top of page

తరలిస్తాం బియ్యం.. మాకేం భయం!

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Sep 5, 2025
  • 2 min read
  • తాజాగా దళారుల అవతారమెత్తిన రేషన్‌ డీలర్లు

  • డిపోల వద్దే లబ్ధిదారుల నుంచి యథేచ్ఛగా కొనుగోళ్లు

  • దాడులు చేసి కేసుల పెట్టే అధికారులపై రాజకీయ ఒత్తిడి

  • అదే ధీమాతో రెచ్చిపోతున్న దళారులు, అక్రమ రవాణాదారులు

  • ఫిబ్రవరి 9న 3.4 టన్నుల రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా కవిటి మండలం కరాపాడు టోల్‌ప్లాజా వద్ద పౌర సరఫరాలు, రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.

  • ఆగస్టు 12న కొత్తూరు నుంచి వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 140 బస్తాల(72 క్వింటాలు) ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని విజిలెన్స్‌, పౌరసరఫరాల శాఖ ఉప తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది పట్టుకున్నారు.

.. ఇవి కొన్ని ఉదాహారణలు మాత్రమే.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జిల్లాలో 15 చోట్ల అక్రమంగా రవాణా చేస్తున్న 339.54 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. రేషన్‌ డిపోల వద్ద బయోమెట్రిక్‌ వేసిన తర్వాత అక్కడమే బియ్యానికి బదులు డబ్బులు తీసుకుంటున్న లబ్ధిదారులు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. డీలర్లే లబ్ధిదారుల నుంచి రేషన్‌ బియ్యం తీసుకుని కిలో రూ.20 చొప్పున డబ్బులు ఇస్తున్నారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా పూర్తి పారదర్శకతతో సులభంగా, వేగంగా రేషన్‌ సరుకులను ప్రజల ఇంటి వద్దనే పంపిణీ చేయాలని గత ప్రభుత్వం చర్యలు చేపట్టినా అక్రమాలకు చెక్‌ పెట్టలేకపోయింది. ఎండీయూ ఆపరేటర్ల ద్వారా ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారులు బియ్యం విడిపించుకొని బయట వ్యక్తులకు విక్రయించేవారు. ఏడాదిన్నర క్రితం ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఎండీయూ ఆపరేటర్లను తొలగించినా పరిస్థితి మారకపోగా ఇప్పుడు డీలర్లే దళారుల అవతారమెత్తారు. తమ షాపునకు వచ్చే లబ్ధిదారులకు బియ్యం ఇచ్చినట్లే ఇచ్చి.. మళ్లీ డబ్బులు ఇచ్చి వెనక్కి తీసేసుకుంటున్నారు.

ఆర్భాటమే తప్ప చర్యల్లేవు

గ్రామీణ ప్రాంతాల్లో బియ్యం అట్టిపెట్టుకొని నగదు ఇస్తున్న డీలర్లు పదుల సంఖ్యలోనే ఉన్నట్లు తెలిసింది. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ తరచూ జిల్లాలో ఏదో ఒకచోట నుంచి రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడుతున్న ఉదంతాలు ఉన్నాయి. ప్రతి వారం సగటున రెండు కేసులు నమోదవుతున్నాయి. దీన్నిబట్టి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా ఏ మేరకు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. వైకాపా హయాంలో అక్రమ రవాణాను అరికట్టేందుకు రేషన్‌ వ్యవస్థను డిజిటలైజ్‌ చేయాలని నిర్ణయించింది. ప్రతి బస్తాకు క్యూఆర్‌ కోడ్‌ సీల్‌ వేసి ట్రాక్‌ చేయాలని కసరత్తు చేశారు. తర్వాత ఈ ప్రక్రియకు బ్రేక్‌ పడిరది. చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రాయితీ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతున్నదని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్‌ తనిఖీల్లోనూ ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై పెద్ద హడావుడి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కూడా కాకినాడ పోర్టును సందర్శించి ‘సీజ్‌ ద షిప్‌’ అంటూ ఆర్భాటం చేశారు. అయితే కొద్దిరోజులకే అంతా గప్‌చుప్‌ అయిపోయింది. మళ్లీ యథాప్రకారం రేషన్‌ బియ్యం అక్రమ రవాణా సాగిపోతోంది. అక్రమ రవాణా దారులపై 6ఏ కేసు నమోదు చేసి వదిలేస్తున్నారు. రేషన్‌ బియ్యం దారి మళ్లడం కొత్త విషయం కాదు. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దందాను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు.

సిఫార్సులకే పెద్దపీట

పేదలకు ఇస్తున్న రాయితీ బియ్యం అనేక చేతులు మారి రీసైకిల్‌ అవుతూ ప్రభుత్వ గిడ్డంగులకు వెళ్లి తిరిగి రేషన్‌ డిపోలకే చేరుతోంది. ఇదంతా ప్రభుత్వ పెద్దలకు తెలియనిది కాదు.. కానీ కఠిన చర్యలు మాత్రం చేపట్టడంలేదన్న విమర్శలున్నాయి. చట్టంలో లొసుగుల కారణంగా అక్రమార్కులు పట్టుబడినా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. కేవలం అపరాధ రుసుము వసూలుచేసి విడిచిపెడుతున్నారు. రేషన్‌ డిపో డీలర్లు తరలిస్తూ పట్టుబడితే 6ఏ కేసు నమోదు చేసి సస్పెండ్‌ చేస్తున్నా.. అది తాత్కాలికమే. స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సుతో మళ్లీ వారికే బాధ్యతలు అప్పగిస్తున్నారు. రేషన్‌ బియ్యం విక్రయించినట్టు గుర్తిస్తే బియ్యం కార్డును రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా లబ్ధిదారులు కూడా వెనక్కి తగ్గడం లేదు. వైకాపా హయాంలో దుడ్డు బియ్యం స్థానంలో సార్టెక్స్‌ (నాణ్యమైన) బియ్యం ఇవ్వడం ప్రారంభించారు. అయినా అక్రమ రవాణా ఆగలేదు.. రీసైక్లింగ్‌కు అడ్డుకట్ట పడలేదు. రేషన్‌ షాపుల్లో ఒక బియ్యం కార్డుకు కేజీ నుంచి రెండు కేజీల వరకు తూకంలో తక్కువ చేసి.. మిగులు బియ్యాన్ని బియ్యం పక్కదారి పట్టించడం ఒక పద్ధతి. లబ్ధిదారులు విడిపించుకునే బియ్యానికి కొంత రేటు కట్టి వారి చేతిలో సొమ్ము పెట్టి బియ్యం డీలర్లు తమ వద్దే ఉంచేసుకోవడం మరో పద్ధతి. దళారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేషన్‌ బియ్యం కొనుగోలు చేయడం ఇంకో పద్ధతి. ఇలా అనేక పద్ధతుల్లో బియ్యాన్ని మిల్లర్ల వద్దకు.. అక్కడి నుంచి పోర్టులకు తరలించి ఎగుమతి చేయడం పీడీఎస్‌ వ్యవస్థ ప్రారంభమైన నాటి నుంచి సాగుతోంది. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వ పెద్దలే దీనివెనుక ప్రధాన సూత్రధారులుగా ఉంటూ పౌర సరఫరాలశాఖ అధికారులను దోషులుగా చూపించి తప్పించుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. రేషన్‌ మాఫియా జోక్యం కారణంగా అక్రమ రవాణాకు అడ్డుకట్టు వేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page