‘సుఖీభవ’పై ఆచితూచి!
- BAGADI NARAYANARAO

- Jun 14, 2025
- 2 min read
వ్యవసాయ శాఖ లాగిన్‌లో 2.88 లక్షల మంది రైతులు
తహసీల్దారు లాగిన్‌లో 77వేల ఖాతాల వివరాలు
రికార్డులు సక్రమంగా లేవంటూ 44వేల ఖాతాల తిరస్కరణ
పెండిరగ్‌లో మరో 13వేల మంది రైతుల వివరాలు
ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు, ఐటీ చెల్లింపుదారులకు సాయం లేదు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
మీరెవరైనా కానీయండి.. ఏ ఉద్యోగమైనా చేయండి భూమి ఉంటే చాలు.. రైతుగా గుర్తించి పెట్టుబడి సాయం అందిస్తాం.. అంటూ గతంలో ఉన్న ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లో సొమ్ములు వేశాయి. సాధారణంగా ఉద్యోగులు, ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టేవారు, ప్రభుత్వ పింఛనుదారులు తమ భూమిని కౌలుకు ఇచ్చి ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయాన్ని మాత్రం తమ జేబులో వేసుకునేవారు. ఈసారి కూటమి ప్రభుత్వం ఇటువంటి వారికి చెక్ పెట్టింది. సహజంగానే గతం కంటే ఎక్కువ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉండాలనే భావిస్తుంది. అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పేరిట రూ.20వేలు అందిస్తున్నవారి జాబితాను ఒకటికి పదిసార్లు వడపోత చేపడుతోంది.
జోరుగా తీసివేతలు
అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతుల జాబితా తయారీ కసరత్తు పూర్తిచేసి రైతుసేవా కేంద్రాల నుంచి వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు పంపించినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 5.87 లక్షలు రైతు ఖాతాలు ఉన్నాయి. వడపోతలు పూర్తిచేసిన తర్వాత 4.80 లక్షలు ఖాతాలు రికార్డులు పరిశీలించి 2.88 లక్షల మంది రైతుల వివరాలను వ్యవసాయ శాఖ లాగిన్‌లో ఉంచారని తెలిసింది. మిగతా 77వేల ఖాతాల వివరాలు తహసీల్దారు లాగిన్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. వీరిలో 44వేల మంది రైతుల ఖాతాల రికార్డులు సక్రమంగా లేకపోవడంతో తిరస్కరించారని తెలిసింది. మరో 13వేల మంది రైతుల వివరాలు పెండిరగ్‌లో పెట్టినట్టు తెలిసింది. ఆర్‌టీజీఎస్ (రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్)లో వడపోత తర్వాత జిల్లాస్థాయిలో పరిశీలన పూర్తయిన వెబ్‌ల్యాండ్ వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. అన్నదాత సుఖీభవకు కొన్ని సాంకేతిక సమస్యలు, రెవెన్యూ చిక్కులు ఎదురవడంతో వేలాది మంది రైతుల వివరాలు పెండిరగ్‌లో పెట్టారు. సమగ్ర సర్వే తర్వాత తలెత్తిన సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉన్నాయి. దీంతో రైతులు అనర్హుల జాబితాలో పెండిరగ్‌లో పెట్టారని తెలిసింది. ఈ నెల 20 నాటికి అన్నదాతకు సుఖీభవ కింద అందించనున్న సాయానికి సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అధికారులు కసరత్తు సాగిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆధార్ అనుసంధానంతో ఉన్న అనర్హులను గుర్తించి తుది జాబితాను మళ్లీ రైతుసేవా కేంద్రాలకు పంపించి, అందులోని లబ్ధిదారులందరితో తప్పనిసరిగా ఈకేవైసీ చేయించి ప్రక్రియ పూర్తి చేస్తారని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో గతంలో 3.22 లక్షలకుపైనే
వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన వెబ్‌ల్యాండ్ డేటాను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌తో పాటు మండల వ్యవసాయశాఖ అధికారుల లాగిన్‌లకు పంంపించి వెబ్‌ల్యాండ్‌లో సర్వే నెంబర్లు, రైతు పేరు, విస్తీర్ణం కచ్చితంగా ఉన్నదీ లేనిదీ రైతు సేవా కేంద్రాల్లో పరిశీలించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరిశీలన పూర్తిచేసి అనర్హులను గుర్తించి జాబితా నుంచి తొలగించారని తెలిసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 658 రైతుసేవా కేంద్రాల్లో ప్రస్తుతం ఈ ప్రక్రియ పూర్తిచేసి ఈ నెల 12 నాటికి వ్యవసాయ కమిషనరేట్‌కు జాబితాలను పంపించేశారు. వైకాపా హయాంలో జిల్లావ్యాప్తంగా కౌలు రైతులతో కలిపి 3.22 లక్షల మందికి రైతుభరోసా జమ చేస్తూ వచ్చారు. ఆ సంఖ్య ఈ ఏడాది పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వైకాపా హయాంలో ఉద్యోగులు, వారి కుటుంబాలు, ప్రభుత్వ పింఛను పొందేవారు, ఆదాయపు పన్ను చెల్లించేవారంతా అర్హుల జాబితాలో చేర్చి రైతుభరోసా జమ చేశారు. ప్రస్తుతం వీరి వివరాలన్నీ వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం చేసి అర్హుల జాబితా నుంచి తొలగించాలని వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అధికారులు చెబుతున్నారు.
అమలుకు సన్నాహాలు
సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన ‘అన్నదాత సుఖీభవ’ రూ.20 వేలు ఆర్ధిక సాయం ఈ నెల 20న మొదటి విడత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వంతో కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు అధికారికంగా ప్రకటించారు. పెట్టుబడి సాయాన్ని ప్రధానమంత్రి కిసాన్ యోజన మాదిరిగానే కేంద్రం జమ చేస్తున్న రోజునే ఏడాదిలో మూడు విడతలుగా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. పీఎం కిసాన్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.2వేలు చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6వేలు సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6వేలుకు మరో రూ.14వేలు కలిపి మొత్తం రూ.20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వైకాపా హయాంలో పీఎం కిసాన్ యోజనతో కలిపి మొత్తం రూ.13,500 జమచేశారు. వీటిలో కేంద్రం వాటా మూడు విడతల్లో రూ.6వేలు కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రెండు విడతల్లో రూ.7,500 రైతుల ఖాతాల్లో జమ చేసేవారు.










Comments