top of page

సుందరకాండ.. సందడి సందడిగా

  • Guest Writer
  • Aug 28, 2025
  • 3 min read

ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేసిన యువ కథానాయకుడు నారా రోహిత్‌.. గత కొన్నేళ్లలో గ్యాప్‌ తీసుకున్నాడు. ఈ ఏడాది ప్రతినిధి-2.. భైరవం చిత్రాలతో పలకరించిన అతను.. ఇప్పుడు ‘సుందరకాండ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రోమోలతో మంచి ఫీల్‌ ఇచ్చిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ :

సిద్దార్థ్‌ (నారా రోహిత్‌)కు వయసు పెరిగినా పెళ్లి కాదు. దాని కోసం ఇంట్లో వాళ్లు పోరు పెడుతూ ఉ:టారు. కానీ సిద్దార్థ్‌ చిన్నప్పుడు ప్రేమించిన తన సీనియర్‌ వైష్ణవి (శ్రీదేవి)ని తలుచుకుంటూ.. ఆమెలోని లక్షణాలే ఉన్న అమ్మాయే కావాలని వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరిస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి అనుకోకుండా ఐరా (వృతి వాఘని) పరిచయం అవుతుంది. ఆమెలో తాను కోరుకున్న లక్షణాల్లో కొన్ని కనిపించడంతో మిగతావి కూడా ఉన్నాయేమో అని తన కోసం వెతుకుతుంటాడు. ఆమె విశాఖపట్నంలో ఓ కాలేజీ స్టూడెంట్‌ అని తెలిసి తను చదివే కాలేజీలోనే లెక్చరర్‌ గా చేరతాడు. ఐరాను ప్రేమలో పడేసి పెళ్లి చేసుకుందామని సిద్దార్థ్‌ అనుకుంటుండగా.. వైష్ణవి ఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ వైష్ణవి అప్పుడేం చేస్తోంది.. ఐరాకు ఆమెకు ఉన్న సంబంధం ఏంటి.. వైష్ణవి పునరాగమనంతో సిద్దార్థ్‌ జీవితంలో వచ్చిన మార్పులేంటి.. ఇంతకీ తన పెళ్లి జరిగిందా లేదా అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

మన సినిమా రేంజ్‌ మారిపోయింది.. సింపుల్‌ గా అనిపించే కథల్ని ప్రేక్షకులు మెచ్చరు అనుకుంటూ.. చారిత్రక నేపథ్యం అని.. భారీ యాక్షన్‌ అని.. వరల్డ్‌ క్రియేషన్‌ అని.. వాస్తవికత కొరవడిన కథలతో నేల విడిచి సాము చేస్తూ మన రచయితలు-దర్శకులు ఎటు పోతున్నారో అర్థం కాని అయోమయ స్థితి నెలకొన్న సమయమిది. కానీ కొంచెం డిఫరెంట్‌ గా అనిపించే పాయింట్‌ తీసుకుని.. దానికి వినోదపు పూత పూస్తే.. సన్నివేశాలను ఆహ్లాదభరితంగా నడిపిస్తే.. కథనంలో వేగం చూపిస్తే ప్రేక్షకులు మెచ్చుతారనడానికి అప్పుడప్పుడూ రుజువులు కనిపిస్తూనే ఉంటాయి. ‘సుందరకాండ’ సరిగ్గా అలాంటి సినిమానే. ఇందులో కథను మలుపు తిప్పే ఓ పాయింట్‌ మాత్రమే కొత్తది. మిగతా వ్యవహారమంతా రొటీన్‌ గానే అనిపిస్తుంది. ఆ కొత్త పాయింట్‌ చుట్టూ నడిపిన ఆసక్తికర డ్రామా.. బోర్‌ కొట్టించని కథనం.. జోష్‌ తగ్గనివ్వని ఎంటర్టైన్మెంట్‌.. కొంచెం ఎమోషనల్‌ టచ్‌.. వెరసి ‘సుందరకాండ’ ఒక క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా రూపొందింది. ఇందులో కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ.. చాలా వరకు ప్రేక్షకులను ఎంగేజ్‌ చేస్తుంది.

హీరోకు చిన్న వయసులో ఒక లవ్‌ స్టోరీ పెట్టి.. పెద్దయ్యాక ఇంకో ప్రేమకథను చూపించడం.. అంతలో మొదటి ప్రేమకథలోని అమ్మాయి తిరిగి తన జీవితంలోకి రావడం.. ఈ తరహా కథలు కొత్తేమీ కాదు. కానీ ఇలాంటి కథలోనే ప్రేక్షకులు ఊహించలేని ఒక ట్విస్ట్‌ ఇచ్చి వాళ్ల అటెన్షన్‌ రాబట్టగలిగాడు దర్శకుడు. ఆ ట్విస్టే కథకు మూలం. దాని వల్లే కథకు ఒక కొత్త లుక్‌ వచ్చింది. షాక్‌ ఫ్యాక్టర్‌ ఉంటూనే భలే గమ్మత్తుగా అనిపించే ఆ పాయింటే సినిమాలో మేజర్‌ హైలైట్‌. బహుశా ఈ కథ పుట్టిందే ఆ పాయింట్‌ దగ్గర కావచ్చు. దాని చుట్టూ డ్రామాను.. అలాగే వినోదాన్ని కూడా బాగా పండిరచడం ద్వారా కొత్త దర్శకుడు వెంకటేష్‌ నిమ్మలపూడి మార్కులు కొట్టేశాడు. కామెడీ పండిరచడం సవాలుగా మారిన ఈ రోజుల్లో.. చాలా వరకు సినిమాను వినోదాత్మకంగా నడిపించాడు. ఇలా హింటిస్తే అలా అల్లుకుపోయే కమెడియన్‌ సత్యకు తగ్గట్లుగా సరైన పాత్రను రాసుకోవడంతో పాటు ఫన్నీ సిచువేషన్లు క్రియేట్‌ చేయడంతో అతను చెలరేగిపోయాడు. ప్రథమార్ధానికి సత్య కామెడీనే అతి పెద్ద బలం. ఇంకోవైపు హీరో పరిచయ సన్నివేశాలు.. రొమాంటిక్‌ ట్రాక్‌ కూడా సరదాగానే సాగుతాయి. దీంతో ఫస్టాఫ్‌ మంచి వేగంతో సాగిపోతుంది.

ఇక ఇంటర్వెల్‌ దగ్గర ఇచ్చిన ట్విస్టుతో.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది. అప్పుడు కలిగే క్యూరియాసిటీకి తగ్గట్లుగా ద్వితీయార్ధం సాగదు. కొన్ని ప్రెడిక్టబుల్‌ సీన్లు.. సాగతీత వల్ల ద్వితీయార్ధంలో ‘సుందరకాండ’ గ్రాఫ్‌ తగ్గుతుంది. అలా అని మరీ బోర్‌ కొట్టకుండా చూసుకోగలిగాడు దర్శకుడు. ద్వితీయార్ధంలో కూడా కొన్ని సీన్లు పేలాయి. చివర్లో చిన్న సందేశం.. ఎమోషన్‌ తో ప్రేక్షకులను కదిలించాలని చూశారు. అది ఓ మోస్తరుగా అనిపిస్తుందంతే. శ్రీదేవి చేసిన వైష్ణవి పాత్రను ఇంకా బాగా ఉపయోగించుకోవాల్సింది అనిపిస్తుంది. కథలో కొన్ని లాజిక్స్‌ కూడా మిస్సయ్యాయి. ఇలాంటి ప్రతికూలతలు కొన్ని ఉన్నప్పటికీ.. వాటిని విస్మరించేలా చేసే అంశాలు ‘సుందరకాండ’లో ఉన్నాయి. క్రేజీగా అనిపించే ప్లాట్‌ పాయింట్‌.. కామెడీ సినిమాను నిలబెట్టాయి. కుటుంబమంతా చూడగలిగే క్లీన్‌ ఎంటర్టైనర్‌ ‘సుందరకాండ’.

నటీనటులు - పెర్ఫార్మెన్స్‌ :

నారా రోహిత్‌ చాలా రోజుల తర్వాత ఓ ప్రేమకథ చేయడంతో అందుకు తగ్గట్లుగా మంచి లుక్‌ తో కనిపించి ఆకట్టుకున్నాడు. ‘భైరవం’లో తనను చూసి నిరాశ చెందిన వారిని ఈ సినిమాతో మెప్పిస్తాడు. తన లుక్‌ తో పాటు నటన కూడా రిఫ్రెషింగ్‌ గా అనిపిస్తాయి. తన మార్కు సటిల్‌ యాక్టింగ్‌ తో అతను ఆకట్టుకున్నాడు. కామెడీ కూడా బాగా పండిరచాడు. ఈ సినిమా కోసం కొంచెం కష్టపడి డ్యాన్సులు కూడా చేశాడు రోహిత్‌. ‘సుందరకాండ’ తనకు కమ్‌ బ్యాక్‌ ఫిలిం అనడంలో సందేహం లేదు. కొత్త హీరోయిన్‌ వృతి వాఘని ఓకే అనిపించింది. తన లుక్స్‌.. నటన పర్వాలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన ‘ఈశ్వర్‌’ ఫేమ్‌ శ్రీదేవికి మంచి పాత్ర దక్కింది. ఈ వయసులోనూ అందంతో ఆకట్టుకుంటూనే ఆమె అభినయంతోనూ మెప్పించింది. సత్య తన మార్కు కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు. సినిమాకు అతి పెద్ద అసెట్‌. సత్య భార్య పాత్రలో సునైనా కూడా ఆకట్టుకుంది. హీరో అక్కగా ప్రెగ్నెంట్‌ క్యారెక్టర్లో వాసుకి బాగా చేసింది. నరేష్‌, అభినవ్‌ గోమఠం.. రూప లక్ష్మి.. వీటీవీ గణేష్‌.. అజయ్‌.. విశ్వాంత్‌.. వీళ్లంతా తమ తమ పాత్రల పరిధిలో మెప్పించారు.

సాంకేతిక వర్గం - పనితీరు :

టెక్నికల్‌గా ‘సుందరకాండ’లో మంచి ప్రమాణాలే కనిపిస్తాయి. సినిమాటోగ్రాఫర్‌ ప్రదీష్‌ వర్మ ప్రతి ఫ్రేమ్‌ ను కలర్‌ ఫుల్‌ గా తీర్చిదిద్దాడు. లియోన్‌ జేమ్స్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మంచి హుషారుగా సాగింది. తన పాటలు మాత్రం సోసోగా అనిపిస్తాయి. ఇలాంటి ఎంటర్టైనర్‌ కు మంచి పాటలు కూడా తోడై ఉంటే సినిమా రేంజ్‌ పెరిగేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక డెబ్యూ డైరెక్టర్‌ వెంకటేష్‌ నిమ్మలపూడి అరంగేట్రంలో బలమైన ముద్రే వేశాడు. ట్విస్టుతో కూడిన ఒక ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ తీసుకుని.. దాని చుట్టూ చక్కటి డ్రామాను.. వినోదాన్ని అల్లి ‘సుందరకాండ’ను చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా తీర్చిదిద్దాడు. అక్కడక్కడా స్క్రీన్‌ ప్లే నెమ్మదించడం.. కథ అంచనాలకు తగ్గట్లుగా సాగడం ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ ప్రతికూలతలు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page