విశ్వగురువుగా ఎదిగే తరుణమిదే..!
- DV RAMANA

- 24 minutes ago
- 3 min read

గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ రాకపోతే హిందువుల దేవాలయాల దగ్గర అన్న ప్రసాదాలు ఆగిపోతు న్నాయి.. హిందూస్థాన్ నుంచి గల్ఫ్ దేశాలకు ఆహార పదార్థాలు వెళ్లకపోతే వారికి తిండి దొరకట్లేదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు మరొకరిపై ఆధారపడి బతుకుతున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఈ వైషమ్యాలు.. ఎందుకు ఈ గొడవలు. రంజాన్ అయినా, శ్రీరామ నవమి అయినా సారం ఒక్కటే.. శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్య పూర్వక వాతావరణం సృష్టించి, సుఖంగా బతికే ఆలోచన చేయాలి. ఇలాంటప్ప్పుడు మన పాలకులు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో మనల్ని విశ్వగురువుల్ని చేస్తాయి. ఇప్పటికే యూరోపియన్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ కుదుర్చుకున్నాం. ఇరాన్ మన రూపాయలు తీసుకోవడానికి ఎప్పుడో ఒప్పుకుని ఆయిల్ సప్లై చేస్తుంది.. ఈ ఉద్రిక్తతలు తగ్గాక భారతదేశం చెయ్యా ల్సిన, అనుసరించాల్సిన వ్యూహాలు ఎలా ఉండాలంటే.. మనవైపు యుద్ధం అనే ఆలోచనే రాకూడదు. యూరోపియన్ యూనియన్ గల్ఫ్ దేశాల సమూహం మిడిల్ ఈస్ట్ దేశాలను కలిపి చైనా, రష్యాతో భేటీ కావాలి. దానికి భారత్ అధ్యక్షత వహించాలి. అప్పుడు మాత్రమే అగ్రరాజ్యానికి ధీటుగా మనం మన ఆత్మగౌరవాన్ని నిలుపుకోగలం. 30 ఏళ్లు కష్టపడి కట్టుకున్న దుబాయ్ 10 రోజుల్లో అతలా కుతలం అయ్యింది. రష్యా ఆర్ధిక వ్యవస్థ పతనం దిశగా వెళ్తుంది. చైనా ఇప్పటి దాకా ప్రైస్ లీడర్ షిప్ చేసిన దేశం. ఈ చమురు దెబ్బకి చతికలపడిపోయింది. యూరోపియన్ సమాఖ్య ఆర్థికంగా తీవ్ర ఒడిదొకుడుల్లో ఉంది. ఇప్పుడే దేశాలన్నిటికీ సఖ్యత కుదిర్చి ఒక విశ్వశక్తిగా మనం రూపాంతరం చెందితే.. అమెరికా ఆధిపత్యాన్ని మనం ఎథికల్‌గా గండి కొట్టి.. బలమైన దేశంగా ఎదగవచ్చు. కారణం మన దగ్గర అపారమైన మేధో సంపత్తి ఉంది, వర్క్ ఫోర్స్ ఉంది, వనరులు ఉన్నాయ్, మార్కెట్ ఉంది. ఇవి మనం దుబాయ్ లాగ అవపోసన చేసుకుంటే, ప్రతి రాష్ట్రంలో ఒక దుబాయ్ తరహా వాణిజ్య శక్తిని పెంపొందించొచ్చు. మనం ఎవరి దగ్గరికి వెళ్లక్కర్లేదు. ప్రపంచానికి మనమే ఆతిధ్యం ఇచ్చే స్థానంలో ఉండబోతున్నామనే సంకేతం ప్రపంచానికి పంపాలి. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయా లను, ఆర్థిక వ్యవస్థలను పరిశీలిస్తే ఒక చేదు నిజం కనిపిస్తుంది. ‘ఏ దేశం కూడా ఒంటరిగా మనగడ సాగించలేదు.’ గల్ఫ్ దేశాల గ్యాస్ మన ఆలయాల్లో అన్నప్రసాదానికి ఇంధనం అయితే, మన రైతులు పండించే ధాన్యం గల్ఫ్ దేశాల ఆకలి తీరుస్తోంది. ఈ పరస్పర ఆధారిత సంబంధమే మానవత్వానికి మూలాధారం. ప్రపంచ ఐటీ రంగం మన మీద ఆధారపడి ఉంది. ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి మన సొంతం. ప్రపంచ దేశాలన్నీ మన దగ్గర వస్తువులు అమ్ముకోవాలని చూస్తున్నాయి. వీటన్నిటినీ సమన్వయం చేస్తూ, ప్రతి రాష్ట్రంలోనూ ఒక ‘దుబాయ్ తరహా’ వాణిజ్య హబ్‌ను నిర్మిస్తే, మనమే ప్రపం చానికి ఆతిథ్యం ఇచ్చే స్థాయికి ఎదుగుతాము. ‘లోకా సమస్తా సుఖినోభవంతు’ అనేది మన నినాదం కావాలి. చెడు మీద అడ్డుకట్ట వేస్తూ, అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ, భారతదేశం ఒక విశ్వశక్తిగా రూపాంతరం చెందాల్సిన సమయం ఇది. యుద్ధం వైపు కాకుండా, వృద్ధి వైపు మన వ్యూహ రచన సాగాలి. ప్రస్తుత ప్రపంచం ఒక సున్నితమైన దారం మీద నడుస్తోంది. ఒకవైపు యుద్ధాలు, మరో వైపు ఆర్థిక మాంద్యం భయాలు. ఇలాంటి తరుణంలో భారతదేశం కేవలం ఒక దేశంగా కాకుండా, ప్రపంచాన్ని నడిపించే ‘శాంతిదూత’గా, ‘ఆర్థిక కేంద్రం’గా మారాల్సిన అవసరం ఉంది. భారత్ ఇప్పుడు ‘తటస్థంగా’ ఉండటం కంటే, ‘న్యాయం వైపు’ నిలబడాలి. ఇరాన్‌తో రూపాయి వాణిజ్యం విజయవం తం అవ్వడం మన ఆర్థిక సార్వభౌమత్వానికి నిదర్శనం. డాలర్ మీద ఆధారపడకుండా మన సొంత కరెన్సీని గ్లోబల్ కరెన్సీగా మార్చే వ్యూహం ఇది. దుబాయ్ కేవలం 30 ఏళ్లలో ఎడారి నుంచి ప్రపంచ వాణిజ్య కేంద్రంగా మారింది. మన దగ్గర అంతకంటే ఎక్కువ వనరులు ఉన్నాయి. సిలికాన్ వ్యాలీని నడిపిస్తున్నది మన మేధస్సే. ఆ మేధస్సును మన దేశంలోనే ఉంచుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కులు గల దేశం మనది. ఈ శ్రమశక్తిని ఉత్పాదకత వైపు మళ్లించాలి. ఆంధ్రప్రదేశ్, గుజ రాత్, మహారాష్ట్ర వంటి కోస్తా తీరం ఉన్న రాష్ట్రాలను గ్లోబల్ లాజిస్టిక్ హబ్‌లుగా మార్చాలి. అమెరికా వంటి దేశాలు తరచుగా ఆంక్షల ద్వారా ఇతర దేశాలను నియంత్రించాలని చూస్తాయి. కానీ భారత్ ‘సమ్మిళిత అభివృద్ధి’ ద్వారా దేశాలను ఏకం చేయాలి. మనం ఎవరి దగ్గరికో వెళ్లడం కాదు, ప్రపంచమే మన దగ్గరికి వచ్చేలా మనల్ని మనం నిర్మించుకోవాలి. యుద్ధం అనే మాట వినిపించని, శాంతియుత, అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన ‘నవ భారతం’ సాధ్యమే. దానికి కావాల్సింది ధైర్యవంతమైన నాయకత్వం, ప్రజల మధ్య సామరస్యం. గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాలకు అవసరమైన బియ్యం, సుగంధ ద్రవ్యాలు, మాంసం, తృణధాన్యాలలో సుమారు 30-40% భారత్ నుంచే వెళ్తున్నాయి. మనం వారికి ఆహారాన్ని ఆయుధంగా కాకుండా, ‘ఆత్మీయతగా’ అందించాలి. రూపాయిలో వాణిజ్యం పెరిగితే మన విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి, రూపాయి విలువ స్థిరంగా ఉంటుంది. మన దేశంలో ఉన్నంత వైవిధ్యం మరెక్కడా లేదు. మన దగ్గర అపారమైన మేధో సంపత్తి ఉంది. భారతదేశం అంటే కేవలం ఒక దేశం కాదు, అది ఒక సంస్కృతి. మనం ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదు. ప్రపంచమే మన దగ్గరకు వచ్చేలా ‘వసుధైక కుటుంబం’ భావనతో ఎదగాలి. కలిసి సాగడం, కలిసి ఎదగడం ద్వారానే ధర్మం చెప్పిన శాంతి సమాజం ఏర్పడుతుంది.






Comments