హే ‘రామ్ జీ’
- BAGADI NARAYANARAO

- 2 days ago
- 2 min read
ఉపాధి పథకానికి కష్టాలు మొదల్యాయి
అప్‌లోడ్ కాని రూ.109 కోట్ల పనుల బిల్లులు
కేటాయింపులకు మించి అనుమతులివ్వడమే కారణం
తెలుగు తమ్ముళ్లు, కాంట్రాక్టర్లు లబోదిబో
జెడ్పీ సమావేశంలో వీబీ జి రామ్ జీ పైనే ఎమ్మెల్యేలు గగ్గోలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లాలో గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 2025`26 ఆర్ధిక సంవత్సరంలో రూ.224 కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఖర్చు చేయడానికి అవకాశం ఉంటే.. జిల్లా ఉన్నతాధికారుల అత్యుత్సాహం, కూటమి ప్రజాప్రతినిధుల హడావుడి కారణంగా రూ.334 కోట్లు విలువైన బీటీ, సీసీ రోడ్లతో పాటు వివిధ రకాల మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేశారు. అయితే ఇప్ప్పుడు ఈ పథకం రూపం మారడంతో పాటు పేరు కూడా మారడంతో అంచనాలకు మించి జరిగిన పనులకు బిల్లులు చెల్లించలేమని పంచాయతీరాజ్ అధికారులు చేతులెత్తేశారు. కొత్త బిల్లు చట్టం కాలేదని ప్రజాప్రతినిధులు జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో మొత్తుకున్నా తమకైతే గైడ్‌లైన్స్ వచ్చేశాయని, కేటాయింపులకు మించి జరిగిన పనులను కొలవలేమని, ఆ మేరకు బిల్లులు కూడా జరగవని తేల్చేశారు. దీంతో బిల్లులు అప్‌లోడ్ కాక దాదాపు రూ.110 కోట్లు గాలిలో ఉన్నాయి. ఇంతవరక మెటీరియల్ కాంపోనెంట్ నిధుల మేరకు రూ.224 కోట్లతో చేపట్టిన పనులకు మాత్రమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. అదనంగా రూ. 109 కోట్లతో చేపట్టిన పనులకు అనుమతి రాలేదు. రూ.109 కోట్లతో చేపట్టిన పనులు పూర్తిచేసినా, వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. వీటితో పాటు సీసీ, బీటీ రోడ్డు పనులు చేపట్టి ఎంబుక్‌లో నమోదు చేయనివి సుమారు రూ.5 కోట్ల మేర ఉన్నాయి. వీటన్నింటికీ ఉపాధి హమీ పధకం ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం లేకుండా పోయింది. ఆర్ధిక సంవత్సరంలో జనరేట్ అయిన మెటీరియల్ కాంపోనెంట్ నిధులు మేరకే పనులు చేపట్టాల్సి ఉన్నా వెనుకా ముందు ఆలోచించకుండా ఎడాపెడా పనులు చేసేశారు. ఒక ఆర్ధిక సంవత్సరంలో కూలీలు చేసే ఉపాధి పని దినాలు మేరకు మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ అవుతుంది. ఈ మెటీరియల్ కాంపోనెంట్ నిధులను ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెపండగ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ, బీటీ రోడ్డులు నిర్మాణం చేయడానికి నిర్ణయించారు. గత ఏడాది మెటీరియల్ కాంపోనెంట్ నిధులు జనరేట్ ఆయన మేరకు పనులు చేపట్టారు. అదనంగా చేపట్టిన పనులకు ఈ ఆర్థిక సంవత్సరంలో వాటికి అనుమతి తెచ్చుకున్నారు. ఈ ఏడాది అదనంగా పనులు చేసి కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు చేతులు కాల్చుకున్నారు.
ఈ ఏడాది జనవరి 18 నుంచి ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలో రూ.55 కోట్ల మేర కూలీలకు వేతనాలు చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్రం రెండు రోజుల క్రితం ఉపాధి కూలీలకు వేతనాల కోసం సుమారు రూ.1850 కోట్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కూలీల ఖాతాల్లో వేతనాలు మరో వారం రోజుల్లో జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అనిధులను పక్కదారి పట్టించకపోతే కూలీ ఖాతాల్లో జమవుతాయి. ప్రభుత్వం ఆ నిధులను ఇతర అవసరాల కోసం వినియోగిస్తే కూలీల దినసరి వేతనాలు చెల్లింపు మరింత ఆసల్యం కావచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కూలీల్లో 30 శాతం బోగస్, బినామీ హాజరుకు చెక్ పెట్టారని అధికారులు చెబుతున్నారు. బోగస్ హాజరు తగ్గడం వల్లన ఉపాధి పని దినాల్లోనూ గణనీయమైన తగ్గుదల నమోదు కానుంది. దీంతో జనరే{య్యే మెటీరియల్ కాంపోనెంట్ నిధులు తగ్గనున్నాయని కూటమి పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బుధవారం జెడ్పీలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కనెక్టివిటీ పెంచడానికి స్థానిక ప్రజాప్రతినిధులు చొరవతో కూటమి కార్యకర్తలు పోటాపోటీగా అవసరమున్నా, లేకపోయినా కాంట్రాక్టర్లు బీటీ రోడ్డులు నిర్మించారు. వీటన్నింటినీ ఎం`బుక్ ఎక్కించారు. పనులు బిల్లు పాస్ ఆన్ స్టేటస్‌కు వచ్చినా, వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ బిల్లులు వచ్చే అవకాశం ఉందా? అంటే అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పలేని పరిస్థితి. పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కూటమి నాయకులు, కార్యకర్తలకు బిల్లులు చేయిస్తామని హమీ ఇవ్వడం మినహా ఎమ్మెల్యేలు చేసిందేమీ లేదు.






Comments