top of page

శంబాల.. మెప్పించే మాయా ప్రపంచం

  • Guest Writer
  • Dec 25, 2025
  • 3 min read

కెరీర్‌ ఆరంభంలో ప్రేమ కావాలి.. లవ్లీ చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు ఆది సాయికుమార్‌.. ఆ తర్వాత ట్రాక్‌ తప్పాడు. తన సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ కావడమే గగనమైపోయింది. ఇలాంటి టైంలో తన కొత్త చిత్రం ‘శంబాల’ మాత్రం ప్రామిసింగ్‌ గా కనిపించింది. ఆకట్టుకునే ప్రోమోలతో ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

శంబాల అనే ఊరిలో ఉల్క పడడంతో అక్కడి జనాల్లో కలకలం రేగుతుంది. దాని వల్ల ఊరికి అరిష్టమని భావిస్తారు. దాని ముప్పు తప్పించుకోవడానికి పూజలు, మంత్రాలనే ఆశ్రయిస్తారు ఆ ఊరి జనం. ఐతే ఉల్క గురించి పరిశోధన చేయడానికి ఆ ఊరికి వస్తాడు శాస్త్రవేత్త అయిన విక్రమ్‌ (ఆది సాయికుమార్‌). ప్రతిదీ సైన్సుకు ముడిపెట్టి చూసే అతడికి.. శాస్త్రాన్ని నమ్మే ఊరి జనానికి మధ్య ఘర్షణ మొదలవుతుంది. అదే సమయంలో ఊరిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని కొందరు ప్రాణాలు కోల్పోతారు. దీంతో ఊరి జనంతో విక్రమ్‌ గొడవ ఇంకా పెద్దదవుతుంది. మరి విక్రమ్‌ నమ్మకం గెలిచిందా.. ఊరి జనం మాటే నెగ్గిందా.. ఊరిలో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి... విక్రమ్‌ ఈ మరణాలకు కారణమేంటో కనిపెట్టి వాటికి అడ్డుకట్ట వేయగలిగాడా.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

సైంటిఫిక్‌ టెంపర్మెంట్‌ ఉన్న హీరో.. మూఢ నమ్మకాలు రాజ్యమేలే ఒక చోటికి వెళ్లి అక్కడ జరిగే అనూహ్య పరిణామాల గుట్టు విప్పడం అన్నది తెలుగు తెరపై చాలాసార్లు చూసిన కథే. కానీ ఇదే లైన్‌ మీద భిన్న నేపథ్యాల్లో సినిమాలు వచ్చాయి. ఐతే సైన్సుని.. శాస్త్రాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ సినిమా తీసి మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. ‘కార్తికేయ’ లాంటి చాలా కొన్ని సినిమాలు మాత్రమే ఈ విషయంలో విజయవంతం అయ్యాయి. ‘శంబాల’ కూడా ఇలాంటి ప్రయత్నంలాగే మొదలవుతుంది. కానీ ఒక దశ దాటాక ఈ బ్యాలెన్సింగ్‌ యాక్ట్‌ నుంచి బయటికి వచ్చేసి పూర్తిగా ఒక సైడ్‌ తీసుకుంటుంది. ‘విరూపాక్ష’ తరహాలో ఒక సగటు మిస్టిక్‌ థ్రిల్లర్‌ రూట్‌ తీసుకుని ఆ కోణంలోనే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇలా కథ స్వరూపం మారడం ఒకింత నిరాశ కలిగించినా.. ఎప్పుడూ చూసే రొటీన్‌ చిత్రాల నుంచి ఉపశమనంలా ఒక భిన్నమైన అనుభూతిని కలిగించడంలో ‘శంబాల’ విజయవంతం అయింది. ఇందులో లోపాలు లేవని కావు.. కానీ వాట్‌ నెక్స్ట్‌ అనే ప్రశ్నతో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించడంలో ‘శంబాల’ సక్సెస్‌ అయింది. ఒక డిఫరెంట్‌ మిస్టిక్‌ థ్రిల్లర్‌ చూడాలనుకునేవారికి ఇది మంచి ఛాయిసే.

‘శంబాల’ ట్రైలర్‌ చూసి కథ మీద ఒక అంచనా పెట్టుకుంటాం. ఒక గ్రామంలో ఉల్క పడితే దాని గురించి పరిశోధన చేయడానికి వెళ్లే హీరోకు.. మూఢ నమ్మకాలను నమ్మే జనానికి మధ్య ఘర్షణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే సంకేతాలను ప్రోమోలు ఇచ్చాయి. ఐతే దీన్ని దాటి సినిమాలో వేరే ఒక ఎలిమెంట్‌ ఉంటుంది. అదే ఈ సినిమాను డ్రైవ్‌ చేస్తుంది. దాని చుట్టూ వచ్చే సన్నివేశాలే సినిమాకు అత్యంత కీలకం. కథను మొదలుపెట్టిన తీరు.. హీరో పాత్రను ఎస్టాబ్లిష్‌ చేసిన విధానం చూసి.. కథనం ఇలా నడవొచ్చు అని ఒక అంచనా పెట్టుకుంటాం. కానీ దర్శకుడు మధ్యలో ఆ ట్రాక్‌ నుంచి బయటికి వచ్చేశాడు. దేవుడు లేదు దయ్యం లేదు అని బలంగా నమ్మే.. ప్రతిదాంట్లో లాజిక్‌ వెతికే.. ప్రతిదీ సైన్సుతో ముడిపడి ఉంటుందని భావించే హీరో.. ఒక సన్నివేశంలో చేతులు జోడిరచి దండం పెట్టి.. విభూది నుదురుకు రాసుకుని పరిణామం చెందుతాడు. అప్పటి వరకు సినిమా ఒకలా నడుస్తుంది. ఆ సన్నివేశం తర్వాత ‘శంబాల’ను చూసే కోణం మారిపోతుంది. సగం సినిమా వరకు ‘కార్తికేయ’ను తలపించే ‘శంబాల’.. ఆ తర్వాత మాత్రం ‘విరూపాక్ష’ రూట్‌ తీసుకుంటుంది. సైన్సుని పక్కకు నెట్టి శాస్త్రం డ్రైవర్‌ సీట్‌ తీసుకున్నాక ఆ కోణంలోనే సినిమాను చూడడం మొదలుపెడతాం. అలా ప్రిపేరయ్యాకే ‘శంబాల’ మరింతగా ఎంగేజ్‌ చేస్తుంది.

కథనం కొంచెం ఎగుడుదిగుడుగా అనిపించినా.. చాలా వరకు ఎంగేజింగ్‌ గా అనిపించే కథనంతో.. కొత్త సన్నివేశాలతోనే ‘శంబాల’ను నడిపించాడు దర్శకుడు యుగంధర్‌ ముని. సినిమాలో చాలా వరకు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను రేకెత్తించడంలో అతను విజయవంతం అయ్యాడు. లాజిక్కుల గురించి ఎక్కువ ఆలోచించకుంటే ఈ సినిమాను బాగానే ఎంజాయ్‌ చేయొచ్చు. పురాణాలతో ముడిపెట్టి క్రియేట్‌ చేసిన ఫ్లాష్‌ బ్యాక్‌ ఆకట్టుకుంటుంది. చిన్న పాపతో ఎమోషన్‌ వర్కవుట్‌ అయింది. ద్వితీయార్ధానికి అదే ప్రాణం. ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌ సినిమాలో మేజర్‌ హైలైట్‌. తొలి గంటలో ఓ మోస్తరుగా అనిపించే సినిమా ప్రి ఇంటర్వెల్‌ నుంచి పుంజుకుంటుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ద్వితీయార్ధం మీద ఆసక్తి పెంచుతుంది. సెకండాఫ్‌ రేసీగా సాగుతూ ఉత్కంఠ రేకెత్తిస్తుంది. క్లైమాక్స్‌ మీద చాలా అంచనాలు పెట్టుకుంటాం కానీ.. దాన్ని హడావుడిగా ముగించేసినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌ గా చెప్పాలంటే ‘శంబాల’లో కొన్ని లోపాలున్నప్పటికీ.. ఇదొక భిన్నమైన అనుభూతిని పంచుతుంది. లాజిక్కుల సంగతి పక్కన పెట్టేస్తే.. వాట్‌ నెక్స్ట్‌ అంటూ ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీని రేకెత్తించి రెండున్నర గంటలు కూర్చోబెట్టడంలో ‘శంబాల’ విజయవంతమైంది.

నటీనటులు -పెర్ఫార్మెన్స్‌ :

చాలా ఏళ్లుగా ఆది సాయికుమార్‌ సినిమాలను ఓటీటీలోనే చూస్తూ అతణ్ని అభిమానిస్తున్న వాళ్లు.. ‘శంబాల’ను థియేటర్లలో చూసి బాగానే ఎంజాయ్‌ చేయొచ్చు. అతడి అభిమానులకు ఈ సినిమా సంతృప్తినిస్తుంది. విక్రమ్‌ పాత్రలో ఆది బాగానే ఒదిగిపోయాడు. కొన్నిచోట్ల ఆ క్యారెక్టర్‌ ప్యాసివ్‌ అయిపోతున్న ఫీలింగ్‌ కలిగినా.. ఓవరాల్‌ గా మంచి ఇంపాక్టే వేసింది. పాత్రకు తగ్గట్లు ఇంటెన్స్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు ఆది. తన లుక్‌.. పెర్ఫామెన్స్‌ రెండూ ఆకట్టుకుంటాయి. దేవి పాత్రలో ఒక దశ వరకు అర్చన అయ్యర్‌ మామూలుగా అనిపించినా.. ఆ పాత్రలో ట్విస్ట్‌ వచ్చాక ఆమెను చూసే కోణం మారుతుంది. స్వామీజీ పాత్రకు మహదేవన్‌ సరిపోయాడు. లక్ష్మణ్‌ మీసాల.. రవివర్మ కీలక పాత్రల్లో రాణించారు. మంచి నటిగా పేరున్న స్వశిక నుంచి పెద్దగా పెర్ఫామెన్స్‌ ఆశించలేం. ఆమె తన గ్లామర్‌ తోనే ఆకట్టుకుంది. సీరియల్‌ నటుడు ఇంద్రనీల్‌.. మధుసూదన్‌ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. సిజ్జు.. హర్షవర్ధన్‌.. వీళ్లంతా మామూలే.

సాంకేతికవర్గం - పనితీరు :

థ్రిల్లర్‌ చిత్రాలకు ఇంటెన్స్‌ బీజీఎం అందిస్తాడని పేరున్న శ్రీ చరణ్‌ పాకాల మరోసారి తనదైన ముద్ర వేశాడు. తన పాటలు ఓ మోస్తరుగా అనిపించినా.. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం అదిరిపోయింది. కొన్ని చోట్ల లౌడ్‌ అనిపించినా.. ఓవరాల్‌ గా బీజీఎం ఆకట్టుకుంటుంది. పవన్‌ బంగారి ఛాయాగ్రహణం కూడా బాగుంది. విజువల్స్‌ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు కొన్ని చోట్ల ఇంకా మెరుగ్గా ఉండాల్సింది కానీ.. ఓవరాల్‌ గా చూస్తే ఆది మార్కెట్‌ స్థాయికి మించే ఖర్చు పెట్టారు. రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ యుగంధర్‌ ముని.. తన ప్రతిభను చాటుకున్నాడు. ప్రథమార్ధాన్న ఇంకొంచెం బిగితో తీర్చిదిద్దుకోవాల్సింది. నిలకడ చూపించాల్సింది. కానీ కథకు కీలకమైన ఎపిసోడ్లను అతను మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. ప్రి ఇంటర్వెల్‌ నుంచి సినిమాను అతను ఉత్కంఠభరితంగా తీసుకెళ్లాడు. ఓవరాల్‌ గా ప్రేక్షకులకు అతను కొంచెం భిన్నమైన అనుభూతిని అందిచండంలో విజయవంతం అయ్యాడు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page