top of page

స్వల్ప వివాదం.. తీసింది ప్రాణం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 11 hours ago
  • 2 min read
  • మేనల్లుడిని మందలించిన యువకుడు

  • తమనెందుకు నిందించావని మరొకడి నిలదీత

  • ఇద్దరి మధ్య వాదులాట, తోపులాట

  • కిందపడి మరణించిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి

  • గంజాయి, మద్యం బానిసల ఆగడాలేనని ఆరోపణలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

స్వల్ప వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పరిచయమే లేని ఇద్దరు యువకుల మధ్య అనవసరం మొదలైన గొడవ తోపులా{కు దారితీసి ఒకరి మరణానికి కారణమైంది. ఉగాది రోజు అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మండలవీధికి చెందిన గొర్లె మోహనరావు (26) అనే యువకుడు మతిచెందాడు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏళ్ల తరబడి పనిచేసి రెండేళ్ల క్రితం మరణించిన గొర్లె రమణ కుమారుడే మోహనరావు. తండ్రి మరణం తర్వాత ఆ ఉద్యోగంలో చేరిన మోహనరావు గురువారం నరసన్నపేటలో జరిగిన పార్టీ సమావేశానికి వెళ్లి రాత్రి పొద్దుపోయాక తిరిగి వచ్చాడు. ఇంటికి వెళ్లే క్రమంలో ఉమెన్స్ కళాశాల ఎదురుగా మండల వీధికి వెళ్లే రోడ్డులో తన మేనల్లుడు హరీష్ మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన కొందరు యువకులతో కలిసి ఉండటాన్ని గమనించి వారి వద్దకు వెళ్లాడు. మేనల్లుడిని పిలిచి అంత రాత్రి వరకు.. అదీ మహాలక్ష్మీనగర్ యువకులతో ఎందుకు ఉన్నావంటూ మందలించినట్లు పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం తెలుస్తోంది. మోహనరావు మందలింపులను విన్న గుంపులోని గడ్డి మనోహర్ అలియాస్ మనోజ్ అనే యువకుడు కల్పించుకుని మహాలక్ష్మినగర్ యువకులను ఎందుకు నిందిస్తున్నావంటూ నిలదీశాడు. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. ఆ క్రమంలో బైక్ మీద ఉన్న మోహనరావును మనోజ్ బలంగా నెట్టడంతో కింద పడిపోయిన బాధితుడి తలకు బలమైన గాయమైంది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మోహనరావు కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే రిమ్స్‌కు తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మోహనరావు మరణించినట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సంఘటన స్థలంలో యువకుల సమూహం ఉండగా.. పోలీసులు మాత్రం తోపులాట జరిగినప్పుడు మోహనరావు, మనోజ్ ఇద్దరే ఉన్నారని చెబుతున్నారు. మోహన్ మతిని వైద్యులు ధ్రువీకరించడంతో ఒకటో పట్టణ పోలీసులు నిందితుడు మనోజ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తలకు బలమైన గాయం కావడం వల్లే మోహనరావు మతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు. రాత్రి 10.30 నుంచి 12.30 మధ్యలో జరిగిన ఈ ఘటన ఊహించిన విధంగా జరిగిందని పోలీసులు చెబుతున్నారు. వివాదం ఎందుకు తలెత్తిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

రాత్రియితే రోడ్డంతా వారిదే

కాగా వాగ్వాదం, తోపులాట జరిగిన సమయంలో మోహనరావు మద్యం సేవించి ఉన్నాడని చెబుతున్నారు. మద్యం మత్తులో ఉండటం వల్లే మనోజ్ నెట్టడంతో ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడినట్టు చెబుతున్నారు. కాగా ఇంటర్ చదువుతున్న మనోజ్ పేద కుటుంబానికి చెందినవాడు. తండ్రి రాము పెయింటర్‌గా పనిచేస్తుంటే, తల్లి దుర్గ బట్టల దుకాణంలో పనిచేస్తున్నారు. ఈ వివాదంలో మనోజ్‌తో పాటు మహాలక్ష్మీనగర్‌కు చెందిన మరికొందరు యువకుల పాత్ర కూడా ఉందన్న చర్చ జరుగుతున్నది. మహాలక్ష్మీనగర్‌తో పాటు సమీపంలోని పలు వీధులకు చెందిన యువకులు ఘటన జరిగిన ప్రాంతంలోనే రాత్రి వేళల్లో గుంపులుగా చేరి గంజాయి, మద్యం సేవిస్తూ అర్ధరాత్రి వరకు అక్కడే గడుపుతుంటారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై పత్రికల్లో పలుమార్లు కథనాలు వచ్చినా, ఆ ఏరియాలోనే ఏడాది క్రితం ఒక యువకుడి ఇంట్లో రెండు కేజీలు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నా పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. రాత్రి ఏడు దాటితే చాలు.. గంజాయి, మద్యం బ్యాచ్‌లు ఆగడాల వల్ల ఆ ప్రాంతంతో పాటు జిల్లా విద్యాశాఖ కార్యాలయం రోడ్డులోనూ మహిళలు, వద్ధులు రాకపోకలు సాగించలేకపోతున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మార్గంలో వీధి లైట్లు వెలగవు. ఒకవేళ బాగు చేసినా వాటిని యువమూకలు పగులగొట్టేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పడు, ఏవైనా జరగరానివి జరిగినప్పుడు మాత్రం హడావుడి చేసే పోలీసులు ఆతర్వాత చేతులు దులుపుకుంటున్నారు. దీంతో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page