వదల బొమ్మాళీ వదలా..!
- Prasad Satyam
- Feb 25
- 1 min read
పాత ప్రాంతాల్లో అదుపులోకి వస్తున్న డయేరియా
అదే సమయంలో కొత్త ప్రాంతాల్లో వెలుగుచూస్తున్న కేసులు
మంగళవారం రాత్రి నుంచి కలెక్టర్ స్వయం పర్యవేక్షణ
ఇతర కారణాలతోనే మరణాలని కప్పిపుచ్చే యత్నాలు?

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలో మూడు రోజుల క్రితం డయేరియా బారినపడి ఆస్పత్రుల పాలైనవారు క్రమంగా కోలుకుంటున్నారు. కానీ మరోవైపు నగరంలో ని మిగిలిన ప్రాంతాలకు కూడా డయేరియా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గోల్కొండరేవు రోడ్డు, మొండేటివీధి, మంగువారితోట, దమ్మలవీధి ప్రాంతాల మధ్యలో డయేరియా(అతిసారం) ప్రబలగా.. ఇప్ప్పుడు వాటి శివారు ప్రాంతాల్లో కూడా అటువంటి కేసులు నమోదవుతున్నాయి. పాత ప్రాంతాల్లో పూర్తిస్థాయి సర్వే ఇంకా జరగకముందే కొత్త ప్రాంతాల నుంచి బాధితులు ఆస్పత్రులకు వెళ్తున్నారు. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బస్వా లక్ష్మి చిన్నకోడలు బస్వా లావణ్యలో డయేరియా లక్షణాలు కనిపించగా మంగళవారం రాత్రి 12 గంటలకు ఆ సమాచారం ఫోన్ ద్వారా కలెక్టర్‌కు అందింది. దీంతో ఆయనే స్వయంగా అంబులెన్స్‌కు ఫోన్ చేసి కిమ్స్‌కు తరలించే ఏర్పాట్లు చేశారు. మరోవైపు మంగువారితోట, మొండేటివీధుల మధ్యలో ఉన్న సుబ్బలక్ష్మి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న శిల్లా కుమారిలో మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో డయేరియా లక్షణాలు బయటపడటంతో ఆమెను అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆరఎంపీ వైద్యుడు వాసు ఆగమేఘాల మీద కిమ్స్‌కు తరలించారు. ఒకవైపు డయేరియా కంట్రోల్‌లోకి వస్తున్నట్టు కనిపిస్తున్నా.. మరోవైపు కొత్త పేషెంట్లు ఆస్పత్రుల్లో చేరుతుండటంపై కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో కిన్నెర థియేటర్ జంక్షన్ వద్ద నిలబడి కలెక్టర్ చాలాసేపు పరిసర ప్రాంతాల్లో డయేరియా కేసులను మానిటర్ చేశారు. మంగళవారమే ద్వారకానగర్ కాలనీలో సదాశివుని నర్సింగరావు అనే వ్యక్తి ఈ వ్యాధి లక్షణాలతోనే మరణించారు. అయితే ఈ మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు సరికదా.. పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించి, మతదేహాన్ని బుధవారం ఉదయం అప్పగించారు. సాధారణంగా ఈ రోజుల్లో బీపీ, షుగర్ లేకుండా ఎవరూ ఉండరు. దీంతో డయేరియా మరణాలన్నింటినీ ఏదో ఒక కారణం చూపి కప్పిపుచ్చాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. డయేరియా కేసులు పెరుగుతుండటంతో దమ్మలవీధిలో ఉన్న వండాన్న శిమ్మన్న ఆస్పత్రిని కూడా ఒక చికిత్సా కేంద్రంగా కలెక్టర్ గుర్తింపునిచ్చారు. ఇక్కడికి ప్రభుత్వ వైద్యులను, ఇతర సిబ్బందిని డిప్యూట్ చేశారు. డయేరియా కేసులు ఉన్నాయని తేలగానే ముందుగా అక్కడికి చేరుకున్న కలెక్టర్ దీనిపై విచారణ జరుపుతుండగానే వరుసగా కేసులు వస్తుండటంతో స్థానికంగా ఆస్పత్రి అందుబాటులో ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.






Comments