top of page

సిఫార్సులకు చెల్లుచీటీ.. బదిలీలకు వెలకట్టి!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Jun 21, 2025
  • 2 min read
  • వార్డెన్లకు గత డీడీ విశ్వమోహన్‌రెడ్డి షాక్‌

  • ఇష్టారాజ్యంగా బదిలీ జాబితా తయారీ

  • ఆయనపై ఫిర్యాదులున్నా చర్యలు నిల్‌

  • ఎదురు ఫిర్యాదులతో బాధితులకు బెదిరింపులు

మంత్రుల సిఫార్సులు చెల్లలేదు.. జేసీ సూచనలకూ విలువలేదు.. ప్రభుత్వ మార్గదర్శకాలూ అమలు కాలేదు. వెరసి సాంఘిక సంక్షేమ శాఖలో పలువురు వార్డెన్లకు సాధారణ బదిలీల్లో షాక్‌ తగిలింది. దీనికి కారణం.. ఇటీవలి బదిలీపై ఏలూరుకు వెళ్లిపోయిన ఆ శాఖ డీడీ విశ్వమోహన్‌రెడ్డి నిర్వాకమే. మాజీ ఐఏఎస్‌ అధికారి ధనంజయరెడ్డి సిఫార్సుతో జిల్లాకు వచ్చి నాలుగేళ్లు ఇక్కడే తిష్ట వేసిన విశ్వమోహన్‌రెడ్డి బదిలీపై వెళ్తూ వెళ్తూ.. పలువురు వార్డెన్లను ఇష్టారాజ్యంగా బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. సాధారణ బదిలీల్లో సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రభుత్వ మార్గదర్శకాలను పట్టించుకోకుండా, కౌన్సెలింగ్‌ చేయకుండానే పలువురు వార్డెన్ల పేర్లను బదిలీ జాబితాలో చేర్చేసి తాను బదిలీపై వెళ్లిపోయారు. ఆయన ఇచ్చిన జాబితానే ఉన్నతాధికారులు కళ్లు మూసుకొని ఆమోదించేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఇచ్చిన సిఫార్సు లేఖలను విశ్వమోహన్‌ రెడ్డి పరిగణనలోకి తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులకు మంత్రుల పేషీ నుంచి సమాచారం వెళ్లినా వారూ స్పందించలేదని తెలిసింది. కొందరు మహిళా వార్డెన్లు గ్రీవెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ను కలిసి విన్నవించుకోగా, ఆయన డీడీ విశ్వమోహన్‌ రెడ్డిని పిలిపించి సదరు మహిళా వార్డెన్ల గ్రీవెన్స్‌కు అనుగుణంగా బదిలీ చేయాలని సూచించారు. దాన్ని కూడా డీడీ పట్టించుకోలేదు.

నాలుగేళ్లలో ఎన్నో ఆరోపణలు

సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినప్పటి నుంచే విశ్వమోహన్‌రెడ్డి జిల్లా నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏలూరు జిల్లాకు చెందిన ఒక మంత్రితో చెప్పించుకుని బదిలీ చేయించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లిపోతానన్న ధీమాతోనే ఎవరి సిఫార్సులు, రిక్వెస్టులను ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా బదిలీ జాబితా రూపొందించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీ కావాల్సిన సీనియర్ల నుంచి డబ్బులు దండుకుని, వారిని కాకుండా జూనియర్లపై బదిలీ వేటు వేశారని పలువురు వార్డెన్లు ఆరోపిస్తున్నారు. టెక్కలి, నరసన్నపేటలకు చెందిన మహిళా వార్డెన్లు వయస్సు, ఆరోగ్యరీత్యా తమను బదిలీ చేయవద్దని వేడుకున్నా, ఉన్నతాధికారులు సదరు మహిళా వార్డెన్ల రిక్వెస్టులను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించినా పట్టించుకోలేదు. డీడీ విశ్వమోహన్‌రెడ్డి సర్వీస్‌ మొత్తం పనిష్మెంట్స్‌తోనే నిండిపోయింది. పనిచేసిన ప్రతిచోటా ఆయనపై ఫిర్యాదులు, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం షరా మామూలే. జిల్లాలో నాలుగేళ్లుగా పనిచేస్తున్న విశ్వమోహన్‌రెడ్డిపై వార్డెన్లు, నాలుగో తరగతి ఉద్యోగులు కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. వీరితో పాటు దళిత సంఘాల నాయకులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇస్తానని నగదు తీసుకున్నట్టు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

ఎదురు ఫిర్యాదులు

కాగా తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ తనపై ఫిర్యాదు చేసిన వారిపైనే డీడీ విశ్వమోహన్‌రెడ్డి పోలీసులకు ఎదురు ఫిర్యాదులు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తులు టీడీపీ అనుబంధ విభాగాలకు చెందినవారు కావడంతో పోలీసులు వెనక్కి తగ్గారు. డీడీపై వచ్చిన ఫిర్యాదులపై విచారణకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పద్మావతిని కలెక్టర్‌ నియమించారు. ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్వమోహన్‌రెడ్డినే ఎదురుగా కూర్చోబెట్టి బాధితులను విచారించడం విచారణపై ప్రభావం చూపింది. దానికితోడు నోటీసులు ఇవ్వకుండానే.. అదీ కొందరిని మాత్రమే విచారణకు పిలిపించినట్లు తెలిసింది. దీనిపై బాధితులు నిలదీయగా నగదు ఇచ్చినట్టు ఆధారాలుంటే ఇవ్వాలని సూచించి పంపించేశారు. నరసన్నపేట కళాశాల హాస్టల్‌ వార్డెన్‌ తారకేశ్వరరావు మాత్రం ప్రమోషన్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా విచారణాధికారికి వివరించారు. కలెక్టర్‌కు నివేదిక ఇవ్వడానికి ముందు డీడీ విశ్వమోహన్‌రెడ్డి విచారణాధికారి పద్మావతిని కలిసి తాను ఎవరి నుంచీ నెలవారీ వసూళ్లకు పాల్పడలేదని చెబుతూ కొందరు వార్డెన్లతో సంతకాలు చేయించిన లేఖను ఆమెకు అందించారు.

విచారణ బుట్టదాఖలు

డీడీ అక్రమాలపై విచారణ నివేదిక ఇచ్చి 40 రోజులు గడిచినా ఇప్పటికీ అది వెలుగు చూడలేదు. డీడీపై చర్యల్లేవు. ఇంతలోనే సాధారణ బదిలీల ప్రక్రియ మొదలుకావడంతో రాజకీయ సిఫార్సుతో విశ్వమోహన్‌రెడ్డి ఏలూరు జిల్లాకు డీడీగా వెళ్లిపోయారు. వెళ్లేముందు నిబంధనలు, సిఫార్సులను ఖాతరు చేయకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించకుండా తనకు నచ్చినట్టు బదిలీ జాబితా తయారుచేసి ఉన్నతాధికారులకు పంపించారు. ఆ ప్రకారమే బదిలీలు జరిగాయి. విశ్వమోహన్‌రెడ్డి బదిలీపై వెళ్లిపోతున్నట్లు తెలుసుకున్న ఆయన బాధితులు ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.2.50 లక్షలు వసూలు చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు డబ్బులు ఇచ్చినట్టు ఆధారాలు ఉంటే సమర్పించాలని బాధితులకు సూచించారు. అయితే కార్యాలయంలోనే నగదు రూపంలో డబ్బులు ఇచ్చామని చెప్పగా, ఆధారాలుంటే తప్ప ఏమీ చేయలేమని చెప్పి గ్రీవెన్స్‌ను క్లోజ్‌ చేసేశారని బాధితులు చెబుతున్నారు. జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్‌ జగన్మోహన్‌రావు విశ్వమోహన్‌రెడ్డికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page