అదంతా మాయా బంగారు లోకం!
- NVS PRASAD

- Sep 6, 2025
- 3 min read
ఇతర ప్రాంతాల నుంచి గోల్డ్ బిస్కెట్ల రవాణా
తక్కువ మార్జిన్‌తో స్థానిక మార్కెట్లలో విక్రయం
ఇప్పుడు రామి పసిడినే హాల్‌మార్క్ పూతతో ప్యూర్‌గా చెలామణీ
గుప్త హత్య నేపథ్యంలో బయటకొస్తున్న గోల్డ్ డొల్లతనం
నగరంలో 600 గ్రాముల ఆభరణాలు కొనుగోలు చేసిన నిందితులు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఇతర ప్రాంతాల నుంచి బంగారం బిస్కెట్లు తక్కువ ధరకు కొని, దానిపై స్వల్ప మార్జిన్ వేసుకొని జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న బంగారం షాపులకు విక్రయించే గుప్త హత్యకేసులో చిక్కుముడి పూర్తిగా వీడటంతోపాటు రికవరీలోనూ పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. ఈ కేసులో నిందితులు శ్రీకాకుళం నగరంలోని పందుంపుల్లల జంక్షన్ మీదుగా పెట్రోమాక్స్ వీధికి వచ్చే దారిలో మద్దులవారి కిరాణా కొట్టు లైన్‌లో ఉన్న ఒక బంగారం షాపు నుంచి 600 గ్రాముల బంగారు నగలను కొనుగోలు చేశారు. ఇందుకు ప్రతిగా తమ వద్ద ఉన్న అంతే విలువైన బంగారం బిస్కెట్లు ఇచ్చారు. కారు డ్రైవర్ సంతోష్‌తో పాటు ఆదిత్య కార్ డెకార్స్ యజమాని మల్లు రాజు పోలీసు ఇంటరాగేషన్‌లో గుప్తను చంపేసి తీసుకున్న బంగారం బిస్కెట్లను ఏం చేసిందీ చెప్పడంతో.. వారు నగలు కొనుగోలు చేసిన షాపునకు పోలీసులు వెళ్లి ఆ బిస్కెట్లు ఇవ్వాలని కోరుతున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఇది చిన్నషాపు. వీరి వద్ద 600 గ్రాముల బంగారు నగలు లేకపోవడంతో అదే సందులో ఉన్న మరికొన్ని షాపుల నుంచి కొన్ని నగలు తీసుకువచ్చి విక్రయించారని చెప్పుకుంటున్నారు.
తక్కువకు కొని.. ఎక్కువకు అమ్మడమే
దర్యాప్తు సంగతి కాసేపు పక్కన పెడితే.. అసలు గుప్త బంగారం షాపులకు బిస్కెట్లు సరఫరా చేసే కొరియర్ కాదని తేలింది. గతంలో అతనితో సహా ముగ్గురు పార్టనర్లుగా ఉంటూ కేరళ, కోయంబత్తూరు వంటి ప్రాంతాలకు వెళ్లి బంగారు ఆభరణాలు తీసుకొచ్చి నరసన్నపేట పరిసర ప్రాంతాలోని షాపులకు విక్రయించేవారని నరసన్నపేటలో చెబుతున్నారు. ఇటీవల బంగారం ధరలు రోజురోజుకు మారిపోతుండటంతో ఆర్నమెంట్ వ్యాపారంలో పెట్టుబడి అలాగే ఉండిపోతుందని భావించి బంగారం బిస్కెట్ల వ్యాపారంలోకి దిగినట్లు తెలిసింది. అందులో భాగంగానే కొన్నాళ్లుగా గుప్త స్థానిక మార్కెట్‌లో దొరికే బిస్కెట్ కంటే తక్కువ ధరకు లభించే ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసి గ్రాముకు 30 నుంచి 40 రూపాయలు మార్జిన్ వేసుకొని.. పలాస, నరసన్నపేట మార్కెట్లలో విక్రయిస్తున్నారు. సాధారణంగా జిల్లాలో బంగారం వర్తకులు బిస్కెట్ కావాలంటే విశాఖ బులియన్ కార్పొరేషన్ నుంచి తెచ్చుకుంటారు. ఇంతకంటే తక్కువకు ఎక్కడైనా దొరికితే ఎక్కువ లాభం వస్తుందన్న ఆశతో గుప్త లాంటివారి వద్ద కొనుగోలు చేస్తారు. అయితే ఈ గుప్తకు తక్కువ ధరలో బంగారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడం అవసరం. ఆ క్రమంలో గుప్త మొదట్లో భువనేశ్వర్ వెళ్లి బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసేవాడు. ఇప్పుడు అదే ధరకు శ్రీకాకుళంలో కూడా బిస్కెట్ దొరుకుతుండటంతో భువనేశ్వర్ వెళ్లడం మానేశాడు. ఆ తర్వాత విశాఖ బులియన్ కంటే తక్కువకు విజయవాడలో కొందరు అమ్ముతున్నారని తెలియడంతో అక్కడి నుంచి బంగారం బిస్కెట్లు తేవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అదే రేటుకు విశాఖపట్నంలో కూడా కొందరు ఇస్తుండటంతో మళ్లీ విశాఖ నుంచే బంగారం బిస్కెట్లు తెస్తూ గుప్త హత్యకు గురయ్యాడు.
బిస్కెట్లలోనూ రామి బంగారమే
అయితే విజయవాడ, భువనేశ్వర్, విశాఖపట్నంలలో బులియన్ మార్కెట్ కంటే తక్కువ ధరకు ఎలా వస్తుందనేది అందరికీ తెలిసిందే. సాధారణంగా పాత బంగారం అమ్మినప్పుడు రామి, తరుగు వంటివి పోను ఇంతే మిగిలిందని వర్తకులు చెప్పి ఆ మేరకు డబ్బులిస్తుంటారు. అయితే వారికి అందులోనే పెద్ద ఎత్తున బంగారం కలిసొస్తుంది. ఇటువంటి బంగారాన్నంతా కలిపి ఒక బిస్కెట్‌గా పోత పోసి, దానికి 916 హాల్‌మార్క్ వేయించి బులియన్ మార్కెట్ కంటే తక్కువకు అమ్ముతున్నారు. వీటినే వర్తకులు ఎక్కువగా కొంటున్నారు. ఇటీవల ఈ బిస్కెట్ వ్యాపారం చేసేవారు జిల్లాలో పెరిగిపోయారు. ఇటువంటి బంగారం బిస్కెట్లకు వ్యాపారుల నుంచి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొత్త ఏజెంట్లు రంగప్రవేశం చేశారు. నగదు అవసరమై బంగారాన్ని కొన్ని ప్రైవేటు బ్యాంకుల్లో తాకట్టు పెట్టినవారు దాన్ని విడిపించుకోలేక మురగబెట్టేస్తుంటే, వారితో మాట్లాడి బ్యాంకులతో ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని, తాకట్టు బంగారం విడిపించి తక్కువ ధరకు కొనేస్తున్నారు. తులం రూ.50 వేలు ఉన్నప్పుడు ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టిన బంగారం విలువ ఇప్పుడు రూ.లక్ష దాటిపోయింది. వడ్డీలతో లెక్కేసుకున్నా ఇంత కాదు. అందుకే ఉభయ కుశలోపరిగా సెటిల్మెంట్ చేసుకొని, ఆ బంగారాన్ని కరిగించి బయటి మార్కెట్‌లో తక్కువకు అమ్మేస్తున్నారు. ఇటువంటి బిస్కెట్లనే కొనుగోలు చేసి గుప్త వ్యాపారం చేస్తున్నాడు. అదే ఇప్పుడు ఆయన చావుకొచ్చింది.
నరసన్నపేటలోనే ఎందుకు ఎక్కువంటే..
జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో జరగనన్ని అక్రమాలు నరసన్నపేటలోనే ఎందుకు జరుగుతున్నాయంటే, ప్రధాన కారణం చుట్టుపక్కల ఉన్న 30 బలమైన గ్రామాలకు నరసన్నపేట కేంద్రం. ఎవరైనా ఏ వస్తువుకైనా నరసన్నపేట రావాల్సిందే. అందుకే ఇక్కడ శ్రీకాకుళం కంటే 10 రెట్లు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. దీనికి తోడు ఈ పట్టణంలోకి ఇంకా కార్పొరేట్లు అడుగుపెట్టలేదు. అందుకే తరతరాలుగా బంగారం వ్యాపారం చేస్తున్నవారు భారీఎత్తున సంపాదిస్తున్నారు. అదే స్థాయిలో శ్రీకాకుళంలో వ్యాపారం ప్రారంభించినవారు ఇప్పుడు గల్లాపెట్టె ముందు కుర్చోవడం మినహా వ్యాపారం చేయలేకపోతున్నారు. పలాసది కూడా దాదాపు ఇదే పరిస్థితి. అందుకే ఇక్కడ గోల్డ్‌షాపులు ఎక్కువగా పెట్టడం, స్కీమ్‌లు రన్ చేస్తునే మధ్యలో ఎత్తేయడం చూస్తుంటాం. అలాగే 916 ముద్ర లేని బంగారం అమ్మకాలు బయటపడుతుంటాయి. పెద్ద ఎత్తున నగదును బస్సుల్లో తరలిస్తూ ఆమధ్య నక్కపల్లి టోల్‌గేట్ దగ్గర జీఎస్టీ అధికారులకు దొరికిపోయారు. ఇది నరసన్నపేట, పలాసకు చెందిన బంగారం వర్తకులదేనని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ కేసు ఏమైందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పాతికేళ్ల క్రితం గుప్త లాగే పర్లాకిమిడి నుంచి ద్విచక్ర వాహనంపై బంగారాన్ని తరలిస్తున్న ఇద్దరిని కొందరు హత్య చేసి శవాలను బెండి రైల్వేట్రాక్ మీద పడేశారు. మళ్లీ ఇన్నాళ్లకు అదే బంగారం కోసం గుప్త హత్య తెర మీదకు వచ్చింది.










Comments