ఆగని అక్రమాలు.. అడిగితే దాడులు!
- BAGADI NARAYANARAO

- Aug 1, 2025
- 2 min read
ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు.. తరలింపు
రెచ్చిపోతున్న అధికార పార్టీ నేతలు
ఫిర్యాదులు అందినా పట్టించుకోని అధికారులు
మొక్కుబడి సందర్శనలు, తనిఖీలతో సరి
నీటి పథకాలు, నదీ కరకట్టలకు ప్రమాదం

జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వీటిపై గ్రీవెన్స్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నాగావళి, వంశధార తీరాల్లో అవకాశం ఉన్న ప్రతి చోటా యంత్రాలతో దర్జాగా ఇసుక తవ్వేసి వాహనాల్లో తరలించేస్తున్నారు. ప్రశ్నించేవారిని బెదిరిస్తూ, దాడులు చేస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారు. నదుల్లో ఇసుక లభ్యత లేకపోయినా ల్యాండ్ స్లైడ్స్ తవ్వేస్తున్నారు. నదుల్లో వరద ప్రవాహం ఉన్నా వెరవకుండా ఇసుకను తోడుకుపోతున్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం/కొత్తూరు)
జిల్లాలో ఆమదాలవలస పరిధిలోని పాతూరు (పాత నిమ్మతొర్లాడ) ఇసుక ర్యాంపు వద్ద జరుగుతున్న అక్రమాల గురించి ప్రశ్నించినందుకు ఇటీవల అక్రమార్కులు దాడులకు పాల్పడ్డారు. నాగావళి గర్భంలో ఉన్న భూమి(పర)ని గ్రామ అవసరాలకు తాము వినియోగించుకుంటుంటే అక్రమార్కులు మాత్రం పరలో ఉన్న ఇసుకను అనుమతులు లేకుండా తవ్వుతుండటాన్ని పాతూరు గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన రౌడీమూకలు రాత్రి వేళలో గ్రామంలోకి వచ్చి ప్రశ్నించిన వారిపై దాడికి పాల్పడ్డారు. దీనిపై వైకాపా నాయకులు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఆర్డీవో సాయిప్రత్యూష, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు సందర్శించి పరిశీలించారు. తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపేయాలని కూడా ఆదేశించారు. కొత్తవలస, పాతూరు మధ్య నాలుగు కిలోమీటర్లు మేర అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేపట్టినట్టు అధికారులు గుర్తించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో నాగావళి, వంశధార తీరాల్లో 20 అనధికార ర్యాంపులు నడుస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. తోటాడ`అక్కివరం, పెద్దదూసి, ముద్దాడపేట, దూసిపేట, కలివరం, తొగరాం, పాతూరు, నిమ్మతొర్లాడ, కొత్తవలస, యరగాం, పురుషోత్తపురం, లాబాం, నారాయణపురం, గండ్రేడు, నెల్లిమెట్ట, బెలమాం, సింగూరులలో వీటిని టీడీపీ నాయకులే నిర్వహిస్తున్నారు.
గ్రామస్తులతో చర్చించి రవాణా చేసుకోండి
పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని కొత్తూరు మండలంలో వసప గ్రామం మీదుగా మాతల ఎత్తిపోతల పథకానికి.. కొత్తూరు, సీతంపేట మండలాలకు తాగునీరందించే రక్షిత మంచినీటి పథకానికి మధ్యలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దీనివల్ల ఎత్తిపోతల పథకానికి నీరు అందే అవకాశం క్రమంగా తగ్గిపోతుందని, తాగునీరు కలుషితం అవుతుందంటూ రెండురోజుల క్రితం స్థానికులు ఆందోళన నిర్వహించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రైతులతో కలిసి అనధికార ఇసుక ర్యాంపును పరిశీలించి అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్రమ రవాణాను అడ్డుకుంటున్న వారిపై దాడులు జరుగుతున్నాయని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన కొత్తూరు తహసీల్దార్ బలద ర్యాంపును పరిశీలించి, పది రోజులపాటు ఇసుక తవ్వకాలు నిలిపేయాలని సూచించి వెళ్లిపోయినట్లు తెలిసింది. గోర్జి మీదుగా ఇసుక లారీలను అనుమతించేది లేదని వసప రైతులు హెచ్చరించడంతో వారితో చర్చించి రవాణా చేసుకోవాలని ఇసుక తవ్వకందారులకు తహసీల్దార్ సూచించినట్టు తెలిసింది. ఆకులతంపరలో ఉన్న అధికారిక ర్యాంపును మూలపేట పోర్టు అవసరాల కోసం నిర్వహిస్తున్నారు. నరసన్నపేట పరిధిలో బుచ్చిపేట, మడపాంలలో తవ్వకాలకు అనుమతులు ఉన్నా, ఇసుకను డంపింగ్ యార్డుకు తరలించకుండా నదీగర్భంలోనే యంత్రాల సాయంతో లారీలు, ట్రాక్టర్లకు లోడ్ చేస్తున్నారు. రామకృష్ణాపురం ర్యాంపును ప్రభుత్వ అవసరాలకు కేటాయించినా ఇసుక మాత్రం ప్రైవేట్‌కు తరలిపోతోంది. పర్లాం, అంధవరంలలో అనధికారికంగా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు.
తాగునీటి పథకానికి ముప్పు
శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో బైరి, కిల్లిపాలెం, ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని ముద్దాడ వద్ద అనధికార తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. రోజుకు 400కు పైగా ట్రాక్టర్లలో చిలకపాలెం, శ్రీకాకుళం ప్రాంతాలకు తరలిస్తున్నారు. నదిలో నీటి ప్రవాహంతో సంబంధం లేకుండా రేయింబవళ్లు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక లభ్యత లేదంటూ ఈ మూడుచోట్ల ఇసుక ర్యాంపులకు నాలుగు నెలల క్రితమే ప్రభుత్వం అనుమతులు రద్దు చేసినా అక్రమార్కులు ల్యాండ్ స్లైడ్‌లను తవ్వేస్తున్నారు. దీంతో నది కరకట్టలు కోతకు గురవుతున్నాయి. బైరి వద్ద వంశధార నదిలో వరద నీరు ఉండటంతో జాతీయ రహదారి వంతెన కింద ఉన్న ల్యాండ్ స్లైడ్‌ను తవ్వేస్తున్నారు. మండల టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. కిల్లిపాలెంలో శ్రీకాకుళం మండలంలోని 40 గ్రామాలకు నీరందించే రక్షిత మంచినీటి పథకానికి సమీపంలో తవ్వకాలు సాగిస్తున్నారు. దీనివల్ల తాగునీరు కలుషితమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విడ్డూరమేంటంటే.. అక్రమాలకు పాల్పడుతున్నదీ, వాటిని ప్రశ్నించి ఆందోళన వ్యక్తం చేస్తున్నది కూడా అధికార టీడీపీ నాయకులే. ముద్దాడ ఇసుక ర్యాంపులోనూ ఇదే పరిస్థితి. ప్రశ్నించే వారిపై దాడులకు దిగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకుల ప్రత్యక్ష ప్రమేయం ఉండటంతో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం డిమాండ్ ఉండటంతో ఇసుక అక్రమ రవాణా ఊపందుకుంది. తవ్వకాలు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భయపడుతున్న రెవెన్యూ, పోలీసు, మైనింగ్, రవాణా శాఖ అధికారులు.. అందిన ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.










Comments