‌తో మొదలుపెట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరకు ఆయన విజ్ఞాపన అందని నాయకుడు, అధికారి లేరు. ఆయన తవ్వి తీసిన లెక్కల మేరకు తోలాపిలో 81 మంది నకిలీ పీహెచ్ పత్రాలతో ఉద్యోగాలు, ఉన్నత విద్య వంటి సౌకర్యాలు అనుభవిస్తున్నారని అర్థమవుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో 19 మంది, ఉపాధ్యాయులుగా 19 మంది, బ్యాంకుల్లో 10 మంది, విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఎనిమిది మంది, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 15 మంది, కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లో 10 మంది ఉన్నారు. వీరంతా ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తెలంగాణలో ఉద్యోగాలు చేస్తున్నారు. మరికొందరు రైల్వేశాఖలో పని చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరంతా 2010 నుంచి వివిధ సందర్భాల్లో నకిలీ దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు పొందినవారేనని ఆ ఫిర్యాదు సారాంశం. అయితే 2019 తర్వాత వీరి సంఖ్య మరింత పెరిగిందని నూకరాజు ‘సత్యం’కు చెప్పారు.

ఇళ్లలోనే SRలు

నకిలీ వైకల్య సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్న వారిపై గతంలో కూడా ఫిర్యాదులు వచ్చినా రాజకీయ కారణాలతో విచారణ నిలిపేశారు. నకిలీ దివ్యాంగులు డిగ్రీ చదువుతున్నవారిలో ఉన్నారని ఫిర్యాదులు వచ్చినప్పుడు జిల్లా బీసీ సంక్షేమశాఖ కార్యాలయంలో ఎసఆర్‌లు మాయమైన ఘటనలు కూడా ఉన్నాయి. కొందరు అధికారులు, ఉద్యోగులు తమ ఎసఆర్‌లను ప్రభుత్వ కార్యాలయంలో కాకుండా తమ వద్దనే అట్టిపెట్టుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినా ఫలితం లేదు. విద్యాశాఖలో నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందిన వారు ఎసఆర్‌లను తమ వద్దే ఉంచుకుని అవసరమైనప్ప్పుడు వాటిని కార్యాలయానికి తీసుకువచ్చి ఎంట్రీలు వేయించి మళ్లీ తీసుకుపోతున్నారు. నిuంధనల ప్రకారం అటువంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలి. ఉద్యోగ నియామకం, విద్యాసంస్థల్లో చేరిన సమయంలో జరిపే సర్టిఫికెట్ల పరిశీలనలోనే నకిలీలను గుర్తించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. కాలు లేదనో, చెయ్యి లేదనో సర్టిఫికెట్ తెస్తే బయటపడిపోతుందని ఏకంగా చూపు మందగించిందని, వినిపించడం లేదంటూ నకిలీ సర్టిపికెట్లు సష్టిస్తున్నారు. ఇటువంటి పత్రాలతోనే ఆరునెలల క్రితం ముగ్గురు ఉద్యోగాల్లో చేరారు. వీరిలో ఇద్దరు బ్యాంకు పీవోలుగా, ఒకరు తెలంగాణ విద్యుత్ సంస్థలో ఏఈగా ఉద్యోగం పొందారు. ఇటువంటి ఆరోపణలతో ఫిర్యాదులు వచ్చినప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్న కేసులూ ఉన్నాయి. విచారణ జరుగుతుండగానే ఉద్యోగ విరమణ చేసినవారూ ఉన్నారు. నకిలీ ధ్రువపత్రాలు సంపాదిస్తున్నవారు వాటిని లైఫ్ సెటిల్మెంట్‌కే వినియోగిస్తున్నారు. అంటే.. ఉద్యోగాలు, బదిలీలు, ప్రమోషన్ల కోసమే వాటిని వినియోగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీల జోలికి పోకుండా జాగ్రత్తపడుతున్నారు. నకిలీ పత్రాలతో ఉద్యోగులు, చదువులు సాగిస్తున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదైన దాఖలాలు లేకపోవడంతో నకిలీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలా ఛీటింగ్‌కు పాల్పడేవారిపై సెక్షన్ 463, 468, 471 కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలు మాత్రం కనిపించడంలేదు.

ఆ కుటుంబానికే వైకల్యం

వికలాంగ పత్రాల విచ్చలవిడితనానికి నిదర్శనంగా నిలిచే ఒక ఉదంతం కూడా ఉంది. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పని చేస్తున్న సింగూరు రామకృష్ణ కుటుంబంలో 13 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఏకంగా పదిమంది దివ్యాంగ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందడాన్ని దుంపల నూకరాజు తన ఫిర్యాదులో ప్రముఖంగా ప్రస్తావించారు. మరో ముగ్గురు ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారు. సింగూరు రామకష్ణ ఎంఎస్సీ, పీహెచ్‌డీ చేశారు. ఈయన నకిలీ వైకల్య ధ్రువపత్రంలోతో ఉన్నత విద్య చదివారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఎసఆర్(సర్వీస్ రిజిస్టర్)లో పీహెచ్‌సీ ధ్రువీకరణ వివరాలు నమోదు చేయలేదని విశ్వసనీయ సమాచారం. రామకష్ణ మామ అన్నాజీరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ీVAదా పెరగడంతో ప్రస్తుతం నరసన్నపేట డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఆయన కూడా నకిలీ పీహెచ్ సర్టిఫికెట్‌తో ఉద్యోగంలో చేరారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక అన్నాజీరావు భార్య, అల్లుడు, కుమార్తె, కొడుకులు, తమ్ముడు, అక్క కూడా నకిలీ పత్రాలతోనే చదువు పూర్తిచేసుకొని ప్రభుత్వ కొలువుల్లో చేరారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా ఒకే కుటుంబంలో కుటుంబంలో 13 మంది చూపు, వినికిడి లోపంతో బాధ పడుతున్నట్టు సర్టిఫికెట్స్ ఇచ్చినవారిని ముందుగా సన్మానించాలి. ఫేక్ వ్యవహారంపై పోరాటం చేస్తున్న దుంపల నూకరాజు కూడా వికలాంగుడు కావడం గమనార్హం. అందుకే అసలైన వికలాంగులు నష్టపోకుండా చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 36 శాఖలకు ఆయన ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదు అందుకున్న వారిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, సీఎస్, డీజీపీతో పాటు కలెక్టర్, ఎస్పీ, ఆయా శాఖల ప్రభుత్వ జిల్లా అధికారులు ఉన్నారు. సదరు ఫిర్యాదుపై స్పందించిన ఎస్పీ పొందూరు పోలీసులకు విచారణకు ఆదేశించినట్టు తెలిసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page