top of page

తప్పెవరిది? శిక్షెవరికి?

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • 1 hour ago
  • 3 min read
  • కంచిలి కేసులో సూత్రధారిని పట్టించుకోని అధికారులు

  • ఏబీసీడబ్ల్యూవోను బలిపీఠం ఎక్కించిన వైనం

  • కొండను తవ్వి ఎలుకను పట్టిన ఏసీబీ

  • పథకం ప్రకారమే బాలముకుందరావు ట్రాప్

  • రిటైర్‌మెంట్ ముందు కేసుల్లోకి నెట్టి వేధింపులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

సంక్షేమ శాఖ వసతి గృహాలంటేనే అక్కడి వార్డెన్లు, ఆ శాఖల కార్యాలయాల సిబ్బంది సంక్షేమాన్ని మాత్రమే చూసుకునే గృహాలు అన్న నానుడి ఎప్ప్పుడో మొదలైపోయింది. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల ఆహారం, కాస్మొటిక్స్ కోసం ప్రభుత్వం ఎన్నిసార్లు రేటును రెన్యువల్ చేసినా, అది సంక్షేమ శాఖ అధికారుల జేబుల్లోకి వెళ్లడం మినహా ఎక్కడా వసతి గృహాలు బాగుపడిన దాఖలాలు లేవు. కింది నుంచి పైస్థాయి వరకు వేళ్లూనుకుపోయిన అవినీతిలో దాని మరక అంటకుండా నూటికో కోటికో ఒక్కడు మిగులుతాడు. అటువంటి ఉద్యోగి సమాజానికి ఎంత ఉపయోగపడతాడో పక్కన పెడితే, సంబంధిత శాఖకు మాత్రం పంటికింద రాయిలా మారిపోతాడు. అందుకే ఆ రాయిని బలమైన గునపాంతో తొలగించాలని సొమ్ములు రుచిమరిగిన అధికారులు భావిస్తారు. అందుకు తాజా ఉదాహరణే జిల్లా బీసీ సంక్షేమ శాఖలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారిగా పని చేస్తున్న బాలముకుందరావు ఏసీబీకి చిక్కడం.

రెండు నెలల క్రితం కింతలిలో 11 బీసీ సంక్షేమ వసతి గహాలకు చెందిన ఐదుగురు వార్డెన్ల నుంచి రూ.1.84 లక్షలు వసూలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా బాలముకుందరావు ఏసీబీకి దొరికిపోయారు. సీన్ కట్ చేస్తే.. దీని వెనుక భారీ కుట్రకోణం ఇప్ప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రతీ హాస్టల్‌లో ఉంటున్న ఒక్కో విద్యార్థి నుంచి రూ.35 చొప్ప్పున లెక్కించి, ఆ సొమ్మును ఈ శాఖలో అందరికీ పంచాల్సిన బాధ్యత బాలముకుందరావుపై సంబంధిత డీబీసీడబ్ల్యూవో పెట్టారని, ఆ పని చేస్తుండగానే ఏసీబీకి పట్టించారని బీసీ సంక్షేమ శాఖలో చర్చించుకుంటున్నారు. డీబీసీడబ్ల్యూవో చెప్పినంత మాత్రాన పిల్లల కూడు దగ్గర సొమ్ము వసూలు చేయడం బాలముకుందరావు చేసిన తప్పే కదా.. అనే ప్రశ్న తలెత్తుతుంది. నిజమే.. బాలముకుందరావు చేసింది నూరు శాతం తప్ప్పు. అయితే ఈ కథకు ఇంకో కోణం కూడా ఉంది. ఈ ఏడాది మేలో రిటైర్ కాబోతున్న ఏబీసీడబ్ల్యూవో బాలముకుందరావు దీర్ఘకాలిక సెలవు కోసం డీబీసీడబ్ల్యూవోకు సెలవు చీటీ పంపించారు. మేలో రిటైర్ అవుతున్నానని, ఏప్రిల్ వరకు తనకు సెలవు కావాలని దాని సారాంశం. సోంపేట, కంచిలి, పలాస, కవిటి ప్రాంతాల్లో ఉన్న వసతి గహాలకు ఏసీబీడబ్ల్యూవోగా ఉన్న బాలముకుందరావు సెలవుపై వెళ్లిపోతే, జనవరి నుంచి ఏప్రిల్ వరకు హాస్టల్ నుంచి మంత్లీలు ఆగిపోతాయని భావించిన డీబీసీడబ్ల్యూవో సెలవు కావాలంటే ఏప్రిల్ వరకు తలా రూ.35 చొప్ప్పున లెక్క కట్టి పంపకాలు జరపాలని ఆదేశించడంతో బాలముకుందం ఈ పనికి పూనుకున్నారని వార్డెన్లే ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అయితే ఇందులో బాలముకుందానికి వాటా లేదా? అనే అనుమానం రావచ్చు. కానీ బాలముకుందం టేబుల్ మీద ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల్లో బీసీ సంక్షేమ శాఖలో ఎవరికి ఎంత ఇవ్వాలన్న లెక్కలు రాసివున్నాయి. వసూలు చేసిన సొమ్మును ఆ మేరకు పంపిణీ చేయాల్సివుంది. అయితే ఆ జాబితాలో బాలముకుందం పేరు లేకపోవడం ఏసీబీ అధికారులు కూడా పరిశీలించారు. కానీ వార్డెన్లు ఆయనకే తెచ్చి సొమ్ములివ్వడం వల్ల ఏసీబీ రైడ్‌కు దొరికిపోయారు. సహజంగా ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోవాలి. కానీ బాలముకుందరావు పేరు పంపిణీ జాబితాలో లేకపోవడంతో ఈ కేసు ఎప్పటికైనా పోతుందనే భావనతో ఏసీబీ తన ప్రతిష్ట నిలుపుకోవడం కోసం చేసిందో, లేదూ అంటే ఇంకేదైనా పైస్థాయి ఒత్తిడులు ఉన్నాయో తెలియదు గాని, బాలముకుందం నివాసంపై కూడా ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తులున్నాయేమోనన్న అనుమానంతో సోదాలు నిర్వహించింది. ఇందులో కోటిన్నర ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. వాస్తవానికి ఏసీబీకి, ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు మధ్య ఎప్పట్నుంచో ఆదాయానికి మించిన ఆస్తుల లెక్కింపు పైనే డిబేట్ నడుస్తోంది. ఒక ఉద్యోగి లక్ష రూపాయలు పెట్టి పదేళ్ల క్రితం కొన్న ఒక స్థలం ఆ తర్వాత మార్కెట్ వాల్యూ మేరకు రూ.50 లక్షలు కావచ్చు. ఇప్ప్పుడు ఏసీబీ కొన్నప్ప్పుడు ఆస్తిని గుర్తిస్తుందా? ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరను బయటపెడుతుందా? ఏమేరకు ఆదాయానికి మించి ఆస్తి ఉందని తేల్చాలన్న దానిపై స్పష్టమైన విధానం లేదు. అందుకే రూ.2వేలు తీసుకొని రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఉద్యోగికి శిక్ష పడుతుంటే, ఆదాయానికి మించి కోట్లలో ఆస్తులున్న ఉన్న కేసులు తేలిపోతున్నాయి. అయితే బాలముకుందం కేసులో మరో నాలుగు నెలల్లో రిటైరవుతున్న అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారికి ఎంత జీతం వస్తుందో ఇట్టే చెప్పేయొచ్చు. దీనికి తోడు ఆయన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఇక పిల్లాజెల్లా సంపాదనలు వేరే విషయం. ఇటువంటి చోట రూ.1.50 కోట్లు మాత్రమే ఎక్కువుందని చెప్పడం గమనార్హం.

సింహభాగం జిల్లా అధికారికే

బీసీ సంక్షేమ శాఖలో ప్రతి ఏటా ఏసీబీ సోదాలు, దాడులు జరుగుతుంటాయి. అయితే ఈ కేసుల్లో ఇప్పటివరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కంచిలిలో రూ.1.84 లక్షలు పట్టుకున్న కేసు కూడా ఈ జాబితాలు చేరిపోయిందంటున్నారు. అక్రమ వసూళ్ల వ్యవహారంపై విచారణకు కలెక్టర్ ముగ్గురు సభ్యుల కమిటీ వేశారు. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించి రెండు నెలలు కావస్తున్నా.. ఇప్పటివరకు కమిటీ ఇచ్చిన నివేదిక ఏమిటో వెలుగుచూడలేదు. బాధ్యులపై చర్యలు కూడా తీసుకోలేదు. వార్డెన్లకు నెలవారీ డైట్ బిల్లులు జమ అయినప్పుడు ప్రతి వసతిగహం నుంచి ఆ శాఖ జిల్లా అధికారికి నిర్ణీత మొత్తంలో మామూళ్లు ఇవ్వాల్సిందే. వీటిని సంబంధిత ఏబీసీడబ్ల్యూవో, ఒకరిద్దరు వార్డెన్లు వసూలు చేస్తుంటారు. నాలుగేళ్ల క్రితం ఒక్కో విద్యార్థికి రూ.20 చొప్పున లెక్క కట్టి వసూలు చేసేవారు. ప్రస్తుత జిల్లా అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత దాన్ని రూ.50కి పెంచేశారు. ఆ ప్రకారం జిల్లాలోని 81 బీసీ బాలబాలికల వసతిగహాల్లో ఆశ్రయం పొందుతున్న సుమారు ఏడువేల మంది విద్యార్ధుల పేరుతో సుమారు రూ.3.5 లక్షలు వసూలు చేసి సమర్పిస్తున్నారు. ఉన్నతాధికారుల ప్రొటోకాల్, రాష్ట్రస్థాయి అధికారుల కోసం ఈ సొమ్ము ఖర్చు చేస్తున్నట్టు జిల్లా అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. బాలముకుందరావు ఎలాగూ రిటైరైపోతున్నారు కాబట్టి.. నివేదిక కూడా ఆయనకు వ్యతిరేకంగా ఇచ్చి మిగిలినవారిని కాపాడాలని ఆలోచిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిపై గత నాలుగేళ్లలో పదుల సంఖ్యలో గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు అందినా, అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నం చేస్తూ వచ్చారని ఆరోపణలు ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page