ఐటీ పొమ్మంటోంది.. భవిష్యత్తు భయపెడుతోంది!
- DV RAMANA

- Aug 1, 2025
- 3 min read
ఐటీ రంగాన్ని ఆక్రమించేస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
వేలల్లో ఉద్యోగాలకు కోత పెడుతున్న కంపెనీలు
వేతన పెంపు, కొత్త నియామకాలు కూడా రద్దు
సాంకేతికంగా అప్‌డేట్ అయ్యేవారికే మనుగడ
మిడ్ లెవల్, సీనియర్ ఉద్యోగులపై అధిక ప్రభావం

పూర్వం బ్యాంకు ఉద్యోగాలను వైట్ కాలర్ జాబ్స్‌గా పరిగణించేవారు. అంటే బట్టలు నలగకుండా హాయిగా కొద్ది గంటల పాటు ఫ్యాన్ కింద కూర్చొని చేసే ఉద్యోగమన్నమాట. కానీ బ్యాంకింగ్ రంగంలోనూ ప్రైవేటీకరణ ఆ వైట్ కాలర్ ఉద్యోగాలనూ షరతులు, టార్గెట్లతో నలిపేస్తోంది.
బ్యాంకుల తర్వాత ఐటీ ఉద్యోగాలను వైట్ కాలర్ జాబ్స్‌గా భావించడం మొదలైంది. రోజులో పనిచేసేది కొద్ది గంటలే.. అది కూడా వారానికి ఐదు రోజుల పని విధానం. వేలు, లక్షల్లో వేతనాలు. ఏసీ రూముల్లో కంప్యూటర్ల ముందు పని చేస్తూ.. రకరకాల అలవెన్సులు, భోజనాది సకల వసతులు.. అబ్బో.. ఐటీ అంటే ఎగిరి గంతేసినంత పని.
కానీ రోజులు మారాయి. కొత్త నీరొచ్చి పాతనీటిని తరిమేసినట్లు ఐటీలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) వంటి కొత్త ఉపరంగాలు పుట్టుకొచ్చి.. సంప్రదాయ ఐటీ ఉద్యోగులకు పొగపెడుతున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం మరోసారి సంక్షోభంలో పడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనూ రెండు మూడుసార్లు ఐటీ రంగంలో స్లంప్(మాంధ్యం) ఏర్పడి ఇబ్బందులు ఎదురైనా.. వాటికి మించిన సంక్షోభం అంచున ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు నిలిచి ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ప్రైవేట్ కంటే ప్రభుత్వ ఉద్యోగులకే ఉద్యోగ భద్రత ఉంటుంది. అలాంటి ప్రభుత్వ ఉద్యోగం కంటే ఈ కాలం యువత ప్రైవేట్ రంగంలోని ఐటీ ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐటీ సంస్థల్లో జాబ్ ఆఫర్ వస్తే చాలు.. దర్జాగా లైఫ్‌ను లీడ్ చేయాలని కలలు కంటుంటారు. కానీ అది వాస్తవం కాదని మరోసారి తెలిసివస్తోంది. ఈ రంగంలో కొత్త సాంకేతిక విప్లవం, ఖర్చులు పెరగడం, లాభాలు తగ్గడం, ప్రపంచ మార్కెట్లలో అస్థిరత వంటి రకరకాల కారణాలతో దిగ్గజ ఐటీ కంపెనీలే లేఆఫ్‌లు ప్రకటిస్తూ ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి. భవిష్యత్తుపై బెంగ కలిగిస్తున్నాయి. 2019లో మొదలైన ఉద్యోగాల కోతలు ఐదేళ్లు దాటినా ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూడా పదుల సంఖ్యలో కంపెనీలు వేలాది ఉద్యోగులను ఇంటికి పంపేశాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి బహుళజాతి సంస్థలతో పాటు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి బడా దేశీయ కంపెనీలు కూడా వేలసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉన్నవారికి జీతాల పెంపును నిలిపివేశాయి.
అనేక సంస్థల్లో ఉద్వాసనలు
మనదేశంలో అపారమైన బ్రాండ్ వేల్యూ కలిగిని టాటా గ్రూప్‌నకు చెందిన టీసీఎస్ ప్రపంచవ్యాప్తంగా తనకు ఉన్న ఆరు లక్షలకుపైగా ఉద్యోగుల్లో రెండు శాతం మందిని తొలగించాలని నిర్ణయించుకుంది. ఆ ప్రకారం సుమారు 12వేల మంది మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ఈ ఏడాది చివరినాటికి వేటు పడనుంది. ఉద్యోగుల జీతాల పెంపును కూడా ఈ సంస్థ ఇంతవరకు ప్రకటించలేదు. కాగా మే నెలలోనే 6వేల మంది ఉద్యోగులను తొలగించిన మైక్రోసాఫ్ట్ ఈ నెలలో మరో 9వేల మందికి ఉద్వాసన పలికింది. అంతకుముందు 2023లో ఈ కంపెనీ 10వేల మందిని తొలగించింది. ఇక ఇంటెల్ సంస్థ తన ఉద్యోగుల్లో 15 శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. దీనివల్ల 24వేల ఉద్యోగాలు పోనున్నాయి. ఎగ్జిక్యూటివ్, చిప్ డిజైన్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ వంటి ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితం కానున్నారు. ఐబీఎమ్‌లో కూడా దాదాపు 8వేల మందిని తొలగించినట్లు తెలిసింది. వీరిలో ఎక్కువగా హెచ్‌ఆర్ విభాగానికే చెందినవారు ఉన్నారు. వారి స్థానాలను ఏఐతో భర్తీ చేశారని వార్తలు వస్తున్నాయి. అలాగే అమెజాన్, మెటా, గూగుల్ వంటి బడా సంస్థలు కూడా లేఆఫ్స్ బాటలో పడ్డాయి. 2022 నుంచి ఇప్పటివరకు అమెజాన్‌లో 27 వేల ఉద్యోగాలు పోయాయి. ఈ ఏడాది జూన్‌లో వంద మందిని తొలగించారు. త్వరలో 14వేల మందిని తొలగించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొదట్లో మెటా కంపెనీ సుమారు 3వేల మందికి ఉద్వాసన పలకగా గూగుల్ సంస్థ క్లౌడ్, పీపుల్ ఆపరేషన్స్, సేల్స్ తదితర డిపార్ట్‌మెంట్లలో పనిచేసే వందలాది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చింది. ఇన్ఫోసిస్ కూడా సైలెంట్‌గా లేఆఫ్‌లు ఇవ్వడంతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి వేతనాల పెంపును వాయిదా వేసింది. అదే బాటలో విప్రో పయనిస్తోంది. ఇక టెక్ మహీంద్రాలో ముఖ్యంగా టెలికాం, బీపీవో స్థాయిల్లో ఉద్యోగులను తొలగించనుంది. హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో 350కి పైగా ఉద్యోగులను తొలగించింది.
ఊడ్చేస్తున్న ఏఐ ప్రళయం
కరోనా సమయంలో ఐటీ కంపెనీలు యువతపై ఆఫర్ల వర్షం కురిపించాయి. వర్క్ ఫ్రం హోమ్‌తో పాటు కోరినన్ని సౌకర్యాలు కల్పించాయి. కట్ చేస్తే మూడేళ్లలో సీన్ రివర్స్ అయ్యింది. ఇటీవలి కాలంలో ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాల్లోకి దూసుకువస్తోంది. కోడిరగ్ నుంచి ప్రాజెక్ట్ డెలివరీల వరకు అన్ని పనులను అదే మానిటర్ చేసేస్తుండటంతో టెక్ పరిశ్రమలో అనూహ్య మార్పులు అనివార్యమయ్యాయి. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా టెక్ సంస్థలు ఏఐ ఆధారిత సేవలను అందుబాటులోకి తెస్తున్నాయి. ఏఐ తీసుకొస్తున్న మార్పులు.. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, క్లౌడ్ మైగ్రేషన్ వంటి గత మార్పులను మించిపోయాయి. వాటి స్థానంలో ఏఐ ఆధారిత క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, డెవాప్స్ ఇంజనీరింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, మల్టీ క్లౌడ్ కన్సల్టెంట్స్, ప్రామ్టింగ్ ఇంజనీరింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్లు, ఏఐ ఎథిసిస్ట్స్ అవసరం పెరిగింది. దీనికి అనుగుణంగానే ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను అప్ స్కిల్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అది కుదరని పక్షంలో లేఆఫ్ చేసి ఏఐ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల నియామకానికి సిద్ధపడుతున్నాయి. ఐటీ రంగంలో నిత్యం మార్పులు జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికత అందుబాటులోకి వస్తుంటుంది. ఈ మార్పులను గమనించి.. వాటిని అందిపుచ్చుకుని నిరంతరం తమను తాము అప్‌డేట్ చేసుకునే ఉద్యోగులకు ఏఐ తరహా సాంకేతిక విప్లవాలు ఎన్ని వచ్చినా ఇబ్బంది ఉండదు. అదే అప్‌డేట్ కాకుండా కాలక్షేపం చేసే ఉద్యోగులకు మాత్రం ప్రస్తుత ఏఐ విప్లవం ప్రమాదకరమేనని స్పష్టమవుతోంది.
1.25 లక్షల మందికి ఎసరు
డిజిటల్ ట్రాన్ఫర్మేషన్ రాకతో 2000-2010 మధ్య 15వేల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఆ తర్వాత 2012-18 మధ్య వచ్చిన క్లౌడ్ టెక్నాలజీ తరంగం సుమారు 70వేల మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది. వీటి తర్వాత సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్ వంటి నైపుణ్యాలున్న టెక్కీలకు డిమాండ్ పెరిగింది. కానీ ప్రస్తుత ఏఐ అండ్ ఆటోమేషన్ కారణంగా ఈసారి 1.25 లక్షల మంది వరకు టెక్కీలు ఉద్యోగాలు కోల్పోతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జనరేటివ్ ఏఐ, ఏఐ ఆటోమేషన్ వినియోగం పెరగటంతో ఖర్చులు తగ్గించుకోవటానికి కంపెనీలు లేఆఫ్స్ బాట పడుతున్నాయి. దీనివల్ల కంపెనీల్లో పనిచేస్తున్న మిడ్ లెవెల్ ఉద్యోగులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇదే క్రమంలో పలు ఐటీ సంస్థల ఉద్యోగుల వేతనాల పెంపును నిలిపివేశాయి. ఇక స్టార్టప్ కంపెనీలు హైరింగ్‌ను ఫ్రీజ్ చేశాయి.










Comments