‘నీ ఒళ్లు నీ ఇష్టమైతే.. వాడి చూపు వాడిష్టం’.. సింగర్ సునీత ఆసక్తికర వ్యాఖ్యలు
- Guest Writer
- 1 hour ago
- 2 min read

ప్రముఖ గాయని సునీత తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ, సినిమాలో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ వంటి అంశాలపై మాట్లాడారు. అమ్మాయిలు ‘నా బాడీ నా ఇష్టం’ అన్నప్పుడు, చూసేవాడి కళ్లు వాడి ఇష్టమని.. తన దృష్టిలో అది అసలైన స్వేచ్ఛ కాదంటూ ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలానే ఇటీవల ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై వచ్చిన విమర్శలపై ఆమె పరోక్షంగా స్పందించారు.
సినీ అభిమానులకు సింగర్ సునీత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన మధురమైన గాత్రంతో గత కొన్నేళ్లుగా శ్రోతలను అలరిస్తున్న ఆమె.. ఎన్నో అద్భుతమైన సినిమా పాటలు ఆలపించారు. సంగీత ప్రపంచంలో ‘మెలోడీ క్వీన’గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగానూ రాణించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. తన కెరీర్ కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఫెమినిజం, మహిళల వస్త్రధారణ వంటి పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొందరు డైరెక్టర్ బుచ్చిబాబు సానాని విమర్శించారు. మరికొందరు మాత్రం ‘నో’ చెప్పకుండా అలాంటి సన్నివేశాల్లో ఎలా నటించావంటూ జాన్వీని ట్రోల్ చేశారు. ఇదే విషయాన్ని సునీత ఇంటర్వ్యూలో పరోక్షంగా ప్రస్తావించగా.. ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. ‘’ఎవరి ఒపీనియన్ వాళ్లది. ఎస్ చెప్పాలన్నా, నో చెప్పాలన్నా మన ఇష్టమే. కేవలం సినీ ఇండస్ట్రీలో అనే కాదు, నేను జనరల్ గా సొసైటీలో ఉన్న అమ్మాయిల గురించి మాట్లాతున్నాను. ఇక్కడ ఒక గీత గీయాలంటే, ఫుల్ స్టాప్ పెట్టాలంటే.. బలవంతం ఏమీ లేదు”
‘’ఇండస్ట్రీలో ఒక సినిమాలోనే కాదు, అలాంటి ట్రిగ్గర్ అయ్యే సిచ్యుయేషన్స్ అన్ని ఫీల్డ్స్ లో చాలానే ఉన్నాయి. ఆ అమ్మాయి తాలూకూ అవసరాలు, అవకాశాలు, భయం, భవిష్యత్ గురించి ఆలోచన, మెచ్యూరిటీ లెవెల్..వీటన్నిటినీ బేస్ చేసుకుని ఆ అమ్మాయి తీసుకునే నిర్ణయం ఉంటుంది. అయినప్పటికీ ఆ అమ్మాయి ‘నో’ చెప్పొచ్చు” అని సునీత అన్నారు. ఇది సినిమా డైరెక్టర్, రైటర్, యాక్టర్, కోయాక్టర్, డీఓపీ, ఆ సీన్ లో నటించిన అమ్మాయి.. ఇలా అందరి రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నారు. అసలు ఇది ఎందుకు? ఏం చేస్తున్నాము? అనేది లేకుండా సినిమా అనే మాధ్యమం ద్వారా చాలా అంశాలను నార్మలైజ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. బయటకి వెళ్తే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ బూతులు మాట్లాడటం చాలా మాములు విషయం అనేలా చేసేశారు.
సమాజంలో సినిమాని తిడితే, సినిమాలో సమాజాన్ని తిడుతున్నారని.. సమాజం అలా ఉంది కాబట్టే తాము ఇలా సినిమా తీశామని చెబుతున్నారని సునీత పేర్కొన్నారు. కమర్షియల్ సినిమా అయినా, ఏ సినిమా రెస్పాన్సిబిలిటీ ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. ‘’సినిమాలో ఒక సీన్ చేయడానికి ఆ అమ్మాయి ‘నో’ చెప్తే ఎదురయ్యే పరిస్థితులు ఫేస్ చేయడం ఆమెకు చాలా కష్టం. అదే ‘ఎస’ చెప్తే ఇంకో నాలుగు సినిమాలు వస్తాయి. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత పేరు, పలుకుబడి, పవర్ తో నేను నా సినిమాలు, నా క్యారెక్టర్లు డిసైడ్ చేసుకోవచ్చు అనేది అమ్మాయిల మైండ్ సెట్. ఆ పవర్ రావొచ్చు, లేకపోతే రివర్స్ అవ్వొచ్చు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లని అనలేం కానీ.. పేరు తెచ్చుకున్న తర్వాత కూడా ఇటువంటి పాత్రలకు ఒప్పుకుంటున్నారు అంటే కచ్చితంగా వాళ్లు తమ ఇష్టానుసారం చేశారనే అనుకోవాలి” అని సునీత అన్నారు.
‘’నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలుసు. ఎలాంటి బట్టలు వేసుకున్నావో నీకు తెలుసు. విమర్శలు వచ్చినప్పుడు.. ‘అవును. నేను చేశాను. ఇలా అవుతుంది అనుకోలేదు, తప్పు జరిగింది. నాకూ నచ్చలేదు’ అని మాట్లాడటం ఒక పద్దతిగా ఉంటుంది. ‘ఓ మై గాడ్, వాళ్లు నన్ను ఇలా చూపించారేంటి? వాళ్ళు నా గురించి ఇలా మాట్లాడారేంటి? అంటే మాత్రం విక్టిమ్ గా బిహేవ్ చేస్తున్నట్లే” అని సునీత చెప్పారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలనేది మహిళల ఇష్టం అనే వాదనపై సునీత స్పందిస్తూ.. ‘’అమ్మాయిలు ‘నా బాడీ నా ఇష్టం’ అంటే, చూసేవాడి కళ్లు వాడి ఇష్టం కదా” అని అన్నారు. తన దృష్టిలో అది అసలు ఫ్రీడమ్ కాదన్నారు. సునీత కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- రాజశేఖర్. జి






Comments