‘వారణాసి’కే సినిమా చూపిస్తున్నారు
- Guest Writer
- 3 minutes ago
- 2 min read

ప్రస్తుతం భారతీయ చలన చిత్రసీమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఏమైనా ఉందీ అంటే అది ‘వారణాసి’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అపజయం అంటూ ఎరుగని దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఇది. దానికి తోడు మహేష్ బాబు తోడయ్యాడు. ఇండియానా జోన్స్ లాంటి కథ, అందులో రామాయణం రిఫరెన్సులు, రాముడిగా మహేష్‌బాబు, ప్రియాంకా చోప్రా హీరోయిన్, ఫృథ్వీరాజ్ సుకుమారన్ విలన్.. ఇలా ఈ సినిమా నిండా ప్రత్యేకతలే. ఈ సినిమా బడ్జెట్ ఎంతన్నది ఇప్పటికీ ఫజిలే. దాదాపు రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు ఓ టాక్ నడుస్తోంది. ఆ లెక్కన చూస్తే భారతదేశంలో రూపుదిద్దుకొంటున్న అత్యంత ఖరీదైన సినిమా ఇదే. బిజినెస్ పరంగా ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. కాకపోతే.. ఇంతటి సినిమా కూడా ఓటీటీ కి లోకువ అయిపోయింది.
ఓటీటీ మార్కెట్ ఈ రోజుల్లో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓటీటీలు ఎగబడి కొనే రోజులు పోయాయి. ఎంత పెద్ద సినిమా అయినా సరే, గీచి గీచి బేరం ఆడుతున్నాయి. కొన్ని సినిమాల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వక రిలీజ్ కు నోచుకోని సినిమాలు ఎన్నో ఉన్నాయి. మిగిలిన సినిమాల మాటేమో గానీ, ‘వారణాసి’ లాంటి క్రేజ్ ఉన్న సినిమాల్ని ఓటీటీలు చూసే దృష్టి కోణం వేరేలా ఉంటుందని అంతా అనుకొన్నారు. కానీ విచిత్రం ఏమిటంటే.. ఇప్పటి వరకూ వారణాసి ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వలేదు. ఆ మాటకొస్తే.. వారణాసిని కొనే ధైర్యం ఓటీటీలు చేయడం లేదు.
దానికి కూడా ఓ కారణం ఉంది. వారణాసి ఓటీటీ నుంచి.. చిత్రబృందం దాదాపు రూ.400 నుంచి రూ.500 కోట్లు ఆశిస్తోంది. ఇది చాలా పెద్ద మొత్తం. రూ.500 కోట్లు పెట్టి ఓటీటీ సంస్థ ఓ సినిమాని కొన్నదంటే.. అది భారతీయ సినిమా చరిత్రలో ఓ రికార్డ్. ఇది వరకటి రోజుల్లో అయితే నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు ఇంత రిస్క్ చేయడానికి వెనుకంజ వేసేవి కావు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. ఇటీవల అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు కొన్ని భారీ చిత్రాల్ని కొని దారుణంగా ఇబ్బంది పడ్డాయి. అందుకే పెద్ద సినిమాలు కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేసుకొంటున్నాయి. వారణాసిపై విపరీతమైన క్రేజ్ ఉన్నమాట వాస్తవం. అయితే మరీ రూ.400-500 కోట్లు పెట్టి కొనేంత సాహసం అయితే చేయలేవు. ఆ మొత్తంతో పది పెద్ద సినిమాలు కొనొచ్చు. చిన్న సినిమాలైతే 50 వరకూ తీయొచ్చు. దాని ద్వారా సబ్ స్క్రైబర్లని పెంచుకోవొచ్చు. ఒక్క సినిమాపైనే ఇంత పెట్టుబడి పెట్టే బదులు.. కొత్త సినిమాలెన్నో తమ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై పెట్టుకోవొచ్చు. ఇదీ ఓటీటీల లెక్క. అందుకే.. వాళ్లెవరూ ‘వారణాసి’ గురించి ఆలోచించడం లేదు.
ఇన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వకపోతే పెద్ద రిస్క్. అందుకే రాజమౌళి కూడా ఈ విషయంపై సీరియస్ గా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఓటీటీ కోసం ఓ బిజినెస్ కట్ రెడీ చేస్తున్నట్టు టాక్. అందులోని విజువల్స్ చూసైనా సరే.. ఓటీటీలు ముందుకు వస్తాయని భావిస్తున్నారు. ఓ పెద్ద నిర్మాత ‘వారణాసి’ తరపున ఓటీటీలతో టచ్ లో ఉంటున్నారని, డీల్ ఆయనే మాట్లాడుతున్నారని తెలుస్తోంది. డీల్ సెట్టయితే ఆయనకు కొంత కమీషన్ ఉంటుంది. అదో వ్యాపారం.
‘వారణాసి’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌కే ఓటీటీలు చుక్కలు చూపిస్తున్నాయంటే మిగిలిన సినిమాల మాటేమిటో అర్థం చేసుకోవచ్చు. రాకా, డ్రాగన్, ఫౌజీ, కల్కి, స్పిరిట్.. ఇవన్నీ భారీ ప్రాజెక్టులే. వీటి మాటేమిటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకమైపోయింది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...






Comments