top of page

‘ఉపాధి’ ఊపిరి ఆగుతోంది!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • May 19
  • 2 min read


కూలీలు, ఉద్యోగులకు వేతనాల్లేవు

పనుల మంజూరులో ఎంతో వేగం

నిధులు అందక ఆవహిస్తున్న నీరసం

సిబ్బందిని వేధిస్తున్న డ్వామా పీడీ

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల నివారణకు, వ్యవసాయ పనుల్లేని కాలంలో గ్రామాల్లోనే కనీసం వంద రోజులు పని కల్పించి గ్రామీణ ప్రజలను ఆర్ధికంగా అండగా నిలిచేందుకు అమలుచేస్తున్న ఉపాధి హమీ పథకం నానాటికీ నీరుగారిపోతోంది. ఈ పథకాన్ని పర్యవేక్షించే ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు చెల్లించకపోవడం పథకం అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఉపాధి హమీ పథకంలో పని చేస్తున్న టెక్నికల్‌ అసిస్టెంట్లకు మాత్రమే రెండు నెలల బకాయిలను రెండు రోజుల క్రితం జమ చేశారు. జిల్లా, మండల స్థాయి కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులకు, క్షేత్రస్థాయిలో పని చేసే ఫీల్డ్‌ అసిస్టెంట్లకు మాత్రం మూడు నెలలుగా జీతాలు అందలేదు. ఇక ఉపాధి కూలీలకు మార్చి 26న చివరిసారిగా వేతనాలు చెల్లించారు. ఆతర్వాత సుమారు ఏడు వారాలుగా వేతనాలు ఇవ్వలేదు. దాంతో పల్లెపండగ పేరుతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో వేసిన సీసీ రోడ్లు, బీటీ రోడ్ల పనులకు గత ఏడాది నవంబర్‌ 19న బిల్లులు చెల్లించారు. ఆ తర్వాత చెల్లించలేదు. ఈ పథకంలో భాగంగా ఫారంపాండ్స్‌, పశువుల పాకలు, ఇంకుడు గుంతలు, పాఠశాల ప్రహరీలు, ఫిష్‌ ల్యాండిరగ్‌ ప్లాట్‌ఫారాలు నిర్మించారు. వీటికి ఆరునెలలుగా బిల్లులు అందలేదు. చేసిన పనులు నమోదు చేయడానికి అవసరమైన ఎం`బుక్స్‌ సరఫరా కూడా నిలిచిపోయింది. వీటిని క్షేత్రస్థాయి సిబ్బందే కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. డబ్బులతో ముడిపెడిన పనులు మినహా మిగతా అంశాలన్నింటిపైనా డ్వామా పీడీ రాత్రి 12 గంటల వరకు గూగుల్‌మీట్‌ పేరుతో ఆ విభాగం అధికారులు, సిబ్బందిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎం`బుక్‌లనైనా కనీసం సరఫరా చేయాలని మండల సిబ్బంది జిల్లా అధికారికి మొరపెట్టుకుంటే ఇంట్లో వస్తువులు, వంటిపై బంగారం తాకట్టుపెట్టి కొనుగోలు చేయాలని సలహా ఇస్తున్నారని డ్వామా ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు.

చాలా పనులు ఎక్కడివక్కడే

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2024`25 ఆర్ధిక సంవత్సరంలో ఉపాధి హమీ పథకంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా రూ.99.29 కోట్ల అంచనా వ్యయంతో 36,447 రకాల పనులు గుర్తించి, మంజూరు చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో సీసీ, బీటీ రోడ్డు నిర్మాణాలకు పల్లెపండగ పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. వీటిలో పంచాయతీరాజ్‌ పరిధిలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.72.15 కోట్ల వ్యయంతో 5,644 పనులు, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో సీసీ, బీటీ రోడ్ల కోసం రూ.7.90 కోట్ల అంచనాతో 162 పనులు చేపట్టారు. సమగ్రశిక్ష పరిధిలో పాఠశాల ప్రహరీలు నిర్మాణానికి రూ.1.86 కోట్ల అంచనాతో 209 పనులకు శ్రీకారం చుట్టారు. ఆర్‌ అండ్‌ బి పరిధిలో బీటీ రోడ్ల నిర్మాణం, ప్యాచ్‌వర్కుల కోసం రూ.6.22 కోట్ల అంచనాతో 41 పనులు చేపట్టారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం పరిధిలో వాటర్‌ వర్క్స్‌ రూ.57.70 లక్షల వ్యయంతో 59 పనులకు అవకాశం ఇచ్చారు. నీటిపారుదల ఎస్‌ఈ పరిధిలో 1.04 కోట్లతో 114 పనులు. వంశధార ఎస్‌ఈ పరిధిలో సాగునీటి కాలువలు మరమ్మతుల కోసం రూ.1.82 కోట్ల అంచనాతో 82 పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం ఏడు ప్రభుత్వ శాఖల పరిధిలో రూ.91.061 కోట్ల అంచనాతో 6,311 పనులు చేయాలని నిర్ణయించారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 4,018 పనులు మాత్రమే ప్రారంభం కాగా 2,274 పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు ప్రారంభానికే నోచుకోలేదు. ఇరిగేషన్‌, వంశధార ఎస్‌ఈల పరిధిలో పనులు ప్రారంభం కాలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ప్రారంభమైన పనులకు ఒక్క పార్టు కింద కేవలం రూ.19.28 కోట్లు మాత్రమే జమ చేసింది. పనులు పూర్తి, ప్రారంభం కాకపోవడానికి బిల్లులు చెల్లింపులు ఆరు నెలలుగా నిలిచిపోవడమే కారణం. ఆర్ధిక సంవత్సరం ముగిసినా బిల్లు చెల్లింపులు చేయకపోవడంతో తెలుగుతమ్ముళ్లు, కూటమి పార్టీల కార్యకర్తలు లబోదిబోమంటున్నారు.

ఆర్థిక సంవత్సరం ముగిసినా..

ఎచ్చెర్ల, హిరమండలం, నరసన్నపేట, టెక్కలి, పలాస క్లస్టర్ల పరిధిలో పశువుల షెడ్లు, ఫారం పాండ్స్‌, ఇంకుడు గుంతలు తదితర 30,136 పనులకు రూ.8.23 కోట్ల అంచనాతో శ్రీకారం చుట్టారు. వీటిలో 14,846 పనులు మాత్రమే ప్రారంభించగా 3,553 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రారంభమైన పనుల కోసం ఆర్ధిక సంవత్సరం ముగిసే నాటికి కేవలం రూ.3.13 కోట్లు మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో ఆర్ధిక సంవత్సరం ముగిసినా 50 శాతం పనులు ప్రారంభం కాలేదు, 10 శాతం పనులు కూడా పూర్తి చేయలేకపోయారు. పంచాయతీల్లో వైకాపా సర్పంచులతో సంబంధం లేకుండా ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో ఈ పనులన్నింటినీ మంజూరుచేసి కూటమి నాయకులు, కార్యకర్తలనే వెండర్లుగా చూపించి గంపగుత్తగా పనులు అప్పగించారు. అయితే బిల్లులు చెల్లింపులు సకాలంలో జరగకపోవడంతో పనులన్నీ నిలిచిపోయాయి. పూర్తిచేసిన పనులకు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page