top of page

సైక్‌ సిద్దార్థ.. కిక్కు సరిపోలేదు

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • Jan 3
  • 3 min read

హీరో పాత్రలే కాక క్యారెక్టర్‌.. విలన్‌ రోల్స్‌ చాలానే చేసినా సరైన బ్రేక్‌ దొరక్క ఇబ్బంది పడుతున్నాడు నందు. ఇప్పుడతను వరుణ్‌ రెడ్డి అనే కొత్త దర్శకుడితో జట్టు కట్టి సైక్‌ సిద్దార్థ సినిమా చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నందు కోరుకున్న బ్రేక్‌ అందించిందా? తెలుసుకుందాం పదండి.

కథ:

సిద్దార్థ (నందు) ఫ్రెండు చేతిలో వ్యాపారంలో.. అమ్మాయి చేతిలో ప్రేమలో విఫలమై.. జీవితం మీద ఆశలు కోల్పోయి.. ఒక గోల్‌ అంటూ లేకుండా ఆవారాగా తిరుగుతుంటాడు. అప్పుడే తన ఇంటి కింద ఉండే శ్రావ్యతి అనుకోకుండా అతడికి పరిచయం అవుతుంది. ఆమె భర్త నుంచి విడిపోయి కొడుకుతో కలిసి బతుకుతుంటుంది. శ్రావ్యతో సిద్దార్థ పరిచయం ఎక్కడిదాకా వెళ్ళింది.. ఆ తర్వాత తన జీవితంలో ఎలాంటి ఎలాంటి మార్పులు వచ్చాయి.. తన లైఫ్‌ చక్కబడిరదా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

‘అర్జున్‌ రెడ్డి’ తర్వాత హీరో పాత్రను టిపికల్‌ గా తీర్చిదిద్ది.. కొంచెం క్రేజీగా సీన్లు రాసి.. బోల్డ్‌ సీన్లు-డైలాగులతో ప్రేక్షకులను మెప్పించాలని చాలామంది ప్రయత్నించి చూశారు. కానీ అవి చాలా వరకు మిస్‌ ఫైర్‌ అయ్యాయి. సందీప్‌ రెడ్డిలా ఒరిజినల్‌ గా సినిమాను తీర్చిదిద్దడం అంత తేలిక కాదని ఆ సినిమాలు రుజువు చేశాయి. ఇప్పుడు శ్రీ నందు హీరోగా కొత్త దర్శకుడు వరుణ్‌ రెడ్డి కూడా ఇలాంటి ప్రయత్నమే చేశాడు. ‘సైక్‌ సిద్దార్థ’ ప్రోమోలు చూసినపుడు ఇది ‘అర్జున్‌ రెడ్డి’కి అనుకరణలాగా అనిపిస్తే అందులో ఆశ్చర్యమేమీ లేదు. హీరో నగ్నంగా పరుగెత్తడాలు.. ఇంటిమేట్‌ సీన్లు.. బూతు డైలాగులు.. ఇలా చాలా అంశాల్లో ‘అర్జున్‌ రెడ్డి’తో పోలికలు కనిపించాయి. ఐతే ‘అర్జున్‌ రెడ్డి’ ఆడిరది వాటి వల్ల కాదు. అందులో ఇంటెన్స్‌ స్టోరీ.. మైండ్‌ బ్లోయింగ్‌ క్యారెక్టరైజేషన్‌.. సరికొత్త సన్నివేశాలు ఉంటాయి. ‘సైక్‌ సిద్దార్థ’లో కొన్ని మంచి సన్నివేశాలున్నాయి.. టేకింగ్‌ భిన్నంగా ఉంటుంది.. కొత్త తరహా సినిమా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది. కానీ ఇందులో చెప్పుకోదగ్గ కథ లేదు. ముఖ్య పాత్రల చిత్రణ కూడా సాధారణంగానే అనిపిస్తుంది. ‘సైక్‌ సిద్దార్థ’ జస్ట్‌ ఒక టైంపాస్‌ సినిమాలా అనిపిస్తుందే తప్ప.. బలమైన ఇంపాక్ట్‌ అయితే వెయ్యలేకపోయింది.

నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న.. విపరీత ప్రవర్తనతో సాగే హీరో పాత్రలను ఇప్పటి యువత బాగా ఇష్టపడుతున్నారు. తెరపై హీరోలు ఎంత క్రేజీగా ప్రవర్తిస్తే.. వాళ్లకు అంత కిక్కు అన్నమాట. కానీ ఆ ప్రవర్తన క్రేజీగా అనిపించాలి కానీ.. ఇరిటేటింగ్‌ గా అనిపించకూడదు. ‘సైక్‌ సిద్దార్థ’లో నందు చేసిన సిద్దార్థ పాత్ర చాలా చోట్ల అసహనమే కలిగిస్తుంది. తాను ప్రేమించిన అమ్మాయి డబ్బు కోసం వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని స్పష్టంగా అర్థమయ్యాక కూడా.. ఆమెను ఆకర్షించే ప్రయత్నం చేయడం.. తనతో మళ్లీ శ ృంగారం జరపడం.. తన దగ్గర డబ్బు లేదన్న వాస్తవం తెలిసి ఆమె వెళ్లిపోతుంటే తెగ ఫీలైపోవడంలో ఔచిత్యమేంటో అర్థం కాదు. హీరో క్రేజీగా ఉన్నాడు.. వింతగా ప్రవర్తిస్తున్నాడంటే దానికి బలమైన కారణం చూపిస్తేనే.. ప్రేక్షకులు ఆ క్యారెక్టర్‌ తో రిలేటవుతారు. కానీ ఇందులో హీరో విపరీత ప్రవర్తనకు సరైన కారణాలేమీ కనిపించవు. ఊరికే అతడి ఒంటిమీద బట్టలు ఊడిపోతుంటాయి. ఎక్కడ పడితే అక్కడ అర్ధనగ్నంగా పరిగెత్తేస్తుంటాడు. అర్థం లేకుండా అరుస్తుంటాడు. అతడి అరుపులనే భరించలేకుంటే.. మళ్లీ వాటికి సబ్‌ టైటిల్స్‌ వేయడం.. అతడి మాటలకు తగ్గ ద ృశ్యాలను మీమ్స్‌ నుంచి తీసుకొచ్చి వేయడం.. ఇదంతా ఏంటో అర్థం కాదు.

ఐతే హీరోది క్రేజీ క్యారెక్టర్‌ అని ఎస్టాబ్లిష్‌ చేయడం కోసం పెట్టిన ఎపిసోడ్లు అన్నీ అయిపోయే వరకు ‘సైక్‌ సిద్దార్థ’ బాగా అసహనానికి గురి చేస్తుంది కానీ.. హీరో జీవితంలోకి హీరోయిన్‌ వచ్చాక సన్నివేశాలు బాగుంటాయి. కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఆహ్లాదకరంగా సాగే ఎపిసోడ్లతో మిడిల్‌ పోర్షన్లు బాగానే ఎంగేజ్‌ చేస్తాయి. కానీ ఈ కథను దర్శకుడు సరిగా ముగించలేకపోయాడు. కథలో వచ్చే మలుపు కానీ.. క్లైమాక్స్‌ కానీ ఏమంత ప్రత్యేకంగా అనిపించవు. ‘‘సినిమాను భిన్నంగా ముగిస్తే మీకు నచ్చదు.. రొటీన్‌ ఎండిరగే కావాలి’’ అంటూ ప్రేక్షకుల మీద పంచులు వేయడం బాగుంది కానీ.. టేకింగ్‌ కొంచెం భిన్నంగా ఉందన్న మాటే కానీ.. ఈ కథలో అంత కొత్తదనమేమీ లేదు. ఈ స్టోరీ పరిధి కూడా చిన్నదిగా అనిపిస్తుంది. కొంచెం భిన్నంగా అనిపించే టేకింగ్‌ తో పెద్ద షార్ట్‌ ఫిలిం చూస్తున్న ఫీలింగ్‌ కలిగిస్తుంది ‘సైక్‌ సిద్దార్థ’. కొన్ని ఎపిసోడ్లు.. పెరామెేన్సుల వరకు ఓకే అనిపించినా.. ఓవరాల్‌ గా అనుకున్నంత మేర మెప్పించలేకపోయిందీ చిత్రం.

నటీనటులు- పెర్ఫార్మెన్స్‌ :

సిద్దార్థ పాత్ర కోసం శ్రీ నందు చాలా కష్టపడ్డాడు. అతను చాలా ఇన్వాల్వ్‌ అయి ఈ పాత్ర చేసినట్లు అర్థమవుతుంది. లుక్‌ దగ్గర్నుంచి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకున్నాడు. నందు కెరీర్లో ఈ పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది. యామిని భాస్కర్‌ చక్కగా నటించింది. తన హావభావాలు ఆకట్టుకుంటాయి. బోల్డ్‌ క్యారెక్టర్లో ప్రియాంక రెబెకా కూడా బాగానే చేసింది. హీరో ఫ్రెండు పాత్రలో చేసిన సింహా ఓకే అనిపించాడు. హీరోయిన్‌ కొడుకు పాత్రలో చేసిన చిన్న పిల్లాడు మెప్పించాడు. సుకేష్‌ రెడ్డి పాత్రకు తగ్గట్లుగా నటించాడు.

సాంకేతిక వర్గం - పనితీరు :

‘సైక్‌ సిద్దార్థ’కు టెక్నికల్‌ సపోర్ట్‌ బాగానే లభించింది. స్మరణ్‌ సాయి ట్రెండీగా అనిపించే పాటలు ఇచ్చాడు. లిరిక్స్‌ సరదాగా రాశారు. పాటలు వేరుగా అనిపించకుండా.. సినిమాలో బాగా సింక్‌ అయ్యాయి. ప్రకాష్‌ రెడ్డి ఛాయాగ్రహణం బాగుంది. సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు. రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ వరుణ్‌ రెడ్డిలో విషయం ఉంది. కొన్ని సన్నివేశాలను బాగా డీల్‌ చేశాడు. తన టేకింగ్‌ బాగుంది. కానీ తన రైటింగ్‌ ఇంకా బలంగా ఉండాల్సింది. కథనంలో బిగి తగ్గింది. తక్కువ నిడివి ఉన్న సినిమాలో వ ృథా సన్నివేశాలు ఎక్కువయ్యాయి. కథాకథనాల మీద ఇంకొంచెం కసరత్తు చేసి ఉండాల్సింది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page