సంగీతం, గణితం, సాంకేతికతలకు కొత్త నిర్వచనం ఇళయరాజా సెంటర్
- Guest Writer
- Jan 2
- 1 min read

భారతీయ సంస్క ృతిని భవిష్యత్తు సాంకేతికతతో అనుసంధానిస్తూ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ`ఎం) 2026-27 విద్యా సంవత్సరం నుంచి ‘ఐఐటిఎం`మాస్ట్రో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్’ను ప్రారంభించనుంది. మెడికల్ ఎడ్యుకేషన్ రంగంలోకి ఐఐటి విస్తరణ, ‘ఐఐటి మద్రాస్ ఫర్ ఆల్’ చొరవపై ఐఐటి-ఎం డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి ఇటీవల ‘డిటి నెక్ట్స్’కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాని సారాంశం మేరకు సంగీతాన్ని కేవలం ఒక కళారూపంగానే కాకుండా ప్రతి రాగం, తాళం, స్వర గమనం వెనుక గణితం ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సౌండ్ సింథసిస్, అకౌస్టిక్స్, డిజిటల్ మ్యూజిక్, ఏఐ ఆడియో టూల్స్ వంటి సౌండ్ టెక్నాలజీ రంగాలు కీలకంగా మారాయి. ఈ రంగంలో రాణించాలంటే సంగీతాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. మన కర్ణాటక, హిందుస్తానీ, జానపద, భక్తిసంగీత సంప్రదాయాల్లో శతాబ్దాల నాటి జ్ఞానం నిక్షిప్తమై ఉంది. అయితే, ఈ మేధో సంపత్తి ఇంకా శాస్త్రీయంగా, గణిత రూపంలో డాక్యుమెంట్ కాలేదు. ఇళయరాజా సెంటర్ లక్ష్యం ఏమిటంటే.. ఈ సంగీత అంశాలను గణితశాస్త్ర పరంగా విశ్లేషించి, సాంకేతికత సాయంతో కొత్త ఆవిష్కరణలు చేయడం. జపాన్ వంటి దేశాలు సౌండ్ సింథసిస్‌లో చాలా ముందున్నాయి. భారతీయ సంగీతకారులు ప్రదర్శనలో గొప్పవారైనప్పటికీ, మన సంగీత సిద్ధాంతంలోని లోతు అసాధారణమైనది. దీన్ని మనం గణితం ద్వారా డీకోడ్ చేయగలిగితే, ప్రపంచ సౌండ్ టెక్నాలజీకి కొత్త నిర్వచనం ఇవ్వొచ్చు.
ప్రతి కచేరీ, తాళ చక్రం, స్వర కదలిక వెనుక గణితం ఉంటుంది. శివ వాద్యం వంటి సాంకేతిక రూపాలు కూడా కచ్చితమైన సంఖ్యా, లయబద్ధమైన తర్కాన్ని అనుసరిస్తాయి. క్లాసికల్ డ్యాన్స్‌లో కూడా సమరూపత, గణిత నమూనాలు ఉంటాయి. ఈ కేంద్రం సంగీతకారులను, గణిత శాస్త్రజ్ఞులను, ఇంజనీర్లను ఒకచోట చేర్చి, ఈ నిర్మాణాలను డాక్యుమెంట్ చేస్తుంది. వీటిని గణిత నమూనాలుగా మార్చిన తర్వాత, అకౌస్టిక్స్, ఇమ్మర్సివ్ ఆడియో ఎన్విరాన్‌మెంట్స్‌లో పరిశోధనలకు ఉపయోగిస్తాం. ఇది వాయిద్యాల రూపకల్పన, డిజిటల్ పునరుత్పత్తికి కూడా విస్తరిస్తుంది.
పర్యావరణ హితానికి ప్రాధాన్యతనిస్తూ ఇళయరాజా సెంటర్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. అస్సాంకు చెందిన నైపుణ్యం కలిగిన కార్మికులతో ప్రధానంగా వెదురు ఉపయోగించి ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మైకులు లేని 100 మంది సామర్థ్యం గల ‘వెదురు ఆడిటోరియం’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది కేవలం సహజ సిద్ధమైన ధ్వని సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఏప్రిల్ 2026 నాటికి నిర్మాణం పూర్తవుతుంది. 2026`27 విద్యా సంవత్సరం నుంచి విద్యా కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
- డిటి నెక్ట్స్ సౌజన్యంతో..










Comments