సంతాన ప్రాప్తిరస్తు.. బోల్డ్ కాన్సెప్ట్ బోరింగ్ నరేషన్
- Guest Writer
- 3 days ago
- 3 min read

‘స్పార్క్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన విక్రాంత్.. తెలుగు హీరోయిన్లలో ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకున్న చాందిని చౌదరి జంటగా నటించిన సినిమా.. సంతాన ప్రాప్తిరస్తు. ఈ తరం యువతకు కనెక్ట్ అయ్యే సమకాలీన కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
చైతన్య (విక్రాంత్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అందరు కుర్రాళ్లలాగే ఉద్యోగం చేసుకుంటూ పార్టీలూ పబ్బులంటూ తిరుగుతూ సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అమ్మాయిలతో మాట్లాడ్డానికి భయపడే అతను.. తనకు తగ్గ అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలవ్వాలని చూస్తుంటాడు. అప్పుడే అనుకోకుండా అతడికి కళ్యాణి (చాందిని చౌదరి) పరిచయం అవుతుంది. తొలి చూపులోనే ఆమెను ప్రేమించిన చైతన్య.. కొంచెం కష్టపడి ఆమె కూడా తనను ప్రేమించేలా చేసుకుంటాడు. కానీ కళ్యాణి తండ్రి శంకర్ రావు (మురళీధర్ గౌడ్)కు వీరి పెళ్ళి చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అయినా ఆయన్ని కాదని చైతన్య-కళ్యాణి పెళ్ళి చేసుకుంటారు. త్వరగా ఓ బిడ్డను కంటే అంతా సర్దుకుంటుందని వీళ్లిద్దరూ భావిస్తారు. కానీ పిల్లల్ని కనడంలో వీరికి ఒక సమస్య ఎదురవుతుంది. అదేంటి.. దాని వల్ల వీరి కాపురంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి.. చివరికి వీరి బంధం నిలబడిరదా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
బాలీవుడ్లో ఒకప్పుడు వీర్యదానం మీద ‘విక్కీ డోనర్’ అనే సినిమా తీయడం ఒక పెద్ద సంచలనం. అందులో చూపించిన అంశాల మీద ఒక చిన్న సీన్ పెట్టడానికి కూడా అప్పటిదాకా సంకోచించేవాళ్లు. అలాంటిది ఏకంగా వీర్య దానం మీద ఫుల్ లెంత్ సినిమానే తీసేయడమే ఆశ్చర్యమంటే.. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించడం ఇంకా పెద్ద షాక్. ఇలాంటి కాన్సెప్టులను ప్రేక్షకులు జీర్ణించుకోలేరు అనే భ్రమలు ఆ దెబ్బతో విడిపోయాయి. ప్రాంతీయ భాషల్లోనూ ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్స్ తో సినిమాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కొన్నేళ్ల ముందు తెలుగులో ‘ఏక్ మిని కథ’ అనే సినిమా వచ్చింది. ఆదరణ దక్కించుకుంది. తర్వాత ఇలాంటి మరెన్నో సినిమాలు చూశాం. ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల ఒక జంట పడే ఇబ్బందుల నేపథ్యంలో ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సంజీవ్ రెడ్డి అండ్ టీమ్. ఐతే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. అక్కడక్కడా కొంచెం కామెడీ.. కొద్దిగా ఎమోషన్ పండినా.. చాలా వరకు బోరింగ్ గా సాగిపోయే కథనం ‘సంతాన ప్రాప్తిరస్తు’ను సాధారణ సినిమాగా నిలబెట్టింది.
‘‘ఆశకు హద్దుండాలి.. దానికి సిగ్గుండాలి’’.. ‘‘కలాం గారు కలలు కనమన్నారు.. కథలు మింగమనలేదు’’.. ‘సంతాన ప్రాప్తిరస్తు’లో సందర్భానుసారంగా ఇలాంటి డైలాగులు చాలానే వినిపిస్తాయి. ఇక ‘మింగేశారు’.. ‘సావమింగొద్దు’.. ‘గుడిసియో’.. ‘గుడిపించిన’.. ‘మొగ్గలో’.. లాంటి పదాలకైతే లెక్కే లేదు. ఒక బోల్డ్ కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఇలాంటి బూతులుంటేనే సినిమాకు సరైన టోన్ సెట్ అవుతుందనే భ్రమలో సన్నివేశాలు- డైలాగులు రాశారేమో అనిపిస్తుంది. కానీ వాటి వల్ల రవ్వంత కూడా ప్రయోజనం లేకపోగా.. అవి సినిమా స్థాయిని తగ్గిస్తాయని అర్థం చేసుకుంటే మంచిది. ఇలాంటి డైలాగుల మీద పెట్టిన శ్రద్ధ.. కాన్సెప్ట్ ను బలపరిచే సన్నివేశాలు రాయడంలో తీయడంలో పెట్టి ఉంటే బాగుండేది. కాన్సెప్ట్ విషయంలో ఆలోచించినంత కొత్తగా కథనం విషయంలో ఆలోచించలేదు రచయితలు-దర్శకుడు. హీరోయిన్ని చూడగానే ప్రేమలో పడిపోయే హీరో.. అతడి హెల్పింగ్ నేచర్ కు పడిపోయే హీరోయిన్.. ఈ క్రమంలో వారి మధ్య ప్రేమకథ నుంచి ఏం కొత్తదనం ఆశిస్తాం? కాకపోతే ఈ ఇద్దరి మధ్య తండ్రి పాత్రను తీసుకొచ్చి కాన్ఫ్లిక్ట్ అయితే బాగానే ప్లే చేశాడు దర్శకుడు. మురళీధర్ గౌడ్ చేసిన ఆ తండ్రి క్యారెక్టరే ‘సంతాన ప్రాప్తిరస్తు’కు అతి పెద్ద బలం. అదే ఈ కథను కొంచెం ఆసక్తికరంగా నడిపించింది.
అసలే హీరో హీరోయిన్ల మధ్య పెద్ద అడ్డంకిలా తండ్రి పాత్ర నిలబడి ఉంటే.. పిల్లల్ని కనడంలో హీరోకు సమస్య తలెత్తడంతో కథ రసవత్తరంగా మారడానికి ఛాన్సుంది. కానీ దీని చుట్టూ డ్రామాను రక్తికట్టించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. బోరింగ్ సీన్లతో ద్వితీయార్ధాన్ని భారంగా మార్చాడు. వెన్నెల కిషోర్ వచ్చి కొంత నవ్వించే ప్రయత్నించినా డోస్ సరిపోలేదు. ఇక హీరో ఆఫీస్ చుట్టూ తిరిగే సీన్ల గురించైతే చెప్పాల్సిన పనే లేదు. ఎంతకీ తెగనట్లుగా సాగే ద్వితీయార్ధం ‘సంతాన ప్రాప్తిరస్తు’కు మైనస్ అయింది. ఒక బోల్డ్ కాన్సెప్ట్ మీద సినిమా తీసినపుడు.. కథలో మలుపులు.. ముగింపు ఏమైనా కొత్తగా ఉంటాయేమో అని ఆశిస్తాం. కానీ రొటీన్ ఫ్యామిలీ డ్రామాల్లో మాదిరే ఇందులో హీరో హీరోయిన్ల విభేదాలు రావడం.. తనను హీరోయిన్ అసహ్యించుకునేలా హీరో ప్రవర్తించడం.. ఇద్దరూ విడిపోవడం.. చివరికి అపార్థాలన్నీ తొలగిపోయి కలిసిపోవడం.. ఇలా రొటీన్ ఫార్మాట్లోనే సినిమా నడుస్తుంది. పతాక సన్నివేశాలను కొంచెం ఎమోషనల్ గా తీర్చిదిద్దడం వల్ల అవి ఓకే అనిపించినా.. ఓవరాల్ ఫీలింగ్ మాత్రం మారదు. కాన్సెప్ట్ లో ఉన్నంత కొత్తదనం.. కథనంలో లేకపోవడం వల్ల ‘సంతాన ప్రాప్తిరస్తు’ సగటు చిత్రంలా అనిపిస్తుందంతే.
నటీనటులు - పెర్ఫార్మెన్స్ :
విక్రాంత్ ‘స్పార్క్’ మూవీతో పోలిస్తే మెరుగైనట్లు అనిపించాడు. చైతన్య పాత్రను పండిరచడానికి కష్టపడ్డాడు. కానీ ఇంకా కూడా హావభావాల విషయంలో ఇంకా కొంచెం మెరుగు పడాలనిపిస్తుంది. చాందిని చౌదరి సినిమాకు అతి పెద్ద బలం. కళ్యాణి పాత్రలో సిన్సియర్ గా నటించింది. తన పాత్రలో ఒదిగిపోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించింది. పతాక సన్నివేశాల్లో తన నటన చాలా బాగా సాగింది. తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ కూడా అలవోకగా నటించాడు. అభినవ్ గోమఠం తనకు అలవాటైన ఫ్రెండు పాత్రలో అక్కడక్కడా పంచులు పేల్చాడు. వెన్నెల కిషోర్ కూడా కొంతమేర నవ్వులు పంచాడు. తన డైలాగులు బాగున్నాయి. తరుణ్ భాస్కర్ కనిపించిన కాసేపు ఆకట్టుకున్నాడు. మిగతా ఆర్టిస్టులు మామూలే.
సాంకేతికవర్గం - పనితీరు :
టెక్నికల్ గా ‘సంతాన ప్రాప్తిరస్తు’ సోసోగా అనిపిస్తుంది. సునీల్ కశ్యప్ పాటలు ఏదో అలా అలా సాగిపోయాయి. అజయ్ నేపథ్య సంగీతం పర్వాలేదు. మహి రెడ్డి పండుగుల ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. సంజీవ్ రెడ్డి-షేక్ దావూద్ కలిసి రాసిన కథలో విషయం ఉంది. కానీ దానికి ఆసక్తికర కథనాన్ని జోడిరచలేకపోయారు. కళ్యాణ్ రాఘవ్ డైలాగుల్లో కొన్ని పేలాయి. కొన్నిచోట్ల మాటలు హద్దులు దాటాయి. దర్శకుడు సంజీవ్ క్లైమాక్స్ సహా కొన్ని సన్నివేశాల వరకు బాగానే డీల్ చేసినా.. చాలా వరకు తన నరేషన్ సాధారణంగా సాగిపోయింది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో.










Comments