top of page

ఏ మహామేళా అయినా మరణాలే

Writer: DV RAMANADV RAMANA

1954 నాటి కుంభమేళా తొక్కిసలాటలో 800 మంది మరణించారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా 30 మంది చనిపోయారు. మరో 60మంది గాయపడ్డారు. మౌని అమావాస్య రోజు త్రివేణి సంగమంలో స్నానాల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో 25 మందిని గుర్తించామని మహాకుంభ్‌ నగర్‌ మేలా ప్రాంతం డీఐజీ వైభవ్‌ కృష్ణ చెప్పారు. గాయపడ్డవారు చికిత్స పొందుతున్నారు. హరిద్వార్‌, ఉజ్జయిని, ప్రయాగ్‌రాజ్‌, నాసిక్‌లలో ప్రత్యేక సందర్భాల్లో కుంభమేళాలు నిర్వహిస్తుంటారు. ఎక్కువ రోజుల పాటు సాగే కుంభమేళాలో కొన్ని రోజులు ప్రత్యేకమైనవి. ఈ రోజుల్లో స్నానాలు ఆచరించడా నికి వచ్చే భక్తుల సంఖ్య కోట్లలో ఉంటుంది. ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరిగే సమయంలో సంగమంలో స్నానమాచరించాలని భక్తులు కోరుకుంటారు. గంగ, యమున, అంతర్వాహినిగా ఉండే సరస్వతి నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అంటారు. ఈ సంగమ ప్రాంతంలో స్నానమాచ రిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. అయితే కొన్నిసార్లు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చినప్పుడు వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం కష్టమైన విషయం. కుంభమేళా సమయంలో గతంలోనూ ప్రమా దాలు జరిగాయి. 1954లో ప్రస్తుత ప్రయాగ్‌రాజ్‌ (అప్పటి అలహాబాద్‌) కుంభమేళా నిర్వహించారు. స్వాతంత్య్రం తర్వాత జరిగిన తొలి కుంభమేళా ఇది. ఆ కుంభమేళాలో భాగంగా 1954 ఫిబ్రవరి 3న మౌని అమావాస్య సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఓ ఏనుగు కారణంగా అక్కడ తొక్కిసలాట జరిగినట్లు చెప్తారు. ఈ తొక్కిసలాటలో 800 మందికి పైగా భక్తులు మరణించారు. వంద లాదిమంది గాయపడ్డారు. కుంభమేళాకు వెళ్లొద్దంటూ అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ రాజకీయ నాయకులు, వీఐపీలకు ఈ తొక్కిసలాట తర్వాత సలహా ఇచ్చారు. 1986లో హరిద్వార్‌ కుంభమేళా జరిగింది. 1986 ఏప్రిల్‌ 14న అప్పటి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, అనేక ఇతర రాష్ట్రాల సీఎంలు, నాయకులతో కలిసి హరిద్వార్‌ వెళ్లారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారి రాకతో సాధారణ భక్తులను ఒడ్డు దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో రద్దీ పెరిగిపోయింది. భక్తులను నియంత్రిం చడం సాధ్యం కాలేదు. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది చనిపోయారు. అంతకుముందు 1927, 1950ల్లో జరిగిన హరిద్వార్‌ కుంభమేళాల్లోనూ తొక్కిసలాటలు జరిగాయి. 1992లో ఉజ్జయినిలో సింహస్థ కుంభమేళా నిర్వహించారు. తొక్కిసలాటలో దాదాపు 50 మంది చనిపోయారు. 2003లో నాసిక్‌లో కుంభమేళా జరిగింది. సాధువులు వెండినాణేలు పంపిణీ చేశారని దైనిక్‌ జాగరణ్‌ కథనంలో ఉంది. వెండినాణేల కోసం భక్తులు ఎగబడ్డారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. దాదాపు 30 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 100 మందికి పైగా గాయపడ్డారు. 2010లో హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించారు. అమృత స్నానాల విషయంలో భక్తులకు, సాధువులకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5లక్షల నష్టపరిహారం ప్రకటించింది. 2013లో అలహాబాద్‌ (ప్రయాగ్‌రాజ్‌)లో కుంభ మేళా నిర్వహించారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉన్న రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగిందిన రాయిటర్స్‌ తెలిపింది. ఆ ప్రమాదంలో 36 మంది చనిపోయారు. వారిలో 29 మంది మహిళలు. తొక్కిసలాటకు కారణమేంటో స్పష్టంగా తెలియలేదు. పోలీసులు భక్తులను నియంత్రించడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిందని కొందరు చెప్పారు. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి మీద తొక్కిసలాట జరిగిందని, అక్కడి నుంచి భక్తులు కిందపడ్డారని ఒకరు తెలిపారు. మహా కుంభమేళాలు ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా ప్రాణాలు పోతునే ఉన్నాయి. అయినా పుణ్యం కోసం, పాపాలు కడిగేసుకోవడం కోసం జనాలు వెంప ర్లాడుతునే ఉన్నారు. అమెరికావోడి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ పడగొట్టి పక్కనున్న చైనావాడు డీప్‌సీక్‌ ఆర్‌`1 తయారుచేశాడు. మనం మురికినీళ్లలో డీప్‌ సింక్‌ అయి పండగ చేసుకుంటున్నాం. మనం పతనం అంచున నిలబడిన జాతి. మునగడానికి మతం ఉంది. ముంచడానికి రాజకీయం ఉంది. మునిగి చావ డానికి జనాలున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద వైరస్‌లు ఈ దేశంలోనే కనుగొన్నారు. అవి కుల మతాలు కలిగిన మనుషుల రూపంలో ఉన్నాయి. ఇవి అన్నిరకాల వైరస్‌లకన్నా ప్రాణాంతకమైనవి. ఈ వైరస్‌ స్వేచ్ఛాసమానత్వాన్ని తిరస్కరించింది. భ్రమలను, అబద్ధాలను, కుట్రలను నమ్మించి బానిసత్వాన్ని, మూఢత్వాన్ని పెంచి పోషించి చదువుల్ని, జ్ఞానాన్ని, చివరకు కనీస విచక్షణ మరిపించి హేతుబద్ధతను, ఆధునీకతను, అభ్యుదయాన్ని ధ్వంసం చేసిన తర్వాత మనిషి మనిషిగా కాకుండా ఇంకేమవుతాడు?

 
 
 

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page