top of page

సామాన్యుడే బిగ్‌బాస్‌!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 22, 2025
  • 3 min read
  • కల్యాణ్‌ పడాలది భోగాపురం సమీప గ్రామమే

  • ఉత్తరాంధ్ర నుంచి ఆ టైటిల్‌ అందుకున్న మూడో వ్యక్తి

  • రెండో సీజను విజేతగా నిలిచిన విశాఖకు చెందిన కౌశల్‌

  • సీజన్‌ - 6 విజేత శ్రీకాకుళానికి చెందిన సింగర్‌ రేవంత్‌

  • ఉత్తరాంధ్ర నుంచే ముగ్గురు విజేతలు కావడం విశేషం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

కామనర్‌గా వచ్చాడు.. ఊహించని విధంగా కింగ్‌ అయ్యాడు. సామాన్యుడిగా ఎంటరైన జవాన్‌ సెలబ్రిటీలనే మట్టికరిపించి బిగ్‌బాస్‌ కిరీటం అందుకున్నాడు. ఒక కామనర్‌ బిగ్‌బాస్‌ విన్నర్‌ కావడంలో తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో వరుసగా రెండోసారి. గత సీజనులో రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవి ప్రశాంత్‌ విజయం సాధించాడు. తెలుగు బిగ్‌బాస్‌`9 విజేతగా నిలవడం ద్వారా పవన్‌కల్యాణ్‌ పడాల మరో రికార్డు కూడా సృష్టించాడు. ఉత్తరాంధ్ర నుంచి ఆ కిరిటీం అందుకున్న మూడో వ్యక్తి ఈయనే. గతంలో విశాఖ నగరంలోని బీహెచ్‌పీవీకి చెందిన కౌశల్‌ మండా బిగ్‌బాస్‌ రెండో సీజన్‌ విజేతగా నిలవగా, ప్రముఖ గాయకుడు, శ్రీకాకుళానికి చెందిన రేవంత్‌ రెడ్డి ఆరో సీజన్‌ బిగ్‌బాస్‌ కిరీటం అందుకున్నాడు.. ఇప్పుడు తొమ్మిదో సీజన్‌ విజేత కల్యాణ్‌ది విజయనగరం జిల్లా కావడం విశేషం. ఇక విశాఖకు చెందిన శ్రీజ కూడా బిగ్‌బాస్‌లోకి కామనర్‌గా ప్రవేశించినా ఆమె కొన్ని వారాల్లోనే ఎలిమినేట్‌ అయ్యింది. తర్వాత రెండోసారి కూడా హౌస్‌లోకి ప్రవేశం లభించినా ఆమె దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కల్యాణ్‌ పడాల మాత్రం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి అందలం ఎక్కాడు. ఫైనల్‌కు ముందు వారం వరకు ఒటింగులో అగ్రస్థానంలో ఉన్న మహిళా సెలబ్రిటీ తనూజ పుట్టస్వామిని చివరి వారంలో వెనక్కి నెట్టి టాప్‌లోకి దూసుకొచ్చిన అతను అదే ఊపులో టైటిల్‌ కొట్టేశాడు. గత సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌ను విజేతను చేయడం ద్వారా జైకిసాన్‌ అన్న బిగ్‌బాస్‌ ఓటర్లు.. ఈసారి కల్యాణ్‌ పడాలను అందలం ఎక్కించి జైజవాన్‌ అన్నారు.

ఎవరీ పవన్‌కల్యాణ్‌?

పవన్‌కల్యాణ్‌ పడాల(29) సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఒక సాధారణ జవాన్‌. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని సుందరపేట అనే చిన్న ఊరు ఈయన స్వగ్రామం. దిగువ మధ్యతరగతి కుటుంబం. తల్లి గృహిణి కాగా తండ్రి స్వగ్రామంలో పాన్‌ షాపు నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తమ ప్రాంతంతోపాటు బంధువర్గంలో చాలామంది ఆర్మీ, పోలీసు వంటి రక్షణ విభాగాల్లో పని చేస్తుండటం, సినిమాల్లోని ఆ తరహా పాత్రలతో స్ఫూర్తి పొందిన కల్యాణ్‌ చిన్నతనంలోనే రక్షణదళాల్లో పని చేయడం, సినిమా ఇండస్ట్రీలో చేరడం లక్ష్యాలుగా పెట్టుకున్నాడు. అయితే తండ్రి సూచన ప్రకారం, ఇంటి ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మొదట యూనిఫాం సర్వీస్‌లో కొన్నాళ్లు పనిచేయాలని నిశ్చయించుకుని పారా మిలటరీ దళమైన సీఆర్‌పీఎఫ్‌లో జవాన్‌ పోస్టు ఎంపిక ప్రక్రియలో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అందులో విజయం సాధించి మూడేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. అక్కడ దీర్ఘకాల సెలవు పెట్టి బిగ్‌బాస్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షకు పెట్టి ఇక్కడా విజయం సాధించాడు. దీని ద్వారా సెలబ్రిటీగా మారి సినిమా రంగం నుంచి అవకాశాలు అందుకోవాలన్నది తన లక్ష్యమని ఆయన చెప్పాడు.

అగ్నిపరీక్షలో నెగ్గి..

బిగ్‌బాస్‌లో సెలబ్రిటీలతోపాటు కామనర్స్‌కు ప్రవేశం కల్పించేందుకు ఈసారి నిర్వాహకులు కొత్త విధానం అనుసరించారు. అగ్నిపరీక్ష పేరుతో కఠిన ఎంపిక ప్రక్రియ ద్వారా పోటీదారులను ఎంపిక చేయాలని నిర్ణయించి.. ఆ మేరకు ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. స్పందించిన వేలాది దరఖాస్తుదారులను రకరకాల ప్రక్రియతో వడపోసి చివరికి 15 మందితో షార్ట్‌లిస్ట్‌ చేశారు. అందులో చోటు సంపాదించిన కల్యాణ్‌ అగ్నిపరీక్షలో ఆ 15 మందితో పోటీపడి అర్హత సాధించిన ఐదుగురిలో ఒకడిగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంటరయ్యాడు. కానీ అప్పట్లో ఇతనిపై ఎలాంటి అంచనాల్లేవు. దానికి తగినట్లే మొదటి మూడు నాలుగు వారాలు హౌస్‌లో అతని ఆట కూడా పెద్దగా కనిపించలేదు. పైగా మహిళల పిచ్చోడు అన్న ఒక అపవాదు కూడా వచ్చింది. కానీ వాటిని తట్టుకుని.. పరిస్థితులను ఎదురిదీ టాప్‌ పొజీషన్‌కు దూసుకెళ్లిన తీరు అబ్బురపర్చింది. మూడోవారంలో బిగ్‌బాస్‌ తనను కన్ఫెషన్‌ రూముకు పిలిచి ఇచ్చిన క్లాస్‌, ఆ తర్వాత ఫ్యామిలీ వీక్‌లో తల్లిదండ్రులు వచ్చి చెప్పిన మాటలతో కల్యాణ్‌ తన ఆటతీరును సమూలంగా మార్చేసుకున్నాడు. దెబ్బతిన్న పులిలా విజృంభించాడు. పారా మిలటరీలో పని చేసిన అనుభవం కూడా కలిసి వచ్చింది. అక్కడి క్రమశిక్షణ, కఠిన సాధన బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫిజికల్‌ టాస్క్‌ల్లో బాగా ఉపయోగపడి విజయం సాధించేందుకు దోహదపడ్డాయి.

అట్టడుగు నుంచి అగ్రస్థానానికి

హౌస్‌లో జరిగే టాస్కులతోపాటు వారం వారం జరిగే ఓటింగులోనూ ఎక్కడో చివరి స్థానాల్లో ఉన్న కల్యాణ్‌ ఫ్యామిలీ వీక్‌ తర్వాత నుంచి జెట్‌ స్పీడ్‌తో చెలారేగిపోయాడు. తన ఆటతీరును పూర్తిగా మార్చేసుకుని స్రాటజికల్‌గా ఆడుతూ తనపై ఉన్న నెగిటివిటీని పాజిటివ్‌గా మార్చుకోగలిగిన ఆయన ఫ్యామిలి వీక్‌ తర్వాత ఓటింగులోనూ సత్తా చూపించడం మొదలుపెట్టాడు. తొలివారాల్లో తనూజ, ఇమ్మాన్యుయేల్‌ తొలి రెండు స్థానాల్లో పోటీ పడగా.. చివరిలో ఉన్న కల్యాణ్‌ క్రమంగా తన స్థానాన్ని మెరుగుపర్చుకుంటూ మొదట టాప్‌ ఫైవ్‌లోకి.. ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్‌ తదితరులను వెనక్కి నెట్టి మూడు, రెండు స్థానాల్లోకి.. చివరి వారంలో తనూజనూ వెనక్కి నెట్టి మొదటి స్థానంలో కి వచ్చి తిష్ట వేశాడు. తన ఆటతీరు మారడానికి తనూజ సలహాలు, ప్రోత్సాహమే కారణమని చెప్పిన కల్యాణ్‌ చివరికి ఆ తనూజనే వెనక్కి నెట్టి ఆఖండ ప్రేక్షకాదరణతో టైటిల్‌నే ఎగరేసుకుపోయాడు. బిగ్‌బిస్‌ టైటిల్‌ అందుకున్న అతి చిన్న వయస్కుడిగానూ రికార్డు సృష్టించాడు. జయహో జవాన్‌.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page