‘తొలి అడుగు’ తడబడి.. ‘మోసం’ మొక్కుబడి
- NVS PRASAD
- 1 day ago
- 3 min read
తొలి ఏడాది కార్యక్రమాల్లో విఫలమవుతున్న టీడీపీ, వైకాపా
పిలిస్తే వెళ్లడం తప్ప.. పర్యవేక్షణ పట్టని వైకాపా ఇన్‌ఛార్జీలు
వేసిన కరప్రాతాలు కూడా టీడీపీవన్న తప్పుడు సంకేతాలు
ఇంటింటికీ చేరని అధికార పార్టీ కార్యక్రమం
తమ క్రెడిట్‌ను వేరొకరు కొట్టేస్తారనే కార్యకర్తల ఆందోళనే కారణం

అధికార మార్పిడి జరిగి ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా చేపట్టిన ప్రజా చైతన్య కార్యక్రమాలను కిందిస్థాయి కార్యకర్తలు అంతంత మాత్రంగానే జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. వైకాపా హయాంలో సామాన్య కార్యకర్తకు జగన్మోహన్‌రెడ్డి ఒరగబెట్టిందేమీ లేదన్న నిరాశతో ఆ పార్టీ నేతలు, కూటమిలో కార్యకర్తగా పనిచేసే కంటే ప్రతిపక్ష పార్టీకి మద్దతు తెలపడమే బెటరన్న కోణంలో తెలుగుదేశం కార్యకర్తలు ఉండటం వల్ల ‘బాబు ష్యూరిటీ ` మోసం గ్యారెంటీ’ కార్యక్రమం మొక్కుబడిగా సాగుతుంటే.. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పై రెండు కార్యక్రమాలు ఒకదానికొకటి కౌంటర్. జులై 4 నుంచి ఆగస్టు 4 వరకు ‘బాబు ష్యూరిటీ ` మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించాలని వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈమేరకు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పీఏసీ సభ్యులతో ఆ మధ్య సుదీర్ఘ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. చంద్రబాబునాయుడు మేనిఫెస్టోలో ఏం పేర్కొన్నారో.. వాటిలో ఎన్ని అమలయ్యాయో చెప్పి.. ఎంత మేరకు మోసం చేశారో వివరించడంతోపాటు పార్టీ రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయించి ప్రజల స్పందనను నమోదు చేయాలని సూచించారు. ఎందుకంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సూపర్‌సిక్స్ పథకాలను అమలు చేసేశానని అన్యాపదేశంగా పేర్కొన్నారు. కానీ బాబు మోసం చేశారని జనానికి తెలియాలన్న కోణంలో జగన్మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోమన్నారు. ఇందుకోసం ముందు జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈమేరకు శ్రీకాకుళం జిల్లా స్థాయి సమావేశాన్ని స్థానిక సన్‌రైజ్ హోటల్‌లో నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే ధర్మాన ప్రసాదరావు బంగ్లాలో జరిగిన సమావేశం కూడా విజయవంతమైంది. ధర్మాన క్రియాశీలంగా లేకపోయినా ఇది అనుకున్నదానికంటే ఎక్కువ విజయవంతమైంది. అంతే.. ఆ తర్వాత ఎక్కడికక్కడ ‘బాబు ష్యూరిటీ ` మోసం గ్యారెంటీ’ ఆగిపోయింది.
పర్యవేక్షణ శూన్యం
ఈ కార్యక్రమం జరుగుతున్న తీరును పర్యవేక్షించే నాధుడే లేడు. అయితే ‘మోసం గ్యారెంటీ’ కార్యక్రమం అమల్లో జిల్లాలో టెక్కలి, ఎచ్చెర్ల, నరసన్నపేట నియోజకవర్గాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఇదే పెద్ద ఊరట అన్నట్టు జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ దన్నెట్టేశారు. పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న తమ్మినేని సీతారాం ఏ నియోజకవర్గం నుంచి పిలుపుపొస్తే ఆ నియోజకవర్గానికి ముఖ్య అతిథిగా వెళ్లడం తప్ప తన సొంత నియోజకవర్గం ఆమదాలవలసలో గానీ, జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో గానీ క్యూఆర్ కోడ్ స్కాన్లు ఏ మేరకు జరుగుతున్నాయని ఒక్కరోజు కూడా అడిగిన పాపాన పోలేదు. ఈ కార్యక్రమం కోసం పార్టీ పరిశీలకులు కురసాల కన్నబాబు, కుంభా రవిబాబు సైతం ఆరా తీసినట్లు కనపడలేదు. ప్రొఫెసర్‌గా పని చేసిన కుంభా రవిబాబు లెక్చర్లు ఇవ్వడానికి అలవాటు పడటం వల్ల ఏ కార్యక్రమానికి వచ్చినా సుదీర్ఘంగా ప్రసంగించి వెళ్లిపోతున్నారు తప్ప పరిశీలకుడిగా గ్రామస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలేదు. అన్నింటికంటే విచిత్రమేమిటంటే.. టౌన్, మండల, గ్రామస్థాయిల్లో రొటీన్ కార్యక్రమం మాదిరిగా ఓ ఫ్లెక్సీ పట్టుకొని జంక్షన్‌లో నిల్చొని ఫొటోకు ఫోజిచ్చి వెళ్లిపోతున్నారు. కాగా 2024 ఎన్నికల్లో చంద్రబాబు మాట ఇచ్చి నేటికీ అమలుకాని హామీలు అంటూ ప్రజాగళం పేరుతో వైకాపా ఒక పాంప్లెట్‌ను పంచుతోంది. విడ్డూరమేమిటంటే.. దీని మీద చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఫొటోలు పెద్దవిగా ఉన్నాయి. అంతేకాకుండా ఉమ్మడి మేనిఫెస్టో 2024 అని రాసుంది. ఈ పాంప్లెట్‌లో కంటెంట్ ఏమిటనేది చూడని ప్రజలు కూటమి ప్రభుత్వానికి వైకాపా ప్రచారం చేస్తుందన్న భావనలో జోకులు వేసుకుంటున్నారు.
ముందడుగు వేయని టీడీపీ కార్యకర్తలు
మరోవైపు ఏడాదిలోనే హామీలన్నీ అమలుచేశామని చెప్పుకోవడానికి.. సామాజిక భద్రత పింఛన్లు, అమ్మకు వందనం, ఉచిత గ్యాస్ సిలెండర్లు వంటివి అర్హులందరికీ వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికి సుపరిపాలనలో తొలి అడుగు పేరిట తెలుగుదేశం రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమం కూడా గ్రామ, మండల స్థాయిల్లో అంతంత మాత్రంగానే నడుస్తోంది. ఒక పోలింగ్ బూత్ పరిధిలో 500 మంది ఓటర్లు ఉన్నారనుకుంటే అందులో 300కు మించి ఇళ్లు దొరకడంలేదు. వాటిలో కూడా లబ్ధిదారులు ఎంతమంది? పథకాలు దక్కనివారు ఎంతమంది? అనేది తెలుసుకొని, వారి సమస్యను పార్టీ రూపొందించిన మై టీడీపీ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇది ఎంతమంది చేశారన్నదానిపై ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మాత్రం రెగ్యులర్‌గా మానిటర్ చేస్తోంది. కాకపోతే స్థానికంగా క్యాడర్‌లో మాత్రం చలనం ఉండటంలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదైనా తమకు ఆర్థికంగా ఎటువంటి లబ్ధి చేకూరలేదని, కిందిస్థాయి పదవులన్నీ జనసేనతో నింపేస్తుండటంతో తమకు ప్రాధాన్యత దక్కడంలేదన్న భావనలో తెలుగు తమ్ముళ్లు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. ఇక శ్రీకాకుళం, ఆమదాలవలస మున్సిపాలిటీల విషయానికి వచ్చేసరికి సుదీర్ఘ కాలంగా ఎన్నికలు లేకపోవడం, వార్డు ఇన్‌ఛార్జిలు ఎవరో తేలకపోవడం వల్ల తొలి అడుగుకు చాలా దూరంగా తెలుగు తమ్ముళ్లు ఉండిపోతున్నారు. దీనికి ముందు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినప్పుడు కొందరు నేతలు కష్టపడి సభ్యత్వం చేయిస్తే, దాన్ని వేరొకరు తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఇప్పుడు తొలిఅడుగు క్రెడిట్‌ను కూడా వేరేవారికి ఇవ్వడానికి ఇష్టంలేక కొందరు దన్నెట్టేశారు. ఎన్నికలు జరిగే ప్రతిసారీ టీడీపీ టిక్కెట్ ఆశించే కొర్ను నాగార్జున ప్రతాప్ సొంత వార్డులోనే ఇంతవరకు ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గత మూడు రోజులుగా కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తొలిఅడుగును శతశాతం పూర్తిచేయాలని ఘోషిస్తున్నారు. తొలి అడుగు వెనుకబాటులో ఉన్న వార్డులకు స్వయంగా ఎమ్మెల్యే వెళ్తున్నారు. బుధవారం నాటికి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న లెక్కల ప్రకారం రాజాం, ఎచ్చెర్ల, చీపురుపల్లి, నెల్లిమర్ల, బొబ్బిలి, గజపతినగరం, విజయనగరం వంటి నియోజకవర్గాలు ఈ కార్యక్రమంలో వెనుకబడి ఉన్నాయి. దీనికి కారణం కూడా తెలుగు తమ్ముళ్లు క్షేత్రస్థాయిలో తిరగకపోవడమే.
Comments