సమగ్రశిక్షలో కంత్రీ త్రయం!
- Prasad Satyam
- 2 hours ago
- 2 min read
పేరుకు సైట్ ఇంజినీర్లు.. మంత్రుల పేషీలే వారి పనిస్థలాలు
విధుల కంటే వడ్డీ వ్యాపారాలు, పర్సంటేజీలకే ప్రాధాన్యం
ఏపీసీలు, డీఈఈలనే ఖాతారు చేయని ఘనులు
కాంట్రాక్టర్లను బెదిరించడంలో సిద్ధహస్తులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సమగ్రశిక్షలో ఉద్యోగం వారికి ఆటవిడుపులా తయారైంది. ఎందుకంటే.. అధికారంలో ఎవరుంటే వారి పంచన చేరి, పనులు చక్కబెట్టే మనుషులే వీరితో ఉంటారు. అదే వీరి ధీమా. ఏ జిల్లాలో పని చేసినా.. ఏపీసీలుగా ఎవరున్నా వీరు అస్సలు లక్ష్యపెట్టరు. ఉద్యోగం కంటే వేరే వ్యాపకాలపైనే మక్కువ ఎక్కువ. ఇక ప్రతి పనిలోనూ పర్సంటేజీలు తీసుకోవడం.. వచ్చిన సొమ్మును తమకు నచ్చిన అధికారులను కాపాడుకోవడానికి వెచ్చిస్తుంటారు కాబట్టి సమగ్రశిక్షలో వీరు ఆడిందే ఆట, పాడిందే పాట. చివరకు ఐఏఎస్ అధికారి బాస్‌గా ఉన్నా ఆయన ఆదేశాలను సైతం వీరు ఖాతరు చేయరంటే.. ఇక జిల్లాలో ఏపీసీల పరిస్థితేమిటో వేరేగా చెప్పనక్కర్లేదు. ఈ ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురి పేర్లు రామానంద్, చంద్రమౌళి, పట్టాభి రామారావు. ఇందులో చంద్రమౌళి, పట్టాభి రామారావులు సమగ్రశిక్షలో సైట్ ఇంజినీర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తూనే.. వడ్డీ వ్యాపారాలపై దృష్టి సారిస్తారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. రామానంద్ కూడా సైట్ ఇంజినీరే. ఆయన తన స్థాయికి మించి రాజకీయాలు చేస్తుంటారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లా నుంచి తమ సామాజికవర్గానికి చెందినవారే మంత్రిగా ఉంటారని ఆయనకు బాగా తెలుసు. సైట్ ఇంజినీర్ అంటే పని ప్రదేశం(సైట్)లో ఉండి పనిచేయాలి. కానీ ఆయన సైట్ కంటే సంబంధిత మంత్రుల పేషీల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారు.
మెమోలకూ స్పందించని నిర్లక్ష్యం
అసలు సమగ్రశిక్షలో తనకు పడనివారందరూ నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారంటూ తెర వెనుక లీకులిచ్చిన రామానంద్ తనకు తెలియకుండానే ఓ మంచిపనికి పునాది వేశారు. ఆయన పుణ్యమాని రాష్ట్రవ్యాప్తంగా సమగ్రశిక్షలో పని చేస్తున్న ఉద్యోగులందరి సర్టిఫికెట్ల జెన్యూనిటీని చెక్ చేయాలని సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇటీవల ఆదేశించారు. ఇది జరిగితే ఎంతమంది ఫేక్ సర్టిఫికెట్లతో సమగ్రశిక్షలో ఉద్యోగాలు వెలగబెడుతున్నారో తేలిపోనుంది. ఆ క్రమంలో రామానంద్ సమర్పించిన సర్టిఫికెట్లలో కూడా ఎటువంటి లొసుగులున్నాయో త్వరలోనే బహిర్గతం కానుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన 15 ఏళ్లుగా పని చేస్తున్న రామానంద్ పార్టీలను, మంత్రుల పేషీలను మేనేజ్ చేయడంలో దిట్ట. ఆ ధైర్యంతోనే గత ఏడాది డిసెంబరు 29న రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక సమీక్ష నిర్వహిస్తే, దానికి ఈ ముగ్గురితో పాటు మరో నలుగురు హాజరుకాలేదు. దీనికి కారణాలు చెప్పాలని మెమోలు ఇచ్చినా సరైన సమాధానం లేదు. దీంతో వీరిని అల్లూరి సీతారామరాజు మన్యం, పార్వతీపురం మన్యం జిల్లాలకు బదిలీ చేశారు. దాంతో మొత్తం సమగ్రశిక్ష మీదే వీరు కక్ష పెంచుకున్నారు. అది ఏమిటి? ఎలా? అనేది మరో కథనంలో తెలుకుందాం. ఇక రామానంద్‌ను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నది చంద్రమౌళి. వడ్డీ వ్యాపారం చేయడం, చేపట్టిన పనుల్లో పర్సంటేజీలు అడగడం, ఇవ్వనన్నవారిని బెదిరించడం వంటి ఆరోపణలు చంద్రమౌళిపై లెక్కలేనన్ని ఉన్నాయి.
ఫిర్యాదు చేసిన డీఈఈనే తరిమేశారు
నాడు`నేడు ఫేజ్`1 పనుల్లో భాగంగా జలుమÖరు కేజీబీవీలో అవకతవకలు జరిగాయని అప్పటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ సైట్ ఇంజినీర్‌గా పని చేసింది చంద్రమౌళీయే. దాంతో వీరంతా కలిసి ఏకంగా డిప్యూటీ ఈఈనే సమగ్రశిక్ష నుంచి లేపేశారు. ఆయన పేరెంట్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన ఒక ఇష్యూను తెర మీదకు తీసుకువచ్చి సదరు డిప్యూటీ ఈఈని సమగ్రశిక్షలో లేకుండా చేశారు. పట్టాభిరామారావుకు కూడా వడ్డీవ్యాపారముంది. నాడు`నేడు పనుల్లో కమీషన్లు అడుగుతున్నారన్న ఆరోపణలతో అప్పటి ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తన నియోజకవర్గంలో పని చేయొద్దని తెగేసి చెప్పేశారు. దీంతో అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు పేషీని ఆశ్రయించి గార మండలానికి బదిలీ చేయించుకున్నారు. చంద్రమౌళి, పట్టాభిలకు కాంట్రాక్టర్లను బెదిరించి కమీషన్లు తీసుకోవడం, తిరిగి వారికే వడ్డీకి అప్ప్పులివ్వడం పరిపాటిగా మారిందని చాలామంది చెబుతుంటారు. ఇక రామానంద్ అయితే కాంట్రాక్టర్లను బెదిరించి, వారితోనే పార్టనర్‌షిప్ వ్యాపారం చేస్తారని, 50 శాతం పనులు చేయించి 100 శాతం బిల్లులు పెడతారని భోగట్టా. ఇప్ప్పుడు ఇటువంటి వ్యవహారాలపై వారం రోజుల నుంచి స్టేట్ ఆడిట్ టీమ్ జల్లెడ పడుతున్నది.






Comments