top of page

సినిమా మేకర్స్‌కు ప్రతి సీనూ ఓ లెసన్‌

  • Guest Writer
  • Apr 30, 2025
  • 3 min read


సంగీత సాహిత్య నృత్యాలకు పట్టాభిషేకం ఈ సాగర సంగమం.. మరో శంకరాభరణం. ఒక్కటే తేడా. అందులో కధానాయకుడు ధీరోదాత్తుడు. ఇందులో కధానాయకుడు మానసికంగా బలహీనుడు.

శంకర శాస్త్రి గారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఒడుదుడుకులు వచ్చినా స్థితప్రజ్ఞుడిగా సముద్రంలా గంభీరంగా నిలబడ్డాడు. సాగర సంగమంలో బాలు నిరాశానిస్పృహలతో, తాను ప్రేమించిన పడతి దూరం కాగానే దేవదాసు అవుతాడు. ఈ పోలిక పక్కకు పెడితే శంకరాభరణం ఎంతటి కళాఖండమో అంతటి కళాఖండం సాగర సంగమం.

తెలుగు ప్రజలు ఒక్కొక్కరు ఎన్నిసార్లు చూసి ఉంటారో ! ఈ సినిమాలోని పాటలలోని సాహిత్యం, ఆ సాహిత్యానికి తగ్గట్లు శాస్త్రీయ నృత్యాలు, వాటి చిత్రీకరణ, సంభాషణలు, అద్భుత దర్శకత్వం, సంగీత దర్శకత్వం, ఛాయాగ్రహణాల మీద కనీసం ఓ పది పీహెచ్‌డీలు చేయవచ్చు. అంత భారీ వస్తువు ఉంది ఈ సినిమాలో.

కమల్‌హాసన్‌ నట విరాట రూపం సాగర సంగమం. భరతనాట్యం, కథక్‌, కూచిపూడి శాస్త్రీయ నృత్య కళాకారుడిగా అతను ప్రదర్శించిన ప్రతిభ వర్ణనాతీతం. జయప్రద... ముగ్ధ మనోహర సౌందర్యంతో కమల్‌హాసనుకి పోటీగా నటించింది, నృత్యించింది.

ఈ సినిమాలో నాకు నచ్చిన మరో పాత్ర శరత్‌ బాబుది. స్వచ్చ స్నేహానికి ప్రతీకగా ఉంటుంది ఆ పాత్ర. శరత్‌బాబు జీవించాడు. జీవితంలో ఇలాంటి స్నేహితుడిని పొందినవాడు కడు అదృష్టవంతుడు.

ఈ మూడు పాత్రల తర్వాత బాలు తల్లి పాత్ర. వంటలు చేసుకుంటూ కొడుకికి ప్రాణప్రదమైన నాట్యంలో అతడు గొప్పవాడు కావాలని నిశ్శబ్ద కలలు కనే పాత్ర. డబ్బింగ్‌ జానకి చాలా బాగా నటించింది. మరో ప్రధాన పాత్ర శైలజది. జయప్రద కుమార్తెగా, పెంకిఘటంగా, తలబిరుసు డబ్బున్న నర్తకిగా బాగా నటించింది. ఆమె నటించిన ఏకైక చిత్రం ఇది.

ప్రేక్షకులు మరచిపోలేని మరో పాత్ర బుడ్డ ఫొటోగ్రాఫర్‌ చక్రి. నృత్య దర్శకుడి పాత్రలో మిశ్రో. తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరించిన మంజుభార్గవి, గీత. విశ్వనాధ్‌ మంజుభార్గవిని మరచిపోకుండా నృత్యింపచేసారు. ఇంకా సాక్షి రంగారావు, ప్రభృతులున్నారు. వీళ్ళందరూ మనకు తెర మీద కనిపించే కళాకారులు.

మనకు కనిపించని తెర వెనుక కళాకారుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వేటూరి. విశ్వనాధ్‌ సినిమాలలో ఆయన పాటల్లోని సాహిత్యం వింటూ ఉంటే సరస్వతీమాత ఆయన కలంలోకి ప్రవేశించి వ్రాసి వెళ్ళిపోతుందా అని అనిపిస్తుంది. ఒక్కో పాట మీద ఒక్కో థీసిస్‌ వ్రాయవచ్చు.

మహాకవి కాళిదాసు విరచిత మహా కావ్యం రఘువంశంలోని మొదటి పద్యం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీప రమేశ్వరౌ, పార్వతీపరమేశ్వరౌ అంటూ ప్రారంభమయ్యే నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము.

రఘువంశం నా థర్డ్‌ ఫారంలో చదువుకున్నాను. ఈ సినిమాలో పార్వతీప దగ్గర ఆపేసి రమేశ్వరౌ అని ముగిస్తాడు. చక్కటి ప్రయోగం. ఆ పదప్రయోగంలో శివకేశవులను ఇద్దరినీ కలిపాడు వేటూరి. ఆ పాటలో కమల్‌ హాసన్‌, జయప్రదలు రతీ మన్మధుల్లాగా తాండవం చేసారు.

అద్భుత చిత్రీకరణ. బాలసుబ్రమణ్యం, జానకిలు ఏం పాడారు ! ఈ నృత్యానికి దర్శకత్వం వహించేందుకు ప్రత్యేకంగా బొంబాయి నుండి నవరంగ్‌ సినిమా గోపీకృష్ణను పిలిపించారు.

మరో అద్భుతమైన పాట మౌనమేలనోయి ఈ మరపురాని రేయి ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో. స్వచ్చ ప్రేమికులకు ఎప్పుడో ఒకసారి ఇలాంటి భావోద్వేగం రాక తప్పదు. విశ్వనాధ్‌ గారికి ఏం అనుభవం ఉన్నదో ఏమో గాని, ఎంత అందంగా చిత్రీకరించారు!

జయప్రద హావభావాలు !! వ్వాప్‌ా ! ఆ పాటలో జయప్రద స్నానం చేసే సీన్‌ విశ్వనాధ్‌ ఎలా దూర్చాడో ఏమో ! అయ్యబాబోయ్‌ ! ఏం మౌన చిత్రీకరణ !

క్లైమాక్సులో వచ్చే పాట సాగర సంగమమే ఒక యోగం. శైలజ, కమల్‌హాసన్‌ల నృత్యం, ఆ పాటలో సాహిత్యం మరువలేనిది. బాల కనక మయ చేల సుజన పరిపాల త్యాగరాజ కీర్తనను విశ్వనాధ్‌ గొప్పగా ఉపయోగించుకున్నారు.

వేదిక మీద మంజుభార్గవి, వంట గదిలో కమల్‌హాసన్‌ నృత్యాలను ఏకకాలంలో చూపిస్తాడు ఫొటోగ్రాఫర్‌. కొడుకు నృత్యానికి మురిసిపోయే తల్లి, కెమేరాలో బిగించే ప్రేమికురాలు !! ఓప్‌ా !

వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం , ఓం నమశ్శివాయ అంటూ సినిమా ప్రారంభంలోనే శైలజ నృత్య గీతం, కమల్‌ హాసన్‌ గీతల పాట వేవేల గోపమ్మా, బావి మీద తాగిన మైకంలో కమల్‌ చిందులేసే పాట తకిట తధిమ తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన పాటలు. ఎంత వ్రాసినా తరగదు.

వందేళ్ళ భారత చలన చిత్ర చరిత్రలోని మొదటి వంద సినిమాల్లో 13 వ సినిమాగా చోటు దక్కించుకుంది ఈ సినిమా. రష్యన్‌ భాష లోకి అనువదించబడిన మొదటి సినిమా. అంతే కాదు. రష్యాలో ఒకేసారి 400 థియేటర్లలో విడుదల చేసారట . ఎంత గొప్ప గౌరవం!

విశ్వనాధ్‌ జన్మ చరితార్ధం అయిపోయింది. 35 కేంద్రాలలో వంద రోజులు, విజయవాడ హైదరాబాదులలో 25 వారాలు అడిరది. బెంగుళూరులో ఒకే థియేటర్లో 511 రోజులు ఆడిరది.

ఇలాంటి రికార్డులు ఇంకా ఉన్నాయి. జాతీయ స్థాయిలో సంగీత దర్శకుడు ఇళయరాజాకు, గాయకుడు బాలసుబ్రమణ్యంకు అవార్డులు వచ్చాయి. విశ్వనాధుకు ఉత్తమ దర్శకుడు, కమల్‌ హాసనుకి ఉత్తమ నటుడు జయప్రదకు ఉత్తమనటి అవార్డులు ఫిలింఫేర్‌ నుంచి వచ్చాయి.

ఈ సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరరావుని, మాటల్ని వ్రాసిన జంధ్యాలని, నృత్య దర్శకులు శేషు- రఘులను, కళా దర్శకులు తరణిని, ఛాయాగ్రాహకుడు నివాసుని అభినందించాలి. ఈ సినిమాలో నటించిన నటీనటులు, పనిచేసిన ప్రతీ సాంకేతికుడు చరిత్రకారులే. ఇంతటి దృశ్య కావ్యాన్ని మనకు అందించిన విశ్వనాధుడికి కళాంజలి అర్పిస్తున్నాను.

సుబ్రమణ్యం డోగిపర్తి

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page