సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్
- Guest Writer
- 3 days ago
- 4 min read

బలగం, కోర్ట్ లాంటి సినిమాలు చూసినవారికి ప్రియదర్శిలో నెక్స్ట్ లెవెల్ నటుడు కనిపిస్తాడు. కెరీర్ ప్రారంభంలో అతడిని కమెడియన్ రోల్స్‌లోనూ, క్యారెక్టర్ రోల్స్ లోనూ ఎక్కువగా వాడుకున్నారు. తనకు ఇచ్చిన పాత్ర ఏదైనా సరే అందులో ఒదిగిపోయి నటించి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొంది తనకంటూ ఒక ప్రత్యేక ఆడియన్స్ ను సృష్టించుకున్నాడు ప్రియదర్శిఎంతలా అంటే ప్రియదర్శి కోసం సినిమా చూడొచ్చు అన్న బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. రొటీన్ హీరోల మాదిరి కమర్షియల్ హీరోయిజానికి పోకుండా తనదైన స్టైల్ లో సపోర్టింగ్ రోల్స్ లో మెప్పిస్తూ వచ్చాడు. అయితే అతడు అంతకుముందు చేసిన సినిమాలన్నీ ఒకెత్తు. బలగం సినిమాలో చేసిన క్యారెక్టర్ ఒకెత్తు. నటుడిగా అతడ్ని ఒక మెట్టు పైకి నిలిపిన చిత్రం బలగం. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలు చేసినా అతడికి పెద్దగా పేరు తీసుకురాలేదు. మళ్ళీ ఇప్పుడు సుయోధన అనే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రియదర్శి హీరోగా పూర్తి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రావడం అంటే ఎలా ఉంటుందో అన్న సందేహాలు, క్యూరియాసిటి ఇండస్ట్రీలో ఏర్పడ్డాయి. మరి ఇండస్ట్రీ అంచనాలకు తగినట్టుగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో ప్రియదర్శి నటించి మెప్పించగలిగాడా? అనేది ఇప్పుడు చూద్దాం
కథేంటంటే?
మద్దులూరి ప్రకాష్ (సాయికుమార్) రంగస్థల నటుడు. అందులోనూ అతడికి దుర్యోధన వేషం కట్టడం అంటే ప్రాణం. అందుకే స్టేజి నాటకాల్లో అతడు దుర్యోధనుడి వేషాలు వేస్తుంటాడు. అలా ఒకసారి ప్రకాష్ స్టేజి నాటకంలో దుర్యోధనుడి వేషం వేసి డైలాగులు చెప్పినప్పుడు చిన్నపిల్లవాడు అయిన అతడి కొడుకు వరుణ్ (ప్రియదర్శి) భయపడతాడు. అతడి తల్లి రాధమ్మ, ప్రకాష్‌లు వరుణ్‌ను డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే, వరుణ్ సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని, అందుకే అతడు దుర్యోధన వేషం చూసి భయపడుతున్నాడని చెప్పడంతో కొడుకు గురించి ప్రకాష్ నాటకాలకు స్వస్తి చెప్తాడు. అయితే తనకు ఆపద ముంచుకొస్తున్నప్పుడు వరుణ్‌కి పదేపదే సుయోధన అనే పేరు వినిపిస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు హాని తలపెట్టే వ్యక్తులు అతడికి దుర్యోధన అవతారంలో కనిపిస్తారు. ఇదిలా ఉండగా వరుణ్ పెద్దవాడు అయి సొంతంగా సౌండ్ డిజైనర్ స్టూడియో పెట్టుకుని సినిమాలకు సౌండ్ డిజైన్స్ అందిస్తూ ఉంటాడు. అతడికి సినిమాలకు కాస్ట్యూమ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంహితతో (ధ్రిషిక చందర్ ) పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. అయితే ఆమె చేస్తున్న ఓ డెమోలో నటించిన ఒక వ్యక్తి (బిత్తిరి సత్తి) వరుణ్‌కి దుర్యోధనుడిలా కనిపించడంతో మళ్ళీ అతడికి పాత రోగం తిరగపెడుతుంది. అదే సమయంలో వరుణ్ తండ్రి ప్రకాష్ హత్యకు గురి అవుతాడు. ఆ హత్యా నేరం వరుణ్ మీద పడటంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. ప్రకాష్‌ను ఎవరు హత్య చేస్తారు? వరుణ్ ఈ కేసు నుంచి ఎలా బయటపడతాడు? తనకి ఆపద ముంచుకొస్తున్నప్పుడు వరుణ్‌కి సుయోధన అనే పదం వినపడటానికి, దుర్యోధనుడి ఆకారం కనపడటానికి కల అసలు కారణం ఏంటి? అనేది మిగిలిన కథనంలో తెలుస్తుంది
ఎలా ఉంది?
సుయోధన మూవీ పూర్తిగా సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.ఇందులో కథానాయకుడికి చిన్నప్పుడు ఏర్పడే సైకలాజికల్ డిజార్డర్ ఆధారం చేసుకుని కథ అల్లుకున్నారు. అతడికి ఆపద ముంచుకొస్తున్నప్పుడు సుయోధన అనే పేరు వినపడటానికి, దుర్యోధనుడి ఆకారం కనపడటానికి వెనుక కల అసలు కారణాన్ని ప్రీ క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా దర్శకుడు కథనాన్ని నడిపించిన తీరు బాగుంది. ఒకానొక దశలో ప్రకాష్ (సాయికుమార్) కూడా వరుణ్‌కి (ప్రియదర్శి) దుర్యోధనుడిగా కనిపించడంతో విలన్ అతడే అయి ఉండవచ్చు అనే హింట్ ప్రేక్షకులకు అందుతుంది కానీ అంతలోనే నాటకాల ట్రూపు వ్యక్తితో కథ నడిపించి ప్రేక్షకుల మైండ్ డైవర్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ప్రీ క్లైమాక్స్ వరకు ప్రియదర్శి గతం రివీల్ చేయకపోవడం, ప్రకాష్‌కు మహితికి ఉన్న సంబంధం రివీల్ కాకపోవడంతో స్టోరీ సుయోధన అనే పేరు చుట్టూ, ప్రకాష్ హత్య చుట్టూనే తిరుగుతుంది. ఎప్పుడైతే వరుణ్ తన గతాన్ని తెలుసుకుంటాడో అప్పుడు కథలో ఉన్న ట్విస్టులు ఒకటొకటిగా విడిపోతాయి. మహితికి, ప్రకాష్‌కు ఉన్న సంబంధం అలాగే రాధమ్మకు ప్రకాష్‌కు ఉన్న సంబంధం తెలియడంతో మిగిలిన కథ చాలామందికి అర్థమైపోతుంది. దాంతో ఫస్టాఫ్‌లో ఉన్న థ్రిల్ సెకండాఫ్ లో ఉండదు. కాకపోతే క్లైమాక్స్‌లో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ మనల్ని పెద్దగా ఆశ్చర్యపర్చదు. ఎందుకంటే ఇలాంటి ముగింపులు చూసి చూసీ ప్రేక్షకుల కళ్ళు ఎప్పుడో పత్తి కాయలు అయిపోయాయి. అప్పటిదాకా హీరో కుటుంబంతో అతి వినయం నటించే వ్యక్తి, అతి మంచితనం చూపించే వ్యక్తి చివర్లో ఖచ్చితంగా అదే కుటుంబం పాలిట యముడికి మొగుడు అవుతాడన్న ఫార్ములా ఈనాటిది కాదు. తెలుగు సినిమాలు పుట్టినప్పటినుంచి అదే ఫార్ములా కొనసాగుతుంది.
సుయోధన మూవీలో కూడా ఎండింగ్ అదే ఫార్ములాని దిగ్విజయంగా వాడుకుని ఎండ్ కార్డ్ వేసారు. ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పుకోవాలంటే సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ కథను బాగానే రాసుకున్నారు కానీ తెరకెక్కించడంలో దర్శకుడు అక్కడక్కడా తడబడ్డాడు. ఓ సన్నివేశంలో హీరో హస్పిటల్ కంపౌండర్‌కి లంచం ఇస్తూ రెండు వేల నోట్లు అతడి చేతిలో పెడతాడు. సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలెట్టారో ఎప్పుడు పూర్తి చేశారో ఖచ్చితంగా తెలీదు కానీ రెండువేల నోట్ల కాలాన్ని ఇందులో చూపించారు. కాబట్టి ఇదేదో డీ మానిటైజేషన్ కంటే ముందు మొదలెట్టిన ప్రాజెక్ట్ అని అర్థమౌతుంది. షూటింగ్ లేట్ అయితే అయ్యింది. కనీసం ఎడిటింగ్‌లో అన్నా ఆ సన్నివేశాన్ని కత్తిరించి ఏ ఐదొందల నోటో అతడి చేతిలో పెట్టి ఉంటే బాగుండేది కదా?
అదలా ఉంచితే సుయోధన కథని బాగానే రాసుకున్నారు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్టాఫ్‌లో ప్రీ ఇంటర్వెల్ వరకు హీరో జీవితంలో ఏదో జరుగుతుంది? అలా ఎందుకు జరుగుతుంది? అనే క్యూరియాసిటీని బాగానే కలిగించారు. సెకండాఫ్‌లో కూడా మహితి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లతో కథనంలో వేగాన్ని పెంచారు. ఎప్పుడైతే ప్రియదర్శి ఫ్లాష్‌బ్యాక్ రివీల్ అయ్యిందో ఇక తర్వాత కథేంటో ప్రేక్షకులు ఊహించేశారు. ఇక ఆ తర్వాత నుంచి రొటీన్ మూవీ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. అది మినహా చాలావరకు సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లోనే నడిచింది
ఎవరెలా చేశారు?
ముందే చెప్పినట్టు రోజురోజుకీ, సినిమా సినిమాకి ప్రియదర్శిలోని నటుడు బలపడుతున్నాడు. కామెడీ జానర్ అయినా, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ అయినా ఈజీగా తనకిచ్చిన పాత్రలో ఒదిగిపోగలడని ప్రియదర్శి నిరూపించాడు. ఈ మూవీలో ప్రియదర్శికి పూర్తి మార్కులు పడతాయిచాలా బ్యాలెన్స్డ్‌గా తనకిచ్చిన పాత్ర పరిధి మేరకు హావభావాలు ప్రదర్శించి మెప్పించాడు. ఇక హీరోయిన్ సంహిత (ద్రిషిక చందర్) నటన విషయానికి వస్తే ఈమె పాత్ర హీరోయిన్ పరిధిలోకి వస్తుందో, సపోర్టింగ్ రోల్ పరిధిలోకి వస్తుందో తెలియక కన్ఫ్యూజ్ అవుతాము. పేరుకి సినిమాలో వీళ్ళిద్దరూ ప్రేమికులే కానీ రొటీన్ సినిమాల్లో ఉన్నట్టు ఇంటర్వెల్‌కి ముందు మూడు, తర్వాత మూడు డ్యూయెట్లు ఉండవు. ఒకరకంగా ఆ విషయంలో దర్శకుడు మంచి పనే చేశాడు. తాను తీయాలనుకున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని అదే కాన్సెప్ట్ తో తీసాడు. ఫైనల్గా ఆమె నటన పర్లేదు. ఇక సాయి కుమార్ నటన గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. అందులో పౌరాణిక పాత్ర అయిన దుర్యోధనుడి ఆహార్యంలోను, డైలాగులు పలకడంలోనూ పూర్తి స్థాయిలో ఒదిగిపోయాడు. వరుణ్ తండ్రి పాత్రలో కొద్దిగా గ్లామర్‌గా కూడా కనిపించాడు. మహితి పాత్రలో ప్రేమకు మంచి ప్రాధాన్యమున్న పాత్ర లభించింది. కానీ ఎందుకో సన్నివేశాలకు తగిన హావభావాలు పలికించడంలో ఆమె తడబడినట్టు కనిపిస్తుంది. అతిథి పాత్రలో జయదేవ్ కనిపించి ఆశ్చర్యపరిచాడు. దేవీప్రసాద్ నటన బాగానే ఉంది. కాకపోతే సాఫ్ట్‌కార్నర్‌లో నటించినంత బాగా విలనిజం పండించడంలో నటించలేకపోయాడు.
సాంకేతికత
సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అనగానే ఎవరైనా ముందు బిజిఎం ఎలా ఉందా? అని చూస్తారు. ఆ పరంగా జై క్రిష్ అందించిన సంగీతం బాగానే ఉంది. కార్తీక్ కొప్పర అందించిన సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో దర్శకుడికి ఇది మొదటి సినిమా అయినా సరే అతడి ప్రయత్నం గట్టిగానే చేశాడు అని చెప్పవచ్చు
విశ్లేషణ
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలు చూసేవారికి సుయోధన సినిమా నచ్చుతుంది. సాధారణంగా ఈ జానర్ మూవీల్లో ప్రేక్షకులు ఎక్కువగా ట్విస్టులు ఆశిస్తారు. ఆ పరంగా దర్శకుడు అవసరమైన చోట్ల ట్విస్టులు జొప్పించాడు. కాకపోతే ముగింపు ట్విస్ట్ ఇంకొంచం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉండాల్సింది. మొదట్లో సినిమా సౌండ్స్ కోసం టెక్నీషియన్స్ ఎలా రికార్డ్ చేస్తారో ప్రియదర్శి పాత్ర ద్వారా చూపించి ఉత్సుకత కలిగించిన దర్శకుడు అదే ప్రియదర్శి చేత పోలీస్‌స్టేషన్లో లాఠీ దెబ్బల సౌండ్స్ రికార్డ్ చేయించడం కొద్దిగా ఓవర్ అనిపిస్తుంది. ఓవరాల్‌గా ముందే చెప్పినట్టు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడేవారికి సుయోధన బోర్ అయితే కొట్టదు. దానికి తోడు మోతాదును మించిన హింస, అశ్లీల సన్నివేశాలు లేవు కాబట్టి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.
- పరేష్ తుర్లపాటి






Comments