హింసలో క్రియేటివిటీ... కథలో ఖాళీ!
- Guest Writer
- 4 hours ago
- 3 min read

రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం జరుగుతుంది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆశపడిన హోం మంత్రి, తన కొడుకుతో కలిసి సీఎంని ఫామ్ హౌస్‌లో చంపేస్తాడు. అన్ని ప్లాన్లు పక్కాగా వేసుకుని హత్య చేసిన వాళ్లు, ఒక్క విషయం మాత్రం మిస్ అవుతారు. ఫామ్ హౌస్ బయట ఉన్న ఓ సీసీ కెమెరాలో మొత్తం మర్డర్ రికార్డ్ అవుతుంది. ఆ కెమెరాలు పెట్టిన వ్యక్తి విష్ణు (తనీష్). భార్య లక్ష్మి, కూతురు తేజుతో హ్యాపీగా జీవిస్తున్న విష్ణు, ఆ వీడియో చూసిన తర్వాత షాక్ అవుతాడు. అదే విషయం హోం మంత్రి కొడుక్కి కూడా తెలుస్తుంది.
అంతే... వీడియో కోసం నేరుగా విష్ణు ఇంటికే వెళ్లిపోతారు. వీడియో ఎక్కడ ఉందో చెప్పమని విష్ణు, అతని భార్యను టార్చర్ చేస్తారు. చివరకు ఇద్దరినీ చంపేస్తారు. కానీ వాళ్ల చిన్న కూతురు తేజు మాత్రం అల్మారాలో దాక్కొని ఈ హత్యలన్నీ చూస్తుంది. బ్రతుకుతుంది. అదే సమయంలో ఆ ఇంటికి కుక్కకు గ్రూమింగ్ చేయడానికి వచ్చిన రుద్ర అలియాస్ ‘రేజర’ (రవిబాబు), అక్కడ ఏదో తప్పు జరిగిందని గుర్తిస్తాడు. చిన్నారి ప్రమాదంలో ఉందని తెలుసుకుని, ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
పాప కోసం మొదలైన వేట
హత్యలకు సాక్షిగా ఉన్న ఆ చిన్నారిని కూడా చంపేయాలని హోం మంత్రి గ్యాంగ్ నిర్ణయిస్తుంది. ఎక్కడ దాక్కున్నా వాళ్లు వెతుక్కుంటూ వస్తుంటారు. కానీ ప్రతి సారి వాళ్లకు ఎదురుగా నిలబడేది రుద్రే. సాధారణంగా కనిపించే రుద్ర, ఒక్కోసారి భయంకరంగా మారిపోతాడు. పాపను చంపడానికి వచ్చిన వారిని దారుణంగా కొడతాడు, చంపేస్తాడు. అతను నిజంగా డాగ్ గ్రూమర్ మాత్రమేనా? లేక గతంలో ఇంకేదైనా చీకటి కథ ఉందా?
ఆ వీడియోలో ఏముంది?
హోం మంత్రి.. సీఎం ని హత్య చేసిన వీడియో బయటకు వస్తే, అతని రాజకీయ జీవితం పూర్తిగా ముగిసిపోతుంది. అందుకే ఆ వీడియో కోసం ఎంతకైనా వెళ్తాడు. విష్ణు చనిపోయే ముందు ఆ వీడియోను ఎక్కడో దాచిపెడతాడు. ఇప్పుడు ఆ వీడియో ఎవరి చేతికి వస్తుంది? రుద్ర దాన్ని బయటపెడతాడా? లేక హోం మంత్రి దాన్ని మాయం చేస్తాడా? అన్న టెన్షన్‌తో సినిమా సాగుతుంది.
‘ రేజర్’ అనే పేరు ఎందుకు?
సినిమాలో రుద్రను ‘రేజర’ అని పిలవడానికి కారణం ఉంది. అతను ఒక్కసారి కోపం తెచ్చుకుంటే ఎదుటివాళ్లను వదిలిపెట్టడు. చాలా స్టైలిష్‌గా, చాలా వైలెంట్‌గా శత్రువులను ముగిస్తాడు. అందుకే అతని పేరు ‘రేజర్’గా మారుతుంది.
చివరికి ఏమైంది?
ఆ చిన్నారి చివరకు సేఫ్‌గా బయటపడిందా? సీఎం హత్య వీడియో బయటకు వచ్చిందా? హోం మంత్రి, అతని కొడుకు చేసిన పాపాలకు శిక్ష పడిందా? రుద్ర అసలు ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ‘రేజర్’ సినిమాను థియేటర్‌లో చూడాల్సిందే.
విశ్లేషణ
సినిమా మొత్తం ఒక వీడియో గేమ్‌లా పరుగెడుతుంది. హీరో ఒక లెవెల్ దాటితే, ఇంకో గ్యాంగ్ వస్తుంది. వాళ్లని కొడితే ఇంకో ట్రాప్ రెడీగా ఉంటుంది. హీరో టీం ఒక స్క్రీన్ ముందు కూర్చుని విలన్లను ట్రాక్ చేస్తుంది. విలన్ టీం మరో స్క్రీన్ ముందు కూర్చుని హీరోని ట్రాక్ చేస్తుంది. చూస్తుంటే సర్వర్ రూమ్‌లో యుద్ధం జరుగుతున్నట్టుంటుంది. ఒక సిస్టమ్ ఉంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో కనిపెట్టేయొచ్చన్న అమాయక నమ్మకంతో స్క్రీన్‌ప్లే ముందుకు పరిగెడుతుంది.
ఈ మధ్యన హింసని విపరీతంగా చూపిస్తూ సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా మళయాళం నుంచి వచ్చిన మార్కో (2024): అత్యంత హింసాత్మకమైన మలయాళ చిత్రాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై కోర్టు కేసులు కూడా అయ్యాయి. అలాగే తెలుగులో నాని నటించిన హిట్ 3 కూడా హింసను విపరీతంగాచూపించారు. అలాగే హిందీలో వచ్చిన కిల్ సినిమా కూడా. ఆ సినిమాలు చూసి ప్రేరణ పొంది రవిబాబు..అంతకు మించి అన్నట్లుగా ఈ సినిమాలో రెచ్చిపోయారు.
‘రేజర్’లో హింస కేవలం షాక్ కోసం కాదు... దర్శకుడు రవిబాబు దాన్ని ఒక “క్రియేటివ్ ఎక్సర్‌సైజ”లా ట్రీట్ చేసినట్టు అనిపిస్తుంది. ఫోర్క్‌తో కళ్లను పొడవడం, కాళ్లు నరుక్కోవడం, తలలు తెగిపడడం... ఒక్కో చావుకి ఒక్కో డిజైన్. ఇది సినిమా కన్నా, “మనుషుల్ని ఎన్ని రకాలుగా చంపొచ్చు?” అనే డెమో వీడియోలా అనిపిస్తుంది. ట్రైలర్‌లో చూపించింది కేవలం చుక్క మాత్రమే. థియేటర్‌లో అసలు రక్తపాతం మొదలవుతుంది. సినిమాలో రుద్ర అనే పాత్రకు ఇచ్చిన ఎలివేషన్లు చూస్తుంటే, దర్శకుడు తన హీరోని మనిషిలా కాదు... పురాణాల్లో వచ్చే రౌద్ర దేవుడిలా చూపించాలని ప్రయత్నించినట్టు ఉంటుంది. “వాడ్ని చంపడానికి ఎంతమంది వెళ్లినా... శవాలు మాత్రమే తిరిగి వస్తాయి.” ఇలాంటి డైలాగులు ఒకప్పుడు మాస్ సినిమాల్లో వినేవాళ్లం. కానీ కమర్షియల్ సినిమాల హీరోయిజాన్ని ఎప్పుడూ సెటైర్ చేసిన రవిబాబు, ఇప్పుడు అదే ఫార్ములాతో హీరోని దేవుడిలా చూపించడం పెద్ద ఐరనీ.
ఒక సీన్‌లో పదుల సంఖ్యలో కమాండోలు మెషీన్ గన్స్‌తో ఇంటిని చుట్టుముడతారు. హీరో చేతిలో మాత్రం టార్చ్ లైట్. కానీ చివరకు పారిపోయేది కమాండోలే! ఇది చూసాక “లాజిక్ లేని హీరోయిజం” మీద ఒకప్పుడు విమర్శలు చేసిన రవిబాబు... ఇప్పుడు అదే లాజిక్‌ను మిక్సీలో వేసి జ్యూస్ చేసేశాడేమో అనిపిస్తుంది.
మూడు ముక్కల వీడియో... మూడు గంటల టెన్షన్
సీఎం హత్య వీడియోని మూడు భాగాలుగా దాచడం, వాటిని వెతకడం సినిమాలో ఆసక్తికరమైన పాయింట్. ఈ ట్రాక్ కొంతవరకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. సినిమా మొదటి 15 నిమిషాల్లోనే అసలు కథ మొత్తం బయటపడిపోతుంది. ఆ తర్వాత మిగిలింది ఒకే లైన్: “పాపను కాపాడాలి... వీడియో బయట పెట్టాలి.” ఈ సింపుల్ పాయింట్‌ను యాక్షన్, ఛేజ్‌లు, హింసతో నింపి రెండు గంటలు లాగించాడు రవిబాబు.
సినిమాలో హింస ఉంది... హృదయం లేదు.ఇక్కడే సినిమా పెద్దగా కనెక్ట్ కాదు. చిన్నారి తన తల్లిదండ్రులను కోల్పోయింది. హీరో తన ప్రపంచాన్ని కోల్పోయాడు. కానీ ఆ బాధ ప్రేక్షకుడికి బలంగా ఫీల్ అయ్యేలా రాయలేదు. అందుకే తెర మీద రక్తం కనిపిస్తుంది... కానీ గుండెల్లో బాధ మిగలదు. ఎంత స్టైలిష్‌గా చంపినా, చివరకు ప్రేక్షకుడు గుర్తుపెట్టుకునేది భావోద్వేగమే అనేది రవిబాబు మర్చిపోయాడు. ‘మార్కో’, శ్రీశ్రీ లాంటి సినిమాల్లో హింస వెనక ఎమోషన్ ఉంటుంది. ‘రేజర్’లో హింస వెనక దర్శకుడి ఉత్సాహం మాత్రమే కనిపిస్తుంది.
ఎవరెలా చేసారు
రవిబాబు ఈ సినిమాలో చేసినవి రెండే పనులు.. కనిపించిన వాళ్లను కొట్టడం, కనిపించనివాళ్లను సీరియస్‌గా చూడడం. ఎమోషనల్ సీన్లో కూడా ముఖం కంటే మేకప్పే ఎక్కువ భావాలు పలికించింది. చిన్నారి పాత్ర చేసిన అమ్మాయి మాత్రం అందరిలో నేచురల్‌గా కనిపించింది. తనీష్ కాసేపే కనిపించినా, ఆ టైమ్‌లోనే ఓవరాక్షన్ కోటా పూర్తి చేశాడు. హోం మంత్రి, అతని కొడుకుల నటన చూస్తే... వాళ్లను విలన్లుగా పెట్టారా, వర్క్‌షాప్ నుంచి నేరుగా తీసుకొచ్చారా అన్న సందేహం వస్తుంది.
అయితే టెర్రరిస్ట్ క్యారెక్టర్ లో విజయ్ భాస్కర్ అనే నటుడు చేసిన నటన కొద్దిసేపే అయినా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ప్లాష్ బ్యాక్ లో వస్తుందీ పాత్ర.
టెక్నికల్‌గా..
టెక్నికల్‌గా ‘రేజర్’ పర్వాలేదు అనిపించినా, కొత్తదనం మాత్రం కనిపించదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా పని ఓకే. కానీ నిర్మాణ విలువలు చాలా సాధారణంగా ఉన్నాయి. ఒకే చోట కెమెరా తిప్పి పెద్ద సినిమా తీసిన ఫీలింగ్ ఇవ్వాలని రవిబాబు ట్రై చేశాడు. హింస సీన్లలో గ్రాఫిక్స్ మాత్రం బాగా తేలిపోయాయి. స్క్రిప్ట్, టేకింగ్ చూస్తే... రవిబాబు ఇంకా పాత కాలం థ్రిల్లర్ మూడ్‌లోనే ఇరుక్కుపోయాడేమో అనిపిస్తుంది.
ఫైనల్ థాట్..
‘రేజర్’లో కథ కంటే కోతలు ఎక్కువ, భావోద్వేగాల కంటే బాదుడే ఎక్కువ. రవిబాబు రక్తంతో రచ్చ చేశాడు గానీ, కథతో మాత్రం కిక్ ఇవ్వలేకపోయాడు. థ్రిల్లర్ చూపిస్తానన్నాడు... చివరకు ప్రేక్షకుల సహనానికే థ్రిల్ టెస్ట్ పెట్టాడు. కొంతమందికి ఇది స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా అనిపించొచ్చు. మరికొంతమందికి మాత్రం “రక్తంతో రాసిన వీడియో గేమ”లా అనిపిస్తుంది.
- జోస్యుల సూర్యప్రకాష్






Comments