ప్రేమ ఉంది... కానీ మ్యాజిక్ ఎక్కడ?
- Guest Writer
- 1 day ago
- 2 min read

జీవితంలో జరిగేదంతా దేవుడు రాసిందే అని నమ్మే శ్యాంబాబు (జగపతి బాబు), తన కూతురు మాయ (నిధి ప్రదీప్) కోసం పెద్ద కలలు కంటాడు. సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తూ, తన శక్తికి మించిన ప్రేమను కూతురిపై కురిపిస్తాడు. మాయ కూడా తండ్రి మాటే వేదంగా పెరుగుతుంది. ఎప్పుడూ ఆయన తలవంచుకునే పని చేయదు. కానీ, ఆమె జీవితంలోకి రాజు (సుమంత్ ప్రభాస్) ప్రవేశించడంతో అంతా తారు మారైపోయింది. రాజు (సుమంత్ ప్రభాస్)... గోదావరి ప్రాంతానికి చెందిన ఓ ఆటో డ్రైవర్. స్నేహితులతో జోక్స్ వేసుకుంటూ , నవ్వుకుంటూ, చిన్న చిన్న సంతోషాలతో జీవితం గడిపే సాధారణ కుర్రాడు. తన చెల్లెలి క్లాస్ మేట్,ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన మాయతో అనుకోకుండా ఏర్పడిన పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారుతుంది. మాయ కూడా రాజులోని నిజాయితీని, మంచితనాన్ని చూసి ఇష్టపడుతుంది. కానీ ఈ ప్రేమ .. పెళ్లి వైపు టర్న్ తీసుకునేటప్పుడే అసలు కథ మొదలవుతుంది.
తన కూతురిని మంచి ఉద్యోగం చేసే అబ్బాయికి ఇచ్చి గొప్ప జీవితంలో చూడాలనుకుంటాడు శ్యాంబాబు. దాంతో రాజును చూసిన క్షణం నుంచే అసహనం పెంచుకుంటాడు.ఆటో డ్రైవర్ అయిన రాజు, తన కూతురి భవిష్యత్తుకి సరిపోడని అతను గాఢంగా నమ్ముతాడు. అలాగే రాజు -- మాయ ఇద్దరి మతాలు వేరు కావడం కూడా కథలో మరో పెద్ద సమస్యగా నిలుస్తుంది.ఈ క్రమంలో ఈ అడ్డంకులను దాటుకుని రాజు, మాయ ఒకటయ్యాయా, వారి ప్రేమ కథకు దొరికిన ముగింపు ఏమిటి..తండ్రిగా శ్యాంబాబు ఏం నిర్ణయం తీసుకున్నాడనేది తెరపై చూడాల్సిన మిగతా కథ.
ఎలా ఉంది
సాధారణంగా ప్రేమకథలు నిలబడాలంటే భారీ ట్విస్టులు అవసరం లేదు. రెండు పాత్రలు ఒకరినొకరు చూసుకునే విధానం చాలు. ఒక చిన్న నిశ్శబ్దం చాలు. “నువ్వు వెళ్తే నాకు ఖాళీగా అనిపిస్తుంది” అనే భావన చాలు. ‘గోదారి గట్టుపైన’ అలాంటివి అన్నీ ఉన్నాయి కానీ...అవి ఉన్నట్లు మనకు తెలిసిపోతుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే... “ తెరపై హీరో,హీరోయిన్స్ నిజంగా ప్రేమించుకుంటున్నారా?, లేక స్క్రీన్‌ప్లే వాళ్లను ప్రేమలో ఉన్నట్టు చెప్తుందా?” అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కథ మీద కాదు...కేవలం “ఫీలింగ” మీద నడవాల్సిన ప్రేమకథ. అక్కడే సినిమా పూర్తిగా జాగ్రత్తపడితే బాగుండేది అనిపిస్తుంది.
ఇందులో హీరో రాజు పాత్రను పరిచయం చేసే సన్నివేశాలు చూస్తే అతను మంచి అబ్బాయి అని తెలుస్తుంది. మాయ పాత్ర చూస్తే ఆమె తండ్రిని గౌరవించే అమ్మాయి అని తెలుస్తుంది. కానీ వాళ్లు ఎందుకు ఒకరినొకరు ప్రేమించుకున్నారు? అనేది మాత్రం ప్రేక్షకుడికి ఫీల్ అయ్యేలా చేయించలేదు. ‘గోదారి గట్టుపైన’లో ఇదే మిస్సైందనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లద్దరి మధ్య ఉండే గాఢమైన ప్రేమే మిగతా సినిమాలో సీన్స్ పండేందుకు సాయం చేస్తుంది.
మంచి ప్రేమకథల్లో ప్రేమ పెరిగేకొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి. ఇక్కడ మాత్రం సమస్యలు కూడా ఫ్లాట్‌గా వస్తాయి. తండ్రి వ్యతిరేకిస్తాడు. కానీ ఆ వ్యతిరేకతలో భయం కనిపించదు. కూతురిని కోల్పోతాననే బాధ కనిపించదు. కేవలం “ఈ అబ్బాయి వద్దు” అనే డైలాగ్ మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఎమోషనల్ టెన్షన్ పండలేదు. ‘గోదారి గట్టుపైన’ ఒక రొటీన్ ఫార్ములా సినిమానే అయినా, అందులోని నిజాయితీ, విలువలు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. ఇటీవల వస్తున్న బోల్డ్ సినిమాల మధ్య, కుటుంబంతో కలిసి చూడదగ్గ ఒక క్లీన్ ఎమోషనల్ డ్రామా ఇది. రైటింగ్ టేబుల్ దగ్గర మరికొంత జాగ్రత్త వహించి ఉంటే, ఇది మరో ‘గోదావరి’ స్థాయి సినిమా అయ్యేది.
టెక్నికల్‌గా
పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తాయి కానీ పెద్దగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది, గోదావరి అందాలు అందంగా చూపించారు. దర్శకుడు క్లీన్ లవ్ స్టోరీ చెప్పాలని ప్రయత్నించాడు. కొంత కామెడీ, తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ బాగున్నా, కథలో కొత్తదనం లేకపోవడంతో సినిమా చాలా సాధారణంగా అనిపిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ..సెకండాఫ్ లో మరింత షార్ప్ చేయాలనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. డైలాగులు కూడా చాలా చోట్ల నేచురల్ గా ఉంటూనే, ఫన్ కు ట్రై చేసారు.
నటీనటుల్లో..
సుమంత్ ప్రభాస్ దాదాపు కొత్త హీరో అయినా చాలా సహజంగా నటించాడు. గోదావరి యాస, సాఫ్ట్ క్యారెక్టర్ అతనికి బాగా సెట్ అయ్యాయి. నిధి ప్రతాప్ కూడా చాలా నేచురల్‌గా కనిపించింది. జగపతి బాబు మధ్యతరగతి తండ్రి పాత్రలో సినిమాకు మంచి వెయిట్ తీసుకొచ్చాడు. సుదర్శన్ కామెడీతో ఎక్కువగా ఎంటర్‌టైన్ చేశాడు. దేవి ప్రసాద్, రాజీవ్ కనకాల ఓకే. లైలా పాత్ర మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వలేదు. ఫైనల్ థాట్ “ఇలాంటి సినిమాల్లో కథ ఎలా మొదలైందన్నది ముఖ్యం కాదు.. అది ప్రేక్షకుల మనసులో ఎలాంటి అనుభూతిని మిగిల్చింది అనేదే ముఖ్యం. మరీ తీసి పారేసే సినిమా కాదు..అలాగని పరుగెత్తుకెళ్లి వెంటనే చూడాలనిపించే సినిమానూ కాదు. అవకాశాన్ని బట్టి ఓ లుక్కేయటమే.
- జోస్యుల సూర్యప్రకాశ్






Comments