హ్యాట్సాఫ్ రేవతి..!
- Guest Writer
- 2 hours ago
- 1 min read

హెడ్ కానిస్టేబుల్ రేవతి.. సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడటానికి కారణమైన కీలక సాక్షి. ఒక సందర్భంలో మనస్సాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు దేశాన్ని కుదిపేసిన ఘటన. కానీ ఆ దారుణం బయటకు రావడానికి కారణం రేవతి.
సంఘటన జరిగిన తర్వాత స్టేషన్‌లో పరిస్థితి ఎలా ఉందంటే.. జరిగినది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తుడిచేయాలి, కథను మార్చాలి.. ఇవే ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో చాలామంది పోలీసులు సైలెంట్‌గా ఉండటాన్నే సేఫ్‌గా భావిస్తారు. కానీ రేవతి ఆ ఆప్షన్ తీసుకోలేదు. ఆమెకి అది కేవలం డ్యూటీ విషయం కాదు.. తన కళ్ల ముందు జరిగిన దారుణానికి స్పందించాల్సిన బాధ్యత.
తోటి సిబ్బంది ఒకవైపు.. పై అధికారుల ఒత్తిడి మరోవైపు.. ఇలాంటి పరిస్థితిలో నిలబడటం అనేది చిన్న విషయం కాదు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. మేజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు దిశనే మార్చింది. అది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు.. ఆ రాత్రి జరిగిన వాస్తవానికి మొదటి స్పష్టమైన రూపం.
పోలీసులు స్టేషన్‌ను శుభ్రం చేసి సాక్ష్యాలను తుడిచివేసినా, ఆమె అత్యంత చాకచక్యంగా గోడల మూలల్లో, టేబుళ్ల కింద మిగిలిపోయిన రక్తపు మరకలను గుర్తించి మేజిస్ట్రేట్‌కు చూపించారు. ఈ రక్తపు చుక్కలే నిందితుల నేరాన్ని శాస్త్రీయంగా నిరూపించడంలో ప్రధాన భూమిక పోషించాయి. సీసీటీవీ ఫుటేజీని మాయం చేసినా, ఆమె తన జ్ఞాపకశక్తితో సంఘటనలు జరిగిన సమయాలను పూసగుచ్చినట్లు వివరించి దర్యాప్తుకు దిక్సూచిలా నిలిచారు. ఇది సాధారణ విషయం కాదు. అదే వ్యవస్థలో ఉండి, అదే వ్యవస్థకు వ్యతిరేకంగా నిజం చెప్పడం అంటే చాలా పెద్ద నిర్ణయం. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు.
ఆమె చెప్పిన విషయాల ఆధారంగా కేసు బలపడింది. కోర్టు కూడా ఆమె భద్రతపై దృష్టి పెట్టి ప్రత్యేక రక్షణ కల్పించింది. అది ఆమె చెప్పిన నిజానికి వచ్చిన గుర్తింపు. రేవతి చేసిన పని గొప్పగా చూపించాల్సిన అవసరం లేదు. ఆమె చేసింది చాలా సింపుల్.. జరిగినదాన్ని దాచలేదు. కానీ అదే సమయంలో చాలామంది చేయలేని పని అదే. సాత్తాన్‌కుళం కేసులో న్యాయం జరగడానికి కారణాలు చాలా ఉండొచ్చు. కానీ నిజం బయటికి రావడానికి కారణమైన పేరు ఒక్కటే.. రేవతి. హ్యాట్సాఫ్ హెడ్ కానిస్టేబుల్ రేవతి.
-క్రిష్






Comments