top of page

అంతరాబలో ఆ కాలేజీ ఎక్కడుందబ్బా!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 4 days ago
  • 3 min read
  • వర్సిటీ అధికారుల రికార్డుల్లో మాత్రం నిక్షేపంగా ఉందట

  • వాటినే నమ్మి ఏటా పర్మిషన్లు ఇచ్చేస్తున్న ఎన్‌సీటీఈ

  • ఏటా 110 అడ్మిషన్లతో రూ.లక్షల ఫీజులు

  • భవనాల్లేకుండా, క్లాసులు చెప్పకుండానే సర్టిఫికెట్లు

  • సర్వం మాయ అన్నట్లు సాగుతున్న శివసాయి బీఈడీ కళాశాల

ree

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

‘మీ కాలేజీ భవనాలు మీరు రిజిస్టర్‌ చేసుకున్న సొసైటీ పేరు తోనే ఉన్నాయా?.. ఉంటే ఆ కాగితాలు తీసుకురండి.. వందమంది విద్యార్థులు ఉన్న కాలేజీలో ఆ బెంచీల సంఖ్య ఏంటి?.. బాత్రూమ్‌లు ఉండాల్సింది ఇలాగేనా?.. బ్లాక్‌బోర్డు మీద ఉండాల్సిన నల్లరంగు అక్కడక్కడ వెలిసిపోయిందెందుకు?.. మీ రికార్డులు, విద్యార్థుల హాజరు పట్టీలు పట్టుకురండి.. పాఠాలు చెప్పే అధ్యాపకుల సర్టిఫికెట్లేవీ?.. ఇలా అయితే కుదరదు. మళ్లీ మేం కబురు పంపుతాం.. కాస్త పెద్ద జేబుతో రండి.’

.. ఇదీ జిల్లాలో ఉన్న 13 బీఈడీ కాలేజీల అనుమతులను ప్రతి ఏటా రెన్యూవల్‌ చేసే విషయంలో సంబంధిత యూనివర్సిటీ అధికారులు అనుసరిస్తున్న తంతు. కానీ ఈ పదమూడే కాకుండా.. జిల్లాలో 14వ బీఈడీ కాలేజీ ఉంది. దాని పేరు శ్రీ శివసాయి కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌. పాతపట్నం మండలం అంతరాబ గ్రామం, ప్లాట్‌ నెంబరు 3/2 అనే చిరునామాలో సదరు కళాశాల ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అసలు పాతపట్నం నుంచి పర్లాకిమిడి ఒడిశా బోర్డరుకు వెళ్లే దారిలోని మారుమూల గ్రామంలో ఒక ప్లాట్‌లో కళాశాల ఉందంటేనే వర్సిటీ అధికారులకు డౌట్‌ రావాలి. కానీ 2016`17 నుంచి ఇప్పటి వరకు మన ఘనత వహించిన వర్సిటీ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు ఆ కళాశాలపై ఏమాత్రం అనుమానం రాలేదంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే.. సదరు వర్సిటీలో ఎన్ని జంతర్‌మంతర్‌లు జరిగాయో అందరికీ తెలుసు. అలాంటిది అంతరాబ గ్రామంలో బీఈడీ కాలేజీ ఉందని, అది బ్రహ్మాండంగా నడుస్తుందని, అన్ని వసతులు ఉన్నాయని ప్రతిసారీ సర్టిఫికెట్‌ ఇస్తున్నారంటే.. దాని వెనుక ఏం జరిగి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాలేజీ లేదు.. విద్యార్థులున్నారు!

వాస్తవానికి శ్రీశివసాయి కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ప్రకాశం జిల్లా బెస్తవారిపేట గ్రామంలో కళాశాల ఏర్పాటుకు నిర్వాహకులు అనుమతులు తెచ్చుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలీదుగానీ దాన్ని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం అంతరాబకు షిఫ్ట్‌ చేసేందుకు వీలుగా నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈమేరకు గెజిట్‌ నోటిఫై చేయించారు. కానీ అంతరాబలో ఆ కాలేజీ ఎక్కడుందయ్యా అని వెతికితే.. ఆచూకీ దొరకడంలేదు. ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లిన ఎన్‌సీటీఈ, యూనివర్సిటీ అధికారులు మాత్రం కాలేజీ ఉందనే చెబుతున్నారు. చెప్పడమేమిటి.. ప్రతి యేటా ఇక్కడ 110 మంది విద్యార్థులు చదువుతున్నారని, పరీక్షలు రాస్తున్నారని చెబుతూ సర్టిఫికెట్లు కూడా ఇచ్చేస్తున్నారు. ఒక లేని కళాశాల పేరుతో ఇంత తంతు ఎలా జరుగుతుందో జిల్లాలో బీఈడీ కాలేజీల నిర్వహకులందరికీ తెలుసు. ప్రతి కళాశాలలో అంతో ఇంతో ఏదో ఒక లోపం ఉంటుంది. భవనాలుంటే ప్లేగ్రౌండ్‌ ఉండదు. ప్లేగ్రౌండ్‌ ఉంటే సరిపడినన్ని ల్యాబ్‌లు ఉండవు. అందుకే బీఈడీ కళాశాల యాజమాన్యాలు అన్నీ మూసుకొని ఇన్‌స్పెక్షన్‌కు వచ్చేవారిని మేనేజ్‌ చేసి నెట్టుకొస్తున్నారు. దీనికోసం నానా అవమానాలు పడుతున్నారు.

ఒక్కోసారి ఒక్కో కాలేజీని వాడకం

కానీ ఒక లేని కాలేజీని ఉన్నట్లు చూపిస్తూ ప్రతి ఏడాది వందమంది సాధారణ, 10 మంది ఈబీసీ విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజులను శివసాయి బీఈడీ కళాశాల దండుకుపోతోంది. అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల నుంచి సర్టిఫికెట్ల సేకరణ, ఫీజుల వసూలు కోసం కొన్నాళ్లు ఇదే అంతరాబలో ఒక బెడ్రూమ్‌, ఒక బాత్రూమ్‌ ఉన్న ఇంటిని అద్దెకు తీసుకొని అడ్మిషన్ల తర్వాత ఖాళీ చేసేశారు. అప్పట్నుంచి ఈ కళాశాలలో ఎవరు చేరాలన్నా పర్లాకిమిడిలోని ఒక లాడ్జి రూమ్‌లో ఈ తతంగం నడిపేవారు. అడ్మిషన్లు కళాశాల యాజమాన్యం సొంత వ్యవహారం కాబట్టి గది అద్దెకు తీసుకున్నా, లాడ్జి తీసుకున్నా పోనీలే.. అని సరిపెట్టుకోవచ్చు. కానీ అసలు పాఠాలు చెప్పడానికి భవనం లేకుండా, బోధించడానికి టీచర్లే లేకుండా ప్రతియేటా 100 మందికి పైగా విద్యార్థులను పరీక్షలకు పంపుతున్నారంటే ప్రపంచంలోనే ఇదో పెద్ద వింత. వాస్తవానికి ఏ సొసైటీ పేరుతో బీఈడీ కాలేజీ పెట్టుకున్నారో.. ఆ సొసైటీ పేరుతో సొంత భూమి, అందులో భవనాలు ఉండాలి. దాన్నే జియో ట్యాగింగ్‌ చేయాలి. కానీ శ్రీ శివసాయి ఎడ్యుకేషనల్‌ అండర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ పేరుతో నడుస్తున్న బీఈడీ కాలేజీకి ఆ సొసైటీ పేరుతో అంతరాబలో భూమి గానీ, భవనాలు గానీ లేవు. అలాంటప్పుడు ఇన్‌స్పెక్షన్‌కు వచ్చిన అధికారులకు ఈ యాజమాన్యం ఏం చూపించి ఉంటుందనేదే ప్రశ్న! కిరణ్మయి డిగ్రీ ఇంటర్‌ కాలేజీ భవనాలు చూపించి అదే తమ బీఈడీ కళాశాల అని ఒకసారి మేనేజ్‌ చేశారు. అక్కడ చదువు చెబుతున్న అధ్యాపకులనే తమ ఫ్యాకల్టీగా చూపించారు. మరోసారి మరో కళాశాలను వాడేశారు. అసలు ఈ కాలేజీ ఏ సొసైటీ పేరు మీద ఉంది? ఆ పేరుతో భవనాలు ఉన్నాయా? లేవా? ల్యాబ్‌లు ఎక్కడున్నాయి? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎంతుంది? అనేది ఎప్పుడూ ప్రస్తావనకు రాలేదు. కానీ ప్రకాశం జిల్లా నుంచి శ్రీకాకుళం పాతపట్నానికి షిప్ట్‌ అయిన దగ్గర్నుంచి నిరంతరాయంగా అడ్మిషన్లు జరిగిపోతున్నాయి.

కాగితాల్లోనే అన్నీ..!

బీఈడీ కళాశాలల్లో పాఠాలు చెప్పే అధ్యాపకులు క్వాలిఫైడా, కాదా? అని ప్రతి యేటా వర్సిటీ అధికారులు పరిశీలిస్తారు. అందుకోసం వారి సర్టిఫికెట్లను పట్టుకొని యూనివర్సిటీ అధికారుల ముందు నిలబడాలి. ఇందులో ఏ ఒక్కరు క్వాలిఫై కాకపోయినా ఆ కళాశాలకు రెన్యూవల్‌ ఉండదు. నిబంధనల మేరకు ఒక బీఈడీ కళాశాలలో 16 మంది స్టాఫ్‌ ఉండాలి. ఆ మేరకు ప్రతియేటా అందరి సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. అలాగే విద్యార్థుల హాజరుపట్టీ, ల్యాబ్‌ల తీరు కూడా చూస్తారు. ఇందుకోసం యూనివర్సిటీ పరిధిలో ఐదుగురి కమిటీ తనిఖీ చేస్తుంది. వీసీ, రిజిస్ట్రార్‌, సీడీసీ డీన్‌, సంబంధిత ఆర్ట్స్‌ విభాగం ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరు సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌లు బీఈడీ కళాశాలలను తనిఖీ చేయాలి. ఇందులో వీసీ, రిజిస్ట్రార్‌లకు ఒక్కొక్కసారి సీడీసీ డీన్‌కు, యూనివర్సిటీలోనే తెమలని పని ఒత్తిడి ఉంటుంది కనుక వారి బదులు యూనివర్సిటీలో ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ను డీల్‌ చేస్తున్నవారు తనిఖీలకు వెళ్తుంటారు. కానీ ఏరోజూ ఈ బీఈడీ కళాశాల వ్యవహారంపై అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడం విడ్డూరం. చివరకు ఎన్‌సీటీఈ బృందం కూడా ఈ కాలేజీ లోగుట్టును పట్టుకోలేకపోయింది. హెడ్‌క్వార్టర్‌కు దూరంగా ఉండటం, మేనేజ్‌మెంట్‌ అందుబాటులో లేకపోవడంతో కాలేజీ యాజమాన్యం తరఫున అందిన కాగితాలనే ఆధారంగా చేసుకొని రెన్యూవల్‌ చేసేస్తున్నారు. యూనివర్సిటీ రికార్డుల్లో అంతా సవ్యంగా నడుస్తుందని ఉండటం వల్ల ఎన్‌సీటీఈ అధికారులే క్షేత్రస్థాయి పర్యవేక్షణకు వచ్చి క్లీన్‌చిట్‌ ఇచ్చి వెళ్లారు కాబట్టి తమ తప్పేమీ లేదని కప్పిపుచ్చుకోడానికి వర్సిటీ అధికారులు రేపట్నుంచి ప్రయత్నిస్తారు తప్ప, అసలు కాలేజీ ఉందా? లేదా? అనేది మాత్రం తేల్చరు. ఇంతకు మించిన దరిద్రమేమిటంటే.. శ్రీకాకుళం ఇందిరానగర్‌ కాలనీలో ఉన్న రవూఫ్‌ బీఈడీ కాలేజీని కూడా ఇదే శ్రీ శివసాయి కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నడుపుతోంది.

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page