విశ్వసుందరి కిరీటం వెనుక కొన్ని చీకటి నీడలు!!
- Guest Writer
- 1d
- 2 min read

అది మిస్ యూనివర్స్ 2025 ఫైనల్స్ రాత్రి.. మెక్సికో సుందరి, ఫాతిమా బాష్ పేరును విజేతగా ప్రకటించగానే, ఆనందోత్సాహాలు మిన్నంటాయి. కానీ ఆ మెరుపుల కిరీటం వెనుక ఒక మాజీ జడ్జి చేసిన సంచలన ఆరోపణ, యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ‘‘ఇది నకిలీ విజయం’’ అంటూ ఆయన చేసిన ప్రకటనతో, గ్లామర్ ప్రపంచంలో ఓ పెద్ద డ్రామా, పెద్ద స్కామ్ తెరపైకి వచ్చింది.
తొలి అంకం: యుద్ధభూమిలో ధైర్యవంతురాలు
పోటీ ఫైనల్స్‌కు కొన్ని వారాల ముందు నుంచే కథ మొదలైంది. ఒక ఈవెంట్‌లో, థాయ్‌లాండ్‌కు చెందిన పేజెంట్ ఎగ్జిక్యూటివ్ ఫాతిమాను ఉద్దేశించి ‘‘డమ్మీ’’ అంటూ బహిరంగంగా అవమానించాడు. తన దేశ ప్రతినిధిగా నిలబడిన ఆమె, ఆ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకోకుండా, ‘‘మా గౌరవాన్ని కాపాడండి.. మీ సమస్యలు సంస్థతో ఉంటే, అది నా తప్పు కాదు..’’ అంటూ దీటుగా బదులిచ్చి ధైర్యంగా నిష్క్రమించింది.. తనపై జరిగిన దాడిని తిప్పికొట్టిన ఫాతిమాకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించింది.
రెండో అంకం: జడ్జి నిష్క్రమణ, సంచలన ఆరోపణలు
పోటీ తుది దశకు చేరుకుంటున్న సమయంలో, జ్యూరీ సభ్యులలో ఒకరైన, అంతర్జాతీయ పియానిస్ట్ ఒమర్ హర్ఫౌచ్ అకస్మాత్తుగా రాజీనామా చేశాడు.. అసలు కథ మొదలైంది ఇక్కడే..
ఫాతిమా బాష్ కిరీటం గెలిచిన కొద్ది గంటల్లోనే, ఒమర్ హర్ఫౌచ్ సోషల్ మీడియాలో నిప్పులు చెరిగాడు. ఆయన మాటల్లో..
‘‘మిస్ మెక్సికో నకిలీ విజేత.. ఆమెకు గెలిచే అర్హత లేదు’’
ఆయన ఆరోపించినదాని ప్రకారం.. ఈ కిరీటం వెనుక ఒక వ్యాపార ఒప్పందం దాగి ఉంది. మిస్ యూనివర్స్ సంస్థ యజమాని రాహుల్ రోచాకు, విజేత ఫాతిమా బాష్ తండ్రికి మధ్య ఉన్న వ్యాపార సంబంధాల కారణంగానే ఈ ఫలితం ముందే నిర్ణయించబడిరది.
‘‘ఫాతిమాకే ఓటు వేయండి, ఇది మన వ్యాపారానికి మంచిది’’ అంటూ యజమాని తనను ఒత్తిడి చేశారని, అందుకే తాను ఆ ‘‘ముందుగా నిర్ణయించిన డ్రామా’’లో భాగం కాకూడదనే ఉద్దేశంతో రాజీనామా చేశానని హర్ఫౌచ్ ప్రకటించాడు. అంతేకాదు, ఫైనల్స్‌కు 24 గంటల ముందే మిస్ మెక్సికో ఈ కిరీటం గెలుస్తుందని తాను ఇంటర్వ్యూలలో చెప్పగలిగానని, ఎందుకంటే ఈ తెరవెనుక ఒప్పందం గురించి తనకు తెలుసని స్పష్టం చేశాడు.
మూడో అంకం: సంస్థ వివరణ.. ఆరోపణల ఖండన
ఈ ఆరోపణలతో ప్రపంచం దిగ్భ్రాంతి చెందగా, మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ వెంటనే రంగంలోకి దిగింది. వారు ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిరచారు. సహజమే కదా.. విజేత ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సంస్థ నియమ నిబంధనల ప్రకారమే జరిగిందని ఆరోపణల్ని కొట్టిపారేసింది సంస్థ.
ఒకవైపు ఆరోపణలు, మరోవైపు సంస్థ ఖండనల మధ్య, ఈ వివాదం గ్లామర్ ప్రపంచంలో అత్యంత హాట్ టాపిక్‌గా నిలిచింది. ఫాతిమా బాష్ కిరీటాన్ని ధరించినప్పటికీ, ఆ విజయం వెనుక నైతికత అనే ప్రశ్న అప్పటి నుంచి వేలాడుతూనే ఉంది.
నిజానికి ఫ్యాషన్, పేజెంట్ ప్రపంచాలు పైకి ఎంతటి గ్లామర్‌తో, పారదర్శకతతో కనిపించినా, తెర వెనుక పెట్టుబడి, స్పాన్సర్‌షిప్‌లు, వ్యాపార ప్రయోజనాలు చాలా బలంగా పనిచేస్తాయి. అంతా మాయ.. అంతా దందా..
ఆర్థిక బంధాల ప్రభావం ఎందుకు ఉంటుంది?
భారీ పెట్టుబడులు: మిస్ యూనివర్స్ వంటి పోటీలు నిర్వహించడానికి, విజేతను గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రమోట్ చేయడానికి వందల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం. ఈ పెట్టుబడులు ఇచ్చే స్పాన్సర్‌షిప్ కంపెనీలు, లేదా సంస్థ యజమానులు తమ వ్యాపార భాగస్వాములకు చెందినవారికి ప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం సహజం.
దేశాల బ్రాండిరగ్: ఒక్కో దేశం తమ ప్రతినిధిని గెలిపించుకోవడానికి భారీగా ఖర్చు చేస్తాయి. పేజెంట్ శిక్షణ, దుస్తులు, ప్రమోషన్స్ కోసం పెట్టే ఖర్చు అంతా ఏదో ఒక విధంగా ఆర్థిక చక్రంలో భాగమే.
రాజకీయాలు: కొన్నిసార్లు, కొన్ని దేశాల మధ్య ఉన్న ఆర్థిక లేదా రాజకీయ సంబంధాలు కూడా ఓటింగ్ ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
వ్యాపార భాగస్వాములు: ఈ వివాదంలో జడ్జి ఆరోపించినట్లుగా, సంస్థ యజమాని, విజేత కుటుంబం మధ్య వ్యాపార భాగస్వామ్యం ఉంటే, అది కచ్చితంగా తుది ఫలితంపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది.
ఈ ప్రత్యేక వివాదంలో, మాజీ జడ్జి ఒమర్ హర్ఫౌచ్ ఆరోపణలు కూడా సరిగ్గా ఈ ఆర్థిక బంధాల ప్రభావం గురించే కావడంతో, చాలా మంది ఈ అనుమానాన్ని నిజమని నమ్ముతున్నారు.
ఇంతకీ ఆమె ప్రొఫైల్ ఏమిటి..?
జననం: 1999, జూలై 29
వయస్సు: 2025 నాటికి 26 సంవత్సరాలు
పుట్టిన ప్రదేశం: కొయాట్జాకోల్కోస్, వెరాక్రూజ్, మెక్సికో
విద్య.. టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్
వృత్తి: టెక్నాలజీ నిపుణురాలు, మోడల్, మహిళల విద్య కోసం పనిచేసే ఒక ఫౌండేషన్‌కు సహ-వ్యవస్థాపకురాలు కూడా..
పేజెంట్ టైటిల్స్: మిస్ మెక్సికో 2024, మిస్ యూనివర్స్ 2025
- ముచ్చట సౌజన్యంతో..










Comments